ఆంధ్రప్రదేశ్: బంగ్లాదేశ్‌ జైలులో విజయనగరం జిల్లా మత్స్యకారులు

  • 11 అక్టోబర్ 2019
బాధితుడి తల్లి

బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన విజయనగరం జిల్లా మత్స్యకారులు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయారు. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ ఆ దేశ తీర రక్షక దళాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి.

స్థానిక మత్స్యకారుల నాయకులు ప్రభుత్వ అధికారులకు సమాచారమివ్వడంతో రాయబార కార్యాలయం ద్వారా సంప్రదింపులు జరిపి వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

పొరుగుదేశం తీర రక్షక దళాలకు చిక్కిన తమవారి కోసం బాధిత మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

విశాఖ తీరం నుంచి సెప్టెంబర్ 24న అమృత అనే బోటు(ఏపీఎల్ 61806/8 నంబర్)లో ఎనిమిది మంది మత్స్యకారులు చేపల వేట కోసం వెళ్లారు.

బోటులో ఉన్న మత్స్యకారులంతా విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందినవారు.

అక్టోబర్ 2న వీరు ప్రయాణిస్తున్న బోటు పశ్చిమబెంగాల్ తీరం వైపు వెళ్తున్న సమయంలో బోటు ఇంజిన్ పాడైంది.

ఆ సమయంలో సముద్ర జలాల్లో ప్రవాహ వేగం, గాలుల ఉద్ధృతి అధికంగా ఉండడంతో బోటు బంగ్లాదేశ్ తీరానికి కొట్టుకుపోయింది.

అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ వీరిని అరెస్ట్ చేసి, బోటును స్వాధీనం చేసుకున్నారు.

బోటు యాజమాని వాసుపల్లి రాములుకు వేరే బోటులో ఉన్న మత్స్యకారులు సమాచారం అందించడంతో ఆయన ఏపీ మత్స్యశాఖ అధికారులకు విషయం చెప్పారు.

చిత్రం శీర్షిక బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అదుపులో ఉన్న మత్స్యకారులు

బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అదుపులో ఉన్నది వీరే..

1) మరుపల్లి పోలయ్య(43)

2) రాయితి అప్పన్న(38)

3) వాసుపల్లి అప్పన్న(24)

4) మరుపల్లి నరసింహ(45)

5) బర్రి రాములు(31)

6) వాసుపల్లి అప్పన్న(41)

7) రాయితి రాము(24)

8) వాసుపల్లి దానయ్య(51)

చిత్రం శీర్షిక బోటు యజమాని రాము

ఇంజిన్ పాడవడంతో బోటు గాలివాటుకు కొట్టుకుపోయింది

బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డుకు చిక్కిన 8 మంది విజయనగరం మత్స్యకారులు కావాలని ఆ దేశ జలాల్లో ప్రవేశించలేదని, వారి బోటు ఇంజిన్ పాడవడంతో కొట్టుకుపోయారని యజమాని వాసుపల్లి రాము చెప్పారు.

''పారాదీప్‌ దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న బోటు ఇంజిన్‌ పాడైంది. దీంతో వారు బోటును నిలిపివేసినా వాతావరణం సహకరించకపోవడం, అండర్ కరెంట్స్ ఎక్కువగా ఉండడంతో బంగ్లాదేశ్‌ సముద్ర జల్లాలోకి ప్రవేశించింది.

జీపీఆర్ఎస్ సిస్టం ఉన్నా బోటు ఇంజను పనిచేయకపోవడంతో అదీ పనిచేయలేదు. మా బోటులో ఉన్నవారు వేరే బోటువారికి సమాచారమివ్వడంతో వారి ద్వారా నాకు తెలిసింది'' అన్నారాయన.

మాకెవరు దిక్కు?

పొరుగుదేశంలో చిక్కుకుపోయిన మత్స్యకారుల కోసం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తన కుటుంబానికి కొడుకే ఆధారమని అతణ్ని వెనక్కు రప్పించాలని వేడుకుంటోంది ఆ బోటులో కలాసీగా పనిచేస్తున్న వాసుపల్లి అప్పన్న తల్లి రాములమ్మ.

