కశ్మీర్‌పై భారత్-పాకిస్తాన్‌ల హెచ్చరిక ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవచ్చు

  • 20 సెప్టెంబర్ 2019
సైనికుడు Image copyright AFP

''పాకిస్తాన్ పాలిత కశ్మీర్ భారత్‌లో భాగమే. ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుని పాలన సాగిస్తాం'' అని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు.

కశ్మీర్ భూభాగం మాదంటే మాది అని.. భారత్, పాకిస్తాన్‌లు వాదిస్తున్నాయి. కానీ, అందులో కొంత భాగం భారత్ పాలనలో, మరికొంత భాగం పాకిస్తాన్‌ పాలనలో ఉంది. అంతర్జాతీయంగా ఆ భూభాగాలను "భారత పాలిత కశ్మీర్", "పాకిస్తాన్ పాలిత కశ్మీర్"గా వ్యవహరిస్తున్నారు.

10 జిల్లాలతో 13,000 చదరపు కిలోమీటర్ల (5,019 చదరపు మైళ్లు) వైశాల్యం ఉన్న కశ్మీర్‌లో 40 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు.

ఈ వివాదాస్పద ప్రాంతంపై భారత విధానాన్ని జైశంకర్ మరోసారి పునరుద్ఘాటించారు.

"భారతదేశానికి చెందిన జమ్మూ కశ్మీర్‌లోని ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ దొడ్డిదారిన ఆక్రమించింది. దానిని ఆ దేశం ఖాళీ చేయాల్సిందే" అంటూ 1994లో భారత పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అయితే, బయటకు కనిపించే దానికంటే ఈ మాటల వెనుక బలమైన వ్యూహం దాగి ఉండవచ్చునని చాలామంది భావిస్తున్నారు.

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్, పూర్తిగా మంచుతో నిండి ఉండే అక్సాయ్ చిన్ ప్రాంతాలు జమ్మూ కశ్మీర్‌లో భాగమేనని ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని ముగ్గురు ముఖ్య సభ్యులు - విదేశాంగ, రక్షణ, హోం శాఖల మంత్రులు గట్టిగా పునరుద్ఘాటించారు.

సుదీర్ఘ కాలంగా భారత్ పాటిస్తున్న "అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదు" అన్న విధానాన్ని అవసరమైతే తిరిగి సమీక్షించాల్సి రావచ్చు అని ఆగస్టులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే ఇకపై అది 'పాక్ ఆక్రమిత కశ్మీర్'పై మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది 'పీవోకే'పైనే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు

భారత పాలిత కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత, కశ్మీర్ అంశంపై వచ్చేవారం ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. దానికి కొన్ని రోజుల ముందు భారత్ తన స్వరాన్ని పెంచిందా? (సరిహద్దు వెంట, పాకిస్తాన్ కూడా తన చర్యలను పెంచింది) లేక ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని గట్టిగా హెచ్చరిస్తోందా?

"జమ్మూ కశ్మీర్లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని అంటున్న పాకిస్తాన్‌కు కౌంటర్‌గా భారత నాయకులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు" అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మోదీ కండ బలాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఫిబ్రవరిలో కశ్మీర్లోని పుల్వామాలో మిలిటెంట్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (జేఈఎం) మిలిటెంట్ గ్రూప్ ఆ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆ దాడికి ప్రతిస్పందనగా... పాకిస్తాన్ భూభాగంలోని మిలిటెంట్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ వైమానిక దాడులు చేసింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionభారత్ వైమానిక దాడులు చేసిన బాలాకోట్ ఎలా ఉంది?

1971లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచీ కశ్మీర్ ప్రాంతాన్ని విభజించే నియంత్రణ రేఖ వెంట దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అదే సరిహద్దులో సెప్టెంబర్ 2016లో ఉగ్రవాదులపై భారత్ "సర్జికల్ స్ట్రైక్స్" చేసిన తరువాత, మోదీ పతాక శీర్షికల్లో నిలిచారు. 18 మంది సైనికుల ప్రాణాలను తీసిన ఆర్మీ స్థావరంపై మిలిటెంట్ల దాడికి ప్రతిస్పందనగా తాము సర్జికల్ దాడులు చేశామని భారత్ తెలిపింది.

