మహాత్మా గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా?

గాంధీ

మహాత్మా గాంధీతోపాటు ఫొటోల్లో ఆయన చుట్టూ చాలా మందిని మనం చూస్తుంటాం. వారిలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌ లాంటి వాళ్లను తేలిగ్గానే గుర్తుపడతాం.

మహాత్ముడికి సన్నిహితులనగానే వాళ్ల పేర్లే ఎక్కువగా గుర్తుకువస్తాయి.

అయితే, వీళ్లు కాకుండా గాంధీకి దగ్గరివారు చాలా మందే ఉన్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు.

గాంధీ అడుగుల్లో అడుగులు వేస్తూ నడిచి, ఆయనకు అత్యంత దగ్గరైన ఎనిమిది మంది మహిళలు వీళ్లే..

1. మెడెలిన్ స్లెడ్ (మీరాబెన్), 1892-1982

బ్రిటీష్ అడ్మిరల్ సర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె మెడెలిన్.

సైనిక కుటుంబం కావడంతో ఆమె బాల్యంలో క్రమశిక్షణగా పెరిగారు.

జర్మన్ సంగీతకారుడు, పియానో విధ్వాంసుడు బీథోవెన్ అంటే మెడెలిన్‌కు అభిమానం. ఆ కారణంతోనే ఆమె‌కు ఫ్రెంచ్ రచయిత రోమైన్ రోలెండ్‌తో పరిచయం ఏర్పడింది.

రోలెండ్ సంగీతకారుల గురించి రచనలు చేసేవారు. గాంధీ జీవిత చరిత్రను కూడా ఆయన రాశారు.

ఈ జీవిత చరిత్రను మెడెలిన్ చదివారు. ఆ పుస్తకం ఆమె‌పై గొప్ప ప్రభావం చూపింది.

గాంధీ చెప్పిన మార్గంలో జీవించాలని ఆమె నిర్ణయానికి వచ్చారు. సబర్మతీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాని గాంధీకి మెడెలిన్ లేఖ రాశారు.

గాంధీ ప్రభావంతో ఆమె మద్యం మానేశారు. శాకాహారిగా మారిపోయారు. వ్యవసాయం నేర్చుకున్నారు.

1925 అక్టోబర్‌లో మెడెలిన్ అహ్మదాబాద్‌కు వచ్చారు.

‘‘అక్కడకు వెళ్లగానే తెల్లటి గద్దె మీద కూర్చున్న ఓ బక్కటి వ్యక్తి లేచి, నా దగ్గరికి వచ్చారు. ఆయన బాపూజీ అని నాకు తెలుసు. నా మనసంతా ఆనందం, భక్తితో నిండిపోయింది. కళ్ల ముందు దివ్య కాంతి కనిపించింది. నేను బాపూజీ పాదాల వద్ద కూర్చున్నా. ఆయన నన్ను లేపి.. నువ్వు నా బిడ్డవు అని అన్నారు’’ అని మెడెలిన్ గాంధీని తొలిసారి కలిసిన సందర్భం గురించి ఓ సందర్భంలో వివరించారు.

అప్పటి నుంచి మహాత్మ గాంధీ, మెడెలిన్‌ల మధ్య గొప్ప బంధం ఏర్పడింది. మెడెలిన్ పేరు మీరాబెన్‌గా మారింది.

2. నిలా క్రైమ్ కుక్, 1972-1945

ఆశ్రమంలో అందరూ నిలాను నాగిని అని పిలిచేవారు. తనను తాను కృష్ణుడి గోపికగా భావించుకునే ఆమె.. మౌంట్ అబూలో ఓ మత గురువు వద్ద ఉండేవారు.

నిలా జన్మస్థలం అమెరికా. మైసూర్‌కు చెందిన రాజకుమారుడితో ఆమె ప్రేమలో పడ్డారు.

1932లో గాంధీకి ఆమె బెంగళూరు నుంచి లేఖ రాశారు. అంటరానితనానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాల గురించి గాంధీకి వివరించారు. వాళ్లిద్దరి మధ్య అలా లేఖల ద్వారా సంభాషణలు మొదలయ్యాయి.

ఆ మరుసటి ఏడాది 1933లో నిలా.. యరవాడ జైల్లో గాంధీని కలిశారు.

గాంధీ నిలాను సబర్మతీ ఆశ్రమానికి పంపారు. కొంతకాలం అక్కడ గడిపాక ఆశ్రమ సభ్యులతో ఆమెకు మంచి అనుబంధం ఏర్పడింది.

అయితే, ఉదారవాద ఆలోచనలతో ఉండే నిలాకు ఆశ్రమ జీవితం ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయారు.

కొన్ని రోజుల తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ ఇస్లాం స్వీకరించి, ఖురాన్‌ను అనువాదం చేశారు.

3. సరళా దేవీ చౌధరానీ (1872-1945)

ఉన్నత చదవులు అభ్యసించిన సరళ దేవీ సంగీతం, భాషలు, రచనల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు. ఆమె రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు.

ఓసారి లాహోర్‌లోని సరళ ఇంట్లో గాంధీ బస చేశారు. సరళ భర్త, స్వాతంత్ర్య ఉద్యమకారుడు రామ్‌భుజ్ దత్త్ అప్పుడు జైల్లో ఉన్నారు.

గాంధీ, సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. సరళను తన ‘ఆధ్యాత్మిక భార్య’గా గాంధీ వర్ణించేవారు.

తమ సాన్నిహిత్యం కారణంగా రామ్‌భుజ్‌తో సరళ వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితులు కూడా వచ్చాయని గాంధీ తర్వాతి రోజుల్లో అంగీకరించారు.

ఖాదీ గురించి ప్రచారం చేసేందుకు గాంధీ, సరళ కలిసి భారత్‌లో పర్యటించారు. వీరి బంధం గురించి గాంధీ సన్నిహితులకు కూడా తెలుసు.

కానీ, కొంత కాలం తర్వాత సరళను గాంధీ దూరం పెట్టారు.

కొన్నాళ్లకు హిమాలయాల్లో ఏకాంత జీవితం గడుపుతూ సరళ మృతిచెందారు.

4.సరోజినీ నాయుడు (1879-1949)

కాంగ్రెస్‌ తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు.

గాంధీ అరెస్టు తర్వాత ఉప్పు సత్యాగ్రహం నడిపించాల్సిన బాధ్యత ఆమెపైనే పడింది.

సరోజినీ, గాంధీ తొలిసారి లండన్‌లో కలుసుకున్నారు.

‘‘ఆయన ఎత్తు తక్కువ. నెత్తిపై జట్టు కూడా లేదు. నేలపై కూర్చొని ఆలివ్ నూనెలో వేయించిన టమాటలను తింటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిని అలా చూసి నాకు ఆనందంతో నవ్వు వచ్చింది. అప్పుడు ఆయన నా వైపు చూశారు. ‘మీరు కచ్చితంగా నాయుడు గారి శ్రీమతి అయ్యుంటారు. నాతోపాటు తినండి’ అని అన్నారు. నేనేమో ఇదేం పనికిరాని పద్ధతి అని అడిగా’’ అంటూ సరోజినీనాయుడు ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

వారి మధ్య బంధం అలా మొదలైంది.

5. రాజకుమారి అమృత్ కౌర్ (1889-1964)

కపూర్థలా రాజు హర్‌నామ్ సింగ్ కుమార్తె అమృత్ కౌర్.

ఆమె ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. గాంధీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరిగా ఆమె పేరును విశ్లేషకులు చెబుతుంటారు.

1934లో తొలిసారి ఆమె గాంధీని కలిశారు. ఇద్దరూ వందల సంఖ్యలో లేఖలు రాసుకున్నారు.

ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భాల్లో అమృత్ కౌర్ జైలుకు కూడా వెళ్లారు.

స్వతంత్ర భారత్‌కు ఆమె తొలి ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

అమృత్ కౌర్‌కు గాంధీ ‘మేరీ ప్యారీ పాగల్ ఔర్ బాగీ’ అంటూ లేఖలు రాసేవారు. చివర్లో తనను తాను ‘తానాషా’ (నియంత)గా అందులో పేర్కొనేవారు.

6. డాక్టర్ సుశీలా నయ్యర్ (1914-2001)

గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నయ్యర్‌‌కు సుశీలా చెల్లెలు.

తమ తల్లి వద్దన్నా వినకుండా ఈ అన్నాచెల్లెళ్లు గాంధీతోపాటు ఉండేందుకు వెళ్లారు. అయితే, తర్వాతి రోజుల్లో వారి తల్లి కూడా గాంధీ సమర్థకురాలిగా మారిపోయారు.

వైద్యం చదివిన తర్వాత గాంధీకి సుశీలా వ్యక్తిగత డాక్టర్‌గా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీ.. మనూ, ఆభాల తర్వాత సుశీలా‌పైనే ఎక్కువగా ఆధారపడేవారు.

బ్రహ్మచర్యం గురించి గాంధీ చేసుకున్న పరీక్షల్లో సుశీలా కూడా ఉండేవారు.

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్భా గాంధీతోపాటు సుశీలా అరెస్టయ్యారు.

పూనాలో కస్తూర్భా గాంధీ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీలా ఉన్నారు.

7. ఆభా గాంధీ (1927-1995)

ఆభా బెంగాలీ. గాంధీ మునిమనవడు కను గాంధీని ఆమె వివాహం చేసుకున్నారు.

గాంధీ ప్రార్థన కార్యక్రమాల్లో ఆభా భజనలు పాడేవారు. కను ఫోటోలు తీసేవారు. 1940లో మహాత్మ గాంధీ ఫోటోలను కను చాలా తీశారు.

ఆభా నోవాఖాళీలో గాంధీతోపాటు ఉండేవారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా హిందూ-ముస్లిం అల్లర్లు జరిగాయి. గాంధీ వాటిని ఆపేందుకు ప్రయత్నించారు.

నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన సమయంలో ఆభా అక్కడే ఉన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఆభా, మనులతో గాంధీ

8.మను గాంధీ (1928-1969)

చాలా చిన్న వయసులోనే మను మహాత్మ గాంధీ వద్ద చేరారు.

ఆయనకు ఆమె దూరపు బంధువు. మనును తన మనవరాలిగా గాంధీ భావించేవారు.

గాంధీ నోవాఖాలీ‌లో ఉన్న రోజుల్లో అభాతోపాటు మను ఆయనకు సాయంగా ఉండేవారు. వాళ్లద్దరి భుజాల ఆసరాతోనే గాంధీ నడుస్తుండేవారు.

గాంధీని వ్యతిరేకించే కొందరు ఆయన నడిచే దారుల్లో ఓసారి మలమూత్రాలు వేసినప్పుడు, వాటిని గాంధీతోపాటు శుభ్రం చేసినవారిలో మను, ఆభా కూడా ఉన్నారు.

కస్తూర్భాకు చివరి రోజుల్లో సపర్యలు చేసినవారిలోనూ మను పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

మహాత్మ గాంధీ జీవితంలో ఆఖరి కొన్నేళ్లు ఎలా గడిచాయన్నది ఆమె డైరీలో వివరంగా రాసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)