''నాలుగు సంవత్సరాలుగా నా కొడుకు వేటకు వెళ్తున్నాడు. అప్పన్న పనిచేసి తెస్తేనే ఇంటిల్లిపాదీ కడుపునిండేది. ముగ్గురు ఆడపిల్లలు. మా బాబు ఇంటికి వచ్చేస్తే చాలు'' అందామె.

చిత్రం శీర్షిక దానమ్మ

‘5 నెలల గర్భిణిని.. వారంలో వచ్చేస్తానని వెళ్లాడు’’

రాయితి దానమ్మ ప్రస్తుతం 5 నెలల గర్భిణి. వారంలో తిరిగొచ్చేస్తానని వెళ్లిన భర్త రాయితి రాము ఇప్పుడు పరాయి దేశంలో అరెస్టయ్యాడు.

''సెప్టెంబరు 23వ తేదీ రాత్రి ఇంటి నుంచి వెళ్లాడు. వెళ్లేటప్పుడు తుపాను వాతావరణం ఉంది. పది రోజుల కిందట ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండు, ఇక ఫోన్‌లు కలవవు అని చెప్పాడు.

అక్టోబరు 3న మా అత్త ఏడుస్తూ ఫోన్ చెసి చెప్పేవరకు నాకు తెలియదు.

జ్వరం, నడుం నొప్పితో బాధపడుతున్నా సముద్రం మీదకు వెళ్లాడు.

‘‘నాన్న ఎప్పుడొస్తాడు’’

‘‘పదేళ్ళుగా వైజాగ్‌లో ఉంటున్నాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. వాళ్లను ఎంత త్వరగా విడిపిస్తే మాకు అంత మంచిది.

నా పిల్లోడు చిన్నోడు. నాన్న ఎప్పుడొస్తాడని ఏడుస్తున్నాడు. మా అత్తమామ, నేను, నా పిల్లలకు ఆయనే ఆధారం.

ఇప్పుడు మా పరిస్థితి ఏంటి'' అంటూ రాయితి అప్పన్న భార్య అంకమ్మ భర్తను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

'మత్స్యకారుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాం'

బంగ్లాదేశ్ కోస్టుగార్డ్‌ అదుపులో ఉన్న మత్స్యకారుల విడుదలకు భారత రాయబార కార్యాలయం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.

ఇప్పటికే బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి చెందిన అధికారులు బోటు యజమాని రాముకు ఫోను చేసి కొన్ని వివరాలు అడిగారన్నారు. భారత్ ఎంబసీ అధికారులూ రామును సంప్రదించారని చెప్పారు.

''బోటు నంబరు, వేటకు వెళ్లిన సిబ్బంది వివరాలు, ఇతర సమాచారం అడిగారు. అక్కడి కోస్ట్‌గార్డ్ ఫిర్యాదు మేరకు మత్స్యకారులను అరెస్టు చేసి జైలులో పెట్టారు, ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నా అప్పగింతకు సంబంధించిన ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. ఆ ప్రక్రియ మొదలైంద''ని ఆయన బీబీసీకి తెలిపారు.

కాగా, దీనిపై విజయనగరం కలెక్టర్, ఆ జిల్లా మత్స్యశాఖ వేర్వేరుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ''ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల విషయం వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడుతున్నారు '' అని మత్స్యశాఖ అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్ లక్షణరావు తెలిపారు.

ఊరందరికీ చేపల వేటే ఆధారం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస పూర్తిగా మత్స్యకార గ్రామం.

గ్రామంలో దాదాపు 1500 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి.

గ్రామంలో జెట్టీ లేకపోవడంతో కొన్ని కుటుంబాలు విశాఖటప్నం వలస వెళ్లాయి. అక్కడ బోట్లపై కలాసీలు, డ్రైవర్లు, హెల్పర్లుగా పనిచేస్తున్నారు.

'బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు ఉండడంతో విడుదల సులభమే'

కొద్ది నెలల కిందట విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 12 మంది మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్‌కు చిక్కి అక్కడ జైలులో ఉన్నారు. వారి విడుదల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అయితే, బంగ్లాదేశ్‌, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉండడంతో దౌత్య ప్రక్రియ త్వరగా పూర్తయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని, అధికారిక విధానాల ప్రకారం ప్రక్రియంతా పూర్తయిన తరువాత 8 మంది మత్స్యకారులను భారత్‌కు అప్పగిస్తారని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా