సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

  • 18 సెప్టెంబర్ 2019
సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులు Image copyright Reuters

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ప్లాంటుపై డ్రోన్ దాడుల తర్వాత చమురు ధరలు ఆకాశాన్నంటాయి. గత కొన్ని దశాబ్దాలుగా చమురు ధరల్లో ఇది అత్యధికం.

పశ్చిమాసియాలో ఇది ఒక కొత్త యుద్ధ పరిస్థితిని సృష్టించింది. కానీ ఈ ప్రభావం ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో కూడా కనిపిస్తోంది.

శనివారం, సెప్టంబర్ 14న కొన్ని డ్రోన్లతో సౌదీ అరేబియాలోని బకీక్ చమురు ప్లాంట్‌, ఖురైస్ చమురు క్షేత్రంపై దాడులు చేశారు.

ఈ దాడులతో సౌదీ అరేబియా మొత్తం చమురు ఉత్పత్తి, ప్రపంచంలో 5 శాతం చమురు సరఫరాపై దారుణ ప్రభావం పడింది.

ఈ దాడులు చేసింది తామేనని యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

Image copyright Reuters

భారత్‌పై ప్రభావం

భారత్ సుమారు 83 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచంలో చమురు అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి.

భారత్‌కు ఎక్కువ ముడి చమురు, కుకింగ్ గ్యాస్ ఇరాక్, సౌదీ అరేబియాల నుంచే వస్తుంది. మన చమురులో పది శాతానికి పైగా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

అయితే, అమెరికా ఈ ఏడాది మొదట్లో అణుఒప్పందం నుంచి తప్పుకున్న తర్వాత ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయాలని భారత్‌పై ఒత్తిడి పెంచింది.

అమెరికా లాంటి ఇతర దేశాల నుంచి కూడా భారత్ దిగుమతులు చేసుకుంటోంది. కానీ ఆ ధర చాలా ఎక్కువ.

బీజేపీ ప్రతినిధి, ఇంధన నిపుణులు నరేంద్ర తనేజా "భారత్‌కు రెండు పెద్ద సమస్యలున్నాయి. వాటిలో మొదటిది మనం సౌదీ అరేబియాను నమ్మకంగా చమురు సరఫరా చేసే దేశంగా భావిస్తాం. భారత్ఆ దేశాన్ని ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆయిల్ సప్లయర్‌గా చూస్తోంది" అన్నారు.

కానీ ఆ దేశంలో డ్రోన్ దాడులు జరిగిన తీరు చూస్తుంటే, సౌదీ అరేబియాలో చమురు ప్లాంట్స్ అంతకు ముందులా సురక్షితంగా లేవనే అనిపిస్తోంది. ఇది భారత్ లాంటి మిగతా చమురు దిగుమతి దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.

రెండోది భారత ఆర్థికవ్యవస్థ. ఇక్కడ ప్రజలు ధరల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. అందుకే ఇప్పుడు చమురు ధరలపై చాలా ఆందోళనలో ఉన్నారు.

Image copyright Getty Images

ధరలు పెరిగే అవకాశం

అంతే కాదు, డ్రోన్ దాడుల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

కువైట్‌పై ఇరాక్ దాడి తర్వాత చమురు ధరలు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. గత 28 ఏళ్లలో ముడి చమురు ధరల్లో ఇంత హెచ్చుతగ్గులు ఎప్పుడూ రాలేదు.

సౌదీ అరేబియా ఇప్పటివరకూ డ్రోన్ దాడులకు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదు. అందుకే, సౌదీల మనసులో ప్రస్తుతం ఏం ఉందో తెలుసుకోవడం చాలా కష్టం. అది సైనిక చర్యలతో సమాధానం ఇస్తుందా?

అదే నిజమైతే, దానివల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. దాంతో ఇరాక్, ఇరాన్ సహా గల్ఫ్‌లోని మొత్తం చమురు క్షేత్రాల నుంచి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

ఇక్కడ అడగని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వాటికి ఇంకా సమాధానాలు దొరకడం లేదు.

భారత్ 2/3 వంతు చమురు డిమాండ్ గల్ఫ్‌లోని ఈ క్షేత్రాల నుంచే తీరుతుంది. ఇప్పుడు ఏదోఒకవిధంగా ఈ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై పడుతుంది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, దిగుమతి చేసుకునే చమురుపై వారు ఆధారపడడాన్ని మనం గమనిస్తే.. వాటిలో ఏ దేశం కూడా దిగుమతులపై ఆధారపడే విషయంలో భారత్‌ అంత బలహీన స్థితిలోలేవు. అందుకే ఈ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై కచ్చితంగా ఉంటుంది.

Image copyright Reuters

భారతీయులకు వచ్చే నష్టం ఏంటి?

చమురు ఉత్పత్తికి ఈ అంతరాయం ఎప్పటివరకూ ఉంటుంది అనేదానిపై అది ఆధారపడి ఉంటుంది.

సౌదీ అరేబియా ధ్వంసమైన తమ చమురు ప్లాంట్లను మళ్లీ పునరుద్ధరించడానికి కొన్నిరోజులు పడుతుందని చెబుతోంది.

కానీ దానికి అంతకంటే ఎక్కువ రోజులు పడితే ఆ ప్రభావం చమురు ధరలపై పడుతుంది. దానివల్ల భారత్ చమురు దిగుమతి ఖర్చులు మరింత పెరగవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఒకవేళ చమురు ధరలు మరింత పెరిగితే భారత్ కష్టాలు కూడా పెరుగుతాయి.

అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు మరింత పెరిగితే, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి.

Image copyright Getty Images

ఇంధన ధరలు పెరిగితే, ఆ ప్రభావం మానుఫాక్చరింగ్, ఏవియేషన్ సహా అన్ని పరిశ్రమలపై కూడా పడుతుంది. దానివల్ల ధరలు మరింత పెరుగుతాయి.

ముడి చమురు బై ప్రొడక్ట్‌ను ప్లాస్టిక్, టైర్ లాంటి ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. వీటి ధరలు కూడా మరింత పెరుగుతాయి.

చమురు ధరల పెరుగుదల ప్రభావం కరెన్సీపై కూడా పడుతుంది. ముడి చమురు డాలర్ ధర పెరిగితే, భారత్ ఇప్పుడు కొంటున్న అదే చమురు కోసం మరిన్ని డాలర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దానివల్ల డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుంది.

భారత షేర్ మార్కెట్ బాగా బలహీనపడడం ఇప్పటికే చూస్తున్నాం. పెరుగుతున్న చమురు ధరల వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత నష్టం జరగచ్చనే భయంతో అందులో వరసగా రెండోసారి పతనం వచ్చింది.

Image copyright Getty Images

అయితే ఏం జరగచ్చు?

కేర్ రేటింగ్ లిమిటెడ్ చీఫ్, ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ "ప్రభుత్వం ఇప్పుడు పెద్దగా ఏం చేయలేదు. అది ప్రస్తుతం ఉన్న నిల్వల నుంచే సరఫరా చేయగలదు. అలా సుమారు ఒక నెల వరకూ గట్టునపడచ్చు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, ప్రభుత్వం పన్నుల్లో కోత విధించవచ్చు. కానీ దానివల్ల ఆదాయం, ద్రవ్య లోటుపై ప్రభావం పడుతుంది. కానీ బ్యారెల్‌ ధర ఎప్పటివరకూ 70 డాలర్ల కంటే తక్కువ ఉంటుందో.. అప్పటివరకూ ఈ అవరోధాన్ని తట్టుకోగలం" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)