హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు

  • 20 డిసెంబర్ 2019
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో, హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్ హైకమిషర్‌కు పంపించిన పది లక్షల పౌండ్ల నగదు కేసుకు సంబంధించిన న్యాయ ఖర్చుల్లో 65 శాతం పాకిస్తాన్ చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ స్మిత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

నిజాం జమ చేసిన సొమ్ము ఆయన వారసులకే చెందుతుందని గత అక్టోబర్‌లో ఇదే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ సొమ్ము తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.

2013 నుంచి కొనసాగుతున్న ఈ కేసులో న్యాయస్థానం తాజా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ న్యాయ వివాదంలో భాగస్వాములైన బ్యాంకు, యువరాజు మఫకంజా, భారతదేశం, ఏడవ నిజాంలకు ఇప్పటి వరకూ అయిన న్యాయ ఖర్చుల్లో 65 శాతాన్ని పాకిస్తాన్ చెల్లించాలని తెలిపింది. ఇందులో భాగంగా...

బ్యాంకుకు 3,67,387.90 బ్రిటీష్ పౌండ్లు (సుమారు 3,40,41,876 రూపాయలు),

యువరాజు మఫకంజాకు 18,35,445.83 బ్రిటీష్ పౌండ్లు (సుమారు 17,00,83,276 రూపాయలు),

భారతదేశానికి 28,02,192.22 బ్రిటీష్ పౌండ్లు (సుమారు 25,96,67,720 రూపాయలు),

ఏడవ నిజాంకు 7,95,064.63 బ్రిటీష్ పౌండ్లు (సుమారు 7,36,69,616 రూపాయలు) చెల్లించాలని పాకిస్తాన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.

అయితే, తన ఖర్చులకు సంబంధించిన మొత్తాన్ని ఇప్పటికే నిజాం నిధి నుంచి బ్యాంకు మినహాయించుకుందని, కాబట్టి ఆ నిధిని పూరించేందుకు పాకిస్తాన్ సదరు మొత్తాన్ని జమ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.

1948వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ వివాదం, 2013వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఈనెల 19వ తేదీ గురువారంతో ముగిసిందని ఏడవ నిజాం తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది పాలు హెవిట్ చెప్పారు.

పాక్‌పై నిజాం వారసుల గెలుపు.. హైదరాబాద్ నుంచి పంపిన సొమ్ము నిజాం మనవళ్లదేనన్న బ్రిటన్ కోర్టు

హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో, హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్ హైకమిషర్‌కు పంపించిన పది లక్షల పౌండ్ల నగదు నిజాం వారసులకే చెందుతుందని, పాకిస్తాన్‌కు కాదని బ్రిటన్ కోర్టు 2019 అక్టోబరు 2వ తేదీన తీర్పు ఇచ్చింది.

బ్రిటన్‌లోని నాటి పాకిస్తాన్ హైకమిషనర్‌ ఇబ్రహీం రహ్మతుల్లాకు పంపిన ఈ నగదుపై ఏడు దశాబ్దాలుగా కేసు నడుస్తోంది. లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంకు(నేషనల్ వెస్ట్‌మినిస్టర్ బ్యాంక్) లో రహ్మతుల్లా ఖాతాలో ఈ సొమ్ము ఉంది.

వడ్డీతో కలిపి ఇప్పుడు అది మూడున్నర కోట్ల పౌండ్లకు అంటే దాదాపు 310 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఈ సొమ్ము ఏడో నిజాం నవాబు వారసులకు చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నగదు తనకే దక్కుతుందన్న పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చింది. పాక్ వాదనను బలపరిచే ఆధారాలేవీ లేవని జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పు స్పష్టం చేశారు.

తీర్పును ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు, ప్రస్తుత నిజాం ముకరం జా కజిన్ నజఫ్ అలీ ఖాన్ స్వాగతించారు. పాకిస్తాన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చిందని, భారత్‌కు, ఏడో నిజాం వారసులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు కోసం తమ కుటుంబం సుదీర్ఘకాలం ఎదురుచూసిందని ఆయన బీబీసీ తెలుగుతో చెప్పారు.

Image copyright Getty Images

తీర్పును తప్పుబట్టిన పాకిస్తాన్

తీర్పుపై భారత్, పాకిస్తాన్ స్పందించాయి. సొమ్ము తనకే చెందుతుందన్న పాకిస్తాన్ వాదనను కోర్టు తోసిపుచ్చిందని భారత్ పేర్కొంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ సొమ్ము ఏడో నిజాందేనని, దీని హక్కుదారులు భారత్, ఇద్దరు నిజాం మనవళ్లు అని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తీర్పును పాకిస్తాన్ తప్పుబట్టింది.

ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో ఈ నగదు బదిలీ జరిగిందనే విషయాన్ని కోర్టు తీర్పు పరిగణనలోకి తీసుకోలేదని పాక్ విదేవీ వ్యవహారాలశాఖ కార్యాలయం ఒక ప్రకటనలో ఆరోపించింది.

"నాడు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి హైదరాబాద్‌ను భారత్ అక్రమంగా విలీనం చేసుకొంది. నిస్సహాయ స్థితిలో ఉన్న నిజాం, భారత్ దండయాత్ర నుంచి హైదరాబాద్ స్టేట్‌ను, తన ప్రజలను కాపాడుకొనేందుకు ప్రయత్నాలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఈ అంశం ఇప్పటికీ భద్రతా మండలి అజెండాలో ఉంది. సార్వభౌమాధికారం కలిగిన నిజాం రాజు సహాయం చేయాలని పాకిస్తాన్‌ను కోరారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనకు సహాయం అందించింది" అని పాక్ విదేశీ వ్యవహారాలశాఖ చెప్పింది.

తీర్పు పూర్తిపాఠంలోని అన్ని అంశాలనూ తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, న్యాయసలహా ప్రకారం తదుపరి చర్య చేపడతామని పాకిస్తాన్ తెలిపింది.

హైకోర్టు తీర్పుపై అప్పీలు దాఖలుకు పాకిస్తాన్ అనుమతి కోరే అవకాశం ఉంది. అప్పీలుకు అనుమతి రాకపోతే ఈ తీర్పు ప్రకారం నిజాం మనవళ్లకు, భారత ప్రభుత్వానికి ఈ సొమ్ము దక్కుతుంది.

Image copyright facebook
చిత్రం శీర్షిక ఆపరేషన్ పోలో సమయంలో అప్పటి భారత హోంమంత్రి సర్దార్ పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

కేసు నేపథ్యం

భారత ప్రభుత్వం 'ఆపరేషన్ పోలో' పేరుతో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న దేశంలో విలీనం చేసుకుంది. అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్‌ను పాలిస్తున్నారు. ఆ సమయంలో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన్ను పరిగణించేవారు.

నిజాంకు ఆర్థిక మంత్రిగా ఉన్న మోయిన్ నవాజ్ జంగ్ 'ఆపరేషన్ పోలో' సమయంలో బ్రిటన్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్‌ ఇబ్రహీం రహ్మతుల్లాకు పది లక్షల పౌండ్లను పంపించారు. ఈ సొమ్ము జాగ్రత్తగా భద్రపరచాలని చెప్పారు.

రహ్మతుల్లా నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాకు ఈ సొమ్ము బదిలీ అయ్యింది. ఈ నగదు ఎవరికి చెందాలన్నదానిపై నిజాం వారసులు, పాకిస్తాన్‌ మధ్య న్యాయవివాదం కొనసాగింది.

నిజాం మనవడి న్యాయవాది ఏమన్నారంటే..

కేసులో నిజాం మనవళ్లలో ఒకరు, ప్రస్తుత నిజాం ముకరం జా తరఫున విథర్స్ వరల్డ్‌వైడ్ న్యాయవాద సంస్థకు చెందిన పాల్ హెవిట్ వాదనలు వినిపించారు.

తీర్పుపై హెవిట్ స్పందిస్తూ- తన కక్షిదారు బాలుడిగా ఉన్నప్పుడు ఈ కేసు మొదలైందని, ఇప్పుడు ఆయన 80ల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఈ డబ్బును నాడు పాకిస్తాన్‌కు ఇచ్చినట్లుగా తాము భావించడం లేదని కోర్టు స్పష్టంచేసిందని ఆయన తెలిపారు. ఒక ట్రస్టీగా మాత్రమే పాకిస్తాన్ వద్ద డబ్బు ఉందని, నిజానికి అది నిజాందేనని, ఇందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

ఈ లావాదేవీ చరిత్ర గురించి హెవిట్ గతంలో బీబీసీతో మాట్లాడుతూ- ''ఈ నగదు బదలాయింపు గురించి తెలుసుకున్న వెంటనే డబ్బు వెనక్కి ఇవ్వాలని ఏడో నిజాం పాకిస్తాన్‌ను కోరారు. రహ్మతుల్లా అందుకు అంగీకరించలేదు. ఆ డబ్బు ఇక పాకిస్తాన్‌దేనని ఆయన స్పష్టం చేశారు'' అన్నారు.

1954లో ఏడో నిజాం ఆ డబ్బు కోసం బ్రిటన్ హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. అక్కడ పాకిస్తాన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ తీర్పును నిజాం అప్పీళ్ల కోర్టులో సవాలు చేసి, గెలిచారు. అనంతరం పాకిస్తాన్ 'హౌజ్ ఆఫ్ లార్డ్స్‌'ను ఆశ్రయించింది. అప్పట్లో అదే బ్రిటన్ సర్వోన్నత న్యాయస్థానం.

సార్వభౌమ దేశమైన పాకిస్తాన్‌పై నిజాం కేసు వేయడం కుదరదని పాక్ వాదించింది. 'హౌజ్ ఆఫ్ లార్డ్స్' పాకిస్తాన్ వాదనను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో, ఆ సొమ్ము ఉన్న బ్యాంకు ఖాతాను స్తంభింపజేసింది.

Image copyright KEYSTONE-FRANCE

కేసు తేలే వరకు ఎవరికీ ఇవ్వబోమన్న బ్యాంకు

డబ్బు ఎవరికి చెందాలో తేలే వరకు ఎవ్వరికీ ఇవ్వబోమని బ్యాంకు స్పష్టం చేసింది.

కేసు పరిష్కారానికి వివిధ పక్షాల మధ్య రాజీ కోసం జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

1967లో ఏడో నిజాం మరణించారు. అప్పట్నుంచి ఆయన వారసులు ఆ డబ్బును దక్కించుకునేందుకు న్యాయపోరాటం చేస్తున్నారు.

2013లో ఆ డబ్బును పొందేందుకు పాకిస్తాన్ హైకమిషనర్ నాట్‌వెస్ట్ బ్యాంకుపై చర్యలు ప్రారంభించారు.

డబ్బు తమదని వాదిస్తున్న మిగతా పక్షాలనూ వివాద పరిష్కారం కోసం బ్యాంకు ఆహ్వానించింది. మొదట నిజాం మనవళ్లను, ఆ తర్వాత భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. ఈ డబ్బు తమకు చెందుతుందని భారత్ కూడా ఓ సమయంలో వాదించింది.

నిజాం మనవళ్లు ఇద్దరూ భారత ప్రభుత్వంతో జట్టు కట్టారని హెవిట్ చెప్పారు. ఈ అంగీకారం కుదిరినట్లు రుజువు చేసే అధికారిక పత్రాలేవీ లేవు.

ఆపరేషన్ పోలో సమయంలో భద్రపరచడం కోసమే ఆ డబ్బును పాకిస్తాన్‌ హైకమిషనర్‌కు ఇచ్చినట్లు నిజాం కుటుంబం వాదించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

పాకిస్తాన్ వాదన ఇదీ

విలీన సమయంలో ఏడో నిజాంకు తాము అందించిన సహకారానికి బదులుగా తమ దేశ ప్రజలకు ఆ డబ్బును ఆయన బహుమతిగా ఇచ్చారని పాకిస్తాన్ వాదించింది. భారత్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ ఆయుధాలు అందించిందని, వాటి కోసమే నిజాం ఈ డబ్బు చెల్లించారని చెప్పింది.

''1947-48 మధ్య హైదరాబాద్‌కు పంపిన ఆయుధాలకు చెల్లింపుగానే ఆ పది లక్షల పౌండ్లు తమకు అందాయని పాకిస్తాన్ 2016లో వాదించింది'' అని హెవిట్ చెప్పారు.

''ఏడో నిజాంకు పాకిస్తాన్ అందించిన సహకారానికి పరిహారంగానూ, భారత్ చేతుల్లోకి డబ్బులు వెళ్లకూడదన్న ఉద్దేశంతోనూ హైదరాబాద్ ఆ పది లక్షల పౌండ్లను రహ్మతుల్లా ఖాతాకు బదిలీ చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ సహకారం అందించింది'' అని పాకిస్తాన్ వాదనల పత్రంలో ఉంది.

1948 సెప్టెంబర్ 20న ఆ లావాదేవీ జరిగినట్లు అందులో ఉంది.

ఈ లావాదేవీ గురించి రెండు పక్షాల మధ్య రాతపూర్వక ఒప్పందమేదైనా కుదిరిందా అన్న ప్రశ్నకు.. ''ఈ లావాదేవీ జరిగినట్లే తనకు తెలియదని ఏడో నిజాం కోర్టులో ప్రమాణం చేసి చెప్పారు. నిజాం కోసం డబ్బును భద్రపరచాలన్న ఉద్దేశంతోనే రహ్మతుల్లాకు హైదరాబాద్ ఆర్థిక మంత్రి డబ్బు పంపించినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి'' అని హెవిట్ వివరించారు.

''బతికుండగా ఆ డబ్బు తన చేతికి రాదని ఏడో నిజాం నిర్ణయానికి వచ్చారు. ఆ మొత్తం తన ఇద్దరు మనవళ్లు యజమానులుగా ఉన్న ట్రస్టుకు చేరేలా చర్యలు తీసుకున్నారు'' అని హెవిట్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం