కశ్మీర్: షేక్ అబ్దుల్లా చేసిన పీఎస్‌ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

  • 17 సెప్టెంబర్ 2019
ఫరూక్ అబ్దుల్లా Image copyright Getty Images

నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఫారూక్ అబ్దుల్లాను.. జమ్మూకశ్మీర్‌ ప్రజా భద్రత చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ - పీఎస్ఏ) కింద అరెస్ట్ చేశారు.

జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూక్ అబ్దుల్లాను నిర్బంధించటానికి ఆయన ఇంటినే తాత్కాలిక జైలుగా పరిగణిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ మేరకు 80 ఏళ్ల వయసు దాటిన ఫారూక్‌ను ఆయన మూడంతస్తుల ఇంట్లోనే ఒక గదిలో నిర్బంధించారు.

నిజానికి.. శ్రీనగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫారూక్ అబ్దుల్లాను.. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏను రద్దు చేసినప్పటి నుంచీ.. అంటే ఆగస్టు 5వ తేదీ నుంచే గృహనిర్బంధంలో ఉంచారు.

అయితే, ఫారూక్ స్వేచ్ఛగానే ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత నెలలో లోక్‌సభలో పేర్కొనటంతో ఆయన నిర్బంధం అంశం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఫారూక్ అబ్దుల్లాను కోర్టు ముందు హాజరుపరచాలంటూ మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కళగం నాయకుడు వైగో సోమవారం నాడు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.

సోమవారం ఈ పిటిషన్ విచారణకు రావటానికి కొద్ది గంటల ముందు ఫారూక్ అబ్దుల్లాను జమ్మూకశ్మీర్ ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధించినట్లు వార్తలు వచ్చాయి.

తీవ్రంగా స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాను పీఎస్ఏ కింద నిర్బంధించటం.. భారత ప్రభుత్వం కశ్మీర్‌లో పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల పరంపరలో తాజా పర్వమని.. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో విమర్శించింది.

''భారత ప్రభుత్వం క్రూరమైన చట్టాలను మారుస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రాజకీయ అసమ్మతివాదులకు వ్యతిరేకంగా ఆ చట్టాలను ప్రయోగించటం కొనసాగించటం ప్రభుత్వం నిజాయితీగా లేదనటానికి నిదర్శనం'' అని వ్యాఖ్యానించింది.

ఫారూక్‌ను ఇప్పుడిలా అరెస్ట్ చేయాలన్న నిర్ణయం పిరికిపంద ఆలోచన అని సీపీఐఎం నాయకుడు సీతారాం ఏచూరి విమర్శించారు. ఆయనను పీఎస్ఏ కింద అరెస్ట్ చేయటం ఏకపక్షం, అన్యాయం అని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ అభివర్ణించారు.

''కశ్మీర్ దిగ్బధంలోకి వెళ్లి 40 రోజులు దాటిపోయింది. వేలాది మంది రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయుల గొంతును.. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ నిర్బంధ చట్టాలతో అణచివేస్తూనే ఉన్నారు'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాను 14 సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం నిర్బంధించింది.. ఆ తర్వాత కశ్మీర్ సీఎంగా పనిచేసిన షేక్ అబ్దుల్లా హయాంలో పీఎస్ఏ అమలులోకి వచ్చింది

ఏమిటీ ప్రజా భద్రత చట్టం?

జమ్మూకశ్మీర్ ప్రజా భద్రత చట్టం.. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం 1978లో అమలులోకి తెచ్చింది.

'రాష్ట్రంలో శాంతిభద్రతల ప్రయోజనార్థం' ఈ చట్టాన్ని రూపొందించారు. రక్షిత ప్రాంతాలు, నిషిద్ధ ప్రాంతాలను ప్రకటించటంతో పాటు మత సామరస్యాన్ని కాపాడటం కోసం పత్రాల పంపిణీని నిరోధించటం వంటి పలు నిబంధనలు ఉన్నాయి. ప్రధానంగా కలప దొంగ రవాణాను నియంత్రించటం కోసం అటువంటి పనులు చేసేవారిని నిర్బంధించటానికి ఇందులో విధివిధానాలను పొందుపరచారు.

ఈ చట్టంలోని సెక్షన్ 8 కింద వ్యక్తులను నిర్బంధించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేయవచ్చు.

  • ఎవరైనా ఒక వ్యక్తి రాష్ట్ర భద్రతకు కానీ, శాంతిభద్రతలకు కానీ విఘాతం కలిగించేలా ప్రవర్తించకుండా నిరోధించటానికి ఆ వ్యక్తిని నిర్బంధించాల్సిందిగా ఆదేశించవచ్చు.
  • విదేశీయుల చట్టం అర్థ పరిధిలో విదేశీయులైన వ్యక్తులను నిర్బంధించటానికి ఆదేశించవచ్చు.
  • 'పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం'లో నివసిస్తున్న వ్యక్తి అయివుండి, సదరు వ్యక్తి సంచారాన్ని నియంత్రించటం లేదా ఆ వ్యక్తిని బహిష్కరించటం అవసరమైన పక్షంలో నిర్బంధించటానికి ఆదేశించవచ్చు.

ఈ చట్టం కింద ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను నిర్బంధించాల్సిందిగా ఆదేశించే అధికారాలు జిల్లా కలెక్టర్లు, డవిజనల్ కమిషనర్లకు కూడా ఉంటుంది.

చట్టం నియమ నిబంధనలేమిటి?

అయితే.. ఈ చట్టంలోని సెక్షన్ 13(1) ప్రకారం.. నిర్బంధిస్తున్న వ్యక్తికి ఆ వ్యక్తిని ఎందుకు నిర్బంధిస్తున్నామనే కారణాలను తెలియజేయాలి. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(5) కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేందకు వీలు కల్పించటానికి ఈ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, ఇదే చట్టంలోని సెక్షన్ 13(2) ప్రకారం.. సదరు వ్యక్తి అరెస్టుకు సంబంధించిన కారణాలను వెల్లడించటం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని అధికార యంత్రాంగం భావించినట్లయితే ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు.

రాష్ట్ర భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తిని ఈ చట్టం కింద గరిష్టంగా రెండేళ్ల పాటు విచారణ లేకుండా నిర్బంధించవచ్చు. ఒకవేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రవర్తన అయితే గరిష్టంగా 12 నెలల పాటు విచారణ లేకుండా నిర్బంధించవచ్చు.

అయితే, తొలుత 12 నెలలుగా ఉన్న ఈ గరిష్ఠ నిర్బంధ కాలాన్ని 2012లో చేపట్టిన సవరణ ద్వారా 'తొలుత మూడు నెలలు నిర్బంధం తర్వాత 12 నెలల వరకూ పొడిగించే అవకాశం'గా మార్చారు. అలాగే, 18 సంవత్సరాల వయసు నిండని భారత పౌరుడిని ఈ చట్టం కింద నిర్బంధించకూడదని కూడా సవరించారు.

మామూలుగా అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులను 24 గంటల ముందు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాల్సి ఉంటుంది. కానీ. పీఎస్ఏ చట్టం కింద నిర్బంధించిన వ్యక్తిని అలా హాజరుపరచాల్సిన అవసరం లేదు.

అలాగే, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి బెయిలు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎస్‌ఏ కింద అరెస్టయిన వారికి ఆ హక్కు కూడా ఉండదు.

Image copyright AFP

ఈ చట్టం కింద నిర్బంధాన్ని సవాల్ చేయలేరా?

ఇటువంటి నిర్బంధ ఉత్తర్వులు జారీచేసిన తర్వాత నాలుగు వారాల లోపు ప్రభుత్వం ఈ కేసును హైకోర్టు ప్రస్తుత లేదా మాజీ జడ్జి సారథ్యంలోని సలహా బోర్డుకు పంపించాలి. ఆ బోర్డులో హైకోర్టు ప్రస్తుత లేదా మాజీ జడ్జీలు కానీ జడ్జీలుగా నియమించబడటానికి అర్హులైన వారు కానీ మరో ఇద్దరు సభ్యులు ఉంటారు.

ఈ బోర్డు తన ముందుకు వచ్చిన నిర్బంధ ఉత్తర్వుల మీద ఎనిమిది వారాల్లోగా తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. ముందస్తు నిర్బంధానికి తగినన్ని కారణాలు ఉన్నాయని ఈ బోర్డు అభిప్రాయపడినట్లయితే, ప్రభుత్వం తను సరిపోతుంది అనుకున్నంత కాలం - గరిష్ట కాల పరిమితికి లోబడి - ఆ వ్యక్తిని నిర్బంధంలో ఉంచవచ్చు.

అయితే, నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈ సలహా బోర్డు ముందు తన తరఫున వాదనలు వినిపించటానికి న్యాయవాదిని నియమించుకునే వెసులుబాటు లేదు. నిర్బంధానికి తగిన కారణాలు ఉన్నాయా అనేది ఈ బోర్డు స్వయంగా పరిశీలిస్తుంది. అలాగే, సలహా బోర్డు తన నివేదికను గోప్యంగా ఉంచాలని భావిస్తే.. ఆ నివేదికను తనకు అందించాలని కోరే హక్కు కూడా నిర్బంధంలో ఉన్న వ్యక్తికి ఉండదు.

ఈ చట్టం కింద ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినపుడు దీనిని ఆర్టికల్ 266 కింద హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా సవాల్ చేయవచ్చు. అయితే, ఇది కూడా విధానపరమైన ఉల్లంఘనలకు మాత్రమే పరిమితవుతుంది.

వైగో పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఫారూక్ అబ్దుల్లాను కోర్టు ముందు హాజరుపరచాలంటూ వైగో వేసిన పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు దీనికి జవాబు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

దీని మీద స్పందించటానికి సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. దీంతో విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఫారూక్ అబ్దుల్లా కుమారుడు, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ తదితరులు కూడా కశ్మీర్‌లో నిర్బంధాల్లోనే ఉన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకశ్మీర్ భారతదేశంలో ఇలా కలిసింది!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)