మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా?

  • 8 అక్టోబర్ 2019
రిప్రజెంటేషనల్ ఇమేజ్ Image copyright iStock

అంజును తరచూ కలుస్తూఉంటాను నేను. లిప్‌స్టిక్ పూసిన ఆమె పెదవులు, నుదుటిపై చక్కటి బొట్టు, చేతికి గాజులు, చెదరని చిరునవ్వుతో కనిపిస్తుందామె. లిఫ్ట్‌లో కానీ, సొసైటీ ఎంట్రన్స్‌లో కానీ కనిపించనప్పుడంతా పలకరించుకుంటాం.

అప్పుడప్పుడు ఇంటి పనిలో సాయం చేయమని పిలుస్తుంటాను. ఎప్పటిలాగే ఒక రోజు ఆమెను 'ఎలా ఉన్నావ'ని అడిగాను. అందుకామె ఏమీ బాగులేనని చెప్పింది. అంతేకాదు.. ''నాకు ఏడుపొస్తోంది. గత మంగళవారం రోజంతా ఏడుస్తూనే ఉన్నాన''ని తన అవధి శైలిలో వడివడిగా చెప్పింది. అలా చెబుతున్నప్పుడు కూడా ఆమె ముఖంలో నవ్వు ఉంది. అంతకుముందు కూడా ఓసారి అదే మాట చెప్పింది.

ఏడుపొస్తోందంటూ అంజు పదేపదే చెబుతోందంటే ఆమె ఏదైనా సమస్యలో చిక్కకుందా? దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అంజు కానీ, ఆమె కుటుంబసభ్యలు కానీ ఆమెకు వైద్య సహాయం అవసరమని గుర్తించారా? సాధారణంగా తలెత్తే మానసిక సమస్యేనా(సీఎండీ) ఇది? ఇలాంటి మానసిక సమస్య కొద్దిమందికే పరిమితమా? లేదంటే అందరి సమస్యా?

Image copyright Getty Images

'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్' 2016లో భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో చేసిన సర్వేలో అనేక ఆందోళనకర అంశాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ప్రకారం 2.7 శాతం ప్రజలు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అంతేకాదు.. దేశంలో 15 కోట్ల మందికి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కోసం సత్వర వైద్య సహాయం అవసరమనీ ఈ సర్వే తేల్చింది.

సైన్స్ జర్నల్ లాన్సెట్‌లో 2016లో ప్రచురితమైన ఒక నివేదిక.. దేశంలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే అలాంటి సేవలు పొందగలుగుతున్నారని చెప్పింది.

మరోవైపు భారత్‌లో ఏటా మానసిక సమస్యలతో సతమతమవుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే పదేళ్ల తరువాత ప్రపంచంలో మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.

చిత్రం శీర్షిక డాక్టర్ నిమిశ్ దేసాయీ

భారత్‌లో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు మానసిక సమస్యలకు దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నగరాలు విస్తరిస్తుండడం, ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తుండడం, చాలామంది సొంతూళ్లు, నగరాలను వీడి కొత్త నగరాలకు మారుతుండడం వంటివన్నీ ప్రజల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు కుంగుబాటుకు దారితీయొచ్చని చెబుతున్నారు.

దిల్లీకి చెదిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లీడ్ సైన్సెస్(ఐహెచ్‌బీఏఎస్) డైరెక్టర్, గత నలభయ్యేళ్లుగా సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ నిమిష్ దేసాయ్ ''కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, భారత్‌లో పాశ్చ్యాత్తీకరణ శరవేగంగా జరుగుతుండడంతో కొత్త సాంకేతికతల ఆవిర్భావం కూడా ఒత్తిళ్లకు కారణం కావొచ్చు. అందుకే సరైన అభివృద్ధి కావాలా? సరైన మానసిక ఆరోగ్యం కావాలా అన్న ప్రశ్న ఉదయిస్తుంద''న్నారు.

మానసికంగానూ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు చాలామంది గుర్తించారని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికీ సమాజంలో చాలామంది మానసిక సమస్యలకు గురవడాన్ని, దాన్నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకోవడాన్ని తప్పు పనిగానే భావిస్తున్నారని, బయటకు చెప్పుకోవడం లేదనీ వైద్యులు చెబుతున్నారు.

Image copyright Getty Images

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నాలుగేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతూ తాను కూడా ఒకప్పడు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కుతున్నా, అవార్డులు అందుకుంటున్నా ఒక రోజు ఉదయం నిద్ర లేవగానే జీవితం దశదిశా లేకుండా సాగిపోతోందని అనిపించిందని.. ఆత్మవిశ్వాస లోపంతో బాధపడుతూ తరచూ ఏడ్చేదాన్నని చెప్పారామె.

దిల్లీలోని స్టీఫెన్స్ హాస్పిటల్‌కు చెందిన సైకియాట్రిస్ట్ రూపాలీ శివాల్కర్.. ''మన చుట్టూ ఉన్నవారిలో 30 నుంచి 40 శాతం మంది సాధారణ మానసిక సమస్యలతో బాధపడుతుంటారు, కానీ, తాము మానసిక సమస్యతో బాధపడుతున్నామన్న విషయం గుర్తించలేర''ని చెప్పారు.

సీఎండీ లక్షణాలు మనిషికి, మనిషికీ మారుతుంటాయని.. ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం, శారీరకంగా ఎలాంటి బాధలు లేనప్పటికీ అలసగా అనిపించడం, నిత్యం మగతగా ఉండడం, విపరీతమైన చిరాకు, కోపం, అకారణంగా కోపం రావడం, ఏడుపు రావడం వంటివి దీని లక్షణాలని రూపాలి తెలిపారు. పిల్లల్లో అయితే ఆకస్మికంగా ప్రవర్తన మారిపోవడం, స్కూలుకి వెళ్లడానికి ఇష్టపడకపోవడం, బాగా బద్ధకిష్టిగా కానీ బాగా చురుగ్గా కానీ మారడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కనిపిస్తే వారు సీఎండీతో బాధపడుతున్నట్లేనన్నారు.

చిత్రం శీర్షిక డాక్టర్ రూపాలీ శివాల్కర్

హార్మోన్ సమస్యలు, హైపర్ థైరాయిడిజమ్, డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల్లో సగటున 10 శాతం మంది, ప్రసవం తరువాత 13 శాతం మహిళలు డిప్రెషన్‌కు గురవుతున్నారు. వర్ధమాన దేశాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటోంది. వర్ధమాన దేశాలకు చెందిన 15 శాతం గర్భిణులు, ప్రసవం తరువాత 19.8 శాతం మంది మహిళలు డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు తేలింది.

పిల్లలు కూడా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, భారత్‌లో 0.3 నుంచి 1.2 శాతం మంది చిన్నారులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, సకాలంలో వారికి మానసిక వైద్యం అందకపోతే అది వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది.

చిత్రం శీర్షిక ఎయిమ్స్

దిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన సైకియాట్రీ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ నందకుమార్ ''పదేళ్ల కిందట సైకియాట్రీ విభాగంలో అవుట్ పేషెంట్లుగా రోజుకు 100 మంది వచ్చేవారు.. ఇప్పుడు 300 నుంచి 400 మంది వస్తున్నార''ని చెప్పారు. ఐహెచ్‌బీఏఎస్‌కు వచ్చేవారి సంఖ్య కూడా బాగా పెరిగిందని ఆ సంస్థ చైర్మన్ చెబుతున్నారు. పదేళ్ల కిందట అక్కడకు కూడా రోజుకు 100 నుంచి 150 మంది వచ్చేవారని, ఇప్పుడు రోజుకు 1200 నుంచి 1300 మంది మానసిక సమస్యలకు వైద్య సహాయం కోసం వస్తున్నారని తెలిపారు. వారిలో చాలామంది సీఎండీతో వచ్చేవారేనని... పిల్లలు, యువత ఎక్కువగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, విచారం ఎక్కువవడం, కోపం, ఆవేశం వంటి లక్షణాలతో వస్తున్నారని.. తమ వద్దకు వైద్య సహాయం కోసం వచ్చే మహిళల్లో ఎక్కువ మంది అలసట, కంగారు, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలతో వస్తున్నారని తెలిపారు.

