దక్షిణాఫ్రికాపై 203 పరుగులతో భారత్ విజయం... రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

  • 6 అక్టోబర్ 2019
రోహిత్ శర్మ Image copyright facebook/RohitSharma

విశాఖపట్టణంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 203 పరుగుల తేడాతో ఓడించి, మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

ఆఖరి రోజు కష్టసాధ్యమైన 395 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు 191 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

ఒక సమయంలో దక్షిణాఫ్రికా 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కానీ, డేన్ పీడిట్ 56 పరుగులు, సెనురన్ ముత్తుస్వామి49(నాటౌట్) పరుగులతో చేసి జట్టు స్కోరును 150 దాటించారు.

మ్యాచ్ ఆఖరి రోజు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హీరోగా నిలిచాడు. అత్యంత వేగంగా 350 వికెట్లు తీసిన శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ రికార్డును సమం చేశాడు.

మురళీధరన్‌లాగే అశ్విన్ కూడా తన 66వ టెస్టులో 350వ వికెట్ తీశాడు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రెండు ఇన్నింగ్స్‌ల్లో రవిచంద్రన్ అశ్విన్‌కు 8 వికెట్లు

ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నాడు. 2010లో రిటైరైన మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లు పడగొట్టాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ముందు 395 పరుగులు విజయ లక్ష్యాన్నిఉంచింది.

మొదటి ఇన్నింగ్స్‌లో రాణించిన అశ్విన్ 7 వికెట్లు తీశాడు.

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 323 పరుగులు చేసిన తర్వాత డిక్లేర్ చేసింది.

Image copyright Getty Images

రోహిత్ శర్మ రెండు సెంచరీలు

మరోసారి ఇన్నింగ్స్ హీరోగా నిలిచిన రోహిత్ శర్మ 127 పరుగులతో వరసగా రెండో సెంచరీ చేశాడు.

రోహిత్ శర్మ 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా దిగిన మొదటి టెస్టులోనే రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడుగా నిలిచాడు.

దీనితోపాటు సునీల్ గావస్కర్ తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్ తర్వాత భారత్ 394 పరుగుల ఆధిక్యం సాధించింది. చతేశ్వర్ పుజారా 81 పరుగులు చేశాడు.

రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 27వ ఓవర్ వేసిన జడేజా తొలి బంతికి ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్(39), నాలుగో బంతికి వెర్నాన్ ఫిలాండెర్(0), ఐదో బంతికి కేశవ్ మహరాజ్(0) వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలో టెంబా బౌమా(10), కెప్టెన్ డుప్లెసిస్(13), వికెట్ కీపర్ క్వింటాన్ డికాక్(0) వికెట్లను పడగొట్టిన మహమ్మద్ షమీ చివర్లో పీడిట్(56), రబాడా(18) వికెట్లు తీసి భారత్‌కు విజయం అందించాడు.

రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా, అశ్విన్‌కు ఒక వికెట్ దక్కాయి.

ఈ మ్యాచ్‌లో మొత్తం 303 పరుగులు చేసిన రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)