'గద్దలకొండ గణేష్' సినిమా రివ్యూ

  • 21 సెప్టెంబర్ 2019
వరుణ్ తేజ్, పూజా హెగ్డే Image copyright facebook/ValmikiTheFilm

దువ్వాడ జగన్నాథం'మిగిల్చిన నిరాశను పూడ్చుకొనే ప్రయత్నంలో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్.. ఈసారి తమిళ కల్ట్ మూవీ 'జిగర్ తండా' ఆధారంగా 'గద్దలకొండ గణేష్' తీశాడు.

తమిళంలో బాబీ సింహా చేసిన విలన్ పాత్రకు వరుణ్ తేజ్ ను ఎంచుకుని..మాతృకకు తనదైన అనుసృజన రాసుకుని తీసిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమాపై ప్రేక్షకుల్లో విడుదలకు ముందే ప్రత్యేక ఆసక్తి కలిగించాడు. విడుదలకు కొన్ని గంటల ముందు 'గద్దలకొండ గణేష్'గా పేరు మార్చుకున్న వాల్మీకి కథ గురించి తెలుసుకుందాం.

అద్బుతమైన కథ.. అంచనా తప్పిన కథనం

అభిలాష్(అధర్వ మురళి)అనే కుర్ర అసిస్టెంట్ డైరెక్టర్ సంవత్సరం లోపు సినిమా తీయాలనే పంతంతో ఉంటాడు. తన సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యమున్న విలన్ని.. హీరోగా చూపించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న గద్దలకొండ గ్రామంలో విలనిజం చేసే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్)ని ఎంచుకుని అతని ప్రతీ చర్యను గమనిస్తూ...అతని గురించిన విషయాలు ఆరాతీస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిలాష్.. గణేష్ దృష్టిలో పడతాడు. ఆ తర్వాత గణేష్ బారి నుండి తప్పించుకోవడానికి అభి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు గణేష్ కథేమిటీ? అనేవి సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

Image copyright facebook/ValmikiTheFilm

గబ్బర్ సింగ్ మేకోవర్ నుండి పూర్తిగా బయటపడని డైరెక్టర్

"నేను జనాలను మార్చేలా సినిమాలు తీయలేను, అందుకే జనాలను ఎంటర్‌టైన్ చేసే సినిమాలు చేస్తాను 'అని 'గద్దలకొండ గణేష్ (వాల్మీకి)' సెకండ్ హీరో పాత్ర పోషించిన అధర్వ మురళి డైలాగ్ మాత్రమే కాదు ఆ సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ అభిప్రాయం కూడానని చూస్తున్నంత సేపూ అనిపిస్తుంది. కానీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేకపోతే జనాల సహనానికి పరీక్ష పెట్టినట్లే.. కాకపోతే గద్దలకొండ గణేష్ ఈ మేరకు కొంత సఫలమయ్యాడనే చెప్పొచ్చు.

హరీష్ శంకర్‌కి గబ్బర్ సింగ్ సక్సెస్ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచి సినిమాలు ఆయన నుండి వచ్చే అవకాశం ఉంది. దువ్వాడ జగన్నాధం ఫెయిల్యూర్ తర్వాత, తమిళంలో బాబీ సింహా నటించిన 'జిగర్ తండా' రీమేక్‌లో, ఫర్ఫెక్ట్ క్లాస్ లుక్ లో కనిపించే 'వరుణ్ తేజ్'ని గద్దలకొండ గణేష్ అనే పేరుతో మాస్ విలన్‌గా చూపించాలనుకోవడం నిజంగా ధైర్యం చేశారనే చెప్పాలి.

తమిళ ప్రేక్షకులకు, తెలుగు ప్రేక్షకులకు మధ్య ఉన్న తేడాను దృష్టిలో ఉంచుకుని.. హరిష్ శంకర్ తెలుగు రీమేక్‌లో కథను అనుసృజన చేసి మన వాతవరణానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశాడు.

తమిళప్రేక్షకులు ఆదరించినంతగా ప్రయోగాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించరనే బలమైన వాదన వినిపించే ముందు అసలు ఎందుకు ఆదరించడం లేదు? ఎక్కడ సమస్య ఉంది?అనే రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగిన డైరెక్టర్ ఎవరైనా అద్భుతమైన సినిమాలు తీయగలరేమో.

అయితే కథను నువ్వెంత గొప్పగా అల్లుకున్నావు, ఎన్ని మలుపులు, ట్విస్టులు ప్లే చేశావు అనేదానికన్నా సినిమాను నువ్వెలా చూపించావు అన్నదే ముఖ్యం. అసలు సినిమా అంటేనే దృశ్యకావ్యం కదా.

సినిమా మొదలైనప్పటి నుండి కథలోని పాత్రలు ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా, సన్నివేశాలు కూడా ఒకదానికి, మరొకదానికి పొంతన లేని విధంగా సాగుతుంటాయి.

Image copyright facebook/ValmikiTheFilm

విలనిజానికి లవ్లీ టచ్ ఇచ్చిన లవర్ బాయ్

ఇప్పుటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రలనే పోషించిన వరుణ్ తేజ్ చక్కటి హావభావాలతో విలనిజం చూపించడంలో కూడా పర్వాలేదనిపించాడని చెప్పవచ్చు. మాస్ లుక్, గెటప్, మ్యానరిజం, అటిట్యూడ్, డైలాగ్స్ డెలివరీ.. అన్నీ చక్కగా కుదిరాయి. సినిమాలో మిగతా పాత్రలన్నింటినీ అతను పక్కకు నెట్టేసి స్క్రీన్ మీద ఆధిపత్యం చలాయించినట్లుగా అనిపిస్తుంది. అవసరమైన చోట అవసరమైన భావోద్వేగాలను చూపిస్తూ సినిమా ఆద్యంతం ఆకట్టుకున్నాడు. వరణ్ తేజ్‌లో ఉన్న మరో నటకోణాన్ని బాగా చూపించగలిగాడు హరీష్ శంకర్.

ఇక వరుణ్ తేజ్ తరువాత చెప్పుకోదగ్గ పాత్ర అధర్వ మురళి. తమిళ కుర్రాడైన అధర్వ మురళి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. ఎక్కడా తమిళ్ నెటివిటీ కనపడకుండా అచ్చ తెలుగు కుర్రాడిలా నటించి మెప్పిస్తాడు.

మెరిసిన సితార - మెరిసిమెరవని తార

శ్రీదేవి అనే పేరుతో పూజాహెగ్డే కనిపించినంతలో మెరిసిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అలనాటి 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మా...'రీమేక్ పాటలో బాగా ఆకట్టుకుంది. అయితే పాత్ర నిడివి మరి తక్కువ కావడం వలన ఇంకాసేపు కనిపిస్తే బాగుండుననిపిస్తుంది ఆమె అభిమానులకు.

మృణాళిని రవి తన పరిధిలో పర్వాలేదనిపించింది.

సత్య చింతమల్లి పాత్రలో, బ్రహ్మాజి రౌడిబ్యాచ్‌కి నటన నేర్పే టీచర్ పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించారు. సుబ్బారావు, జబర్దస్త్ రవి, తనికెళ్ళ భరణి..తదితరులు ఎవరి పరిధిలో వాళ్ళు బాగా నటించారు.

క్లాస్ కథలో మాస్ మెరుపులు కురిపించాలనుకున్న హరీష్ శంకర్ ప్రయత్నం వృధా పోలేదు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)