టీమిండియా మహిళల వన్డే మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం, బీసీసీఐ ఫిర్యాదుతో ఇద్దరు బుకీలపై కేసు నమోదు

  • 18 సెప్టెంబర్ 2019
క్రికెట్ ఫిక్సింగ్ Image copyright Getty Images

ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచ్ ఫిక్స్ చేయాలంటూ ఇద్దరు బుకీలు భారత మహిళా క్రికెట్ ప్లేయర్‌ను కలిశారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ఆడడానికి ముందు ఫిబ్రవరిలో ఇది జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మోసం, జూదం సెక్షన్లపై నమోదు చేసిన ఈ కేసులో రాకేష్ బాఫ్నా, జితేంద్ర కొఠారీలను నిందితులుగా చేర్చామని పోలీసులు బీబీసీకి చెప్పారు.

భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్ పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇక్కడ 300 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతుందని అంచనా.

తమను తాము స్పోర్ట్స్ మేనేజర్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒక భారత మహిళా క్రికెటర్‌ను సంప్రదించారు. తనకు-రాకేష్ బాఫ్నాకు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను ఆమె రికార్డ్ చేసినట్లు భావిస్తున్నారు.

తర్వాత ఇద్దరు బుకీలు మ్యాచ్ ఫిక్స్ చేయమని తనతో మాట్లాడారని ఆమె బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.

Image copyright Getty Images

మహిళా క్రికెటర్లపై బుకీల కన్ను

ఆ మహిళా క్రికెటర్ దీని గురించి బీసీసీఐకి ఎప్పుడు ఫిర్యాదు చేశారన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. కానీ బోర్డు సోమవారం బెంగళూరు పోలీస్ స్టేషన్లో దీనిపై రిపోర్ట్ చేసింది.

"ఏ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నా జనం దానిలో బెట్టింగ్‌ పెట్టాలని చూస్తారు. ఆ మ్యాచ్ ఏ స్థాయిలో జరుగుతోంది అనేది వాళ్లు అసలు పట్టించుకోరు" అని బీసీసీఐ అధికారి అజిత్ సింగ్ షెకావత్ స్థానిక మీడియాతో అన్నారు.

"మహిళా క్రికెటర్లు కూడా పురుష క్రికెటర్ల లాగే బుకీల దృష్టిలో పడుతున్నారు, అందుకే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు.

భారత క్రికెట్ జట్టు ఆడే ఒక వన్డే మ్యాచ్‌పై 1350 కోట్ల రూపాయల విలువైన బెట్టింగ్స్ జరుగుతుంటాయని వార్తా కథనాలు చెబుతున్నాయి.

భారత క్రికెట్‌లో గతంలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు జరిగాయి. వాటిలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ పేరు కూడా వినిపించింది.

క్రికెటర్లకు లాభాలు తెచ్చిపెట్టే ఐపీఎల్‌ను కూడా బెట్టింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. దీనిపై నియమించిన ఒక కమిటీ, మ్యాచ్ ఫిక్సింగ్, అక్రమ బెట్టింగ్‌లో ప్రమేయం ఉన్న చాలా మంది ఆటగాళ్లను దోషులుగా గుర్తించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు