కశ్మీర్: పర్యటకానికి ఎంతవరకు సిద్ధంగా ఉంది?

  • 10 అక్టోబర్ 2019
కశ్మీర్ పర్యటన Image copyright Getty Images

శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మొహమ్మద్ సుల్తాన్‌కు చెందిన హౌస్ బోట్ ఆగస్టు 5 నుంచి ఖాళీగా ఉంది.

కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ పర్యటకం పూర్తిగా దెబ్బతింది.

ఇప్పుడు కశ్మీర్ పర్యటనపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తేసింది. కానీ, దీనివల్ల పరిస్థితి సాధారణ స్థాయికి ఏమీ రాదని స్థానికులు భావిస్తున్నారు.

మొహహ్మద్ బీబీసీతో మాట్లాడుతూ, ''గత రెండు నెలల నుంచి మేం ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. హౌస్ బోట్లు ఖాళీగా ఉండటాన్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పర్యటకులు ఇక్కడికి రావడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎలా ఉంటున్నామో దేవుడికే తెలుసు'' అని పేర్కొన్నారు.

''పర్యటక శాఖ నుంచి గానీ, మరే ఇతర మార్గంలోనూ మాకు ఏ విధమైన సహాయం అందడం లేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి వచ్చే పర్యటకులకు హెచ్చరికలు జారీ చేయడాన్ని నేను స్వాగతిస్తాను. కానీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే మేం బతకలేం'' అని చెప్పారు.

''కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్దరిస్తేనే పర్యటక పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లు తేలికగా తమ వ్యాపారాన్ని మొదలుపెట్టగలరు. ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మేం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంటర్నెట్ లేకుండా మేం మా వినియోగదారులను ఎలా కలుసుకోగలం? కేవలం ల్యాండ్ లైన్ ఫోన్లు సరిపోవు. ల్యాండ్ లైన్ నుంచి ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ చేయలేకపోతున్నాం'' అని తెలిపారు.

అక్టోబర్ 10 నుంచి కశ్మీర్ పర్యటనపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Image copyright EPA

ఇది 'సరైనకాలం' కాదు

''కశ్మీర్ నుంచి పర్యటకులు వెళ్లిపోవాలని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పుడు రమ్మని చెబుతోంది. కానీ, పర్యటకులు రావడానికి ఇది సరైన కాలం కాదు. ఈ సమయంలో మేం ఏమీ సంపాదించలేం'' అని కశ్మీర్ హౌస్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రషీద్ చెప్పారు.

''ఇప్పుడు చలికాలం వచ్చేసింది. కొత్తగా బుకింగ్స్ రావడం అసాధ్యం. సమాచార వ్యవస్థ పూర్తిగా ప్రారంభంకావాలి. పర్యటకులను హెచ్చరించడం కూడా ఆపాలి. ఇవన్నీ సాధ్యం కాకుంటే మేం వినియోగదారులను ఆకర్షించలేం. పరిస్థితి మెరుగుపడనంతకాలం పర్యటకులు కశ్మీర్‌కు రాలేరు'' అని పేర్కొన్నారు.

''ఈ కాలంలో మేం మా హౌస్ బోట్లకు మరమ్మతులు చేసుకుంటాం. కానీ, దీనికి ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడు పర్యటకులు రాకపోవడంతో మాకు ఆదాయం లేదు. మరమ్మతులు చేసుకునే పరిస్థితి లేదు'' అని చెప్పారు.

Image copyright Getty Images

కశ్మీర్ హోటల్స్ అసోసియేషన్ యజమాని ముస్తాక్ అహ్మద్ కహియా మాట్లాడుతూ, ''మీరు ఇప్పుడు కశ్మీర్‌లోని హోటళ్లను చూస్తే అవన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఈ పరిస్థితికి ప్రభుత్వ నిర్ణయమే కారణం. కశ్మీర్‌లో పర్యటించవచ్చని చేసిన చిన్న ప్రకటనతో ఒరిగేదేమీ లేదు. కశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లు లేదు'' అని పేర్కొన్నారు.

పర్యటక శాఖ ఏమంటోంది?

తమ ప్రయత్నాలతో పర్యటకం తిరిగి పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

కశ్మీర్ టూరిజం డైరెక్టర్ నిసార్ అహ్మద్ వాని బీబీసీతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పర్యటకాభివృద్ధికి అనేక పథకాలు రచించిందని చెప్పారు.

''కశ్మీర్‌లో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా, మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పర్యటకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి మెరుగవుతోంది. అందుకే ప్రభుత్వం తన సూచనను వెనక్కి తీసుకుంది. పర్యటకులను ఆకర్షించడానికి మేం ప్రయత్నిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో సైతం కశ్మీర్ పర్యటక విశేషాలపై రోడ్ షోలు నిర్వహిస్తాం. వార్తాపత్రికలు, టీవీ, రేడియోలలో ప్రకటనలు చేస్తాం'' అని పేర్కొన్నారు.

Image copyright kamran

కశ్మీర్‌లో పరిస్థితి ఇంకా మెరుగు పడలేదని అధికారులు కూడా భావిస్తున్నారు. త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని, పర్యటకులు లోయలోకి వస్తారని ఆశిస్తున్నారు. సమాచార వ్యవస్థ, ల్యాండ్‌లైన్స్ పనిచేస్తున్నాయని చెప్పారు.

''ల్యాండ్‌లైన్ ఫోన్లు పనిచేస్తున్నందున సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిందని మేం 100 శాతం చెప్పలేం. ఈ రోజు నాకు చాలా మంది టూర్ ఆపరేటర్ల నుంచి, బయటి నుంచి ల్యాండ్‌లైన్‌లలో కాల్స్ వచ్చాయి'' అని తెలిపారు.

కశ్మీర్‌లో ఇంకా ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో పర్యటకులు అక్కడికి ఎలా వస్తారని అడిగినప్పుడు, ఇది తమకు సంబంధించిన విషయం కాదని వారు చెప్పారు.

''సంబంధిత ఏజెన్సీలు శాంతిభద్రతల పరిస్థితిని చూసుకుంటాయి. పర్యటకులను ఆకర్షించడమే మా పని'' అని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)