గోదావరి పడవ ప్ర‌మాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?

  • 20 సెప్టెంబర్ 2019
గోదావరిలో పడవ ప్రమాదం

పాపికొండ‌ల ప‌ర్యట‌న ప్రాణాంతకంగా మారటం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పెను ప్ర‌మాదం త‌ర్వాత సాగుతున్న మృత‌దేహాల వెలికితీత కూడా ఎప్ప‌టికి పూర్తవుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి నెలకొంది.

ద‌శాబ్దాలుగా న‌దీ ప్ర‌యాణాలు సాగుతున్నా అవి సుర‌క్షితంగా సాగటానికి నేటికీ పటిష్టమైన చర్యలు లేవనే అభిప్రాయం వినిపిస్తోంది.

గోదావ‌రి న‌దిలో క‌చ్చులూరు వ‌ద్ద జ‌రిగిన టూరిస్టు బోటు ప్ర‌మాదం త‌ర్వాత ప్ర‌భుత్వం స్పందించింది. తూర్పు గోదావ‌రి జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో మెజిస్టీరియల్ విచార‌ణ నిర్వహిస్తామ‌ని చెప్తోంది.

అయితే, గ‌తంలో ఇటువంటి ప్రమాదాల మీద జ‌రిగిన విచార‌ణలు ఏం చెప్పాయి? వాటి మీద తీసుకున్న చర్యలేమిటి? ఆ చర్యలు ఎంత వరకూ ఫలించాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండేళ్లలో 100 మంది మృతి...

1992లో దేవీప‌ట్నం మండ‌లంలోని పోచ‌మ్మగండి స‌మీపంలో పెను ప్ర‌మాదం జ‌రిగింది. లాంచీలో ప్ర‌యాణిస్తున్న వారు దాదాపు వంద మంది ప్రాణాలు కోల్పోయారు.

2017లో కృష్ణా న‌దిలో ఇబ్ర‌హీంప‌ట్నం సమీపంలో జరిగిన లాంచీ ప్ర‌మాదం 20 మంది పర్యాటకుల ప్రాణాలు తీసింది.

2018 మే 15వ తేదీన నడి వేసవి కాలంలో కూడా గోదావ‌రి నదిలో ప్ర‌యాణిస్తున్న లాంచీ ప్ర‌మాదానికి గురై 22 మంది చ‌నిపోయారు. అప్ప‌ట్లో ప‌రిమితికి మించిన లోడు, పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఎక్కిన బోటు వాతావ‌ర‌ణంలో మార్పులు, ఈదురుగాలుల కార‌ణంగా ప్ర‌మాదానికి గుర‌యిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

2018లోనే జూలై 14న ముమ్మిడివ‌రం మండ‌లం ప‌శువుల్లంక స‌మీపంలో గోదావరి నదిని దాటటానికి ఉపయోగించే నాటు ప‌డ‌వ ప్ర‌మాదానికి గురైంది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్ద‌రి మృత‌దేహాలు ఇప్పటివరకూ ల‌భించ‌లేదు.

రెండేళ్ల వ్య‌వ‌ధిలో నాలుగు ప‌డ‌వ ప్ర‌మాదాల్లో సుమారు 100 మంది ప్రాణాలు నీటిలో క‌లిసిపోయాయి.

''కొత్త నిబంధ‌న‌ల్లో శాస్త్రీయత లేదు...''

ప్రభుత్వ యంత్రాంగం ప‌డ‌వ ప్ర‌మాదాలు జ‌రిగిన వెంట‌నే హ‌డావిడి చేసి ఆ త‌ర్వాత మిన్నకుంటోందని, పటిష్టమైన చర్యలు చేపట్టటం లేదని గోదావ‌రి ప్రాంత ప్రజలు తప్పుపడుతున్నారు.

కృష్ణా న‌దిలో జ‌రిగిన ప్ర‌మాదం త‌ర్వాత ప్ర‌భుత్వం నదీ జలాల ప్రయాణానికి సంబంధించిన నిబంధ‌న‌లు మార్చేసిందని కొత్త నిబంధనలు శాస్త్రీయంగా లేకపోవటం సమస్యగా మారిందని దేవీప‌ట్నం ప్రాంతానికి చెందిన స్థానిక విలేక‌రి యు. శ్రీనివాస‌రావు పేర్కొన్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''అప్ప‌టివ‌ర‌కూ కాలువ‌లు, ప‌బ్లిక్ ఫెర్రీస్ యాక్ట్ 1230 అమ‌లులో ఉండేది. దాని ప్ర‌కారం ఇరిగేష‌న్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో బోటు సూప‌రింటెండెంట్ అనుమ‌తులు జారీ చేసేవారు. ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించేవారు. కానీ, ఇప్పుడు ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టం తీసుకొచ్చి దానిని పోర్ట్ డైరెక్ట‌ర్ ప‌రిధిలోకి మార్చేసింది’’ అని తెలిపారు.

‘‘స‌ముద్రంలో బోట్లు, ర‌వాణా విష‌యంలో అవ‌గాహ‌న ఉన్న పోర్టు అధికారులకు న‌దీ జ‌లాల విష‌యంలో అవ‌గాహ‌న లేని కార‌ణంగా స్థానికేత‌రులకు కూడా బోటు స‌రంగులుగా అనుమ‌తులు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన రాయ‌ల్ వ‌శిష్ట బోటు స‌రంగు నూక‌రాజుకి ఈ ప్రాంతంలో న‌ది ప్రవాహం మీద పూర్తిగా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కూడా తాజా ప్రమాదానికి కార‌ణ‌మే'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

పాత ప్రమాదాల కేసులు ఏమ‌య్యాయి..?

2017 న‌వంబ‌ర్ 12న కృష్ణా న‌దిలో జ‌రిగిన‌ బోటు ప్ర‌మాదంపై ఎఫ్ఐఆర్ సీఆర్ 604/2017 గా కేసు న‌మోదైంది. ఐపీసీ 304 సెక్ష‌న్లు కూడా న‌మోదు చేశారు. శేష‌గిరిరావు, కొండ‌ల‌రావు, గేదెల శ్రీను, వింజ‌మూరి విజ‌య‌సార‌థి, చిట్టి అనే వారితో పాటు పది మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులు బెయిల్ మీద విడుదలయ్యారు. విజ‌య‌వాడ సెష‌న్స్ కోర్ట్ ప‌రిధిలో ఈ కేసు విచార‌ణ‌లో ఉందని ఇబ్ర‌హీంప‌ట్నం సీఐ శ్రీధ‌ర్ బీబీసీకి తెలిపారు.

గోదావ‌రి ప‌డ‌వ ప్ర‌మాదాల్లో కూడా అదే తీరు క‌నిపిస్తోంది. 2018 మే 15న జ‌రిగిన ప్ర‌మాదానికి సంబంధించి లాంచీ య‌జ‌మాని కాజా వెంక‌టేశ్వ‌ర రావు దేవీప‌ట్నం పోలీసుల ముందు లొంగిపోయారు. ఆ త‌ర్వాత ఆయన బెయిల్ మీద విడుదలై ఎప్పట్లా లాంచీ న‌డుపుతున్నారు.

ఈ కేసు ప్ర‌స్తుతం రంప‌చోడ‌వ‌రం కోర్టు ప‌రిధిలో ఉంది. ఆ లాంచీ ప్ర‌మాదం జ‌రిగినపుడు రంప‌చోడ‌వ‌రం స‌ర్కిల్‌లో విధులు నిర్వ‌హిస్తున్న అధికారి ఇప్పుడు కూడా బాధ్య‌త‌ల్లో కొనసాగుతున్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

గ‌త ఏడాది జూలైలో ముమ్మిడివ‌రం మండ‌లం ప‌శువుల్లంక వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో పోలీసులు 160/2018 ఎఫ్ఐఆర్ నంబరుతో ముగ్గురిపై కేసు న‌మోదు చేశారు. గుత్తాల రాజేష్, కోరుకొండ ఈశ్వ‌ర‌రావు, స‌లాది వెంక‌టేశ్వ‌ర రావుల‌ను నిందితులుగా పేర్కొన్నారు. వారు కూడా బెయిల్ మీద విడుదలయ్యారు. కేసు విచార‌ణ సాగుతోంది.

