దిల్లీ కాలుష్యం: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తగ్గుతోందా - రియాలిటీ చెక్

  • 21 సెప్టెంబర్ 2019
వాయుకాలుష్యం Image copyright AFP

''దిల్లీలో కాలుష్యం 25 శాతం తగ్గింది. కాలుష్య తీవ్రత తగ్గుతున్న ఏకైక నగరం దిల్లీయే''.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల తన ట్వీట్‌లో చెప్పుకొన్నారీ విషయం. దేశ రాజధానిలో విషపూరిత వాయువులను తగ్గించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కూడా ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దిల్లీని చాలా సంవత్సరాలుగా వాయు కాలుష్య సమస్య పట్టి పీడిస్తోంది. శీతాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దిగజారుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్

2018 నవంబరులో దిల్లీలో వాయు కాలుష్య స్థాయి అత్యధిక స్థాయిలో రికార్డయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాదకర స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైంది ఆ నెలలో.

పెరుగుతున్న ట్రాఫిక్, నిర్మాణ పనులు, పరిశ్రమలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం, వివిధ సందర్భాల్లో బాణసంచా వినియోగం, కలుషిత గాలి పైకి వెళ్లకుండా నిరోధించే వాతావరణ పరిస్థితులు వంటివన్నీ ఈ తీవ్ర వాయు కాలుష్యానికి కారణాలే.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017లో కాలుష్యం కారణంగా దిల్లీలో మాస్కులు కట్టుకుని ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లు

ఏం మెరుగుపడింది?

కాలుష్యం 25 శాతం తగ్గిందని చెప్పిన కేజ్రీవాల్ అది ఎలాంటి కాలుష్యమో స్పష్టంగా చెప్పలేదు. దిల్లీకి చెందిన అధ్యయన సంస్థ 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ)' పరిశీలన ప్రకారం.. 2012-14 మధ్య మూడేళ్లతో పోల్చితే 2016-18 మధ్య మూడేళ్ల కాలంలో పీఎం 2.5 పార్టికల్స్ 25 శాతం తగ్గాయి.

  • పీఎం 2.5 పార్టికల్స్ రోజువారీ గరిష్ఠ స్థాయి కూడా గత మూడేళ్లలో తగ్గిందని ఆ అధ్యయనం చెబుతోంది.
  • ఏడాదిలో కాలుష్య తీవ్రత అధికంగా గల రోజుల సంఖ్యా తగ్గింది.
  • పీఎం 2.5 పార్టికల్స్ శాతం తక్కువగా ఉన్న రోజుల సంఖ్యా పెరిగిందని ఆ అధ్యయనం వెల్లడించింది.

ఇటీవల కాలంలో దిల్లీలోని నగర పాలక సంస్థలు కాలుష్య నివారణ దిశగా పలు చర్యలు చేపడుతున్నాయి. శుద్ధ ఇంధనాల దిశగా సాగడం, నిర్దేశిత సమయాల్లో వాహనాల వినియోగం తగ్గించడం, పారిశ్రామిక కాలుష్యానికి కారణమవుతున్న కొన్ని రకాల ఇంధనాలను పరిమితం చేయడం, పలు విద్యుత్కేంద్రాలను మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపట్టింది. దిల్లీ మీదుగా వెళ్లాల్సిన సరకు రవాణా వాహనాలు దిల్లీలోకి ప్రవేశించకుండా బయట నుంచే వెళ్లిపోయేందుకు వీలుగా రెండు రహదారులు అందుబాటులోకి తెచ్చారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ఏడాది దిల్లీ సగటు పీఎం 2.5 కాలుష్య స్థాయి ఘనపు మీటరుకు 115 మైక్రోగ్రాములు ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఇది 10 మైక్రో గ్రాములుగా ఉండాలి. భారత ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములుగా ఉండొచ్చు.

మిగతా కాలుష్యాల సంగతేంటి?

సర్రే యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్‌ ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ వివిధ ప్రాంతాల్లో తీసుకున్న నమూనాల ప్రకారం దిల్లీలో పీఎం 10 కాలుష్య స్థాయి తగ్గింది.

అయితే, పీఎం 2.5 తరహాలోనే పీఎం 10 కాలుష్య స్థాయి కూడా గతం కంటే తగ్గినప్పటికీ జాతీయ సగటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉందని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్, ఓజోన్ వంటి హానికర వాయువులతోనూ ఇబ్బందులే.

దిల్లీలో ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్ స్థాయి పెరుగుతున్నట్లు గుర్తించామని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన అనుమితరాయ్ చౌదరి తెలిపారు.

ముఖ్యంగా వేసవి కాలంలో ఓజోన్ సమస్య ఎక్కువగా ఉందన్నారామె.

మిగతా నగరాల కంటే నయమా?

దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే దిల్లీలో వాయు నాణ్యతను పరిశీలించడం, కొలవడం పక్కాగా జరుగుతోంది. నగరంలో 38 ప్రత్యేక వాయు నాణ్యత పరిశీలన కేంద్రాలున్నాయి.

మిగతా నగరాల్లో ఇంత వ్యవస్థ లేదు. తక్కువ సంఖ్యలో వాయునాణ్యత పరిశీలన కేంద్రాలు, అవి కూడా ఎప్పుడో ఏర్పాటు చేసినవి ఉన్నాయి.

దిల్లీతో పాటు దేశంలోని ఇతర నగరాల్లోనూ పీఎం 2.5 పార్టికల్స్ స్థాయి తగ్గుతూ వస్తోందని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

దిల్లీలోని నగరపాలక సంస్థలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 2024 నాటికి పీఎం 2.5, 10 పార్టికల్స్ స్థాయి 20 నుంచి 30 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు