"మా పాప కారుణ్య మరణానికి అనుమతివ్వండి" అంటూ కోర్టుకు వెళ్లిన దంపతులు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: "మా పాప కారుణ్య మరణానికి అనుమతివ్వండి" అంటూ కోర్టుకెళ్లిన చిత్తూరు జిల్లా దంపతులు

  • 13 అక్టోబర్ 2019

రిపోర్టింగ్: బళ్ల సతీష్, షూట్&ఎడిట్: నవీన్ కుమార్

బీబీసీ ప్రతినిధులు

"రోజుకు ఎనిమిదిసార్లు పొడిచి పొడిచీ, ఆ పాప సూది గుచ్చినా ఏడ్వడం మానేసింది. అర్థరాత్రి 12 గంటలకు నిద్రలో ఉన్నప్పుడు షుగర్ ఇంజెక్షన్ చేస్తుంటే, ఏదో చీమ కుట్టినట్టు కదిలి ఊరుకుంటోంది" అని బాధగా చెప్పారు పాప తాత పఠాన్ ఆయూబ్ ఖాన్.

చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర్లోని బి.కొత్తకోట గ్రామానికి చెందిన చిన్నారి రెడ్డి సుభానాకు ఇంకా ఏడాది కూడా నిండలేదు. ఈ నెలలో మొదటి పుట్టిన రోజు.

తండ్రి పఠాన్ బావజన్, తల్లి పఠాన్ షబానా. వీరికి గతంలో ఇద్దరు పిల్లలు పుట్టి వెంట వెంటనే చనిపోవడంతో, స్థానిక విశ్వాసం ప్రకారం, రెడ్డమ్మ తల్లి పేరు వచ్చేలా సుభానా పేరు ముందు రెడ్డి అని పెట్టారు.

పుట్టుకతోటే సుభానాకు లో షుగర్ (హైపోడెసీమియా) వచ్చింది. రోజుకు నాలుగు ఇంజెక్షన్లు చేయాలి. షుగర్ లెవెల్స్ రోజుకు నాలుగుసార్లు చూడాలి. అప్పుడే ఆమె మామూలుగా బతుకుతుంది. లేదంటే, కష్టమని వైద్యులు చెప్పారు.

ఇప్పటి వరకూ ఉన్నదంతా అమ్మి, అప్పులు చేసి వైద్యం చేయించిన ఆ కుటుంబం, ఇక వైద్య ఖర్చులు భరించే స్థోమత తమకు లేదని తమ బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

"పాప పుట్టిన వెంటనే చెమటలు పట్టి ఫిట్స్ లాగా వచ్చింది. పెద్దాసుపత్రికి, బెంగళూరులోని ఇందిరా గాంధీ పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లాం. వారు బాగానే చూశారు. కానీ, ఏం జరిగిందో చెప్పటానికి పది రోజులు పట్టింది. లో షుగర్ (హైపోడెసీమియా) అన్నారు. రోజూ ఇంజెక్షన్లు చేస్తే బతుకుతుంది, లేకపోతే బతకదని చెప్పేశారు. పుట్టినప్పటి నుంచీ పాప నరకం చూసేది. ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు, గ్లూకోజులూ నిత్యo... పాప బాధ చూసి ఎందుకురా ఈ జన్మ అనుకునేదాన్ని. నరకం అంటే ఏంటో ఆసుపత్రుల్లో చూశాం" అన్నారు తల్లి షబానా.

"పాప వయసు పెరిగి తనకు తాను తినే సమయానికి కొంచెం కుదురుకుంటుంది. అప్పటి వరకూ ఇంజెక్షన్లు కావాలని డాక్టర్లు చెప్పారు" అని తండ్రి బావాజాన్ తెలిపారు.

మూడు నెలల క్రితం వరకూ ఇంజెక్షన్లు బెంగుళూరు నుంచి తెప్పించేవారు.

"డబ్బులు లేక ఇంజెక్షన్లు తెప్పించడం ఆలస్యం అయినప్పుడు పాపకు ఫిట్స్ వచ్చేవి. ఒకసారి అలా అయినప్పుడు ఒక వ్యక్తి బెంగుళూరు నుంచి ఇంజెక్షన్లతో బయలుదేరితే, ఇక్కడ ఫిట్స్ వచ్చిన పాపను తీసుకుని ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లోని శ్రీనివాసపురం వరకూ వెళ్లి దారి మధ్యలోనే రోడ్డుపక్కన ఇంజెక్షన్ వేయించుకొని ఇంటికి తీసుకువచ్చాం" అని పరిస్థితి వివరించారు పాప పెద్దమ్మ.

వీరి బాధ చూసిన స్థానిక మందుల దుకాణం యజమాని, ఆ ఇంజెక్షన్లు వీరికోసం తెప్పించి సహకరిస్తున్నారు.

పాపకు రోజూ నాలుగు సార్లు ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, రాత్రి 12 గంటలకు షుగర్ లెవెల్స్ చూసి పుస్తకంలో రాయాలి. ఆ షుగర్ లెవెల్ చూశాక ఇంజెక్షన్లు చేయాలి.

"సాధారణంగా 75- 80 మధ్య ఉండాల్సిన షుగర్, 20కు, అంత కంటే తక్కువకూ పడిపోతుంది. అప్పుడు పాప ఎలానో అయిపోతుంది. కండ్లు తేలేస్తుంది. పిలిచినా పలకదు. చెమటలు పట్టి, వణుకుతుంది. కడుపు ఉబ్బిపోతుంది. ఒక్క గుండె మాత్రమే కొట్టుకుంటుంది. దేవుడు మాకు పిల్లలను ఇచ్చిన సంతోషం లేకుండాపోయింది. ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నాం. చాలా నరకం అనుభవించాం. పాప ఇంత గోసపడుతోంది. చనిపోవాలనుకున్నాం. పాప గోస చూసి ఉండలేకపోయాం. ఆశలన్నీ పాపపైనే ఉన్నాయి. ఆడపిల్లంటే మా ఇంటిమొత్తానికి ప్రాణం" అన్నారు షబానా.

ఆర్థిక సమస్యలు

"పాపకు నెలా నెలా చెకప్ కోసం బెంగళూరు వెళ్లాలి. పోయిన నెల డబ్బుల్లేక వెళ్లలేదు. మొదటి మూడు నెలలూ ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఉచితంగా చూశారు. డాక్టర్లు చాలా బాగా చూశారు. కానీ, మందులు బయటే కొనాలి. మొదట్లో ఇంజెక్షన్లకు రోజుకు 3 వేల రూపాయలు అవుతుండేవి. తరువాత, ఒక ఇంజెక్షన్ 600 రూపాయల చొప్పున రోజుకు నాలుగింటికీ కలపి 2,400 రూపాయలు పెట్టాలి. ఇప్పటి వరకూ ఇల్లూ, బంగారం అన్నీ అమ్మేసి, నేను మా అన్నయ్య, మా నాన్న కలిపి అప్పులు తెచ్చి 12 లక్షల రూపాయల దాకా పెట్టాం. అప్పులు చేస్తూ ఇంజెక్షన్లు తెచ్చుకుంటున్నాం. వడ్డీలు కట్టలేకపోతున్నాం" అని పాప తండ్రి బావాజాన్ చెప్పారు.

బావాజాన్ చికెన్ షాపులో మాంసం కొట్టే పనిచేస్తారు. దానికి రోజుకు 300 రూపాయల కూలీ వస్తుంది. ఆయన అన్న, తండ్రి చిరు వ్యాపారాలు చేస్తారు. వారిద్దరూ కలసి బావాజాన్‌కు చాలా సాయం చేశారు. ఇప్పుడు వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చారు.

"రోజుకు 2,400 రూపాయలు పెట్టి నాలుగు ఇంజెక్షన్లు కొనే స్థోమత లేక పాపకు ఇవ్వాల్సిన మందు మోతాదు తగ్గించాం. డాక్టర్ చెప్పినదాని కంటే తక్కువ డోస్ ఇస్తున్నాం. రెండు ఇంజెక్షన్ల స్థానంలో ఒక ఇంజెక్షన్ ఖర్చుతో సరిపెడుతున్నాం" బావాజాన్ చెప్పారు.

కారుణ్య మరణం

"పెద్దవాళ్లం మనమే ఇంజెక్షన్ చేస్తే బాధ పడతాం. అలాంటిది రోజుకు ఎనిమిది సూదిపోట్లతో మా పాప ఎంత బాధపడాలి? నాకే చచ్చిపోవాలనిపించింది. ఇది ఎవరో చెప్పింది కాదు. అది పాపకూ నరకం. మా వల్ల తల్లితండ్రులూ నరకం చూస్తున్నారు. మా నాన్న, అన్న మా గురించి అప్పుల పాలైపోయారు. వాళ్లకు భారం అయ్యాం" అంటూ బావాజాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

"గతంలో ఎవరో ఇలా పిటిషన్ వేశారని తెలుసు. ఫ్రెండ్సును పిటిషన్ గురించి అడిగితే కోర్టు దగ్గరకు వెళ్లమన్నారు. అక్కడ అర్జీలు రాసే వారి చేత పిటిషన్ రాయించాను. లాయర్లు పెట్టుకోలేని వాళ్ల కోసం ఉదయం పూట కోర్టులో పిలుస్తారు. ఈనెల 9న అక్కడకు వెళ్లి జడ్జిగారికి అర్జీ ఇస్తే, ఆయన చూసి ఇది చిత్తూరు కోర్టులో ఇవ్వాలి, ఇక్కడ తీసుకోము అన్నారు. మాకు చిత్తూరుకు వెళ్లే స్తోమత కూడా లేదు. మూడు పూటలు కాదు, రెండు పూటలే తింటాం. ఒక పూట పస్తుంటాం. ఒకపూట మా తిండికి అయ్యే డబ్బు పాప పాలకు పనికొస్తాయని. ఇంక ఊరుకుని కోర్టు నుంచి బయటకు వస్తున్నాం. మేం బయటకు వచ్చినప్పుడు మమ్మల్ని చూసి కొందరు మీడియా వాళ్లు పలకరించారు" అని వివరించారు తల్లి షబానా.

"మందుల షాపాయన చాల మంచివాడు. బెంగళూరు వెళ్లే పనిలేకుండా ఇంజెక్షన్లు తెప్పిస్తున్నారు. చాలా మంది సాయం చేశారు. కొందరు మా బాధ చూసి వడ్డీ అక్కర్లేదు అన్నారు. అయినా, ఇప్పటికే ఐదారు లక్షలు అప్పు చేసేశాం. ఇక నావల్ల కాదని చేతులు ఎత్తేశా. మా పెద్ద కొడుకూ ఎంతో చేశాడు. మా వాడే (పాప తండ్రి) వాళ్లనీ వీళ్లనీ అడిగి ఏవో బాధలు పడుతున్నాడు" అంటూ వివరించారు తాత ఆయూబ్ ఖాన్.

పాప తల్లి ఇంటర్ చదువుకుని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేశారు. దీంతో ఇంజెక్షన్ చేయడం పాప తల్లికే నేర్పించారు బెంగళూరు వైద్యులు. వారి ఇంటిలో ఒక ట్రే నిండా వాడేసిన ఇంజక్షన్లు కనిపిస్తున్నాయి.

"నాకు గతంలో ఇద్దరు బిడ్డలు ఇదే సమస్యతో పుట్టిన 20 రోజుల్లోపే చనిపోయారు. నేను చేయగలిగినదంతా చేశాను. తెలిసిన వారందరినీ సాయం అడిగాను. అడుగుతున్నాను. తంబళ్ళపల్లె ఎమ్మెల్యే, మదనపల్లె ఎమ్మెల్యే సాయం చేస్తామన్నారు. బి. కొత్తకోట ఎమ్మార్వో మా పిటిషన్ తీసుకున్నారు. అందరూ ఏదో ఒకటి చేస్తారని ఆశతో ఉన్నాం" అని తండ్రి బావాజాన్ అన్నారు.

"మాకేమీ అక్కర్లేదు. ఇల్లు వద్దు. డబ్బు కూడా వద్దు. ఎక్కడైనా మంచి ఆసుపత్రిలో పాపను చూపించి, ఆమెకు మంచి మందులు ఇప్పిస్తే చాలు. ఆడపిల్లంటే మాకు ప్రాణం సార్. పాప బాగుంటే చాలు. పాప బాగుంటే ఏ చెట్ల కిందైనా బతుకుతాం" అంటూ కన్నీరు పెట్టుకుంది పాప తల్లి షబానా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)