‘సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి.. దేశంలో ఆర్థిక మాంద్యం ఎక్కడ?’ - కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్: ప్రెస్ రివ్యూ

  • 13 అక్టోబర్ 2019
Image copyright FB/SYE RAA/War
చిత్రం శీర్షిక చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి', హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన 'వార్' సినిమాలు అక్టోబర్ 2న విడుదలయ్యాయి

దేశంలో సినిమాలు బాగానే వసూళ్లు చేస్తున్నాయి కదా... ఇక ఆర్థిక మాంద్యం ఎక్కడుంది? అంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారని ఈనాడు రాసింది.

"దేశంలో విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాలు అక్టోబర్ 2వ తేదీన రూ.120 కోట్ల వసూళ్లు సాధించాయి. దేశం ఆర్థికంగా బలంగా ఉండి... ఆర్థిక మందగమనం లేకపోవడం వల్లే ఇంత భారీ మొత్తంలో వసూలైంది. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ నేషనల్ శాంపిల్స్ సర్వే కార్యాలయం ఇచ్చిన నివేదిక కూడా తప్పుగానే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదిక కూడా అసంపూర్తిగానే ఉంది. ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉన్న విషయాన్ని మరచిపోవద్దు" అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Image copyright Thinkstock

ఇంట్లోనే డయాలసిస్‌

ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకునే పద్ధతికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అంటూ సాక్షి ఒక కథనం ప్రచురించింది.

'పెరిటోనియల్‌ డయాలసిస్‌'అనే ఈ పద్ధతితో కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి.. రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. పెరిటోనియల్‌ డయాలసిస్‌ బ్యాగు కొనుక్కుని దాని ద్వారా ఇంట్లోనే డయాలసిస్‌ చేసుకోవచ్చని తెలిపింది.

అమెరికా, థాయిలాండ్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో పెరిటోనియల్‌ పద్ధతినే పాటిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆసుపత్రులకు వెళ్లకుండానే తక్కువ సమయంలో డయాలసిస్‌ చేసుకోవచ్చు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులను ఉపయోగించుకొని పెరిటోనియల్‌ డయాలసిస్‌ను అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

దేశంలో ఏటా లక్ష మంది కిడ్నీ సంబంధిత వ్యాధులకు బలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనంలో వెల్లడైంది. త్వరలో దేశంలో 10 లక్షల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తుందని కేంద్రం అంచనా.

చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఏపీ మద్యం షాపుల్లో ఉద్యోగాలు మానేస్తున్న ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో చేరిన కొద్ది రోజులకే, ఉద్యోగాలను మానేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

మద్యం దుకాణాల్లో అమ్మకాలకు, నగదుకు లెక్కలు తేలడం లేదు. దీంతో ఉద్యోగం ప్రారంభమైన పది రోజుల్లోనే సుమారు 400 మంది ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పినట్లు తెలిసింది.

లెక్కల్లో తేడాలు రావడంవల్ల రోజూ సాయంత్రానికి తమ చేతి నుంచి రూ.200 నుంచి రూ.400 ఎదురు కట్టాల్సి వస్తోందని, ఇలా తమ సొంత జేబుల్లోంచి డబ్బు కట్టే ఉద్యోగం చేయలేమని వెనుదిరిగిపోతున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ షాపులో ఒకేరోజు రూ.6 వేల నగదు తేడా వచ్చింది. దానికి సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌దే బాధ్యత కాబట్టి కట్టాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఆ షాపు సూపర్‌వైజర్‌తో సహా అందరూ అదే రోజు ఉద్యోగం మానేశారు. మరో జిల్లాలో ఒక స్టేషన్‌ పరిధిలో తొలివారంలోనే ఐదుగురు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎక్సైజ్‌ అధికారులు మళ్లీ అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తున్నారు.

గతంలో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసి... రాని వారికి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం పలుచోట్ల నిబంధనలను కూడా సడలిస్తున్నారు. కచ్చితంగా నిబంధనల ప్రకారమే తీసుకోవాలంటే విక్రయాలు కష్టమని భావించి ఈ మేరకు చర్యలు చేపడుతున్నారు. దీని బాధ్యతను స్థానిక సీఐలకు అప్పగిస్తున్నారు. అలాగే ఉద్యోగులు మానేయకుండా వారికి పనిపట్ల తగిన అవగాహన కల్పించాలని, కొంతకాలం ఉద్యోగులకు సహాయపడాలని కానిస్టేబుళ్లకు ఆదేశాలు జారీచేశారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని తెలుస్తోందని ఆంధ్రజ్యోతి రాసింది.

Image copyright FB/KCR

గల్ఫ్ వెళ్లినవారు వెనక్కి వచ్చేయండి

పొట్టకూటికోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ర్టానికి తిరిగి వచ్చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం పిలుపునిచ్చారని నమస్తే తెలంగాణ రాసింది.

తెలంగాణ బిడ్డలతో మాట్లాడటానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు వివిధ పనులు చేసుకొంటూ ఇబ్బందులు పడుతున్నారని.. తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకొనేందుకు పనులున్నందున తిరిగి రావాలని కోరారు.

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి ప్రజలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి పనులు వెతుక్కొంటూ.. గల్ఫ్ దేశాలకు పోయారు. అక్కడ దొరికిన పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి దొరికే జీతం కూడా తక్కువే. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి గతంలో లాగా లేదు. ఇక్కడే చేసుకోవడానికి చాలా పని ఉన్నది.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ పనికి మనుషులు దొరుకక వేరే ప్రాంతాల నుంచి రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బిడ్డలు పనికోసం వేరేచోటుకు వెళ్తే.. తెలంగాణలో పనికోసం వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారిని వెనుకకు రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. వారికి న్యాక్‌లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళ్తాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఎన్నారై విధానం అధ్యయనం చేయడంకోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హాతో కూడిన బృందం ఆదివారం కేరళలో పర్యటించనున్నది.

నగదు Image copyright Getty Images

కోటీశ్వరుల సంఖ్య పెరిగింది

దేశంలో పన్ను కొట్టే కోటీశ్వరుల సంఖ్య పెరిగిందని ఈనాడు కథనం పేర్కొంది.

2018-19 మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్ ఇయర్)లో రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయాలు కలిగిన వారి సంఖ్య 97,689కి చేరింది. అంతకు క్రితం ఏడాది 2017-18లో 81,344 మందితో పోలిస్తే వారి సంఖ్య 20 శాతం పెరిగింది.

2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌లో వేతన విభాగంలో 49,128 మంది తమకు కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్నట్లు ప్రకటించారు. అంతకు ముందటి ఏడాది వీరి సంఖ్య 41,457గా ఉంది.

2.62 కోట్ల మంది ఆదాయం ఏమీ లేదని ప్రకటించగా, 82 లక్షల మంది తమ ఆదాయాన్ని రూ. 5.5- 9.5 లక్షలుగా చూపించారు.

2085 మంది తమకు ఇళ్ల ద్వారా రూ. కోటికి పైగా ఆదాయం వస్తోందని వెల్లడించారు. రూ. కోటికి పైగా దీర్ఘకాల మూలధన లాభాలను పొందినట్లు ప్రకటించిన వారి సంఖ్య 6,750 నుంచి 8,629కి పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)