ఆంధ్రప్రదేశ్: విశాఖ జిల్లా మొండిపాలెంలో పెరుగుతున్న కిడ్నీ రోగులు... ఇది మరో ఉద్దానమా?

  • 9 అక్టోబర్ 2019
మొండిపాలెం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ సమస్య గురించి అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి సమస్యే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం సుందరయ్యపేట పంచాయితి మొండిపాలెంలో నెలకొని ఉంది.

ఈ గ్రామానికి కిడ్నీ జబ్బు చేసింది. 2018 జూన్‌లో వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరుగురు చనిపోగా, మరికొందరు వ్యాధి ముదిరిపోయి, మరణశయ్యపై ఉన్నారు. ఊళ్లో ఎక్కడ చూసినా కిడ్నీ బాధితులే కనిపిస్తున్నారు.

ఈ గ్రామజనాభా దాదాపు 500 ఉంటుంది. 130 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తుల్లో చాలా మంది సమీపంలో ఉన్న క్వారీలలో రోజు వారీ వేతనం మీద కూలి పనులకు వెళుతుంటారు.

గత 10 ఏళ్ల నుంచి కిడ్నీ సమస్య ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 50 మంది చనిపోయారు. గతేడాది 20 మంది చనిపోగా, మరో 30 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చాయి.

మొండిపాలెం గ్రామానికి చెందిన సత్యారావు కిడ్నీ సమస్య వల్ల మరణించారు. ఆయన కొడుకు శంకర రావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పుడు శంకర రావుకు కూడా కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు.

శంకర రావు బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మా నాన్న క్వారీ పనికి వెళ్లేవారు. రెండేళ్ల కిందట కిడ్నీ వ్యాధి ఉందని తెలిసింది. మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. ఏడాది కిందట చనిపొయారు. ఇప్పుడు నాకూ ఈ వ్యాధి ఉంది. మందులు వాడుతున్నాను'' అని చెప్పారు.

మా ఊరుకి పిల్లను ఇవ్వడం లేదు

మా ఊరిలో 40 ఏళ్లు దాటిన మగవాళ్లకు ప్రాణభయం పట్టుకుందని పార్మతమ్మ అనే గ్రామస్తురాలు తెలిపారు.

''40 ఏళ్లు దాటిన మా మామయ్య కిడ్నీ సమస్యతో చనిపోయారు. 40 ఏళ్లు దాటిన వారిలో ప్రాణభయం నెలకొంది. కిడ్నీ సమస్యల మూలంగా మా ఊరును తరలిస్తారని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా ఊరికి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు'' అని చెప్పారు.

క్వారీలే కారణమా?

క్వారీల వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కొందరు గ్రామస్తులు అంటున్నారు. మొండిపాలెం గ్రామానికి 10 ఏళ్ల కిందటి వరకూ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, 10 ఏళ్ల కిందట ఇక్కడ క్వారీలు, క్రషింగ్ పనులు ప్రారంభం అయ్యాయి.

మొదట రెండు క్వారీలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 5కు పెరిగింది. దానితో పాటుగా 5 మెటల్ క్రషింగ్ యూనిట్లు వచ్చాయి. గ్రామస్తులలో ఎక్కువ మంది ఈ క్రషింగ్ ప్లాంట్ లలోనూ, క్వారీలలోనూ పనిచేస్తున్నారు.

క్వారీల వల్లే కిడ్నీ సమస్యలు వస్తున్నాయనే వాదనలపై తగరంపూడి వైద్యాధికారి రమేశ్ నాయుడును బీబీసీతో మాట్లాడుతూ, ''ఉదయం నుంచి క్వారీలలో పనిచేయడం వల్ల నీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డీ హైడ్రేషన్ కు గురై కిడ్నీలలో రాళ్లు తయారవుతున్నాయి. గ్రామంలో నీరు కూడా పాడైపోవడం వల్ల సమీపంలోని అచ్చయ్యపేట నుంచి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఇప్పటికే చెప్పాం. విశాఖ కేజీహెచ్ నుంచి వైద్యుల బృందం వచ్చి వ్యాధి బారిన పడ్డవారిని గుర్తించారు. సమీపంలోకి క్వారీల నుంచి డస్ట్ ఎక్కువగా వస్తుంది'' అని చెప్పారు.

ప్రజాచేతన అనే ఎన్జీవో 2015 నుంచి మొండిపాలెంలో ఉన్న క్వారీ కార్మికుల ఆరోగ్య సమస్యలపై పనిచేస్తోంది. ఈ ఎన్జీవో పరిశీలనలో ఇక్కడ క్వారీలలో పనిచేస్తున్న 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యనున్న పురుషుల్లో ఎక్కువ మందికి కిడ్నీ వ్యాధులు వస్తున్నట్టు గుర్తించారు. అదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

గ్రామాన్ని తరలిస్తే ఉపాధి ఎలా?

మొండిపాలెం గ్రామాన్ని తరలించాని గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. 2019 ఎన్నికల ముందు అచ్చయ్యపేట సమీపంలో 22 ఎకరాలు సేకరించి గ్రామస్తులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

తాము వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ తమ భూములు, ఉపాధి అంతా గ్రామంతోనే ముడిపడి ఉందని రమణ అనే కిడ్నీ బాధితుడు చెప్పారు.

‘‘గ్రామాన్ని ఇక్కడ నుంచి తరలించినా ఉపాధి కోసం తిరిగి ఇక్కడికే రావాలి. శాశ్వతంగా ఉపాధి, నివాసం కల్పిస్తే వెళ్లిపొవడానికి గ్రామస్తులు అంతా సిద్ధమే’’ అని ఆయన పేర్కొన్నారు.

గ్రామంలోని కిడ్నీ సమస్య పరిష్కరించడానికి నీటి పరీక్షలు చేశామని, ఇక్కడ నీళ్లు కలుషితం కాలేదని రిపోర్టు వచ్చినట్టు అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

గ్రామస్తుల కోరిక మేరకు వారిని ఊరి నుంచి తరలించడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. వారికి ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

మొండిపాలెంలో ఎటువంటి సమస్యలు లేవు. డీఎంహెచ్ఓ

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మొండిపాలెంలో నీరు వల్ల కానీ క్వారీల వల్ల కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని విశాఖ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎస్.తిరుపతి రావు తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘అక్కడి ప్రజలు అనుకుంటున్నట్లు కిడ్నీ వ్యాధులకు క్వారీలు కారణం కాదు. మేం 2018 నవంబర్ 12న అక్కడ ఒక శిబిరం నిర్వహించాం. అప్పటి మొత్తం గ్రామ జనాభా 494 కాగా అందులో 47 మంది ఆ రోజు వైద్య శిబిరానికి వచ్చారు. వారిలో 18 మందికి రక్త పరీక్షలు చేయగా అందులో 17 మందికి మూత్రపిండాల సమస్య ఉన్నట్లు గుర్తించాం. 2013 నుంచి ఇప్పటి వరకూ 11 మరణాలు సంభవించాయి. వారిని విశాఖ నగరంలోకి కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగానికి రిఫర్ చేశాం. మొండిపాలెం నీటిని పరిశీలించగా అవి తాగడానికి పనికొస్తాయని తేలింది. మొండిపాలెం ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకొని అక్కడ తరచూ శిబిరం నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నాం’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

భారత సైన్యం దాడిలో ‘ఉగ్రవాదులు’, పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి

సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: చిలీలో హింస.. ముగ్గురి మృతి

‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల

వాట్సాప్‌పై పన్ను వేసేందుకు లెబనాన్‌లో ప్రయత్నం.. ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం

టర్కీ అధ్యక్షుడి హెచ్చరిక: 'కుర్దు ఫైటర్లు ఉత్తర సిరియా నుంచి వెనక్కి వెళ్లకపోతే తలలు చిదిమేస్తాం’

బ్రెగ్జిట్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