కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలు: నేతలంతా నిర్బంధంలో ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?

  • 11 అక్టోబర్ 2019
ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ

ఓ పక్క ప్రముఖ నేతలంతా నిర్బంధంలో ఉండగా జమ్మూ కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 5న కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే.

బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (బీడీసీ) ఎన్నికలు అక్టోబర్ 24న జరగబోతున్నాయి.

పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇవి రెండో స్థాయి సంస్థలు. సర్పంచ్, పంచ్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 316 బ్లాకులు ఉండగా, ప్రస్తుతం 310 బ్లాకులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

కానీ, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలందరినీ నిర్బంధంలో ఉంచి, ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసి ఈ ఎన్నికలు నిర్వహించడం అంటే, 'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే' అని ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు.

రాజకీయ శూన్యత ఏర్పడితే అది భారత ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు.

"మేం అభ్యర్థులను ఎలా నిలబెట్టాలి? వారితో మాట్లాడలేని పరిస్థితుల్లో వారిని ఎలా ఎంపిక చేయాలి? లోయలోని మా ముఖ్య నేతలంతా గృహనిర్బంధంలో ఉన్నారు" అని కాంగ్రెస్‌కు చెందిన రవీందర్ శర్మ అన్నారు.

ఆగస్టులో జమ్మూలో ఓ సమావేశంలో ప్రసంగించేందుకు సిద్ధపడుతున్న సమయంలో శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Image copyright MAJID JAHANGIR

"పరిస్థితులు మారాలి"

తమ నేతలను సంప్రదించే అవకాశం లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

"మా పార్టీ గుర్తుపై పోటీచేసేందుకు అనుమతిస్తూ అధీకృత లేఖలను అభ్యర్థులకు ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇవేం ఎన్నికలు?" అని నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన హర్ష్ దేవ్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.

జమ్మూలో 58 రోజులపాటు నిర్బంధంలో ఉన్న ఆయన ఇటీవలే విడుదలయ్యారు.

"రాజకీయ పార్టీలకు, నేతలకు సమాన అవకాశాలు కల్పించే ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలతో దాన్ని అపహాస్యంపాలు చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

"ఈ ఎన్నికలు ఏదో తంతులా ఉన్నాయి. కశ్మీర్ లోయలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుని, ప్రచారం చేసుకోవడానికే వారు వీటిని నిర్వహిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికే మేం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నామని తెలిపారు.

ఎన్‌సీ, పీడీపీ నేతలు కూడా తమ పార్టీ అభ్యర్థులతో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు.

"అంతా లాక్ డౌన్‌లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదు" అని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన దేవేందర్ సింగ్ రానా వ్యాఖ్యానించారు.

"ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా సాధ్యమవుతాయి? ఎన్నికలు సజావుగా జరగాలంటే పరిస్థితులు మారాలి. ఓ రాజకీయ నాయకుడు ప్రజలను కలుసుకోకుండా, వారి ఉద్వేగాలను అర్థం చేసుకోకుండా, వారి ఆకాంక్షలను తెలుసుకోకుండా ఎన్నికల్లో భాగం కావడం ఎలా?" అని రానా ప్రశ్నించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionకశ్మీరీ పండిట్లు: "అత్యంత దారుణ పరిస్థితుల నడుమ బతుకుతున్నాం’’

ఒక్కొక్కరినీ విడుదల చేస్తాం: గవర్నర్ కార్యాలయం

"ఇదంతా ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నాయకులుగా చేయడానికి ఇదో ప్రణాళిక" అని ట్వీట్ చేస్తూ.. తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు షెహ్లా రషీద్.

మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ స్థాపించిన జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీలో ఆమె చేరారు.

అయితే, అరెస్టులు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయనే వాదనతో తాను ఏకీభవించడంలేదని బీజేపీ రాష్ట్ర నేత రవీందర్ రైనా అన్నారు.

"రాజకీయ నాయకులపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. తన వ్యాఖ్యలు, ప్రకటనల ద్వారా పరిస్థితులను మరింత దిగజార్చే ప్రమాదముందనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం మేరకు ఫరూఖ్ అబ్దుల్లాను నిర్బంధించారు. వారెవరిపైనా ఎఫ్ఐఆర్‌లు నమోదు చెయ్యలేదు" అని రైనా తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు సజ్జద్ లోన్, షా ఫైజల్ వంటి అనేక మంది నేతలను నిర్బంధించారు.

పరిస్థితులు మరింత దిగజారి, అమాయకుల ప్రాణాలు బలి కాకుండా అడ్డుకోవడానికే ఈ నిర్బంధాలని రవీందర్ రైనా అంటున్నారు.

ఇటీవలే కొందరు రాజకీయ నేతల నిర్బంధాన్ని ప్రభుత్వం తొలగించింది.

"ఒక్కొక్కరి గురించి విశ్లేషించిన తర్వాత కశ్మీరీ నాయకులంతా ఒక్కొక్కరుగా నిర్బంధం నుంచి విడుదలవుతారు" అని గవర్నర్ సత్యపాల్ మలిక్ సలహాదారు ఫరూఖ్ ఖాన్ చెప్పారు.

తమ పార్టీ అధ్యక్షులను కలుసుకునేందుకు జమ్మూకు చెందిన రాజకీయనాయకులకు అనుమతి లభించింది.

ఇటీవల ఒమర్, ఫరూఖ్ అబ్దుల్లాలను కలిసిన బృందంలో దేవేందర్ రాణా ఒకరు.

"ప్రస్తుత పరిస్థితులపై వారు చాలా విచారంగా ఉన్నారు. ప్రజల గురించే వారు ఆవేదన చెందుతున్నారు" అని ఆయనన్నారు.

మెహబూబా ముఫ్తీని కలిసేందుకు పీడీపీ బృందానికి కూడా సమయం లభించింది. కానీ అనుమతి లభించిన సమయానికి, కలుసుకునే సమయానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉండటంతో ఈ సమావేశం సాధ్యం కాలేదు.

Image copyright EPA

"ఫరూఖ్‌నే నిర్బంధిస్తే, ఇక ఏమైనా జరగొచ్చు"

అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలూ భయంతో ఇళ్లలోనే ఉంటున్నారు. లేదంటే వ్యక్తిగత భద్రతకు ముప్పుందని చెబుతూ వేరే ప్రదేశాలకు తరలిపోయారు అని శ్రీనగర్‌లో నాకు కొందరు చెప్పారు. ఎన్సీ, పీడీపీ వంటి పార్టీల కార్యాలయాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

"పార్లమెంటు ఎన్నికల్లో మేం ఓటేశాం. దానికి మాకు దక్కిన ప్రతిఫలం ఇది" అని నిర్బంధంలో ఉన్న ఓ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. ఆయనను ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలో ఉంచారు.

ఎలాంటి అభియోగాలు లేకుండానే రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచడానికి ఈ చట్టం వీలు కల్పిస్తోంది.

ఫరూఖ్ అబ్దుల్లాను నిర్బంధించిన విధానంపైనే చాలామంది కశ్మీరీలు ఆందోళనగా ఉన్నారు.

"ఈ లోయలో ఫరూఖ్ అత్యంత సీనియర్ రాజకీయ నేత. ఆయనపైనే పీఎస్ఏ చట్టాన్ని ప్రయోగిస్తే, ఇక ఏమైనా జరగొచ్చు" అని ఒకరు వ్యాఖ్యానించారు.

అయితే, కొందరు ఈ చర్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ సంపాదనపైనే దృష్టిపెట్టి, ప్రజలను పట్టించుకోని తమ నేతలకు ఇలాంటి శిక్ష పడటం సరైనదే అంటున్నారు.

ఒక్కసారిగా రాజకీయ కార్యకలాపాలు తగ్గిపోయిన ప్రస్తుత తరుణంలో బీడీసీ ఎన్నికల విశ్వసనీయతను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

"లోయలో 19,582 పంచ్‌, సర్పంచ్‌ స్థానాలు ఉన్నాయి. వీటిలో 7,528 పదవులు భర్తీ అయ్యాయి. అంటే దాదాపు 64 శాతం ఖాళీగానే ఉన్నాయి. బీడీసీకి ఓటర్లు లేరు, ఎలక్టోరల్ కాలేజీ లేదు, అలాంటప్పుడు ఎవరు ఓటేస్తారు? విశ్వసనీయత ఏముంటుంది? ఛైర్‌పర్సన్‌లుగా ఎన్నికయ్యేవారికి ప్రజల సమ్మతి ఎక్కడ ఉంటుంది?" అని హర్ష్ దేవ్ సింగ్ ప్రశ్నిస్తున్నారు.

Image copyright Getty Images

రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి?

కశ్మీర్ లోయలోని ఎన్‌సీ, పీడీపీ లాంటి ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోందనే దానిపై ఇప్పటికే అనేక అనుమానాలున్నాయి.

రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడటంపైనే ఇంతకాలం రాజకీయాలన్నీ నడిచాయి. ఇప్పుడు అదే లేకపోవడంతో వీటి పరిస్థితి ఏంటో చూడాలి.