చిత్రం శీర్షిక డాక్టర్ నంద్ కుమార్

టీనేజర్లు, యువతను డిప్రెషన్‌లోకి నెడుతున్న కారణాల్లో సోషల్ మీడియా కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, పోస్టులకు లైక్‌లు తక్కువగా రావడం, అసలు రాకపోవడం వంటివాటి వల్ల తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆలోచనలతో భావోద్వేగ భారానికి గురవుతున్నారని డాక్టర్ నంద్ కుమార్ తెలిపారు.

Image copyright Getty Images

పిల్లలపై ప్రతిభపరమైన ఒత్తిళ్లు ఉంటున్నాయని.. తల్లిదండ్రులకు తమ పిల్లలు సంగీతంలోనో, డ్యాన్సులోనో, ఆటల్లోనో అద్భుతంగా రాణించాలనే కోరిక వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతోందని.. అలాగే పిల్లల మధ్య కూడా సోషల్ మీడియాలో స్టేటస్ అప్‌డేట్ చేయడం వంటి విషయాల నుంచి అనేక అంశాలు ఒత్తిడి పెంచుతూ ఆశించిన గుర్తింపు రాలేదనుకుంటే డిప్రెషన్‌లోకి నెడుతున్నాయని రూపాలీ శివాల్కర్ చెప్పారు.

ఇలాంటి మానసిక ఒత్తిళ్లు కేవలం పిల్లలపైనే కాదు అందరిపైనా ఉన్నాయంటున్నారు వైద్యులు. వీటి దుష్పరిణామాలు ప్రమాదకరంగా ఉంటున్నాయని, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019ని 'ఆత్మహత్య నివారణ' సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి 40 నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఏటా సగటున 8 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్నారన్న మాట. 15 నుంచి 29 ఏళ్ల వయస్కుల మరణాలకు గల కారణాల్లో ఆత్మహత్యలది రెండో స్థానమని ఈ సంస్థ వెల్లడించింది.

అయితే, ఇది కేవలం వర్థమాన దేశాలకు చెందిన సమస్య మాత్రమే కాదు. అంతటా ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 80 శాతం అల్ప, మధ్యాదాయ దేశాల్లోనే జరుగుతున్నాయి.

ఆత్మహత్యలను నివారించవచ్చని, ఒకసారి ఆత్మహత్యకు యత్నించినవారు మళ్లీ అలాంటి ప్రయత్నం చేసే ప్రమాదముంటుందని.. వారిలో ఇలాంటి లక్షణాలను గుర్తించడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.

Image copyright Getty Images

ఒక్క ఆత్మహత్యతో 135 మంది ప్రభావం పడుతుంది

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రభావం 135 మందిపై పడుతుందని డాక్టర్ నంద్ కుమార్ చెప్పారు. కుటుంబసభ్యులు, సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు, సహోద్యోగులు ఇలా అనేక మందిపై ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే వీరందరి గురించి ఆలోచించాలని ఆయన సూచిస్తున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారిని గుర్తించి కొద్దిసేపు వారిని ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించగలిగితే ప్రాణాలు కాపాడినట్లేనన్నారు.

ఆత్మహత్యల నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సూచనలు చేస్తోంది. ఆత్మహత్యలను ప్రపంచ ఆరోగ్య సమస్యగా గుర్తించి అందరిలో అవగాహన కల్పించడం కూడా అందులో ఒకటి.

మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవాలన్న అవగాహన ప్రజల్లో పెరిగిందని, అయితే, నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి అవగాహన మరింత పెరగాలని వైద్యులు సూచిస్తున్నారు.

తమ చుట్టూ ఉన్నవారిలో కనిపించే మానసిక సమస్యలను గ్రామీణ ప్రజలు పెద్దగా పట్టించుకోరని, వాటిని జబ్బుగా పరిగణించరని.. అవగాహన లోపమే అందుకు కారణమని డాక్టర్ రూపాలీ అంటున్నారు.

గ్రామీణ భారతంలో చాలామంది అల్పాదాయ వర్గాల ప్రజలు రక్తహీనత, పోషకాహారలోపం, అతిసారం వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మానసిక సమస్యలు వారికి అంతకంటే చిన్నవిగానే అనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.

మానసిక ఆరోగ్యానికి సంబంధించి దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకోవడానికి మానసిక ఆరోగ్య చట్టం-2017ని భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు 1987లోనూ ఇలాంటి చట్టం ఒకటి తెచ్చారు. అయితే, కొత్త చట్టంలో మానసిక జబ్బులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వం కొన్ని హక్కులు కల్పించింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఆత్మహత్యను నేరాల జాబితా నుంచి తొలగించారు. అంతకుముందు ఆత్మహత్య చేసుకోవడం నేరం.. కానీ, కొత్త చట్టం ప్రకారం ఆత్మహత్య చేసుకున్నవారు కానీ, యత్నించి బయటపడినవారు కానీ నేరస్థులు కారు. వారిని బాధితులుగా పరిగణిస్తుందీ చట్టం. ఈ చట్టం ప్రకారం ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో బయటపడినవారికి అందరిలానే చికిత్స పొందే హక్కు ఉంటుంది. అంతేకాదు, రాష్ర్టాలు, జాతీయ స్థాయిలో మానసిక ఆరోగ్య ప్రాథికార సంస్థలు కూడా ఏర్పాటు చేయాలని ఈ చట్టం సూచించింది.

Image copyright Getty Images

ఈ చట్టం మంచిదే అయినప్పటికీ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లోని విధానాలను ఇందులో అనుసరించారని, నిజానికి భారత్‌లో పరిస్థితులు వేరని డాక్టర్ నిమిష్ దేసాయ్ అంటున్నారు. భారత్‌లో ఆత్మహత్యల సమస్య పరిష్కారానికి సామాజిక, కుటుంబ వ్యవస్థను వాడుకోవడం ఉత్తమ మార్గమని ఆయన సూచిస్తున్నారు.

దేశంలో మానసిక సమస్యలు ఓ వైపు పెరిగిపోతుంటే మానసిక వైద్య నిపుణుల కొరత కూడా అంతకుమించి పెరుగుతోంది. అమెరికాలో సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్‌లు 60 వేల నుంచి 70 వేల మంది ఉండగా భారత్‌లో వారి సంఖ్య 4 వేల లోపే. ప్రస్తుతమున్న అవసరాల పరంగా చూసుకున్నా దేశంలో కనీసం మరో 15 వేల మంది మానసిక వైద్య నిపుణుల అవసరం ఉంది.

దేశంలో ప్రస్తుతం 43 మానసిక వైద్యాసుపత్రులుంటే అందులో రెండుమూడిట్లో మాత్రమే అన్ని సదుపాయాలూ ఉన్నాయి. మరో 10 నుంచి 12 ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరుస్తున్నారు.

మరోవైపు సైకియాట్రీలో శిక్షణ ఎంబీబీఎస్ నుంచే మొదలుకావాలని వైద్యులు కోరుతున్నారు. అంతేకాదు, తీవ్ర మానసిక సమస్యల బాధితులను గుర్తించి చికిత్స అందించాలని.. లేదంటే సమస్య మరింత తీవ్రతరమవుతుందని వైద్యులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)