టీవీ చానల్స్ నిలిపివేత ఎమ్మెస్వోల ఇష్టమా? ట్రాయ్ పాత్ర ఏంటి?

 • 18 సెప్టెంబర్ 2019
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ల లోగోలు Image copyright ABN Andhrajyothy/TV5

చానల్స్ నిలిపివేత వివాదం మళ్ళీ మొదలైంది. గతంలో తెలంగాణలో టీవీ9, ఎబిఎన్ దాదాపు ఏడాదిపాటు నిలిపివేత సమస్య ఎదుర్కొన్నాయి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీవీ కి కూడా అలాంటి సమస్యే ఎదురైనా, కొద్ది నెలలకే ప్రసారాల పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు కొత్తగా ఎబిఎన్, టీవీ5 ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఆగిపోయాయి.

ఇలా జరగటానికి అప్పుడైనా, ఇప్పుడైనా అధికారపార్టీ పరోక్ష ఆదేశాలే కారణమన్న విమర్శలు ఎలాగూ ఉన్నాయి.

అయితే, చానల్స్ ఇలాంటి నిలిపివేతలను చట్టపరంగా ఎదుర్కోవటం సాధ్యం కాదా? ఎమ్మెస్వోలు ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారు? ట్రాయ్ పాత్ర ఏంటి? అనే విషయాలు వివరించటమే ఈ వ్యాసం లక్ష్యం.

కేబుల్ టీవీ డిజిటైజేషన్ కి ముందు, తరువాత కూడా ఇలా జరగటం గుర్తుంచుకుంటే, డిజిటైజేషన్ సమయంలోనైనా ఇలాంటివి జరగకుండా ట్రాయ్ చర్యలు తీసుకోలేదా ? అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. దానికీ సమాధానం చూద్దాం.

Image copyright Getty Images

కారేజ్ ఫీజ్ కీలకం

కారేజ్ ఫీజు ను అడ్డం పెట్టుకొని ఎమ్మెస్వోలు చానల్స్ నిలిపివేయగలుగుతున్నారు. మామూలుగా ఎంటర్టైన్మెంట్ చానల్స్ అత్యధికభాగం పే చానల్స్ కాబట్టి ప్రేక్షకులు చెల్లించే చందాలో వాటా ఎమ్మెస్వోలకు వస్తుంది. అందుకే ఉచిత చానల్స్ నుంచి కారేజ్ ఫీజు వసూలు చేసుకోవటం ఎమ్మెస్వోలకు అలవాటుగా మారింది. అనలాగ్ విధానంలో సుమారు 100 చానల్స్ మాత్రమే అందించగలగటం వలన ఎమ్మెస్వోలది తిరుగులేని మాట అయింది. నిజానికి కారేజ్ ఫీజు వసూలు చేయటమన్నది చట్టబద్ధమైన వ్యవహారమేనని చాలామంది గుర్తించకపోవటం కూడా ఈ అపోహలకు తావిస్తోంది. దినపత్రికలు తమ పత్రిక పంపిణీ చేసే ఏజెంటుకు ఇస్తున్న కమీషన్ లాంటిదేగనుక కారేజ్ ఫీజు మీద రాద్ధాంతం అనవసరమనేది ఎమ్మెస్వోల వాదన.

అదే సమయంలో చానల్ యజమాని తన చానల్ ను ఫలానా వరుస క్రమంలో పెట్టాలని కోరినప్పుడు అందుకుగాను ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకునే హక్కు కూడా ఎమ్మెస్వో కు ఉంది. ఉదాహరణకు టీవీ9, ఎన్టీవీ చానల్స్ మధ్య ఉండటం వలన ప్రేక్షకులు చానల్స్ మార్చే సమయంలో తమ చానల్ వాటి మధ్య ఉంటే వాళ్ళ దృష్టిలో పడుతుందని ఏదైనా టీవీ వారు భావిస్తే తమ చానల్ ను అక్కడ పెట్టాల్సిందిగా కోరి కొంత అదనపు సొమ్ము చెల్లించవచ్చు. ఇలా చెల్లించే ప్లేస్ మెంట్ ఫీజు కూడా చట్టబద్ధమే. ప్రసారభారతి ఆధ్వర్యంలోని ఉచిత డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ అయితే మరో అడుగు ముందుకేసి వేలం వేసి మరీ చానల్స్ కు అవకాశం కల్పిస్తోంది. తమిళనాడులో అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అరసు కేబుల్ టీవీ కూడా వేలం వేసి కారేజ్ ఫీజు పెద్దమొత్తంలో సంపాదించుకుంది.

Image copyright Getty Images

ట్రాయ్ చెప్పిందేంటి?

అయితే, కారేజ్ ఫీజు ఎంత ఉండాలి, అందరి దగ్గరా సమానంగా వసూలు చేయాలా, కొత్త చానల్స్ కూ, పాత చానల్స్ కూ ఒకే రకంగా చెల్లించాలా? ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న చానల్ కూ, ప్రేక్షకాదరణ తక్కువగా ఉన్న చానల్స్ కూ ఒకే రకమైన కారేజ్ ఫీజు వసూలు చెయ్యాలా అనే ప్రశ్నలు ట్రాయ్ ముందుకొచ్చాయి. అప్పుడు ట్రాయ్ ఒక పరిష్కారమార్గం చెప్పింది.

 • ఒక ఎమ్మెస్వో దగ్గర ఉన్న మొత్తం చందాదారులలో కనీసం 20% మంది చందాదారులు ఆ చానల్ ను తీసుకోవాలనుకుంటే అలాంటి చానల్స్ కారేజ్ ఫీజు చెల్లించనవసరం లేదని ట్రాయ్ తాజాగా ప్రతిపాదించింది.
 • కొత్త చానల్ అయితే కనెక్షన్ కు నెలకు 20 పైసల చొప్పున లెక్కించి కారేజ్ ఫీజు చెల్లించాలి.
 • అప్పటికే ఉన్న చానల్స్ కోరుకుంటున్న చందాదారులు 5-10% మధ్య ఉన్నప్పుడు కారేజ్ ఫీజులో 25% తగ్గుతుంది. అంటే15 పైసల చొప్పున కట్టాలని ప్రతిపాదించింది.
 • 10-15% మంది కోరుకున్న చానల్ అయితే కారేజ్ ఫీజు 50% తగ్గిపోతుంది. అంటే కనెక్షన్ కు10 పైసల లెక్కన కట్టాలి.
 • 15-20% వరకు చందాదారులుంటే కారేజ్ ఫీజులో 75% తగ్గినట్టే. అంటే, 5 పైసల లెక్కన చెల్లించాలి.
 • 20% దాటి చందాదారులుంటే ఎలాంటి కారేజ్ ఫీజూ చెల్లించాల్సిన అవసరమే లేదు.

ఈ నిబంధన ప్రకారం చూస్తే కొత్త చానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం కావాలంటే ఏడాదికి దాదాపు నాలుగున్నర కోట్లు కట్టాల్సిందే.

Image copyright Getty Images

కానీ ఎంతమంది ఏ చానల్స్ కోరుకుంటున్నారో తెలిసేదెలా?

డిజిటైజేషన్ నిబంధనల ప్రకారం ప్రతి చందాదారుకూ వినియోగదారు దరఖాస్తు ఇచ్చి ఎమ్మెస్వోలు తమ దగ్గర అందుబాటులో ఉన్న చానల్స్ జాబితా కూడా ఇచ్చి అందులే ఏయే ఉచిత చానల్స్, ఏయే పే చానల్స్ కోరుకుంటున్నారో నింపేలా చేసి అందుకు అనుగుణంగా వారి బిల్లు నిర్ణయించాలి. ఆ తరువాత ఎప్పుడైనా ఆ జాబితాలో మార్పు చేసుకునే అధికారం కూడా చందాదారుకు ఉండాలి. ఈ దరఖాస్తుల ఆధారంగా ఎంత శాతం మంది చందాదారులు ఏ చానల్ కోరుకుంటున్నారో లెక్కించి కారేజ్ ఫీజు కూడా వసూలు చేసుకోవాలి. అదే సమయంలో పంపిణీ వేదిక నిర్వాహకులు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్, హిట్స్, ఐపిటివి నిర్వాహకులు) తప్పనిసరిగా తమ పంపిణీ వేదికల సామర్థ్యాన్ని ప్రకటించి తీరాలి.

అంటే, ఒక ఎమ్మెస్వో తన కంట్రోల్ రూమ్ నుంచి 400 చానల్స్ ప్రసారం చేయగలిగి ఉంటే అదే విషయాన్ని వెల్లడించాలి. అదే సమయంలో ఒక్కో చానల్ కు ఎంత కారేజ్ ఫీజు వసూలు చేస్తున్నదీ కూడా వెల్లడించాలి. ఒకవేళ ఏదైనా చానల్ కు కారేజ్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తూ ఉంటే ఏ మేరకు అలాంటి తగ్గింపు ఇస్తున్నారో కూడా వెల్లడించాలని ట్రాయ్ నిర్దేశించింది. కాబట్టి రహస్యంగా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం లేదు. ఒక చానల్ నుంచి ఎక్కువ, ఒక చానల్ నుంచి తక్కువ వసూలు చేస్తూ వివక్ష చూపటానికి వీల్లేదు. కేవలం చందాదారుల సంఖ్య ఆధారంగా మాత్రమే తగ్గింపు సాధ్యమవుతుంది. ఏయే అంశాల ఆధారంగా డిస్కౌంట్ ఇస్తున్నదీ కూడా స్పష్టంగా చెప్పగలగాలి. అంటే, డిస్కౌంట్ కు కారణాలు కొలవగలిగే అంశాలై ఉండాలే తప్ప చాటుమాటు ఒప్పందాలకు, అవగాహనకు తావులేదు.

Image copyright Getty Images

ఎమ్మెస్వోలు చేసిందేంటి?

 • చానల్స్ ఎంచుకునే చందాదారు స్వేచ్ఛకు ముందుగా గండికొట్టారు.
 • చందాదారుకు అవగాహన కల్పించే బాధ్యతను విస్మరించారు.
 • వినియోగదారు దరఖాస్తు తీసుకున్న మీదటే కనెక్షన్ ఇవ్వాలని చెప్పినా పట్టించుకోలేదు.
 • ఎంత త్వరగా సెట్ టాప్ బాక్స్ పెట్టిద్దామా అనే ధ్యాస తప్ప ఈ దరఖాస్తులు నింపించే పనికి ఎంతమాత్రమూ ప్రాధాన్యం ఇవ్వలేదు.
 • కొత్త టారిఫ్ అమలు చేయటానికి ముందున్న ఆరునెలలు సైతం అలాగే కాలయాపన చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎపిఎస్ఎఫ్ఎల్ సైతం అలాగే వ్యవహరించి వినియోగదారుల దరఖాస్తుల గురించి పట్టించుకోవటం లేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ట్రాయ్ ఒకవైపు ఏదో విధంగా కొత్త టారిఫ్ అమలు చేయాలన్న పట్టుదలతో ఉండటం ఎమ్మెస్వోలకు కలిసి వచ్చింది. వినియోగదారులు తమకు కావాల్సిన చానల్స్ ఏవో చెప్పటం లేదని ట్రాయ్ కి చెప్పటంతో ఎమ్మెస్వోల చేతికే ఆ ఎంపిక హక్కు వచ్చి చేరింది. బెస్ట్ ఫిట్ ప్లాన్ అని చందాదారుకు ఏది సరైనదో నిర్ణయించే అధికారం కట్టబెట్టారు. ఇంకేముంది.. ఎక్కువ కమీషన్ ఇవ్వజూపే పే చానల్ బొకేలకూ, కారేజ్ ఫీజు ఇవ్వటానికి ముందుకొచ్చే చానల్స్ కూ అవకాశం ఇచ్చారు. ప్రేక్షకుడి స్వేచ్ఛ అలా మరుగునపడింది.