Image copyright PAPIKONDALU TOURISM/FB

విచార‌ణ‌ల్లో ఏం తేలింది..?

గ‌తంలో కృష్ణా న‌ది ప‌డ‌వ ప్ర‌మాదంపై ప్రత్యేక విచార‌ణ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఇరిగేష‌న్ అధికారులు అందించిన సమాచారంతో స‌రిపెట్టుకుంది.

ఆ త‌ర్వాత గోదావ‌రిలో 2018 ప‌డ‌వ ప్ర‌మాదాల‌పై కూడా రెవెన్యూ అధికారులు ఎటువంటి ద‌ర్యాప్తులు నిర్వ‌హించ‌లేద‌ని తూర్పు గోదావ‌రి జిల్లా డీఆర్‌ఓ స‌త్తిబాబు బీబీసీకి తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌భుత్వానికి సమాచారం అందించినట్లు అధికారులు చెప్తున్నారు.

ఆ నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ప‌లు హామీలు ఇచ్చారు. మంటూరు ప‌డ‌వ ప్ర‌మాదం త‌ర్వాత ఆయ‌న వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం ''ప్ర‌మాదానికి స‌మాచార లోపం ప్ర‌ధాన కార‌ణం. వాతావ‌ర‌ణంలో మార్పుల‌ గురించి ముందుగానే హెచ్చ‌రించాం. అయినా అది బోట్లు నడిపేవారికి చేర‌లేదు. ఇక‌పై ప‌డ‌వ ప్ర‌యాణాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడ‌తాం. గోదావ‌రిలో ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి పాపికొండ‌ల వ‌ర‌కూ ప్ర‌త్యేక బృందాల ఆధ్వ‌ర్యంలో గ‌స్తీ నిర్వ‌హిస్తాం. మారుమూల ఏజ‌న్సీ గ్రామాల‌కు రోడ్డు స‌దుపాయం క‌ల్పిస్తాం'' అని తెలిపారు.

కానీ, గ‌తంలో ప్ర‌భుత్వం చేసిన‌ ప్ర‌క‌ట‌న‌లు, నిబంధ‌న‌లు ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చిన దాఖ‌లాలు క‌నిపించ‌లేద‌న్న‌ది తాజా ప‌డ‌వ ప్ర‌మాదం చెప్తున్న వాస్త‌వం అంటున్నారు స్థానికుడైన పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్.

‘‘పాపికొండల పర్యాటక యాత్ర విషయంలో గతంలో మా ఆఫీసు నుంచే పర్యవేక్షణ ఉండేది. కొత్త చట్టం ప్రకారం పోర్ట్ డైరెక్టర్ అనుమతులు ఇస్తున్నారు. పాపికొండల వరకూ వెళుతున్న అన్ని బోట్లను పరిశీలిస్తుంటాం. గస్తీ తిరగాలనే ఆదేశాలు లేవు. ఇప్పటికప్పుడు రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకారంతో బోటింగ్ ని గమనిస్తూ, అవసరమైన ఏర్పాట్లు చేస్తుంటాం’’ అని ధవళేశ్వరం ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు బీబీసీకి వివరించారు.

కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై తాము దర్యాప్తు చేయలేదని.. టూరిజం వాళ్ళు చేసి ఉంటారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. టూరిజం వాళ్ళని అడిగితే తాము కూడా చేయలేదని చెప్తున్నారు.

‘‘ఘటనకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారికంగా తెలియజేసి ఉంటారు. అయితే, అప్పటి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం సహా అనేకం ఉన్నాయి. వాటిని ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం’’ అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి.

ఏదైనా తీవ్ర సంఘటన జరిగినపుడు హడావిడి చేయటం, ఆ తర్వాత అన్నీ మరచిపోవటం షరామామూలుగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు.

‘‘ఏ ఒక్కరికీ క్లారిటీ లేదు. విచారణ విషయంలో వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేసారని వాళ్ళు అంటున్నారు కానీ, మొత్తంగా ఎవరూ దర్యాప్తు చేయలేదు. కేవలం కేసు విచారణలో భాగంగా పోలీసులు దర్యాప్తు చేయటం తప్ప’’ అని నిట్టూరుస్తున్నారు.

తాజా ప్రమాదంపైన అయినా సమగ్ర విచారణ జరుగుతుందా?

రాయ‌ల్ వ‌శిష్ట ప్ర‌మాదంపై జాయింట్ కలెక్టర్‌తో విచార‌ణ‌కు ఆదేశించిన ప్ర‌భుత్వం స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్ర‌మాదానికి గుర‌యిన బోటును విశాఖ‌ప‌ట్నానికి చెందిన కోడిగుడ్ల వెంక‌ట ర‌మ‌ణ అనే వ్య‌క్తి పేరుతో న‌డుపుతుండ‌డం ప‌ట్ల కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

గోదావ‌రి ప్రాంతం గురించి, ఇక్క‌డి ప‌రిస్థితి గురించి పూర్తిగా అవ‌గాహ‌న లేని వ్య‌క్తులు బోటు నిర్వ‌హించ‌డం వెనుక కొంద‌రు అధికారుల లాబీయింగ్ ఉంద‌ని దేవీప‌ట్నానికి చెందిన ప‌లువురు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.

యాళ్ల ప్ర‌భావ‌తి, య‌ర్రంశెట్టి అచ్యుతామ‌ణి పేర్లు కూడా బోటింగ్ రిజిస్ట్రేష‌న్‌లో ఉన్న‌ట్లు తాజాగా పోలీసులు ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఘ‌ట‌న త‌ర్వాత తొలి నాలుగు రోజుల పాటు వెంక‌ట‌ర‌మ‌ణ పేరు మాత్ర‌మే ప్ర‌స్తావించిన పోలీసులు తాజాగా మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను ముందుకు తీసుకురావ‌డం వెనుక కార‌ణాలు ఏమిటనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఒక‌నాడు ప‌డ‌వ‌లను ప‌ర్య‌వేక్షించిన బోటు సూప‌రింటెండెంట్‌ల‌కు అధికారాలు ఇవ్వాల‌ని అచ్యుత్ దేశాయ్ సూచిస్తున్నారు. ఇప్ప‌టికే దాదాపుగా మూత‌ప‌డిన ధ‌వ‌ళేశ్వ‌రం, సీతాన‌గ‌రం బోటు యార్డుల‌ను కూడా పున‌రుద్ధరించాల‌ని కోరుతున్నారు.

గ‌తంలో మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు...

కృష్ణా, గోదావ‌రి నదుల్లో సుదీర్ఘ‌ కాలంగా ప‌డ‌వ ప్ర‌యాణాలు సాగుతున్నాయి. గోదావ‌రిలో అయితే రాజ‌మండ్రి నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కూ ఎగువ‌కు ప్ర‌యాణం సాగించే వారు. వివిధ ర‌కాల స‌రకుల ర‌వాణాతో పాటు.. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు కూడా పూర్తిగా ప‌డ‌వ‌ల మీదే సాగేది.

తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల ఏజ‌న్సీ ప్రాంతం నుంచి చింత‌పండు వంటి వివిధ అట‌వీ ఉత్ప‌త్తుల‌ను ప‌డ‌వ‌ల ద్వారా అటు భ‌ద్రాచ‌లం, ఇటు రాజ‌మండ్రి త‌ర‌లించేవారు. రోడ్డు ర‌వాణా లేని స‌మ‌యంలో జ‌ల‌ రవాణానే ప్రధాన సాధ‌నంగా ఉండేది.

కాకినాడ స‌ముద్ర తీరం నుంచి మ‌ద్రాసు వ‌ర‌కూ బ‌కింగ్‌హాం కెనాల్ ద్వారా కూడా ర‌వాణా సాగించేవారు.

ఈనాటి స‌దుపాయాలు అప్ప‌ట్లో లేవు. ఇప్పుడు బోట్లు యంత్రాలతో పాటు ఆధునిక హంగుల‌తో నడుస్తున్నాయి. కానీ ఆనాడు తెర‌చాప ప‌డ‌వ‌ల ద్వారానే ప్ర‌యాణాలు చేసేవారు. అయినా న‌దీ ప్ర‌వాహ‌పు వ‌డిని బ‌ట్టి పయనించేవారు. దాంతో ప్ర‌యాణాలకు పెద్ద‌గా ఆటంకాలు ఉండేవి కాదు.

సినిమా చూసి వెళుతూ ప్ర‌మాదం బారిన‌...

సంత‌ల‌కు, ఇత‌ర అవ‌స‌రాల‌కు అన్నింట‌ికీ ప‌డ‌వ ప్ర‌య‌ణాల మీద ఆధార‌ప‌డిన మ‌న్యం వాసులు కొన్నిసార్లు ప్ర‌మాదాల్లో చిక్కుకున్నారు.

వాటిలో 1959 జూలై 31న జ‌రిగిన ప్ర‌మాదం పెద్ద‌ది. అప్ప‌ట్లో ఉద‌య్ భాస్క‌ర్ బోటు ప్ర‌మాదానికి గురికావ‌డంతో పెద్ద సంఖ్య‌లో ప్రాణ న‌ష్టం జ‌రిగిందని పొడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ బీబీసీకి తెలిపారు.

ఆనాటి ప్ర‌మాదం గురించి ఆయ‌న మాట్లాడుతూ ''రాత్రి అంద‌రూ క‌లిసి సినిమాకు వెళ్లి, తెల్ల‌వారుజామున ప‌డ‌వ ప్ర‌యాణం సాగించారు. మ‌ధ్య‌లో ఇప్పుడు ప్ర‌మాదం జ‌రిగిన కచ్చులూరు ద‌గ్గ‌రే మందంలో చిక్కుకుని బోటు ప్ర‌మాదానికి గుర‌య్యింది. ఆ విష‌యం అప్ప‌ట్లో బీబీసీ రేడియో ద్వారానే అంద‌రికీ తెలిసింది’’ అని పేర్కొన్నారు.

‘‘ఆ త‌ర్వాత అదే జూలై 31నాడు 1969లో కూడా స‌రిగ్గా ప‌దేళ్ల‌కు అక్క‌డే జ‌రిగిన ప్ర‌మాదంలో ఝాన్సీరాణి బోటు ప్ర‌మాదానికి గురైంది. అప్పుడు నేను అక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే ఉన్నాను'' అని చెప్పారు.

అప్ప‌ట్లో లాంచీల ప్రయాణ‌మే అయినా ప్ర‌మాదాల విష‌యంలో జాగ్ర‌త్త‌లు, అనుభ‌వ‌జ్ఞులైన స‌రంగుల వల్ల ప్ర‌జ‌ల ప్రాణాల‌కు కొంత ర‌క్ష‌ణ ఉండేదని పేర్కొన్నారు.

ఇప్పుడు ప‌ర్యాట‌క రంగం వాణిజ్యంగా మారటంతో కొంద‌రు య‌జ‌మానులు పూర్తిగా లాభాపేక్ష‌తో ఈ రంగంలోకి రావటం, వారితో అధికార యంత్రాంగం లాలూచీప‌డ‌టం, ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డ‌టం వ‌రుస ప్ర‌మాదాల‌కు ఆస్కారం ఇస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తాజా ప్రమాదం నేపథ్యంలో ఇక ముందు ఇటువంటి ప్రమాదాలను నివారించటానికి ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్న‌ది చూడాల్సిందేనని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)