ఆంధ్రప్రదేశ్‌లో బీర్ల కొనుగోలుపై ఆంక్షలు... ఏ సైజు అయినా సరే ఒకరికి మూడు బాటిళ్లు మాత్రమే- ప్రెస్‌ రివ్యూ

  • 12 అక్టోబర్ 2019
Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఇష్టం వచ్చినన్ని బీరు బాటిళ్లు కొనేందుకు అవకాశం లేదని సాక్షి తెలిపింది. బీరు బాటిళ్లపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

గత నెల 24న మద్యం బాటిళ్లకొనుగోళ్లపై నిర్ధిష్టమైన ఆంక్షలు జారీ చేశారు. ఒక వ్యక్తి ఏ సైజు అయినా సరే... మూడు బాటిళ్ల వరకే కొనుగోలుకు, తన ఆధీనంలో ఉంచుకునేందుకు అవకాశం ఉంది.

విదేశీ మద్యం అయినా మూడు బాటిళ్లకు మించి ఉండకూడదు. స్పిరిట్ మూడు బల్క్ లీటర్లు, కల్లు 2 బల్క్ లీటర్లు, బీరు 60 ఎంఎల్ బాటిళ్లు ఆరు వరకు కొనుగోలు చేయవచ్చని ఆదేశాలిచ్చింది.

అయితే, ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది. శనివారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసిందని సాక్షి తెలిపింది.

Image copyright Meil/fb

మేఘా ఇంజినీరింగ్ సంస్థలో ఐటీ తనిఖీలు

దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఐఈఎల్) కార్యాలయాల్లో, సంస్థ అధిపతి కృష్ణారెడ్డి నివాసం, మరికొన్ని చోట్ల శుక్రవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారని ఈనాడుతెలిపింది.

ఉదయం ఏడు గంటలకే మొదలైన ఈ తనిఖీలు రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీ ఐటీ శాఖ కార్యాలయానికి చెందిన అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది.

మేఘా సంస్థకు దేశవ్యాప్తంగా 17 ప్రాంతీయ కార్యాలయాలు ఉండగా.. వాటన్నింటిలోనూ తనిఖీలు జరిగినట్లు తొలుత ప్రచారమైంది. కానీ, తనిఖీలు మాత్రం బాలానగర్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కృష్ణారెడ్డి నివాసంలో, హైదరాబాద్‌లోని మరికొన్ని చోట్ల మాత్రమే జరిగింది.

ముందస్తు పన్ను చెల్లింపుల్లో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే అధికారులు ఈ తనిఖీలు నిర్వహింస్తున్నట్లు సమాచారం. మేఘా సంస్థ తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఏపీలో పట్టిసీమతో పాటు ప్రస్తుతం పోలవరం పనులు కూడా దక్కించుకుందని ఈనాడు పేర్కొంది.

Image copyright chada venkatreddy/fb

‘టీఆర్‌ఎస్‌కు మద్దతు వాపస్‌’

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు విరమించుకుంటున్నట్లు సీపీఐ పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఆర్టీసీ సమ్మెకు ముందు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలనుకోవడం వాస్తవమేనని, కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులు ఆంధ్రోళ్లు కాదని.. వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు.

అంతకుముందు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ చిన్నవాడైనా.. ఆయన అడుగుజాడల్లో సీఎం కేసీఆర్‌ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మె కారణంగా మనోవేదనకు గురై ముగ్గురు కార్మికులు మృతి చెందారని, దీనికి కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ Image copyright CCDMC.CO.IN

'లోకల్‌ స్టేటస్‌' మరో రెండేళ్లు పొడిగింపు

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారు స్థానిక హోదా(లోకల్‌ స్టేటస్‌) పొందడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించిందని సాక్షి తెలిపింది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి 2021 జూన్‌ ఒకటో తేదీ వరకూ స్థానిక హోదా పొందడానికి అవకాశం లభించనుంది. తెలంగాణలో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి ఇక్కడ లోకల్‌ స్టేటస్‌ పొందడానికి కేంద్ర ప్రభుత్వం మొదట మూడేళ్లు గడువు ఇచ్చింది.

ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370(డి)లోని ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను రాష్ట్రపతి ఆమోదంతో సవరించింది. దీనిప్రకారం రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ రోజైన 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 1 వరకు లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికెట్లు పొందవచ్చని 2016 జూన్‌ 16న కేంద్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

తదుపరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ 2017 అక్టోబర్‌ 30న మరో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం గడువు 2019 జూన్‌ 1వ తేదీతో ముగిసింది

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం వల్ల చాలామంది ఏపీ ఉద్యోగులు ఇప్పటికీ తెలంగాణలోనే ఉండిపోయారు.

కొందరు ఉద్యోగులు ఏపీకి వచ్చినప్పటికీ తమ కుటుంబాలను హైదరాబాద్‌లోనే ఉంచారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సైతం హైదరాబాద్‌ను పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా అప్పట్లో కేంద్రం పేర్కొంది.

తెలంగాణ నుంచి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిరపడినవారు, ఇప్పుడు రావాలనుకుంటున్న వారు స్థానిక హోదా పొందాలంటే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చేశాం కదా ఆటోమేటిగ్గా లోకల్‌ స్టేటస్‌ వర్తిస్తుందనుకుంటే పొరపాటే.

2021 జూన్‌ 1వ తేదీలోగా తహసీల్దార్‌ నుంచి లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికెట్లు పొందిన వారికి మాత్రమే విద్య, ఉద్యోగాల్లో స్థానిక కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయి.ఈ సర్టిఫికెట్‌ పొందగోరేవారు తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడికి వచ్చినట్లు ఆధారాలతో దరఖాస్తు (ఫారం-1) సమర్పించాలని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

చైనాలో అదృశ్యమైన వీగర్ ముస్లిం ప్రొఫెసర్‌ ఏమయ్యారు?

ఏడేళ్ల వయసులో నాపై జరిగిన అత్యాచారాన్ని 74 ఏళ్ల వయసులో ఎందుకు బయటపెట్టానంటే...

రెడ్డి సుభానా: "మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి" అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు

IND Vs SA రెండో టెస్టు: ఇన్నింగ్స్ 137 పరుగులతో భారత్ విజయం

కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు

హాగిబిస్‌ పెనుతుపాను: అతలాకుతలమైన జపాన్, 18 మంది మృతి, నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి

నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్‌ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా