వీడియో: హౌడీ మోదీ కార్యక్రమానికి సిద్ధమైన అమెరికా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: హౌడీ మోదీ కార్యక్రమానికి సిద్ధమైన అమెరికా

  • 22 సెప్టెంబర్ 2019

వీడియో: రజిత జనగామ, బీబీసీ కోసం, హూస్టన్ నుంచి

బ్రజేష్ ఉపాధ్యాయ, బీబీసీ న్యూస్, వాషింగ్టన్

అయిదేళ్ల కిందట నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద మోదీకి లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది.

దశాబ్ద కాలం పాటు అమెరికాలో ప్రవేశ అనుమతి తిరస్కరణకు గురైన మోదీకి అలాంటి అపూర్వ స్వాగతం లభించడం సామాన్యమైనదేమీ కాదు.

ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆదివారం హ్యూస్టన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు.

'హౌడీ మోదీ' పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని అంచనా. భారతదేశం వెలుపల మోదీ మద్దతుదారులు ఇంత పెద్దసంఖ్యలో పోగవడం ఇదే తొలిసారి.

ట్రంప్‌తో కలిసి ఇలా అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాల వ్యవహారంలో మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. అదేసమయంలో అమెరికా, భారత్ సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకూ ఇది ఉదాహరణగా నిలుస్తుంది.

ఇక ట్రంప్ వైపు నుంచి చూస్తే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా అమెరికాలోని భారతీయులు వ్యవహరించేలా చేసుకునేందుకూ ఇది మార్గం వేస్తుంది. అనుకున్న దాని కంటే భారీగా సభకు హాజరవుతారని ట్రంప్ అంటున్నారు.

అమెరికాలో భారతీయుల జనాభా 32 లక్షలు.. ఆ దేశ జనాభాలో భారతీయులు ఒక శాతం ఉన్నారు. అంతేకాదు.. అమెరికాలోని సంపన్న వర్గాల్లో భారతీయులూ ఒకరు.

మోదీ-ట్రంప్ సందర్భంగా ముస్లింలు, మరికొందరు మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. హ్యూస్టన్ సభ తరువాత మోదీ గేట్స్ ఫౌండేషన్ నుంచి స్వచ్ఛతా అవార్డు అందుకోబోతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో మోదీ తీరును నిరసిస్తూ కొందరు ఈ అవార్డును మోదీకి ఇవ్వరాదంటూ గేట్స్ ఫౌండేషన్‌కు లక్ష సంతకాలతో ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)