ఎవరైనా పంపిణీదారుడు (ఎమ్మెస్వో లేదా డిటిహెచ్, హిట్స్, ఐపిటీవీ ఆపరేటర్) ఎలాంటి కారణమూ చెప్పకుండా ఏదైనా చానల్ ను ప్రసారం చేయకుండా ఉండే హక్కు ఉంటుందా అన్నది అసలు ప్రశ్న.

ముందుగా తమ కంట్రోల్ రూమ్ ( డిజిటల్ హెడ్ ఎండ్) ద్వారా ఎన్ని చానల్స్ పంపిణీ చేయటానికి అవకాశం ఉన్నదో వెల్లడించి తీరాలి. ఏదైనా చానల్ ఆ ఎమ్మెస్వో/డిటిహెచ్ ఆపరేటర్ ద్వారా పంపిణీచేయాలనుకున్నప్పుడు ఆ మేరకు నిర్దిష్టమైన నమూనాలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ముందు వచ్చిన దరఖాస్తుకు ముందు ప్రాతిపదికన పంపిణీదారుడు ఆ చానల్స్ ప్రసారం చేయాల్సి ఉంటుంది. అప్పటికే పూర్తి సామర్థ్యం అయిపోయి ఉంటే తిరస్కరించవచ్చు. ఎలాగూ సొంత చానల్స్ ఐదు నుంచి పదిహేను దాకా పెట్టుకొని అవసరాన్నిబట్టి వాళ్ళు ఇవ్వాలనుకున్న చానల్స్ ఇస్తూ సొంత చానల్స్ తగ్గించుకునే వెసులుబాటు వాళ్లకుంది.

ఇక్కడ గమనించాల్సిన మరో ట్రాయ్ నిబంధన ఏంటంటే.. ఎమ్మెస్వో ఇచ్చే బేసిక్ పాకేజ్ లో వందలోపు చానల్స్ లో 26 దూరదర్శన్ చానల్స్ పోను చందాదారు ఎంచుకోవటానికి అవకాశమున్న 74 లో ముందుగా ఒక్కో వర్గానికి కనీసం ఐదు చానల్స్ చొప్పున ఇవ్వాలి. అంటే, ఉచిత చానల్స్ గా అందుబాటులో ఉండే ఐదు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, ఐదు న్యూస్ చానల్స్, ఐదు మ్యూజిక్ చానల్స్ ఐదు పిల్లల చానల్స్, ఐదు ఇన్ఫొటైన్మెంట్ చానల్స్, ఐదు సినిమా చానల్స్, ఐదు స్పోర్ట్స్ చానల్స్, ఐదు ఆధ్యాత్మిక చానల్స్...ఇలా. అయితే, దీన్ని కూడా ఎమ్మెస్వో తనకు అనుకూలంగా మార్చుకొని ఐదు న్యూస్ చానల్స్ తో సరిపెట్టినా అడగటానికి వీల్లేదు.

Image copyright Andhrajyothy
చిత్రం శీర్షిక విశాఖపట్నంలో జర్నలిస్టుల నిరసన

పరిష్కారం లేదా?

నిజంగా న్యూస్ చానల్స్ కు ట్రాయ్ నిబంధనలమీద, కారేజ్ ఫీజు మీద స్పష్టత ఉంటే వ్యవహారం వేరుగా ఉండేది. తమ చానల్ కూడా ఉచిత చానల్స్ జాబితాలో పెడుతూ నెట్ వర్క్ కెపాసిటీలో చందాదారులకు చూపించాలని కోరుతూ ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక దరఖాస్తును ఎమ్మెస్వోలకు పంపేవారు.

అదే సమయంలో వీక్షకులు తాము కోరుకునే ఉచిత చానల్స్ లో తమ చానల్ కూడా కోరుకోవలసిందిగా విజ్ఞప్తి చేసేవారు. కానీ అలా జరగలేదు. డిజిటైజేషన్ మీద, చందాదారుల హక్కుల మీద, వినియోగదారు దరఖాస్తు మీద, ఉచిత చానల్స్ ఎంపికమీద ప్రేక్షకులకు తగిన అవగాహన కల్పించటంలో న్యూస్ చానల్స్ విఫలమైన మాట అక్షరాలా నిజం. అప్పుడే ఈ స్వేచ్చ ప్రాధాన్యాన్ని చెప్పి ఉంటే అత్యధిక భాగం తెలుగు చానల్స్ ఎలాంటి కారేజ్ ఫీజూ కట్టాల్సిన అవసరం లేకుండానే ప్రసారం కాగలిగేవి.

తెలుగు ప్రేక్షకులు తాము కోరుకున్న చానల్స్ చూడగలిగే అవకాశమూ దక్కేది. బెస్ట్ ఫిట్ ప్లాన్ అంటూ తమ ఇష్టమొచ్చిన చానల్స్ అంట గట్టిన ఎమ్మెస్వోలను గట్టిగా నిలదీస్తే వాళ్ళు ట్రాయ్ నిబంధనల ప్రకారం తాము ఇచ్చి తీరాల్సిన కనీస న్యూస్ చానల్స్ ఐదు మాత్రమేనని, బార్క్ రేటింగ్స్ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ లో టీవీ9, ఎన్టీవీ, వి6 న్యూస్, సాక్షి టీవీ, టి న్యూస్ మాత్రమే ఉన్నాయని సమాధానమిచ్చినా చేయగలిగేదేమీ లేదు.

Image copyright Getty Images

ఇప్పుడు చేయగలిగిందల్లా ఒక్కటే. ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా చందాదారు దరఖాస్తును తప్పనిసరి చేసేట్టు ట్రాయ్ మీద వత్తిడి తీసుకురావటం, ప్రేక్షకులలో అవగాహన పెంచి దరఖాస్తు ఎలా నింపి ఎక్కువ ప్రయోజనం పొందాలో చెప్పాలి. ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే నెట్ వర్క్స్ వైపు మొగ్గు చూపాలని, అప్పుడే స్వేచ్ఛకు అవకాశం ఉంటుందని కూడా ప్రేక్షకులకు తెలియజెప్పాలి.

ఆపరేటర్లు కూడా కమీషన్ ఎక్కువ ఇచ్చే ఎమ్మెస్వోను కాకుండా, ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే ఎమ్మెస్వో వైపు మొగ్గు చూపటానికి వీలుంటుంది. చందాదారు దరఖాస్తులు తీసుకోక పోవటం వల్లనే ప్రేక్షకుల స్వేచ్ఛకు, చానల్స్ ప్రసారానికి అవరోధం ఏర్పడుతోందన్న విషయం మీద చానల్స్ దృష్టి పెట్టాలి. ఇందులో ఘోరంగా విఫలమైన ట్రాయ్ మీద టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ని ఆశ్రయించటం ఒక్కటే మార్గం.

అప్పటికే ఎమ్మెస్వోలకు డబ్బు చెల్లించి ఒప్పందాలు చేసుకొని ఉంటే మాత్రం ఆ మేరకు చానల్స్ కు ఊరట దొరుకుతుంది. లేకపోతే కేవలం వినియోగదారు దరఖాస్తులు తీసుకోలేదన్న కారణం చూపిస్తూ ప్రేక్షకుల కోరికను లెక్కించలేదని టిడిశాట్ కి నివేదించాల్సి ఉంటుంది. ఏ కారణం వల్లనైనా ఒక చానల్ తొలగించాల్సి వస్తే ముందుగా నోటీసు ఇవ్వటం తప్పనిసరి కాబట్టి ఉన్నట్టుండి చానల్ తొలగిస్తే ఎమ్మెస్వోలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా