కరంజియా: నెహ్రూతో తిట్లు తిని, మొరార్జీ దేశాయ్‌ని విసిగించిన ట్రెండ్ సెటర్ జర్నలిస్ట్

  • 19 సెప్టెంబర్ 2019
Image copyright KARANJIA FAMILY

భారత్ పరిశోధాత్మక జర్నలిజంలో మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ధోరణికి ఎన్నో దశాబ్దాల క్రితమే పునాదులు వేసిన వ్యక్తి రూసీ కరంజియా.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒకసారి తిరుగులేని స్కూప్ కూడా చేశారు.

మహారాజులా బట్టలు వేసుకున్న కరంజియా ముంబైలోని తాజ్ హోటల్‌లో జరుగుతున్న ఇండియన్ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ రహస్య సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ జరిగిందంతా తన పత్రికలో ముద్రించారు.

ఆ వార్తతో ఆయనకు వంద రూపాయలు లభించాయి. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. తర్వాత ఆయన తన అనుభవాలపై 'థియేటర్ ఆఫ్ ద ఎబ్సర్డ్' అనే పుస్తకం రాశారు.

రూసీ కరంజియా ఫిబ్రవరి 1941లో ఒక టాబ్లాయిడ్‌ ప్రారంభించారు. బ్రిటన్‌పై జర్మనీ వైమానిక ఆపరేషన్ 'బ్లిట్జ్ క్రిగ్' పేరుమీద దాని పేరు 'బ్లిట్జ్' అని పెట్టారు. ఆ పత్రికకు ఫ్రీ.. ఫ్రాంక్.. ఫియర్‌లెస్.. అనే ట్యాగ్‌లైన్ ఉండేది. కరంజియా నేతృత్వంలో ఆ నియమాలను సజీవంగా ఉంచడం అనేదే ఆ పత్రికకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.

Image copyright COMMONWEALTHJOURNALISTS.ORG
చిత్రం శీర్షిక ప్రముఖ జర్నలిస్ట్, కామన్వెల్త్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు మహేంద్ర వేద్

రూసీ కరంజియా తన బ్లిట్జ్‌లో వార్తలు రాయడానికి అవకాశం ఇచ్చిన రోజును ప్రముఖ జర్నలిస్ట్ కామన్వెల్త్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు మహేంద్ర వేద్‌ ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు.

నేను ఆయన్ను మొదటిసారి ఆయన్ను 60వ దశకంలో కలిశాను. అప్పుడు నేను నేను చదువుకునేవాడ్ని. ఆయన అప్పట్లో మాకు హీరో. కరంజియా చాలా పెద్ద పత్రికను నడిపేవారు, అది చాలా పాపులర్. మేం ఒక పత్రిక ప్రారంభించి దాని మొదటి ప్రతిని ఆయనకు బహుమతిగా ఇచ్చాం. ఆ తర్వాత నేను ఒక చిన్న స్టోరీ రాశాను. దాన్ని ఆయనకు చూపించగానే, తర్వాత వారం రమ్మన్నారు. వెళ్లేసరికి ఆయన నా స్టోరీని 'బాక్స్ ఐటం'గా మూడో పేజీలో ప్రచురించారు. దానికి డబ్బు కూడా ఇచ్చారు. అది జర్నలిస్టుగా నా తొలి సంపాదన. ఆ రోజుల్లో 30 రూపాయలంటే చాలా ఎక్కువే. కానీ నా స్టోరీ బ్లిట్జ్‌లో రావడం, ఆయన చేత్తో డబ్బు తీసుకోవడం నాకు సంతోషంగా అనిపించింది" అన్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం

కరంజియా 1912 ఫిబ్రవరి 15న క్వెట్టాలో పుట్టారు. ఆయన తండ్రి కంటి సర్జన్. తల్లి క్వెట్టాలో ఒక సంపన్న కుటుంబానికి చెందినవారు. వారికి ముంబయి చౌపాటీ బీచ్‌ ఎదురుగా ఒక ఇల్లుండేది. దాని పేరు 'క్వెట్టా టెర్రస్'.

ప్రముఖ రచయిత జ్ఞాన ప్రకాశ్ తన 'ముంబై ఫెబిల్స్' పుస్తకంలో కరంజియా గురించి చెప్పారు. బొంబాయి సెయింట్ జేవియర్ స్కూల్, విల్సన్ కాలేజీలో చదివిన కరంజియా ఐపీఎస్ పరీక్ష రాసేందుకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదవాలనుకున్నారు. కానీ ఒక ఆకతాయి చేష్ట ఆయన జీవిత గమనాన్నే మార్చేసింది. కరంజియా మారుపేర్లతో టైమ్స్ ఆఫ్ ఇండియాలోని 'లెటర్స్ టు ఎడిటర్' కాలంకు చాలా లేఖలు రాశారు. పత్రిక ఉప సంపాదకుడు ఐవర్ జెహూకు అది ఎవరిపనో తెలిసింది. వెంటనే ఆయన కరంజియాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం ఆఫర్ చేశారు. ఆయన ప్రతిభ గుర్తించి ఈవెనింగ్ స్టాండర్డ్స్ పత్రికతో ట్రైనింగ్ కోసం లండన్ పంపించారు. కానీ ఆ సీరియస్ ట్రైనింగ్ ఆయనకు నచ్చలేదు. దాంతో ఆయన మసాలా వార్తలు రాసే టాబ్లాయిడ్ 'డైలీ మిర్రర్‌'తో కలిసి పనిచేయడం మొదలెట్టారు.

Image copyright KARANJIA FAMILY

గాంధీపై విమర్శలు

కొన్ని రోజుల తర్వాత కరంజియా భారత్ తిరిగొచ్చారు. మహాత్మా గాంధీ వార్ధా ఆశ్రమానికి వెళ్లి ఆయన గురించి ఒక విమర్శనాత్మక రిపోర్ట్ ప్రచురించారు.

దీని గురించి కరంజియా ఒక ఇంటర్వ్యూలో "నేను గాంధీ గురించి ఒకసారి చాలా చెత్త ఆర్టికల్ రాశాను. నాకు బాప్స్ తల్యార్ ఖాన్‌తో స్నేహం ఉంది. ఆయన ఒకసారి నన్ను భోజనానికి పిలిచారు. అక్కడ మొదటిసారి నేను జవహర్‌లాల్ నెహ్రూను కలిశాను. ఖాన్ నెహ్రూతో "నేను నిన్న మీకు చూపించిన గాంధీ ఆర్టికల్ రాసింది ఈయనే" అన్నారు. తర్వాత నెహ్రూ నాకు ఎంత లెక్చర్ ఇచ్చారంటే.. నేను తర్వాత రోజే గాంధీకి లేఖ రాసి క్షమాపణ అడిగాను. అంతే కాదు, ఆ ఆర్టికల్ కోసం నాకు ఇచ్చిన 250 రూపాయలను గాంధీ హరిజన్ ఫండ్ కోసం దానం చేసేశాను" అని చెప్పారు.

Image copyright KARANJIA FAMILY

బ్లిట్జ్ సక్సెస్ సీక్రెట్

కరంజియా నెహ్రూను కలిసినప్పటి నుంచీ ఆయనకు అభిమాని అయిపోయారు. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ కరంజియా స్థానంలో ఫ్రాంక్ మోరెస్‌ను ఎడిటర్ పదవికి 'గ్రూమ్' చేయడం మొదలుపెట్టింది.

ఆయన టైమ్స్ ఉద్యోగం వదలడానికి కొన్ని రోజుల ముందు సండే స్టాండర్డ్ తర్వాత మార్నింగ్ స్టాండర్డ్ ఎడిటర్‌గా ఉన్నారు. తర్వాత 1941లో ఆయన తన సొంత పత్రిక 'బ్లిట్జ్' ప్రారంభించారు.

ఆ పత్రికను ముంబయిలో 3000 రూపాయలతో ప్రారంభించారు. సీనియర్ జర్నలిస్ట్, కరంజియాతో కలిసి పనిచేసిన ఆనంద్ సహాయ్ "అప్పట్లో ఇన్ని పత్రికలు ఉండేవి కాదు. వీక్లీ బ్లిట్జ్‌ను మూడు భాషల్లో తీసుకొచ్చారు. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ. ఎక్కువగా బర్నింగ్ ఇష్యూలను ఎలాంటి జంకూ, గొంకూ లేకుండా ప్రచురించేవారు. అది అందరినీ ఆకట్టుకుంది. బ్లిట్జ్ చివరి పేజ్ కూడా చాలా పాపులర్. బ్రిటిష్ టాబ్లాయిడ్ లాగే దానిపై ఒక 'అమ్మాయి' బొమ్మ ఉండేది. కానీ దానితోపాటూ అదే పేజిలో ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ కాలమ్ ముద్రించేవారు అని చెప్పారు.

Image copyright KARANJIA FAMILY

కరంజియా జల్సా పురుషుడు

1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అండర్ గ్రౌండ్‌లో ఉన్న కాంగ్రెస్ వామపక్షవాదులకు బ్లిట్జ్ ఆఫీసు రహస్య స్థావరంగా మారింది.

అప్పుడు ఈ వార్తాపత్రిక తన లండన్ ఎడిటర్ స్ఫీక్ జకారియా ద్వారా నెహ్రూ విడుదల కోసం ఉద్యమం నడిపింది. అప్పుడు జైల్లో ఉన్న నెహ్రూను బ్లిట్జ్‌ సంచిక చదవడానికి అనుమతించకపోవడంతో కరంజియా ఈ విషయాన్ని లార్డ్ సోరెసన్ ద్వారా హౌస్ ఆఫ్ కామన్స్‌లో లేవనత్తారు.

25 ఏళ్లకే 'బ్లిట్జ్' పాఠకుల సంఖ్య 10 లక్షల దగ్గరకు చేరింది. ఆర్.కె.కరంజియా వ్యక్తిత్వం చాలా ఆకట్టుకునేలా ఉండేది. ఆయన మాట్లాడే తీరు చాలా అద్భుతంగా ఉండేది. ఆయన మంచి రాజకీయ జ్ఞానం కూడా ఉండేది.

"ఆయన చాలా 'జల్సా' పురుషుడు, మంచి మేనర్స్ ఉన్న వ్యక్తి. ఆయన పార్సీ సమాజంలో పాత తరం వారిలా ఉండేవారు. వారు ఇంగ్లిష్ శైలిలో ఉండేవారు. మంచి మంచి బట్టలేసుకునేవారు. అందరితో బాగా కలిసిపోయేవారు. ఆయన ఒక సోషలిస్టులా ఉండేవారు. మనం ఆయన ఆఫీసుకు వెళ్తే అక్కడ "యూ హావ్ టు బీ క్రేజీ టు వర్క్ హియర్ బట్ ఇట్ పేస్" అని రాసుండేది. ఆయన ఆఫీసులో వాతావరణం మిగతా పత్రికల కార్యాలయాల కంటే భిన్నంగా ఉండేది" అని మహేంద్ర వేద్ చెప్పారు.

Image copyright BLITZ

నానావటీ కేసు రిపోర్టింగ్

నానావటి మర్డర్ కేసు గురించి బ్లిట్జ్ పత్రిక అందించిన కథనాలు, దాని పాపులారిటీని పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు నేరస్థుడిని మీడియా ట్రయల్ చేస్తుంటారు. కానీ అప్పట్లో బ్లిట్జ్ బాధితుడిని మీడియా ట్రయల్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.

