టీడీపీ నేత, చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ కన్నుమూత

  • 21 సెప్టెంబర్ 2019
టీడీపీ నేత శివప్రసాద్ Image copyright ANI
చిత్రం శీర్షిక టీడీపీ నేత శివప్రసాద్

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత డాక్టర్ నారమల్లి శివ ప్రసాద్ తుదిశ్వాస విడిచారు.

కొంతకాలంగా మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివ ప్రసాద్‌కు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈరోజు మధ్నాహ్నం 2.10 గంటలకు శివప్రసాద్ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదంటూ... అడాల్ఫ్ హిట్లర్ వేషధారణలో 2018 ఆగస్టులో శివప్రసాద్ పార్లమెంటుకు హాజరయ్యారు.

నారమల్లి శివ ప్రసాద్ 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో పనిచేశారు.

2009, 2014 ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.

Image copyright Getty Images

గతంలో నటుడిగానూ ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో అనేక సమస్యలపై తనదైన శైలిలో, విభిన్నమైన వేషధారణలతో పార్లమెంటు వద్ద నిరసన తెలిపేవారు.

Image copyright fb/Dr.N.SivaPrasad

చిత్తూరు జిల్లాలోని పూటిపల్లిలో 1951 జులై 11న శివప్రసాద్ జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పార్లమెంటు వద్ద నారుదుడి వేషంలో నిరసన తెలిపిన శివప్రసాద్

రంగస్థల నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ నటుడిగా, దర్శకుడిగానూ పనిచేశారు. ఖైదీ, జై చిరంజీవ, యముడికి మొగుడు, డేంజర్, ఆటాడిస్తా లాంటి అనేక సినిమాల్లో ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు.

ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకుడిగానూ పనిచేశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా వేషంలో శివప్రసాద్

"తెలుగుదేశం పార్టీకి తీరని లోటు"

శివప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసుల్లో శివప్రసాద్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)