"కేవలం 10 శాతం మంది ఓటర్లు ఇచ్చే తీర్పుతో రాజకీయ శూన్యత ఉన్న ఈ ప్రాంతంలో వారు వారసత్వ రాజకీయాలు చేస్తూ మూడు దశాబ్దాలు గడిపారు" అంటూ అబ్దుల్లా కుటుంబం, ముఫ్తీపై ఇటీవల జరిగిన ఇండియా టుడే కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విమర్శలు గుప్పించారు.

అయితే, మంత్రి విమర్శలను హర్ష్ దేవ్ సింగ్ ఖండించారు.

"ఎవరు పార్టీని నడపాలి, ఎవరు పదవిలో ఉండాలనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఓటెయ్యాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు, మీరు కాదు. ఏదైనా తప్పు జరిగితే దోషిపై రాజ్యాంగం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకోండి. బంధువులు, లేదా పార్టీకి సంబంధించినవారు పార్టీని ముందుకు తీసుకెళ్తే అందులో బీజేపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright Pti
చిత్రం శీర్షిక ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా

"తీవ్ర వ్యతిరేకతకు దారితీసే ప్రమాదముంది"

కశ్మీర్‌లో నాయకత్వ లేమిని కల్పించే ప్రమాదం దిశగా తీసుకెళ్తున్నారని కశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ విభాగంలో అధ్యాపకుడు డాక్టర్ నూర్ అహ్మద్ బాబా అభిప్రాయపడ్డారు.

"ఇక్కడేదో అమలు చేయాలని వారు భావిస్తున్నట్లుంది. అది నాయకత్వం కాదు. అది బలవంతంగా అణచివేసే చర్య. ఇది తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు, ఆగ్రహం, అవిశ్వాసానికి దారితీసే ప్రమాదముంది" అని ఆయనన్నారు.

లోయలోని రాజకీయాలకు కొత్త రక్తం ఎక్కించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త నేతలను వెలుగులోకి తెస్తాయని స్థానిక బీజేపీ నేతలు అంటున్నారు.

"కశ్మీర్‌లో రాజకీయ శూన్యత లేదు. పంచ్‌లు, సర్పంచ్‌లు వేలల్లో ఉన్నారు. బీడీసీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతుంది. గెలిచినవారికి కేబినెట్ హోదా ఉంటుంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఇక్కడ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి" అని బీజేపీ నేత రవీందర్ రైనా అన్నారు.

Image copyright Getty Images

ఇదంతా సులభంగా జరుగుతుందా?

"నాయకులుగా ఎదగడానికి ఓ పద్ధతి ఉంటుంది. ప్రజలను కదిలించగలగాలి, వారి బాధలను వినాలి, సాధారణ ప్రజలు వారితో కలవాలి, అప్పుడే వాళ్ల మధ్య ఓ నమ్మకంతో కూడిన బంధం ఏర్పడుతుంది. ఇదంతా జరగడానికి దశాబ్దాలు పడతాయి" అని డాక్టర్ నూర్ అహ్మద్ బాబా అన్నారు.

"స్వేచ్ఛాయుత, పారదర్శక రాజకీయ వాతావరణం చాలా అవసరం. అప్పుడే సామర్థ్యమున్న వ్యక్తులు ప్రజలను కూడగడతారు, వారితో కలసి వెళ్తారు, ప్రజలు కూడా వారిని నమ్ముతారు. ఈ విశ్వాసమే చెదరని బంధానికి పునాది అవుతుంది" ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఇక్కడ 290 బ్లాకుల్లో పోటీ చేస్తోంది. మిగిలిన చోట్ల స్వతంత్రులకు మద్దతునిస్తోంది.

"కేవలం ఒక్క పార్టీనే అన్ని చోట్లకూ వెళ్లగలుగుతోంది, అదే బీజేపీ" అని హర్ష్ దేవ్ సింగ్ విమర్శించారు.

"పోటీలో ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అనే భావన కల్పించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు" అని ఆయనన్నారు.

ఇవన్నీ కుంటిసాకులని బీజేపీ నేత రవీందర్ రైనా కొట్టిపారేశారు.

"ఎన్సీ, పీడీపీలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో వారి పార్టీలకు చెందిన పంచ్‌లు, సర్పంచ్‌లు విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు వాళ్లకి కూడా తెలిసింది... వారు నామినేట్ చేసినవాళ్లు గెలవరు అని. అందుకే ఇలాంటి సాకులు చెబుతున్నారు" అని ఆయన విమర్శించారు.

"మా నాయకులను సంప్రదించడానికి మాకు ఎలాంటి సమస్యలూ లేవు. ల్యాండ్ లైన్లు ఉన్నాయి. మా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రజలను కలుస్తున్నాం. నేను ఇప్పటికే కశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటించాను. మా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నాం" అని రైనా తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)