చంద్రయాన్-2: ఇస్రో ప్రయోగం విఫలమైందనడం సరి కాదు... 2021 నాటికి అంతరిక్షంలోకి మొదటి భారతీయుడు..

  • 6 అక్టోబర్ 2019
చంద్రయాన్-2 Image copyright iSro

చంద్రయాన్-2 మిషన్‌లో భారత్ చంద్రుడిపైకి పంపించిన ల్యాండర్ దాని ఉపరితలం పైకి చేరుకోకముందే భూమితో సంబంధాలు కోల్పోయింది. దానిని గుర్తించేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కానీ, అంతమాత్రాన ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని వైఫల్యంగా తోసిపుచ్చలేమని ఇస్రో శాస్త్రవేత్తలు బీబీసీకి చెప్పారు.

సెప్టెంబర్ 7న అర్థరాత్రి దాటాక విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణం కోసం కోట్లాది భారతీయులు ఆతృతగా ఎదురుచూశారు. టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో చంద్రయాన్-2 పురోగతిని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

కానీ, 'హోవరింగ్ స్టేజ్' అనే అంతిమ దశలో ఒక సమస్య వచ్చింది. చంద్రుడి ఉపరితలానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలకు ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగిన నాలుగో దేశంగా నిలవాలనుకున్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి.

తర్వాత, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ 'హార్డ్ ల్యాండింగ్' అయ్యిందని చెప్పింది.

Image copyright NASA

అది ల్యాండ్ అయ్యే ప్రాంతాన్ని నాసా ఉపగ్రహం తీసిన ఫొటోలు విడుదల చేసింది. కానీ, వాటిని చీకటిపడే సమయంలో తీయడంతో అక్కడ ల్యాండర్‌ను గుర్తించలేకపోయారు.

చంద్రయాన్-2 లాంటి క్లిష్టమైన మిషన్‌ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో, ఇప్పటివరకూ ఎప్పుడూ చేయలేదు. అందుకే, ల్యాండర్ దిగే చివరి దశను '15 నిమిషాల టెర్రర్‌'గా వర్ణించిన ఇస్రో ఛైర్మన్ కె. శివన్, ప్రయోగం తర్వాత తమ అధికారిక కమిటీ వివరాల ప్రకారం తమ మిషన్ 98 శాతం విజయవంతం అయ్యిందని చెప్పారు.

ఈ ప్రయోగంలో రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్, కీలకమైన సమాచార సేకరణ లాంటి అత్యంత ముఖ్యమైన దశలు అసంపూర్తిగా ఉండిపోవడంతో ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని శివన్ చెప్పడం ఇస్రో తొందరపాటు అవుతుందని కొందరు శాస్త్రవేత్తల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ పేరుతో రూపొందించిన 27 కిలోల ల్యాండర్‌లోని పరికరాలు చంద్రుడిపై మట్టిని విశ్లేషిస్తాయి.

ల్యాండర్ రెండు పెద్ద బిలాల మధ్య కచ్చితంగా అనుకున్న ప్రాంతంలో దిగి ఉంటే, దాని నుంచి బయటికొచ్చే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లి విశ్లేషణ కోసం డేటా, ఫొటోలను తిరిగి భూమికి పంపించేది. 14 రోజుల జీవితకాలంలో అది తన సామర్థ్యం మేరకు 500 మీటర్ల దూరం ప్రయాణించేది.

Image copyright dd

అయితే, కొంతమంది ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న కొందరు డాక్టర్ శివన్‌కు అండగా నిలుస్తున్నారు. చంద్రయాన్-2 మిషన్ విఫలమైందని చెప్పడం సరికాదని అంటున్నారు.

ఒక అంతరిక్ష ప్రయోగం విజయాన్ని 'మనకు అందే సమాచారాన్ని' బట్టి కొలుస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఇస్రో శాస్త్రవేత్త బీబీసీతో చెప్పారు.

"మేం కచ్చితత్వంతో లాంచ్ చేశాం. ఆర్బిటర్ మేం అనుకున్నట్టే వెళ్లడం అనేది మా విజయంలో చాలా ప్రధానమైన దశ. మా అంచనాలను అందుకోని చివరి దశ తప్ప, మిగతా మూడు దశలనూ ల్యాండర్ దాటింది" అని చెప్పారు.

"ఇప్పుడు మేం ఆర్బిటర్ నుంచి అందే డేటా మీదే ఆధారపడ్డాం. ఇంధనం పెద్దగా ఖర్చు కాకపోవడంతో, ఆర్బిటర్ జీవితకాలం ఏడాది నుంచి ఏడేళ్లకు పెరిగింది. ఏడేళ్లలో ఆర్బిటర్ నుంచి మనకు ఏదైనా డేటా అందితే అది అదృష్టమే అనుకోవాలి. అంటే ఈ మిషన్‌లో చాలా సాంకేతికతలు పనిచేశాయి" అన్నారు.

"మిషన్‌లో ఒక చిన్న భాగం మాత్రమే విఫలమైంది. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినా, చంద్రుడికి చాలా దగ్గరగా వెళ్లాక దానితో సంబంధాలు తెగిపోయాయి" అని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ మాధవన్ నాయర్ అన్నారు.

"మిషన్‌లో ప్రతి దశకూ ప్రాధాన్యం ఇవ్వాలి. లాంచింగ్, ఆర్బిటర్‌ను చంద్రుడి కక్ష్యలో అనుకున్న స్థానంలోకి చేర్చడం, ల్యాండర్‌ను ఆర్బిటర్ నుంచి వేరు చేయడం లాంటి మిగతా అన్ని దశలూ విజయవంతం అయ్యాయి".

"ప్రపంచంలో చంద్రుడి ఉపరితలాన్ని స్పష్టంగా ఫొటోలు తీసింది బహుశా మనమేనేమో" అని మాధవన్ నాయర్ అన్నారు.

"మరో గ్రహంపై సాఫ్ట్ ల్యాండింగ్ అనే ఘనతను ఇప్పటివరకూ మూడు దేశాలే అందుకున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం అయ్యుంటే, అది ఇస్రోకు ఒక పెద్ద సాంకేతిక విజయం అయ్యేది" అని సైన్స్ అంశాలు రాసే పల్లవ్ బాగ్లా చెప్పారు.

అంగారకుడిపై ల్యాండ్ కావడం, అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించడం లాంటి భారత భవిష్యత్ ప్రయోగాలకు ఇది మార్గం సుగమం చేసిందని కూడా ఆయన అన్నారు.

చూస్తుంటే, ఇస్రో ఇప్పటికే దానికి సిద్ధమైనట్లు అనిపిస్తోంది.

ది హిందూ పత్రికతో మాట్లాడిన డాక్టర్ శివన్.. "2021 డిసెంబర్ నాటికి మన సొంత రాకెట్‌, మొదటి భారతీయుడిని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఇస్రో ఆ దిశగా కృషి చేస్తోంది" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం