జియో కాల్స్ ఇకపై ఉచితం కాదు: ప్రెస్‌రివ్యూ

  • 10 అక్టోబర్ 2019
Image copyright Getty Images

డేటాకు మాత్రమే ఛార్జీ... జీవితకాలం ఉచిత కాల్స్ నినాదంతో సేవలు ఆరంభించిన రిలయన్స్ జియో, అందుకు విరామం పలుకుతోందని ఈనాడు వెల్లడించింది.

ఇకపై సొంత నెట్‌వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్‌కు ఛార్జీలు ఉండవని, ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే మొబైల్ వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున ఛార్జ్ చేస్తామని ప్రకటించింది.

కాల్స్ కోసం రూ. 10 నుంచి టాపప్ ఓచర్లతో రీఛార్జి చేసుకోవచ్చని, ప్రతి రూ. 10కి 1 జీబీ చొప్పున డేటాను అదనంగా కేటాయిస్తామని తెలిపింది.

ఒక నెట్‌వర్క్ చందాదార్లు వేరొక నెట్ వర్క్ పరిధిలోని ఫోన్లకు కాల్స్ చేస్తే, కాల్ అందుకున్న నెట్ వర్క్‌కు తొలి సంస్థ ఛార్జీ చెల్లించాలన్న (ఐయూసీ) ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు కాల్ ఛార్జీలు కొనసాగుతాయని జియో స్పష్టం చేసింది. అయితే, జియో నెట్‌వర్క్ ఫోన్ల మధ్య చేసుకునే కాల్స్ ఉచితమే.

జియో నెట్‌వర్క్ నుంచి ల్యాండ్ లైన్లకు చేసుకునే కాల్స్ ఉచితమే. వాట్సాప్, ఫేస్ టైమ్ వంటి ప్లాట్ ఫామ్‌ల ద్వారా చేసుకునే కాల్స్‌కు ఛార్జీలు ఉండవు.

ఇతర నెట్‌వర్క్‌ల నుంచి ఇన్‌కమింగ్ కాల్స్ కూడా ఉచితమే అని ఈనాడు తెలిపింది.

Image copyright FACEBOOK/YSJAGANMOHANREDDY

ఔట్ సోర్సింగ్‌లోనూ 50 శాతం రిజర్వేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఈ కోటాలోనూ 50 శాతం మహిళలకే కేటాయించాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల విధివిధానాలపై సమీక్షించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర స్థాయిలో జీఏడీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల్లో వివిధ స్థాయుల్లో విభాగాలుండాలని సూచించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి నేతృత్వం వహించే ఈ జిల్లా స్థాయి విభాగానికి కలెక్టర్‌ ఎక్స్‌ అఫీషియో కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో కార్పొరేషన్‌ ఉండాలన్నారు.

అందరికీ ఒకే రకమైన నియమ నిబంధనలుంటాయని చెప్పారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఒకే పనికి ఒకే వేతనం ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌ పద్ధతుల్లో జీతాల చెల్లింపులు జరగాలని సూచించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

సర్కార్‌ దిగిరాకపోతే సకల జనుల సమ్మె: అఖిలపక్షం

సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వం విలీన చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేయనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం ప్రకటించిందని సాక్షి పేర్కొంది.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ (రెండు గ్రూపులు), టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన, శివసేన, ఎమ్మార్పీఎస్, బీసీ సంక్షేమ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ మీడియా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, వివిధ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

అలాగే భవిష్యత్‌ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించాయి. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వద్ధామరెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌ నిర్వ హించాలని నిర్ణయించినా, గురువారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.

సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారని సాక్షి తెలిపింది.

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ Image copyright Getty Images

మూకదాడి అంటూ దేశం పరువుతీయొద్దు

''లించింగ్‌ (కొట్టిచంపడం, మూకదాడి) అనే పదం భారతీయ సంస్కృతి నుంచి వచ్చింది కాదు. అది పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టింది. ఆ మాట వాడి దేశాన్ని అపఖ్యాతి పాలుచేయొద్దు'' అని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

భారతీయులు సౌభ్రాతృత్వాన్ని నమ్ముతారని, వారి విషయంలో అటువంటి పదాలు వాడొద్దని సూచించారు. మంగళవారం నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌ మైదానంలో ఆరెస్సెస్‌ విజయదశమి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు.

ప్రజలు సామరస్యంతో జీవించాలని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని కోరారు.

ఆర్టికల్‌ 370 నిర్వీర్యంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాను భాగవత్‌ ప్రశంసించారు. కాగా, అమాయకులు బలైపోతున్న మూకదాడులను భాగవత్‌ సమర్థిస్తున్నారా, ఖండిస్తున్నారా స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

సామర్యసంపై ఆరెస్సెస్‌ చీఫ్‌ తన సొంత సందేశాన్ని అనుసరించడం మొదలుపెడితే దేశంలో మూకదాడులు, మతద్వేషం ఆగిపోతాయని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

మూకదాడుల దోషులు నాథూరాం గాడ్సే వారసులేనని మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)