టీఎస్ఆర్టీసీ సమ్మె: ‘కడుపు కాలే రోడ్లపైకి వచ్చాం.. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి మా సమ్మె నాంది కావాలి’ - అభిప్రాయం

  • 14 అక్టోబర్ 2019
టీఎస్ ఆర్టీసీ

ప్రస్తుతం ఆర్టీసీలో సమ్మె జరుగుతోంది. ఆ సమ్మెకు కార్మిక సంఘాలదే బాధ్యత అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. ఈ సందర్భంలో ప్రజల ముందు కొన్ని విషయాలు ఉంచాలనుకుంటున్నాం.

మేం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటున్నాం. నిజానికి ప్రభుత్వంలో విలీనం అయితే మా పలుకుబడి తగ్గిపోతుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ చట్టం కార్మికులకు వర్తించదు. మా యూనియన్ల బలం తగ్గినా ఇలా చేయమని అడుగుతున్నామంటే పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు.

నష్టాలకు అసలు కారణాలేంటి?

2014లో ఆర్టీసీలో 57 వేల మంది కార్మికులు ఉండేవారు. మేం చేసే పనిని, అంటే మా ఉత్పత్తిని మొత్తం బస్సులు తిరిగిన కిలోమీటర్ల దూరంతో కొలుస్తారు. 57 వేల మంది కార్మికులు 2014లో 125 కోట్ల కిలోమీటర్ల దూరం బస్సులు నడిపాం. ఇప్పుడు 6 వేల మంది రిటైరయ్యారు. కొత్తగా ఒక్కరినీ తీసుకోలేదు. అలాంటప్పుడు ఆ మేరకు ఉత్పత్తి తగ్గాలి కదా. కానీ పెరిగింది. ప్రస్తుతం 50 వేల మంది కార్మికులు ఉండగా 132 కోట్ల కి.మీ. దూరం బస్సులు తిప్పారు. అంటే మేం మరింత కష్టపడుతున్నాం. అయినా నష్టాలు వస్తున్నాయంటే కారణం ప్రభుత్వ వైఫల్యమే తప్ప కార్మికులు కాదు. మరి మాపై నింద ఎలా వేస్తారు?

దూర ప్రాంత డ్యూటీలు చేసినప్పుడు ఇచ్చే విశ్రాంతి తగ్గించారు. కొన్ని దూర ప్రాంత ట్రిప్పులు వేస్తే డ్రైవర్, కండక్టర్లకు ఇన్ని రోజుల ఆఫ్ (ఆన్ డ్యూటీ) అని ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి బెంగళూరు బస్సు వెళ్తుంది. అక్కడకు వెళ్లి మళ్లీ తిరిగి రావాలి. ఆ ట్రిప్పు 8 గంటల్లో ముగియదు కాబట్టి, ఆ ట్రిప్పు నిరంతరంగా చేసినందుకు తరువాత మరో డ్యూటీ లేదా రెండు డ్యూటీలు ఆన్ డ్యూటీ కింద ఇస్తారు. కానీ ఇప్పుడా నిడివి బాగా తగ్గించారు. నాలుగు డ్యూటీలు ఇచ్చేచోట మూడు, మూడు ఇచ్చే చోట రెండు, రెండు ఇచ్చే చోట ఒకటి ఇస్తున్నారు.

దీంతో కార్మికులపై భారం, ఒత్తిడి పడింది. అయినా మేం కష్టపడుతున్నాం. స్పెషల్ ఆఫ్ డ్యూటీ కింద 14 గంటలు నిరంతరం పనిచేస్తే సెలవు ఇచ్చేవారు. దాని బదులు ఓటీ ఇస్తున్నారు. సిటీలో తప్ప మహిళా కండక్టర్లకు ఎక్కడా 8 గంటల్లో డ్యూటీ ముగియడం లేదు.

కండక్టర్లుగా పనిచేస్తున్న తల్లులు పిల్లలకు పాలివ్వకుండా 8 గంటలు కంటే ఎక్కువ సేపు ఉండాల్సిన పరిస్థితి ఉంది.

మండు వేసవిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కండక్టర్లు డబుల్ డ్యూటీలు చేశారు. వడదెబ్బకు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇదంతా సంస్థ కోసమే కదా?

మేం ఇంత కష్టపడుతున్నా, మూసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. వరంగల్ టైర్ల బటన్ షెడ్ మూసేశారు. ప్రైవేటు వారికి టెండర్లు ఇచ్చారు. ప్రింటింగ్ ప్రెస్ మూసేశారు. కళాభవన్ ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారు. సెక్యూరిటీ ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారు. డిపో ఆడిట్ ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారు. తెలంగాణ తెచ్చుకున్నది ఇదంతా ఔట్ సోర్స్ చేయడానికేనా? ఇప్పుడు ఏకంగా బస్సులే ఔట్ సోర్సింగ్ అంటున్నారు.

అసలు నష్టాలకు కారణం కార్మికులు ఎలా అవుతారు? మేమే నష్టాలకు కారణం అయితే ఇన్ని అవార్డులు ఎందుకు వస్తాయి? మేం పనిచేయకుండానే ఆర్టీసీకీ తక్కువ ప్రమాదాల విషయంలో, ఇంధన పొదుపు విషయంలో అవార్డులు వస్తాయా? మేం పనిచేస్తున్నాం కాబట్టే అవార్డులు వస్తున్నాయి. మీరు కావాలంటే ఏ నిపుణులు కమిటీ అయినా వేయండి.

పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఎంత కష్టపడి అయినా పనిచేస్తాం. నష్టాలకూ, లాభాలకూ కారణం మేమా? ప్రభుత్వ విధానాలు కారణం. దానికి మేమెలా బాధ్యులం?

ప్రభుత్వం నుంచి ఎంత రావాలి?

ప్రభుత్వం ఆర్టీసీకి రీయెంబర్సుమెంటు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. బడ్జెట్లో ప్రకటిస్తున్న ఇవ్వాల్సినంత కాకుండా సగం ఇస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ. 2100 కోట్లు రావాలి. ఆ విషయం మాట్లాడరు. సిటీలో వచ్చే నష్టాలకు జీహెచ్ఎంసీ నుంచి పరిహారం ఇస్తారు అని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఆయన కుమారుడు కేటీఆర్ వచ్చిన తరువాత జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం చేసి మేం ఇచ్చేదిలేదని తేల్చేశారు. అసెంబ్లీ‌లో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు విలువ ఎక్కువా? జీహెచ్ఎంసీ స్టాండిగ్ కమిటీ తీర్మానం విలువ ఎక్కువా?

Image copyright TRSPARTYONLINE/FACEBOOK

'కేసీఆర్ మాట నిలబెట్టుకోలేదు'

ప్రభుత్వాలు మాకేం చేయడం లేదు. మేమే ప్రభుత్వానికి చేస్తున్నాం. మేం ఏటా వెయ్యి కోట్లు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. తెలంగాణ వచ్చాక ఐదారు వేల కోట్ల రూపాయలు పన్నులుగా కట్టాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రమాణం చేయకముందు మేడ్చల్ మీటింగులో మేం వెళ్లి కలసి కేసీఆర్ గారికి ఒక ఫైల్ ఇచ్చాం. అందులో అనేక విషయాలు చెప్పాం. ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ వేటినీ అమలు చేయలేదు. ఆర్టీసీ మీద రూ. 190 కోట్ల భారం తగ్గిస్తాం. డబ్బు రైటాఫ్ చేయిస్తాం. మిగులు బడ్జెట్ రాష్ట్రం కదా అన్నారు. కానీ మాట నిలబెట్టుకోలేదు.

ఆర్టీసీ బస్సులు రోజుకు 36 లక్షల కి.మీ. తిరుగుతాయి. అంటే 7 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. ఏడాదికి సుమారు 25 కోట్ల లీటర్లు డీజిల్ కావాలి. అంటే డీజిల్ ఒక్క రూపాయి ధర పెరిగినా, ఆర్టీసీపై ఏడాదికి రూ. 25 కోట్లు అదనపు భారం పడుతుంది. ఈ ఐదేళ్లలో డీజిల్ ధర ఎంత పెరిగింది? ఆ భారం ఎవరు భరించాలి. టికెట్ రేట్లు పెంచాలి. అందుకు అంగీకరించరు. మరి మేం ఎక్కడి నుంచి తేవాలి? ప్రజలపై భారం పడకూడదు అనుకున్నప్పుడు, దానికి తగ్గట్టు ప్రభుత్వం భరించాలి కదా? తమిళనాడు, కేరళల్లో డీజిల్ భారం ఆర్టీసీలపై పడకుండా సబ్సిడీ ఇస్తున్నారు. ఇక్కడా ఇవ్వండి.

ఈ ప్రభుత్వం ఆర్టీసీపై నిపుణుల కమిటీ ఒకటి వేసింది. 16 నెలలైనా ఆ కమిటీ రిపోర్టు తీసుకునేవారే లేరు. అద్దె బస్సులకు రీటెండరింగ్, డీజిల్ ఇన్సెంటివ్ విధానం ద్వారా సంస్థకు నష్టం వస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కేంద్ర విధానాల వల్ల నష్టం వస్తుంది. ఆ బస్సుల నష్టాలు పూడ్చడానికా ఆర్టీసీ ఉన్నది?

సిబ్బంది తగ్గినా అంతర్గత సామర్థ్యం పెంచుకుంటున్నాం. ఈ ఐదేళ్లలో రిటైర్ అయిన 6 వేల మంది స్థానంలో కొత్త వారిని నియమించలేదు. ఆ మేరకు జీతం మిగులే కదా? పెరిగిన డీజిల్ భారం భరించి ఉంటే ఇప్పడు ఆర్టీసీకి ఇంత నష్టం ఉండేదా? సీఎం ఆర్టీసీకి ఏదీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. 13.5.2015 నాటికి ఉన్న నష్టాలు తగ్గించుకున్నాం. డీజిల్ డబ్బు ఇవ్వండి చాలా ఆర్టీసీ నష్టాలు తగ్గుతాయి.

ఇక ఉద్యోగ భద్రత కావాలి అంటున్నాం. చాలా చిన్న తప్పులకు ఆర్టీసీలో ఉద్యోగాలు పోతాయి. ఆ పరిస్థితి ఆంధ్రలో ఇటీవల మారింది. ప్రతి చిన్న తప్పును కారణంగా చూపించి ఉద్యోగం తీసేయకుండా, కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. వాటి ప్రకారం చర్యలు తీసుకోవాలంటున్నాం. మాకు ఉద్యోగ భద్రత కావాలి అంటున్నాం. దగ్గినా తుమ్మినా ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది.

Image copyright Getty Images

‘ఉద్యోగులు దాచుకున్న డబ్బూ వాడుకున్నారు’

ఆర్టీసీ సిబ్బంది క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ ఆసియాలోనే పెద్దది. ఆర్టీసీ సిబ్బంది చిన్న మొత్తాల్లో జీతంలోంచి నగదు తీసి ఆ సొసైటీలో డిపాజిట్ చేసేవారు. అవసరాలు ఉన్నప్పుడు అందులో నుంచి లోన్ తీసుకునేవారు. గతంలో లోన్ కావాలని దరఖాస్తు చేస్తే వెంటనే ఫలానా రోజు డబ్బు వస్తుందని చెప్పి చెక్కులు ఇచ్చేసేవాళ్లు. కానీ యాజమాన్యం ఇప్పుడు ఆ సొసైటీ డబ్బు సుమారు రూ.550 కోట్లు వాడుకుంది. దీంతో ఇప్పుడు అవసరాలకు డబ్బు అందడం లేదు. దీనివల్ల ప్రయోజనం లేదని చెప్పి కార్మికులు సొసైటీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. జీతం సమయానికి రాక, బాకీలు కట్టలేక సిబిల్ స్కోరుపోతోంది. సొసైటీ సరిగా లేక బయట అప్పులకు వెళ్లాల్సి వస్తోంది. వడ్డీల బారిన పడుతున్నాం. అంతేకాదు సొసైటీ సొమ్ము యాజమాన్యం వాడుకోవడం వల్ల ప్రతీ షేర్ హోల్డరూ దాదాపు రూ.10 వేల వరకూ నష్టపోయాం.

కార్గో సర్వీసులు ప్రారంభించాలని మేమే కోరాం. మాకు మౌలిక వసతులు ఉన్నాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఆర్టీసీకి కాస్త స్థలం లేదా చిన్నదో పెద్దదో గదులు ఉన్నాయి. పాత బస్సులను అధికారులు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. దానికి కొద్ది రేకులు కొడితే గూడ్సు బండిగా ఉపయోగపడుతుంది.

పెట్రోలు పంపులు మేఘా సంస్థకు ఇచ్చారు. మొత్తం తీసుకునే శక్తి లేదు మాకు. బయో డీజిల్ స్కాం గురించి వార్తలు వచ్చినా విచారణ జరగలేదు. ప్రైవేటు ఆపరేటర్లు బయో డీజిల్ వల్ల బస్సు పాడువుతందని ఆపేశారు. మరి ఆర్టీసీ బస్సులు చెడిపోవా? ఈ విషయంలో వందల కోట్ల స్కాం జరిగింది.

