మోదీ -షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడి భారత పర్యటనలో పంచెకట్టులో కనిపించిన ప్రధాని మోదీ

  • 11 అక్టోబర్ 2019
మోదీ, జిన్‌పింగ్ Image copyright Ani

భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో కనిపించారు. తెల్లని పంచె, చొక్కా ధరించిన ఆయన జిన్‌పింగ్‌తో కలిసి అక్కడి చారిత్రక కట్టడాలను సందర్శించారు.

వెయ్యేళ్ల కిందట పల్లవ రాజులు మహాబలిపురంలో నిర్మించిన ఆ కట్టడాల వైశిష్ట్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు.

తొలుత జిన్‌పింగ్ చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, ముఖ్యమంత్రి పళనిస్వామి స్వాగతం పలికారు.

తన రాక సందర్భంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తూ జిన్‌పింగ్ బయటకొచ్చారు. అనంతరం సాయంత్రం మహాబలిపురం చేరుకున్నారు.

Image copyright Twitter/PMOIndia

ఈ రోజు(11.10.2019), రేపు రెండు రోజుల పాటు మహాబలిపురంలో ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరగనున్నాయి.

మామళ్లపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతంగా చెప్పేచోట, ప్రాచీన పంచరథ సముదాయంలో మోదీ, జిన్‌పింగ్‌లు తిరిగారని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.

పంచరథ సముదాయంలోని అయిదు కట్టడాలు కూడా రథాలను పోలి ఉంటాయని, అవన్నీ ఏకశిలా నిర్మాణాలని.. ఇదంతా జిన్‌పింగ్‌కు మోదీ వివరించారని పీఐబీ ట్వీట్ చేసింది.

పంచెకట్టులో ఉన్న మోదీ చిత్రాలు.. ఇద్దరు నేతలు కొబ్బరి బొండాలు తాగుతున్న చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు జిన్‌పింగ్‌ను భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా మహాబలిపురంలో కలిశారు.

మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య ఇది రెండో అనధికారిక సమావేశమని, మొదటి సమావేశం చైనాలోని వుహాన్‌లో గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిందని.. ఇప్పుడు చెన్నైలో రెండో అనధికారిక సమావేశం జరుగుతోందని చైనాలోని ప్రధాన వార్తాఏజెన్సీల్లో ఒకటైన జిన్‌హువా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)