కేరళ సైనేడ్ హత్యలు: భర్త, అత్తమామలు సహా ఆరుగురిని ‘విషమిచ్చి చంపిన ఆదర్శ కోడలు’

  • 11 అక్టోబర్ 2019
జాలీ షాజు Image copyright K SASI
చిత్రం శీర్షిక జాలీ షాజు 1997లో తన మొదటి భర్త రాయ్ థామస్‌తో వివాహమైంది

కేరళలో ఆరుగురు కుటుంబ సభ్యులను విషమిచ్చి చంపిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితురాలిని కోర్టులో ప్రవేశపెట్టినపుడు స్థానికులు ఆమెను 'ఆదర్శనీయమైన కోడలు' అంటూ గేలిచేశారు.

జాలీ షాజు (47) అనే మహిళ 2002 నుంచి 2014 మధ్య తన మొదటి భర్తను, అతడి తల్లిదండ్రులను, తన రెండో భర్త మాజీ భార్యను, మరో ఇద్దరిని విషం పెట్టి చంపినట్లు అంగీకరించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె 2014లో ఒక చిన్నారిని కూడా చంపినట్లు చెప్తున్నారు.

జాలీ షాజుతో పాటు, ఆమెకు సాయం చేశారన్న ఆరోపణలతో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయగా.. అక్టోబర్ 16వ తేదీ వరకూ ముగ్గురినీ రిమాండ్‌కు పంపించారు.

నిందితుల్లో ప్రాజీకుమార్ అనే స్వర్ణకారుడు ఆమెకు సైనేడ్ సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే తనపై ఆరోపణలన్నీ అవాస్తవమని తాను నిర్దోషినని అతడు చెప్పినట్లు పీటీఐ తెలిపింది. ఎలుకలకు విషం పెట్టటానికి జాలీ తన దగ్గర సైనేడ్ కొందని తాను భావించినట్లు అతడు పేర్కొన్నాడు.

అనుమానాలు

జాలీ మొదటి భర్త రాయ్ థామస్ 2011లో చనిపోయారు. అతడి సోదరుడు రోజో థామస్ రెండు నెలల కిందట అధికారులను కలిసి తన అనుమానాలు వ్యక్తం చేయటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

జాలీ షాజు మొదటిగా 2002లో తన మొదటి అత్త అన్నమ్మ థామస్‌ను భోజనంలో విషం పెట్టి చంపిందని ఆరోపణ.

ఆరేళ్ల తర్వాత జాలీ మొదటి మామ టామ్ థామస్ (66) కూడా అదే పరిస్థితుల్లో చనిపోయారు.

ఆ తర్వాత 2011లో జాలీ మొదటి భర్త రాయ్ థామస్ చనిపోయారు. మృతదేహానికి నిర్వహించిన శవపరీక్షలో సైనేడ్ ఆనవాళ్లను గుర్తించారు. కానీ దాని మీద దర్యాప్తు చేయలేదు.

అయితే.. తన మేనల్లుడి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష జరపాలని 2014లో అన్నమ్మ సోదరుడు మాథ్యూ పట్టుపట్టారు. ఆయన అదే సంవత్సరంలో చనిపోయారని పీటీఐ పేర్కొంది.

2016లో రాయ్ థామస్‌కి సోదరుడు వరస అయ్యే స్కారియా షాజు భార్య చనిపోవటంతో ఆ కుటుంబంలో ఆందోళన పెరిగింది. రెండేళ్ల తర్వాత 2018లో స్కారియా షాజు కూతురు ఆల్ఫైన్ కూడా చనిపోయింది.

అనంతరం స్కారియా షాజును జాలీ పెళ్లి చేసుకుంది.

ఈ ఆరుగురినీ తాను విషం పెట్టి హత్య చేసినట్లు జాలీ షాజు అంగీకరించిందని పోలీసులు చెప్తున్నారు. ఇందుకు కారణం డబ్బులేనని పేర్కొన్నారు. తన తల్లి మరణం తర్వాత కుటుంబ ఆర్థిక వ్యవహారాలను జాలీ షాజు తన చేతుల్లోకి తీసుకుందని ఆమె ఆడపడుచు రెంజీ చెప్పారు. జాలీని ఆదర్శవంతమైన కోడలని తన తండ్రి భావించేవారని కూడా పేర్కొన్నారు.

''జాలీని నా అక్కగా భావించేదానిని. ఆమెను ఎంతో ఇష్టపడేదానిని. అందరితో చాలా స్నేహపూర్వకంగా మెలిగేది'' అని రెంజీ పీటీఐతో చెప్పారు.

ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)