చాలా మంది రిటైరైన కార్మికులకు సెటిల్మెంట్లు కూడా చేయలేదు. 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ సెటిల్మెంట్ కాని కార్మికులు ఉన్నారు. గట్టిగా అడిగితే డబ్బు లేదంటున్నారు. సకల జనుల సమ్మె తరువాత తెలంగాణ ప్రభుత్వం వచ్చేలోపు రిటైర్ అయిన వారికి కనీసం సకల జనుల సమ్మె కాలం జీతాలు కూడా అందలేదు.

ఆంధ్రలో వారికి కొత్త జీతాలు వచ్చాయి. మాకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయంలో పక్క రాష్ట్రంతో పోల్చుకుంటోంది. అభివృద్ధిలో పోల్చుకుంటోంది. మరి మాకు మాత్రం పక్క రాష్ట్రంతో పోలిక ఉండదా? నిన్నటి దాకా కలిసున్నాం. ఇంకా పూర్తిగా విడిపోలేదు కూడా. జీతాల విషయంలో వారికీ మాకు ఎంతో తేడా ఉంది.

Image copyright Getty Images

సమ్మె అప్పటికప్పుడు చేశామా?

ఈ సమ్మె నోటీసు హడావుడిగా ఇచ్చింది కాదు. ఎప్పుడో ఇచ్చాం. కార్మిక సంఘాలన్నీ కలిసి 26 డిమాండ్లు పెట్టాం. వాటిలో చాలా వరకూ చర్చల్లో పరిష్కారమయ్యేవే. కానీ చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నాలు చేయలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎండీ తరువాత స్థాయి అధికారి అయిన ఈడీలు చర్చలు జరుపుతారు. అప్పుడు ఐదారు డిమాండ్ల వరకూ పరిష్కారం అవుతాయి. ఇక ఎండీ దగ్గర ఒకట్రెండు డిమాండ్లు పరిష్కారం అవుతాయి. తరువాత మంత్రి స్థాయిలో కొన్ని పరిష్కారం అవుతాయి. కానీ ఇప్పుడలా కాదు. అసలు చర్చల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు.

ఐఏఎస్‌ల కమిటీ వేశాం అన్నారు. 26 అంశాలపై నోట్ ఇవ్వాలని మాత్రమే ఆ కమిటీకి సూచించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం కానీయలేదు. మేం అడిగినప్పుడు కూడా ఆ కమిటీ సభ్యులు ఒకటే చెప్పారు. 26 సమస్యలపై ప్రభుత్వానికి నోట్ ఇమ్మన్నారు. ఇస్తాం. అంతే. అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. త్రిసభ్య కమిటీకి చిత్తశుద్ధి లేదు. మేం చర్చలు జరిపినా వినలేదు అని చెప్పడానికే ఇదంతా.

వ్యాట్ తగ్గించండి. డీజిల్ డబ్బు ఇవ్వండి. రీయెంబర్సుమెంటు ఇవ్వండి. జీతాలివ్వండి. అని ఎందుకు అడగాలి? జీతాలు రాక, అప్పులు పుట్టక, మాతప్పు లేకుండా ఇదంతా ఎందుకు భరించాలి? అందుకే ఇవన్నీ వద్దు విలీనం చేసేయండి అంటున్నాం. మా తప్పుంటే చెప్పండి, బహిరంగ చర్చకు రండి. ఊరికే అవి ఇవ్వండి. ఇవి ఇవ్వండి అని అడగడం. జీతాల్లేవు. ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం లేదు అని బాధపడడం.. ఇవన్నీ ఎందుకు? విలీనం చేసేయండి. ఇదేమీ కొత్త డిమాండు కాదు. 2013 అక్టోబరులో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై 'జీవో 961' వచ్చింది. కమిటీ వేశారు. తెలంగాణ విడిపోవడంతో ఆ ఫైల్ పెండింగ్‌లో పడింది. ఇది కొత్త కోరిక కాదు, గతంలో అంగీకరించి అమలు చేయని కోరిక మాత్రమే. ఇవన్నీ మాకెందుకు. ప్రభుత్వంలో కలిపేస్తే ఒకటవ తారీఖున జీతం వస్తుంది. పెన్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మా కార్మిక సంఘాలకు కొంత నష్టం జరగొచ్చు, కార్మిక సంఘాల బలం తగ్గవచ్చు. కానీ కార్మికులను విలీనం చేస్తే మేలు జరుగుతుందనే నమ్మకంతోనే అలా కోరుకుంటున్నాం.

సకల జనుల సమ్మెలో రాత్రి ఫోన్ చేసి పొద్దున్నే బస్సులు ఆపమంటే ఆపాం. ఆఖరికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఏడు మండలాల విషయంలో రెండు రోజులు సమ్మె చేయాలంటే చేశాం. అప్పుడు ఆ సమ్మెలు చట్టబద్ధమైనప్పుడు ఈ సమ్మె ఎందుకు చట్టవిరుద్ధమవుతుంది? ఎవరు మర్చిపోయారు? ఆర్టీసీ కార్మికుల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తా అన్న కేసీఆర్ ఇప్పుడు అసలు వారికి ప్రశ్నించే హక్కే లేదంటారా? ఉద్యమంలో ఆయనెంతో మేమూ అంతే.

ఇప్పుడు కూడా మేం చెప్పేది ఒకటే. బహిరంగ చర్చకు రమ్మంటున్నాం. మా తప్పు ఉంటే మారుతాం. 3వ తేదీ ఇవ్వాల్సిన జీతం ఈ నెల ఇంకా ఇవ్వలేదు. మమ్మల్ని భయపెట్టారు. కానీ ఎవరూ భయపడలేదు. ఎందుకంటే ఇది యూనియన్లు చేస్తోన్న సమ్మె కాదు. కార్మికులు క్షేత్ర స్థాయి నుంచి చేస్తున్న సమ్మె. ఇప్పుడు కేసీఆర్ మాటకు విలువలేదు. కార్మికులు ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదు. వర్క్ లోడ్ పెరగడంతో కార్మికుల నుంచే మొదలైన సమ్మె ఇది.

ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలతో గందరగోళం చేస్తున్నారు. డిపో మేనేజర్ ర్యాంకు వదిలి పెట్టండి, ఆ తరువాత ఉండే అసిస్టెంట్ మేనేజర్ స్థాయి నుంచి శ్రామిక్ స్థాయి వరకూ ఉన్నవారి సగటు జీతం రూ. 50 వేలు ఉందని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు సమ్మె ఆపేస్తాం. ఇక ఉద్యోగాల తీసివేతపై ఎక్కడా లిఖితపూర్వకంగా లేదు. మాకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తే అప్పుడు మాట్లాడతాం.

మేం ప్రజలను కోరేది ఒక్కటే. మీ పిల్లలకు ఉద్యోగాల కోసం మా ఆందోళన. ప్రజా రవాణాను రక్షించడం కోసం మా ఆందోళన. రెండు రోజుల సమ్మెలోనే ఇంత దోపిడీ చేస్తున్నారు. మొత్తం ప్రైవేటు అయితే ఎంత దోపిడీకి గురవుతారు? ఇప్పుడు ఓపిక పడితే మిగిలిన 360 రోజులూ లాభపడతారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం చేరుకోవడంలో వైఫల్యం చెందాం. బంగారు తెలంగాణ కాదు. బతుకు తెలంగాణ కావాలి. తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ ఉద్యమం నాంది కావాలి.

వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. 13 వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటిపై వాళ్ల కన్ను పడింది. యూనియన్లలో చేరకుండా ఉంటే ఉద్యోగం ఇస్తారట. మరి టీఆర్ఎస్ అనుబంధ సంఘం కూడా మూసేస్తారా? మాకేం భయం లేదు. కావాలంటే కేసులు పెట్టుకోండి. రైడింగులు చేసుకోండి. కేసీఆర్ తన జీతం పెంచుకోవచ్చా? దేశంలో ఏ సీఎంకూ లేనంత జీతం ఆయనకెందుకు? ఆయనకన్నీ కావాలి. మేం అడిగితే తప్పా? వాస్తవానికి ప్రభుత్వం మనసులో ప్రైవేటీకరణ ఉంది. దానికోసమే తొందర పడుతోంది.

(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

గోటాబయ రాజపక్ష: "ఆయన విజయంతో భారత్-శ్రీలంక సంబంధాల్లో మార్పేమీ రాదు"

‘హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన లేదు’

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థుల కారాగారం... నేడు పర్యటకుల స్వర్గధామం

లవ్ జిహాద్ కేసు: ఇబ్రహీం-అంజలి జంట తమ ఇష్టప్రకారం జీవించవచ్చన్న హైకోర్టు

శ్రీలంక ఎన్నికలు: అధ్యక్షుడిగా ఎన్నికైన రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటాబయ రాజపక్ష

రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్

పంజాబ్, హ‌రియాణా పొలాల పొగ దిల్లీని క‌మ్మేస్తుంటే ఏపీ రైతులు ఏం చేస్తున్నారు