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్‌ భూభాగాన్ని 'పాక్ ఆక్రమిత కశ్మీర్' అని భారత్ పిలుస్తుంటుంది. "భారత ఉపఖండంలో సంఘర్షణల తీవ్రత పెరుగుదలపై అధ్యయనం చేసే ఎవరైనా భారత్ చేస్తున్న తాజా ప్రకటనలను తీవ్రంగా పరిగణించాలి" అని 'ది హిందూ' పత్రిక దౌత్య వ్యవహారాల సంపాదకురాలు సుహాసిని హైదర్ అభిప్రాయపడ్డారు.

అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు ప్రత్యర్థి దేశాలూ కశ్మీర్ అంశంపై ఇప్పటికే రెండు యుద్ధాలు చేశాయి.

"రెండు దేశాలలో 250కి పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు ప్రచ్ఛన్నంగా పోరాటం కొనసాగిస్తూనే... పరస్పరం రెచ్చగొట్టుకుంటూ ఒకదాని సహనాన్ని మరొకటి పరీక్షిస్తున్నాయి. ఫలితంగా అణ్వస్త్రాల నిరోధకతే ప్రశ్నార్థకంగా మారుతోంది" అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌కు చెందిన స్టీఫెన్ కోహెన్ అన్నారు.

ఈ ఏడాది సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు కొన్నేళ్లుగా ఎక్కువయ్యాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్ సైన్యం రెండు వేల సార్లు "అకారణంగా" కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, పాక్ సైనికుల కాల్పుల్లో 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

2019లో సరిహద్దు దాటి భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సైనికులతో సహా 45 మందికి పైగా మరణించారని పాకిస్తాన్ తెలిపింది.

"సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఉల్లంఘనలు రాజకీయ వాగ్యుద్ధాలకు, సైనిక బలప్రదర్శనకు, దౌత్యపరమైన ప్రతిష్టంభనకు దారితీస్తుంది. అవి మరిన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, ఉద్రిక్తతలకు దారితీస్తాయి" అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో దౌత్య, నిరాయుధీకరణ అంశాల ప్రొఫెసర్ హ్యాపీమోన్ జాకబ్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలంటే భారత్ సైనిక చర్యను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పాకిస్తాన్ ఏకపక్షంగా దానిని ఇచ్చే అవకాశం లేదు.

"అలా జరగాలన్నది భారత దీర్ఘకాలిక ఆకాంక్షగా కనిపిస్తోంది" అని 'కశ్మీర్: ది అన్‌రిటెన్ హిస్టరీ' పుస్తక రచయిత క్రిస్టోఫర్ స్నెడెన్ అన్నారు.

"పాకిస్తాన్‌ మొదట కాల్పులు జరిపేలా భారత్ రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా జరిగితే కశ్మీర్ స్వాధీనాన్ని భారత ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉంటుంది" అని ఆయన చెప్పారు.

మరి, తాజా ప్రకటనలను రెండు అణ్వాయుధ దేశాల మధ్య సాగుతున్న మాటల యుద్ధానికి కొనసాగింపే తప్ప, మరొకటి కాదు అనుకోవాలా?

పాకిస్తాన్ పాలిత కశ్మీర్ గురించి మాట్లాడేందుకు భారత్ ముప్పేట వ్యూహంతో ఉందని దిల్లీకి చెందిన విదేశీ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు.

మొదటిది, "నెలన్నర కాలంగా కశ్మీర్ లోయలో నెలకొన్న పరిస్థితుల నుంచి దృష్టిని మళ్లించడం. రెండోది, కశ్మీర్‌ మీద అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చను మార్చేసి పాకిస్తాన్‌ను దెబ్బతీయడం. మూడోది, భారతీయ కశ్మీరీలలో నిస్సహాయ భావనను కలిగించడం, ప్రతిఘటన వ్యర్థం అన్న సందేశాన్ని ఇవ్వడం" అని అజయ్ శుక్లా వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం