‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి జైశంకర్

  • 18 సెప్టెంబర్ 2019
ఎస్ జైశంకర్ Image copyright Reuters

''పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్‌లో భాగమే. ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుని పాలన సాగిస్తాం'' అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

''ఉగ్రవాదంపై చర్యలు తీసుకోనంతవరకూ పాకిస్తాన్‌తో చర్చలు మొదలుపెట్టే ప్రసక్తే లేదు'' అని ఆయన స్పష్టం చేశారు.

''సీమాంతర ఉగ్రవాద సమస్య పూర్తిగా పరిష్కారమై, పొరుగు దేశం తన ప్రవర్తనను మార్చుకునేంతవరకూ వారి నుంచి భారత్‌ సవాలును ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని అన్నారు.

దిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370 సవరణ నిర్ణయంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా అన్న ప్రశ్నకు కూడా ఆయన బదులిచ్చారు.

''సీమాంతర ఉగ్రవాద అంశం, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు గురించి భారత్ వాదనను ప్రపంచమంతటికీ సవివరంగా వినిపించగలిగాం. అంతర్జాతీయ వేదికలపై భారత్ వాణి మునుపటి కన్నా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది'' అని అన్నారు.

''విదేశాంగ అజెండాను తీర్చిదిద్దడంలో మన చొరవ, సామర్థ్యం మరింత పెరిగాయి. ఆర్టికల్ 370 భారత్ అంతర్గత విషయం. కశ్మీర్ గురించి ఎవరో ఏదో అనుకుంటారన్న బెంగ అవసరం లేదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright AFP

ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటన్న విషయాన్ని మీడియా విస్మరించి వార్తలు రాసిందని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

''నేను పత్రికలు బాగా చదువుతా. కానీ ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటన్న విషయం గురించి ఎవరూ ఎక్కువగా రాయట్లేదు. తాత్కాలికమైన అంశాలు ఎన్నటికైనా ముగిసేవే'' అని ఆయన అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని సవరించడం ద్వారా జమ్మూకశ్మీర్‌కున్న ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం గత ఆగస్టు తొలి వారంలో తొలగించింది.

ఎన్నో ఏళ్లుగా సంక్షోభంతో రగులుతున్న కశ్మీర్‌ను ఈ నిర్ణయంతో అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

కశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 పెద్ద అవరోధంగా మారిందంటూ భారత హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రసంగించారు.

అయితే, భారత్ అధీనంలోని కశ్మీర్ భూభాగం తమకు చెందుతుందని వాదిస్తున్న పాకిస్తాన్.. భారత్ నిర్ణయాన్ని సహజంగానే తీవ్రంగా తప్పుపట్టింది.

భారత్‌తో దౌత్య సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ తీరుకు వ్యతిరేకంగా వివిధ దేశాల మద్దతు కూడగట్టేందుకు అంతర్జాతీయ వేదికలపైనా ప్రయత్నాలు చేస్తామని వెల్లడించింది.

ఆర్టికల్ 370 సవరణ తర్వాత తమ అధీనంలోని కశ్మీర్‌లో భారత్ ఆంక్షలు అమలు చేసింది. టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో భారత్ నిర్ణయాన్ని విమర్శిస్తూ అంతర్జాతీయ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.

Image copyright Reuters

‘సన్నిహిత దేశం కాబట్టే ఆ సమస్యలు’

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశంతో ఉన్న సంబంధాల గురించి కూడా జైశంకర్ మాట్లాడారు.

భారత్-అమెరికా మైత్రి గొప్పగా సాగుతోందని, వాణిజ్యపరమైన సమస్యల పరిష్కారానికి కొన్ని నెలలుగా రెండు దేశాల ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు.

''పురోగతి ఎప్పటికీ పైకే సాగుతోంది. అన్ని బంధాల్లోనూ కొన్ని కొన్ని సమస్యలుంటాయి. వాణిజ్య సమస్యలు అత్యంత సన్నిహితుల మధ్యే తలెత్తుతాయి. ఎందుకంటే మనం వాణిజ్యం ఎక్కువగా చేసేది వాళ్లతోనేగా'' అని జైశంకర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)