"టెలివిజన్ కంటే ముందు యుగంలో నానావటీ కేసు ఒక చాలా పెద్ద మీడియా ఈవెంట్. బ్లిట్జ్ దానిని చాలా పెద్దది చేసి అందించింది. ఒక ఘటనను ఇంకో ఘటనతో జోడిస్తూ వెళ్లింది. చాలా చోట్ల బ్లిట్జ్ ఘటనలను సృష్టించేది. వాటి గురించి పత్రికల్లో, సినిమాల్లో కూడా ప్రస్తావించారు. నానావటీ కోర్టుకు వెళ్లినపుడు అమ్మాయిలు ఆయనపై గులాబీలు విసిరేవారు. ఎందుకంటే ఆయన చాలా డాషింగ్, హాండ్సమ్‌గా ఉండేవారు. అలా మొదటిసారి ఒక స్కాండల్‌కు జాతీయ ప్రాధాన్యం లభించింది. అప్పుడే చాలా పెద్ద ఘటనలు కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్‌తో యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నారు. చైనాతో భారత్ సంబంధాలపై ప్రభావం పడింది. రాష్ట్రాల పునర్వవస్థీకరణ జరిగింది. కేరళలో మొదటి కమ్యునిస్ట్ ప్రభుత్వం రద్దైంది. అవన్నీ ఉన్నా దేశం దృష్టంతా నానావటీ కేసుపైనే ఉండేది. దానికి ఒకే ఒక కారణం బ్లిట్జ్ రిపోర్టింగ్" అని జామియా మిలియా ఇస్లామియాలో రీసెర్చ్ సెంటర్‌ ప్రొఫెసర్ సబీనా గడియోక్ అన్నారు.

Image copyright KARANJIA FAMILY
చిత్రం శీర్షిక తన కూతురు రీతా మెహతా, ఇరాన్ షాతో రూసీ కరంజియా

సెవన్ స్టార్ హోటల్ యజమాని ఇమేజ్

ఆర్.కె. కరంజియా మిగతా ఎడిటర్ల కంటే భిన్నంగా ఉండేవారు. కరంజియాపై అవుట్‌లుక్ ఎడిటర్‌గా పనిచేసిన వినోద్ మెహతా రాసిన "మోర్‌దాన్ ఎ మావరిక్" అనే ఆర్టికల్‌లో "ఆయన 70వ దశకంలో ఎడిటర్లలా అస్సలు ఉండేవారు కాదు. ఖుష్వంత్ సింగ్, గిరిలాల్ జైన్, శాంలాల్, ముల్‌గావ్‌కర్ అందరికీ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండేది. వీళ్లందరికీ భిన్నంగా రూసీ కరంజియా ఒక సెవన్ స్టార్ హోటల్ యజమానిలా కనిపించేవారు. ఆయకు పెద్ద మీసాలు ఉండేవి. స్టైలిష్ సఫారీ లేదా సూట్ వేసుకునేవారు. ఆయన బూట్లు చాలా ఫాషనబుల్‌గా ఉండేవి. ఒకసారి నేను ఆయన లిఫ్టు దగ్గర తన గర్ల్‌ఫ్రెండును ముద్దుపెట్టుకోవడం చూశాను. ఆయన అసలు సిగ్గుపడలేదు. నా వైపు చూసి కన్నుకొట్టారు" అని చెప్పారు.

గాసిప్స్ మాట్లాడ్డమంటే ఇష్టం

"కంజరియాను కలవడం అంటే అర్థం.. తాజా కొబ్బరినీళ్లు తాగడం, విదేశీ అంశాల గురించి తెలుసుకోవడం. ఆయన టేబుల్ మీద సుకర్ణ, నాసిర్, నెహ్రూ, టిటో ఫొటోలు ఉండేవి. ఆయన వారందరి గురించీ ఆసక్తికర విషయాలు చెప్పేవారు. గాసిప్స్ మాట్లాడ్డం అంటే ఆయనకు చాలా ఇష్టం. సుకర్ణో ప్రియురాలి గురించి ఆయన చెప్పిన విషయాలతో ఏకంగా ఒక పుస్తకమే రాయచ్చు. ఆయన తన ఫ్రీలాన్సర్లకు రాసిన ప్రతి కాలమ్‌కు ప్రతి నెలా చివర్లో జీతంలా డబ్బు ఇచ్చేవారు. ఒకసారి నా కళ్ల ముందే లాస్ట్ పేజ్ రాసే ఖ్వాజా అహ్మద్ అబ్బాస్‌కు పెళపెళలాడే 5 రూపాయల నోట్ల కట్టను ఇచ్చారు" అని వినోద్ మెహతా చెప్పారు.

చిత్రం శీర్షిక మొరార్జీ దేశాయ్

మొరార్జీ దేశాయ్ వెనకపడ్డారు

కరంజియాకు కొందరు రాజకీయ నేతలు అంటే ఇష్టం. కొందరంటే అస్సలు ఆయనకు అస్సలు పడేది కాదు. వారిలో మొరార్జీ దేశాయ్ కూడా ఒకరు.

ముంబయి ఫెబిల్స్ రాసిన జ్ఞాన ప్రకాశ్ అందులో "బ్లిట్జ్ పత్రిక వెంటాడిన దురదృష్టకర నేతల్లో మొరార్జీ దేశాయ్ ఒకరు. ఆయన 1952లో బొంబాయి ముఖ్యమంత్రిగా ఉండేవారు. 1977లో భారత ప్రధానమంత్రి కూడా అయ్యారు. బ్లిట్జ్ ఆయన నిజాయితీ, నైతికతను వేళాకోళం చేసేది. మద్యపానం నిషేదించాలని ఆదేశించిన సమయంలో కంజరియా అక్రమ మద్యాన్ని 'మొరార్జీనా, మొరార్జూస్' అని వ్యంగ్యంగా రాసేవారు. మొరార్జీ దేశాయ్‌ ఆయన నెహ్రూ అంటే పైపై విశ్వాసం చూపిస్తారని, కానీ ఆయనకు లోలోపల ప్రధాన మంత్రి కావాలని ఉండేదని బ్లిట్జ్ పత్రిక భావించేది.

మొరార్జీకి కూడా కరంజియా అండే పడేది కాదు

కంజరియా మొరార్జీ దేశాయ్‌ను ఎలా చూసేవారో, ఆయన కూడా బ్లిట్జ్‌ అంటే అదే స్థాయిలో పడేది కాదు.

దాని గురించి చెప్పిన మహేంద్ర వేద్ "నేను ఒకసారి మొరార్జీ దేశాయ్‌ను కలవడానికి వెళ్లి, నేను కరంజియా పత్రిక 'ద డెయిలీ'లో పనిచేస్తున్నానని చెప్పాను. దాంతో ఆయన ముఖం మాడ్చుకుని 'కరంజియా ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా రాస్తారు' అన్నారు. నేను అక్కడ్నుంచి లేవబోతుంటే, 'మీకు పనిచేయడానికి నిజాయితీ ఉన్న వేరే ఎడిటరే దొరకలేదా' అన్నారు. నేను మొరార్జీతో 'మీరు ఏ ఎడిటర్ గురించైనా చెప్పండి వాళ్ల దగ్గరికే వెళ్లి పనిచేస్తా' అన్నాను" అని చెప్పారు.

Image copyright Getty Images

రాజీవ్ గాంధీ అంటే ఇష్టం

ఇందిరాగాంధీ కరంజియా మధ్య 'లవ్-హేట్' రిలేషన్‌షిప్ ఉండేది. కానీ రాజీవ్ గాంధీని ఆయన చాలా ఇష్టపడేవారు. రాజీవ్ అంటే అయనకు మంచి భావన ఉండేది.

దాని గురించి చెప్పిన ఆనంద్ సహాయ్.. "కరంజియాకు రాజీవ్ గాంధీతో మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఆయన అప్పుపడ్డుతూ తన ఆర్టికల్స్‌లో రాజీవ్‌ను విమర్శించేవారు. దాంతో రాజీవ్ గాంధీ ఒకటి రెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు మంచి మంచి నేతలను కూడా మీ కథనాలతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారు అన్నారు. కరంజియాలో ఉండే మంచి విషయం అదే. వ్యక్తిగతంగా ఎంత బాగున్నా, ఒక ఎడిటర్‌గా మాత్రం ఆయన వాస్తవాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు.

అగ్ర నేతలను ఇంటర్వ్యూ చేయాలనే ఉత్సాహం

కరంజియా ఫిదెల్ కాస్ట్రో నుంచి, జమాల్ అబ్దుల్ నాసిర్, మార్షల్ టిటో వరకూ ప్రపంచంలోని ఎంతోమంది అగ్ర నేతలను ఇంటర్వ్యూ చేశారు.

ఈజిఫ్ట్ మాజీ అధ్యక్షుడు నాసిర్‌కు ఆయన ఎంత నచ్చాడంటే, కరంజియాను ఆయన తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'రిపబ్లికన్ ఆఫ్ మెరిట్‌' ఇచ్చి గౌరవించారు.

ప్రముఖ జర్నలిస్ట్ వీర్ సాంఘ్వీ తన ఒక కథనంలో కరంజియా బ్లిట్జ్ పత్రిక గురించి చెప్పారు. "స్వతంత్ర్య పోరాటం సమయంలో భారత ప్రెస్‌పై బ్రిటిష్ కంపెనీలు, జనపనార యజమానుల అధీనంలో ఉండేవి. అందుకే జవహర్‌లాల్ నెహ్రూ వాటిని 'ఝూట్ ప్రెస్'(అబద్ధాల వార్తలు) అనేవారు. అప్పుడే బ్లిట్జ్ భారత్‌కు మరో ప్రత్యామ్నాయాన్ని అందించింది. కరంజియా ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవారు. ఇప్పటి సందర్భంలో మీరు ఆయన్ను కాంగ్రెస్ మద్దతుదారుడని అనవచ్చు. కానీ 50, 60వ దశకంలో భారత రాజకీయాలు ఇప్పటికంటే ఎంతో జటిలంగా ఉండేవి.

అప్పట్లో భారత వార్తా పత్రికలు ప్రభుత్వం జారీ చేసే ప్రెస్ నోట్లు ముద్రిస్తుంటే, రూసీ కరంజియా ప్రపంచంలోని పెద్ద పెద్ద నేతలను ఇంటర్వ్యూ చేసేవారు. అది కూడా అందరికీ సమాన స్థాయి ఇచ్చేవారు. ఆ ఫొటోల్లో ఎంత హుందాగా, ఆత్మవిశ్వాసం కనిపించేవారంటే.. వాటిని చూసిన జనం అక్కడ ఇంటర్వ్యూ చేసిందెవరో, ఇచ్చిందెవరో తెలుసుకోలేకపోయేవారు.

Image copyright MUMBAI FABLES

పాకిస్తాన్ అటార్నీ జనరల్‌తో విభేదం

వివాదాలకు ఆజ్యం పోయడం, ఆకట్టుకునే హెడ్‌లైన్లు పెట్టడం, ఏదైనా ఉన్నదున్నట్టు చెప్పడంలో కరంజియా తనదైన ప్రత్యేకత చూపించేవారు. తనతోపాటూ పనిచేసే జర్నలిస్టులు కూడా అలాగే ఉండాలని కోరుకునేవారు. తోటివారు కష్టాల్లో ఉండే వారికి అండగా నిలిచేవారు.

అప్పట్లో పాకిస్తాన్ మాజీ అటార్నీ జనరల్ ఎ.కె.బ్రోహీ దిల్లీ వచ్చారు. మేం ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాం. బ్రోహీ అక్కడ చెప్పిన కొన్ని మాటల వల్ల అప్పటి జియా ఉల్ హక్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడింది. దాంతో ఆయన పాకిస్తాన్ హై కమిషన్‌కు వివరణ ఇస్తూ నేనసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. మేం అదే ఇంటర్వ్యూను ప్రచురించాం. ఆయన ఆ మాటలు అన్నాడని కూడా చెప్పాం". అని మహేంద్ర చెప్పారు.

కరంజియా కోపం

నేను ఆనంద్ సహాయ్‌ను ఆయన తన తోటి జర్నలిస్టులతో ఎలా ఉంటాడని అడిగాను. దానికి ఆయన కరంజియా మాతో చాలా బాగుండేవారు. కానీ, అప్పుడప్పుడూ కోపంగా అరిచేవారని చెప్పారు. ఆయనలో ఉన్న పెద్ద విషయం ఏంటంటే అనామకుడైనా సరే, ఆయన గదివరకూ వెళ్లగలిగేవాడు. అతిథులను ఆయన స్వయంగా బయటికి వచ్చి పంపించేవారు.

Image copyright KEYSTONE/GETTY IMAGES

బంగ్లాదేశ్ వెళ్లడానికి 10 వేలు ఇచ్చారు

కరంజియా పత్రిక ఎంత పాపులర్ అయ్యిందంటే ఆయనకు ప్రకటనల అవసరమే వచ్చేది కాదు. ప్రకటనలు లేకపోవడం వల్ల ఆయన జర్నలిస్టులకు మిగతా పత్రికల్లో ఇచ్చేంత జీతం కూడా ఇవ్వలేకపోయేవారు.

"కరంజియా అంటే వన్ మేన్ షో. నా దగ్గర డబ్బుల్లేవని ఆయన చెప్పేవారు. కానీ ఆయన మాతో మాట్లాడే పద్ధతి చాలా బాగుండేది. అందుకే డబ్బు తక్కువైనా మేం సంతోషంగా ఉండేవాళ్లం" అని మహేంద్ర వేద్ చెప్పారు.

"అప్పట్లో బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడు జియావుర్ రహమాన్ హత్య జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి. దాంతో నేను అక్కడికి వెళ్లాలని అనుకున్నాను. కానీ వేరే వాళ్లు ఆయన అలాంటి వాటిపై డబ్బు ఖర్చు పెట్టరని చెప్పారు. కానీ నేను ఆయనకు ప్రతిపాదనలు పంపించాను. తర్వాత మూడు గంటల్లోనే నాకు కరంజియా నుంచి మసేజ్ వచ్చింది. మీకు పది వేలు ఇస్తున్నాం. అక్కడికి వెళ్లండి" అన్నారు.

జీవిత చరమాంకంలో బీజేపీ చెంతకు

80వ దశకం మధ్య నుంచి కాలం మారడంతోపాటూ బ్లిట్జ్ పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. కరంజియా కూడా వృద్ధులయ్యారు.

జీవితాంతం సోషలిజం, నెహ్రూ ఆదర్శవాదానికి సలాం చేస్తూ వచ్చిన రూసీ కరంజియా తన జీవిత చరమాంకంలో భారతీయ జనతా పార్టీ వైపు వచ్చారు.

కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం బాగా పాడైంది. జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. 2008 ఫిబ్రవరి 1న భారత జర్నలిజంలో లెజండ్ అనిపించుకున్న కరంజియా తుదిశ్వాస విడిచారు. అయితే, 67 ఏళ్ల క్రితం సరిగ్గా అదే రోజు ఆయన 'బ్లిట్జ్' మొదటి సంచికను ముద్రించడం యాదృచ్చికం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నన్నయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు, సీఎం జగన్‌కు లేఖ, ప్రొఫెస‌ర్ సస్పెన్షన్

‘టార్జాన్’ భార్యను పొడిచి చంపిన కొడుకు.. అతడిని కాల్చిచంపిన పోలీసులు

యుద్ధభూమిలో అమ్మానాన్న మృతి.. చిక్కుకుపోయిన విదేశీ చిన్నారులు.. వీళ్లు ఇళ్లకు చేరేదెలా

ఎరిత్రియా: ఇక్కడ సిమ్‌ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించే వారికి తెలియదు

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం: భారత్‌లో పేదరికం తగ్గుతోందా

‘ఆర్టీసీ కార్మికులతో చర్చల్లేవ్’ - ప్రెస్ రివ్యూ

సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్‌షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్‌'

ఉత్తర కొరియాలో అత్యంత ఎత్తైన పర్వతాన్ని గుర్రంపై ఎక్కిన కిమ్