కశ్మీర్ లోయలో సోమవారం మధ్యాహ్నం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవల పునరుద్ధరణ

  • 12 అక్టోబర్ 2019
జమ్ము కశ్మీర్ Image copyright Getty Images

కశ్మీర్ లోయలో సోమవారం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్లు పనిచేయనున్నాయి. జమ్ము-కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ ఈ సమాచారం ఇచ్చారు.

శనివారం పరిస్థితిని సమీక్షించిన తర్వాత జమ్ము-కశ్మీర్ మిగతా భాగాల్లో మొబైల్ ఫోన్ సేవలు పునరుద్ధరించనున్నట్లు రోహిత్ కన్సల్ చెప్పారు.

అన్ని టెలికామ్ ఆపరేటర్ల పోస్ట్ పెయిడ్ మొబైల్ ఫోన్లు సోమవారం, అంటే 2019 అక్టోబర్ 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి పనిచేస్తాయి. లోయలోని మొత్తం పది జిల్లాలకూ ఇది వర్తిస్తుంది అన్నారు.

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఆగస్టు 5 నుంచి జమ్ముకశ్మీర్ అంతటా మొబైల్ నెట్‌వర్క్, ల్యాండ్ లైన్ సేవలు నిలిపివేశారు.

తర్వాత ల్యాండ్ లైన్ సేవలను దశలవారీగా పునరుద్ధరించారు. కానీ లోయలోని వివిధ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ సేవలపై ఇప్పటికీ నిషేధం అమలు చేస్తున్నారు.

Image copyright Getty Images

99 శాతం లోయలో ఎలాంటి ఆంక్షలూ లేవు

లోయలో 99 శాతం ప్రాంతాల్లో ఎలాంటి ఆంక్షలూ లేవని, ల్యాండ్ లైన్ ఫోన్ కూడా పూర్తిగా పనిచేస్తున్నాయని జమ్ము-కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సల్ అన్నారు.

షాపులు, రవాణా సౌకర్యాలు ఆపివేయడానికి తీవ్రవాద సంస్థలే బాధ్యులని రోహిత్ కన్సల్ చెప్పారు. లోయ ప్రశాంతంగా ఉండడం ఆ సంస్థలకు ఇష్టం లేదని, అందుకే వారికి భయపడి షాపులు తెరుచుకోవడం లేదని చెప్పారు.

రాబోవు రోజుల్లో కశ్మీర్ అత్యున్నత క్వాలిటీ ఆపిల్స్ మార్కెట్‌కు చేరుకుంటాయని కూడా ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం పండించేవారికి మంచి ధర కూడా లభిస్తుందన్నారు.

జమ్ము-కశ్మీర్ గవర్నర్ అక్టోబర్ 10న పర్యటకుల కోసం జారీ చేసిన భద్రతా సూచనలు వెనక్కు తీసుకున్నారు. ఈ ప్రాంతంలో పర్యటించాలనే ఆసక్తి ఉన్నవారికి, రవాణాతో సహా అవసరమైన సాయం అందిస్తామని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే మొబైల్ ఫోన్ సేవలు పునరుద్ధరించాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, దానిని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆ తర్వాత కేంద్రం ఇక్కడివారికి దేశంలోని మిగతా రాష్ట్రాల వారిలాగే రాజ్యాంగ ప్రయోజనాలు అందిస్తామని, రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పింది.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత వచ్చే ఎలాంటి స్పందననైనా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఆంక్షలు విధించింది.

ఇంటర్నెట్, మిగతా కమ్యూనికేషన్ సేవలను నిలిపివేయడంతోపాటు స్థానిక నేతలను గృహనిర్బంధంలోకి తీసుకుంది. పర్యటకులను రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని చెప్పింది. అదనపు భద్రతా బలగాలను మోహరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం