టీటీడీ బోర్డులోకి శేఖర్ రెడ్డి ఎలా వచ్చారు? చంద్రబాబు బినామీ అన్న వైఎస్ జగన్ ఆయనకు అవకాశం ఎలా ఇచ్చారు?

  • 20 సెప్టెంబర్ 2019
చంద్రబాబుతో శేఖర్ రెడ్డి. పక్క చిత్రంలో జగన్ Image copyright Facebook

జే శేఖర్ రెడ్డి. ఈయన తమిళనాడు రాష్ట్రం కాట్పాడికి చెందిన కాంట్రాక్టర్. 2016 డిసెంబర్ నుంచి కొన్ని నెలల పాటు నిత్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్మోగి.. మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోకి వచ్చారు.

అప్పట్లో శేఖర్ రెడ్డి 'చంద్రబాబు బినామీ.. లోకేష్ రూ. 100 కోట్లు తీసుకుని టీటీడీ బోర్డులో సభ్యుడిని చేశారు' అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అదే స్వరంలో మాట్లాడారు. మూడేళ్లు తిరిగే సరికి.. చంద్రబాబు స్థానంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రభుత్వ హయాంలో తొలిసారి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యులను నియమించారు. ఈ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా మళ్లీ అదే శేఖర్ రెడ్డిని చేర్చారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అపుడంత తీవ్రమైన ఆరోపణలు చేసిన వారు ఇపుడెందుకు మనసు మార్చుకున్నారు అనేది ప్రశ్న.

ఇదీ శేఖర్ రెడ్డి ప్రస్థానం..

తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని తొండాన్ తులసి అనే గ్రామం శేఖర్ రెడ్డి స్వస్థలం. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తొలుత చిన్నచిన్న కాంట్రాక్టులు చేసుకునేవారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టారు. కాలక్రమంలో స్థానిక రాజకీయ నాయకులకు, తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్‌లకు సన్నిహితుడిగా మారారు. అన్నా డీఎంకేలో పన్నీర్ సెల్వం, జయలలిత స్నేహితురాలు శశికళకు శేఖర్ రెడ్డి అత్యంత దగ్గరి మనిషి అని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

వైభవ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ఆర్ బిల్డర్స్ పేరిట రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి అధినేతగా ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఇసుక తవ్వకాల అనుమతులు ఆయనకు భారీగా దక్కుతుంటాయి.

జయలలిత బెంగళూరు జైల్లో ఉన్న సమయంలో పన్నీర్ సెల్వం తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు పన్నీర్ సెల్వం సిఫారసుతోనే ఆయనకు టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం లభించినట్లు పలు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వర్గాలు సైతం అన్నా డీఎంకే ఆధ్వర్యంలోని తమిళనాడు ప్రభుత్వ సిఫారసుతోనే శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డులో సభ్యత్వ పదవి ఇచ్చామని అప్పట్లో తెలిపాయి.

Image copyright TTD
చిత్రం శీర్షిక తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్ సెల్వంతో తిరుమల దేవస్థానం వద్ద శేఖర్ రెడ్డి (పాత ఫొటో)

కోట్ల కొద్దీ నగదు.. కిలోల కొద్దీ బంగారం

2016 నవంబర్ 8వ తేదీన నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు ప్రకటించారు. సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే 2016 డిసెంబర్ 8వ తేదీన కాట్పాడిలోని శేఖర్ రెడ్డి ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. అప్పటికి జయలలిత మరణించారు. ముఖ్యమంత్రి పదవి కోసం పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి పోటీపడ్డారు. పన్నీర్ సెల్వం గెలిచారు. ఈ సమయంలోనే ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సంయుక్తంగా మూడు రోజులకు పైగా సుదీర్ఘంగా ఈ సోదాలు జరిపారు. ఈ దాడుల్లో ఎంత డబ్బు, బంగారం పట్టుబడిందనేది స్పష్టంగా బయటకు రాలేదు. అయితే, మూడోరోజు నాటికి సుమారు రూ.164 కోట్ల నగదు, 127 కేజీల బంగారం దొరికిందని ది హిందూ వార్తా పత్రిక డిసెంబర్ 10వ తేదీన ప్రచురించిన ఒక వార్తా కథనంలో పేర్కొంది. ఈ దాడుల్లోనే శేఖర్ రెడ్డి డైరీలు కూడా దొరికాయి. అందులో కొందరు నాయకులు, అధికారులకు డబ్బులు చెల్లించినట్లుగా వివరాలను పేర్కొన్నారు. సుమారు రూ.400 కోట్లు ఇలా ముడుపులు చెల్లించారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

Image copyright SAM PANTHAKY

శేఖర్ రెడ్డిపై కేసులు ఏంటి? ఏమయ్యాయి?

సీబీఐ నమోదు చేసిన కేసు (ఎఫ్ఐఆర్ నంబర్. ఆర్‌సీ ఎంఏ1 2016 ఎ 0040.. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 409, 420, ఐపీసీ 120 బి రెడ్ విత్ 13(2), 13(1), 13 (1)(డి)) ప్రకారం.. శేఖర్ రెడ్డి, అతని కంపెనీ ఎస్ఆర్ఎస్ మైనింగ్ భాగస్వాములు కలిపి రూ.33.63 కోట్లు విలువైన కొత్త రెండువేల రూపాయల నోట్లను కలిగి ఉన్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కస్టమ్స్ యాక్ట్ సెక్షన్ 123 కింద నమోదు చేసిన కేసు ప్రకారం.. శేఖర్ రెడ్డి 178 కిలోల బంగారాన్ని కలిగి ఉన్నారు. అందులో 131.5 కేజీల బంగారం విదేశాల్లో తయారైనది. ఇందులో చాలా వరకు కేజీ కడ్డీల రూపంలో ఉంది.

వీటితో పాటు ఆదాయపు పన్ను శాఖ సైతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది.

ఈ క్రమంలో శేఖర్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేయగా.. సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

కాగా, సరైన సాక్ష్యాలను, ఆధారాలను చూపించలేనందువల్ల సీబీఐ పెట్టిన కేసును 2018లో తమిళనాడు హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో సాక్ష్యాధారాలను చూపించలేకపోయినందుకు సీబీఐ పైన కూడా విమర్శలు చేసింది.

శేఖర్ రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వాములపై సీబీఐ మొత్తం మూడు (ఎఫ్ఐఆర్) కేసులు నమోదు చేయగా.. అందులో రెండు ఎఫ్ఐఆర్ లను తగిన సాక్ష్యాధారాలు లేవంటూ మద్రాసు హైకోర్టు కొట్టేసింది. మరొక కేసులో సీబీఐ ఇప్పటి వరకూ ఛార్జిషీటు దాఖలు చేయలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.33.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే, దీనిపై శేఖర్ రెడ్డి పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థను ఆశ్రయించగా.. ఈడీ ఉత్తర్వులపై స్టే లభించింది

ఆదాయపు పన్ను శాఖ కేసు సైతం ఈ ఏడాది పరిష్కారమయ్యింది. శేఖర్ రెడ్డి, ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలో లభించిన ఆదాయం అంతా ఆయన వ్యాపారానికి సంబంధించినదేనని ఐటీ శాఖ తేల్చి చెప్పింది.

డీఆర్ఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన వివరాలపై స్పష్టత లేదు.

Image copyright facebook/ysjagan
చిత్రం శీర్షిక శేఖర్ రెడ్డిపై జగన్ ఫేస్ బుక్‌లో చేసిన పోస్టు

శేఖర్ రెడ్డి వ్యవహారంపై అప్పుడు వైసీపీ ఏమంది?

2016 డిసెంబర్ 11వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ''భారీగా అవినీతికి పాల్పడి సంపాదించిన నల్లధనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు.. శేఖర్ రెడ్డి లాంటి బినామీల ద్వారా తెల్లధనంగా మార్చుకుంటున్నారు. సాధారణ కాంట్రాక్టు పనులు నిర్వహించే శేఖర్ రెడ్డి వద్ద ఐటీ అధికారుల దాడుల్లో రూ.167 కోట్ల నగదు, 127 కిలోల బంగారం బయటపడింది. పెద్దనోట్ల రద్దు తర్వాత రూ.2 వేల నోటు కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల వద్ద సామాన్య ప్రజలు క్యూలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల వద్ద మాత్రం వందల కోట్లు నూతన కరెన్సీ ఉండటం వెనుక పెద్ద రాకెట్‌తో పాటు ప్రభుత్వ అధినేతల హస్తం ఉంది. శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించడం కోసం నారా లోకేష్ రూ.100 కోట్లు తీసుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సిఫార్సు చేయించి నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి'' అని అన్నారు.

జగన్ సైతం శేఖర్ రెడ్డి.. చంద్రబాబు బినామీ అంటూ 2016 డిసెంబర్ 15వ తేదీన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, శేఖర్ రెడ్డి కలసి ఉన్న ఫొటోను కూడా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ సైతం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. లోకేష్‌కు, శేఖర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ఈ విషయం ప్రధానమంత్రికి తెలిసినందువల్లనే చంద్రబాబు మాట చెల్లుబాటు కావటం లేదంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు.

సీపీఐ నాయకులు మధు, కాశీనాథ్ వంటివాళ్లు సైతం ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు.

Image copyright Govt of AP

శేఖర్ రెడ్డి టీటీడీలోకి ఇలా వచ్చారు..

టీటీడీ బోర్డులో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ జీఓ (963) విడుదల చేసింది. ఇందులో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే కాగా.. మిగతా ఆరుగురు ఆయా రాష్ట్రాల్లో టీటీడీ స్థానిక సలహా కమిటీ (ఎల్ఏసీ) అధ్యక్షులుగా ఉన్నారు. చెన్నై ఎల్ఏసీ అధ్యక్షుడిగా ఉన్న శేఖర్ రెడ్డికి కూడా అదే హోదాలో టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం దక్కింది. అయితే, ఈ జీఓలో శేఖర్ రెడ్డి పేరును 'శేఖర్ ఏ.జే' అని పేర్కొనడం గమనార్హం. ఎల్ఏసీ అధ్యక్షులను టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణించటం, వారికి టీటీడీ బోర్డు సభ్యులతో సమాన గౌరవ మర్యాదలు కల్పించడం గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. శేఖర్ రెడ్డి కంటే ముందు చెన్నై ఎల్ఏసీ అధ్యక్షుడిగా ఉన్న నూతలపాటి శ్రీకృష్ణ కూడా టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా కొనసాగారు. జూన్ నెలలో ఆయన రాజీనామా చేయగా, ఆయన స్థానంలో శేఖర్ రెడ్డికి ఎల్ఏసీ ఛైర్మన్‌గా, టీటీడీ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా జగన్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

'శేఖర్ రెడ్డి భక్తుడు.. అలాంటి వారికి చోటివ్వాలి' - వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో విలేకరులతో మాట్లాడారు. ఈ శేఖర్.. ఆ శేఖర్ రెడ్డేనా? అని ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ శేఖర్ రెడ్డే' అని సమాధానం ఇచ్చారు. ''ఆయన ఆదాయపు పన్ను కేసులను ఎదుర్కొన్నారు. అయితే, అవేవీ రుజువు కాలేదు. కోర్టు కూడా ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. పైగా శేఖర్ రెడ్డి శ్రీవారికి భక్తుడు. తిరుమలలో (రూ.80 లక్షల విలువైన) గో మందిరాన్ని తన స్వంత ఖర్చులతో నిర్మిస్తున్నారు. ఆయన్ను టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదు'' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

'జగన్ అన్న నన్ను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించారు' - శేఖర్ రెడ్డి

ఈ వ్యవహారంపై శేఖర్ రెడ్డి కూడా స్పందించారు. ''దేవుడు అనుగ్రహించడం వల్లనే శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం నాకు మళ్లీ కలిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్న నన్ను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను'' అని ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)