లింగమార్పిడి రచయిత్రి రేవతి: అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ ముఖద్వారంపై మెరిసిన పేరు

  • 16 అక్టోబర్ 2019
ఎ. రేవతి

తమిళ సాహిత్య రంగంలో లింగ సమానత్వం లేదని, పురుష రచయితలకు లభించే గుర్తింపు మహిళా రచయితలకు ఇవ్వరని చెబుతుంటారు. కానీ, ట్రాన్స్ వుమన్, రచయిత ఎ.రేవతి అలాంటి చోటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అమెరికాలోని ప్రతిష్ఠాత్మక కొలంబియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో మాయ ఏంజెలో, టోనీ మోకి,న్, మార్మన్ సిల్కో, చేంజ్ పేర్ల సరసన ఆమె పేరును చేర్చారు.

కొలంబియాలోని బట్లర్ లైబ్రరీ ముఖద్వారం వద్ద మంది అరిస్టాటిల్, ప్లేటో, హోమర్, డెమోస్టెనెస్, సిసిరోతో పాటు మొత్తంగా 8 మంది పురుష రచయితల పేర్లు ఉన్నాయి. మహిళా రచయితల పేర్లు కూడా చేర్చాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

అయితే, 1989లో అక్కడి విద్యార్థులు పురుష రచయితల పేర్లకు పైన మహిళా రచయితల పేర్లను రాసి ప్రదర్శించారు. కానీ, కొద్ది రోజుల్లోనే యాజమాన్యం ఆ పేర్లను తొలగించింది.

దాదాపు 30 ఏళ్ల తరువాత, మహిళా హక్కుల నిరసన జ్ఞాపకార్థం, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన మహిళా రచయితల పేర్లతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించారు. ఆ బ్యానర్‌లో తమిళనాడుకు చెందిన ట్రాన్స్ వుమన్, రచయిత ఎ.రేవతి పేరును కూడా చేర్చారు.

ఈ విషయంపై ఎ. రేవతితో బీబీసీ మాట్లాడింది.

ఇంతకీ రేవతి ఎవరు?

"రేవతి ఎవరని మీరు అడిగారు. కానీ, నాలోని రేవతిని తెలుసుకోవడానికి, నేను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది" అని ఆమె చెప్పారు.

తమిళనాడులోని నమక్కల్ జిల్లాలో దురైసామిగా జన్మించిన రేవతి అయిదో తరగతి చదువుతున్నప్పుడు తనలోని లైంగిక పరమైన మార్పులను గమనించింది.

స్కూల్‌లో చాలా మంది ఎగతాళి చేశారు. ఆటపట్టించారు. తల్లిదండ్రులు, సోదరుల నుంచి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

చివరకు ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి దిల్లీ, ముంబయిలలో తిరిగింది. సమాజం ఆమెను చిన్నచూపు చూసింది. అనేక ఇబ్బందులకు గురి చేసింది. ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొనే అన్ని సమస్యలను ఆమె ఎదుర్కొన్నారు.

రేవతి 1999లో బెంగళూరులోని సంగమా సంస్థలో చేరారు.

''మీరు ఇప్పుడు చూస్తున్న రేవతిని సంగమా లైబ్రరీయే తీర్చిదిద్దింది. నాకు సాహిత్యం మీద పెద్దగా పట్టు లేదు. వాస్తవానికి, నేను అంతగా చదవలేదు. భాష గురించి నాకు భయాలు ఉన్నాయి. ప్రతి దాన్నీ పవిత్రంగా చేసిన సమాజం భాషను కూడా పవిత్రమైన స్థాయిలో ఉంచింది. ఈ పవిత్రతను ఎలా ఎదుర్కోవాలనే భయం నాకుండేది'' అని రేవతి చెప్పారు.

''సంగమాలోని లైబ్రరీ నాకు అద్భుతమైన పఠనానుభవాన్ని ఇచ్చింది. నేను అక్కడ చాలా పుస్తకాలు చదివాను. అవి నాలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తాయి. ట్రాన్స్‌జెండర్ల బాధను వివరించే పుస్తకాలు ఇంగ్లిష్ చాలా ఉన్నాయి. కానీ, భారతీయ దృక్కోణం నుంచి వచ్చిన పుస్తకాలు లేవు. ఈ ప్రశ్నే నన్నూ ఒక పుస్తకం రాయడానికి పురికొల్పింది. కానీ, మొదట నేను కాస్త సంశయించాను. ఆ సమయంలో రచయిత బామా నాకు మద్దతిచ్చారు. నన్ను రాసేలా ప్రోత్సహించారు'' అని ఆ రోజులను రేవతి గుర్తు చేసుకున్నారు.

తొలి రచన

2004లో రేవతి తన మొదటి పుస్తకం ''ఉనారువం ఉరువామ్'' రాశారు. భారతదేశంలో ట్రాన్స్ విమెన్ గురించి ట్రాన్స్ వుమన్ రాసిన తొలి పుస్తకం ఇది.

ట్రాన్స్ వుమన్ జీవితం ఎలా ఉంటుంది? సమాజం వారిని ఎలా చూస్తుంది? ఇలా ట్రాన్స్ మహిళ కోణం నుంచి వారి హక్కులకు సంబంధించి ఈ పుస్తకం చాలా చర్చను లేవదీసింది. ఈ పుస్తకానికి చాలా అవార్డులు కూడా వచ్చాయి.

''నేను పుస్తకం రాసినప్పటికీ, దానిలోని భాష, సాహిత్యం గురించి చాలా సంశయించాను. ఆ సమయంలో, పెంగ్విన్ పబ్లిషర్స్ ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో అనువదించడానికి అనుమతి కోరింది. ఇది నాకు నమ్మకాన్ని కలిగించింది. దీంతో నేను నా ఆత్మకథను రాస్తాను, మీరు ప్రచురిస్తారా అని వారిని అడిగాను. దానికి వారు అంగీకరించారు. దీంతో ''ది ట్రూత్ అబౌట్ మీ: ఏ హిజ్రా లైఫ్ స్టోరీ'' పుస్తకం బయటకు వచ్చింది.

తన ఆత్మకథ మొదట ఇంగ్లిష్‌లోనే ఎందుకు విడుదలైందో కూడా ఆమె వివరించారు.

''నా జీవితంలో జరిగిన విషయాలను ఏదీ దాచకుండా రాశాను. ఒక వేళ ఈ పుస్తకం నేరుగా తమిళంలోనే విడుదలయితే ప్రజలు చదవడానికి కాస్త ఇబ్బందిపడేవారు. అందుకే తొలిగా ఇంగ్లిష్‌లో విడుదల చేశాం. ఇక్కడో చిత్రమైన విషయం ఏమిటంటే నాకు ఇంగ్లిష్ రాదు'' అని ఆమె చెప్పారు.

ప్రజలు నుంచి మద్దతు రావడంతో పాటు పుస్తకాన్ని తమిళంలో విడుదల చేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన తరువాత ఆమె ఈ పుస్తకాన్ని తమిళంలో ''వెల్లై మొళి'' గా విడుదల చేశారు.

రచయిత పెరుమాళ్ మురుగన్ తన రచనను మెరుగుపరచడానికి సహాయపడ్డారని ఆమె చెప్పారు. ''మా ఇళ్లు దగ్గర్లోనే ఉండేవి. నేను తరచూ ఆయనను కలుస్తుంటాను. మేము చాలా విషయాలు చర్చిస్తాం. నా రచనలను ఎలా మెరుగుపరచాలో ఆయన సూచనలు ఇస్తారు'' అని రేవతి తెలిపారు.

కొలంబియాలో గుర్తింపు

కొలంబియా లైబ్రరీలో తన పేరు చేర్చిన విషయం రెండు రోజుల తర్వాత ఆమెకు తెలిసింది.

''అక్కడ పీహెచ్‌డీ చేస్తున్న కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక స్నేహితుడు ఈ విషయం నాకు చెప్పారు. మొదట్లో దాని ప్రాముఖ్యం నాకు తెలియదు. 30 ఏళ్ల కిందట జరిగిన మహిళా రచయితల గురించి, నిరసనల గురించి నాకు తెలిసింది. నేను నిజంగా చాలా గర్వంగా భావించాను'' అని రేవతి చెప్పారు.

''నేను నిజంగా అక్కడికి వెళ్లి నా పేరును చూడాలనుకుంటున్నాను, కానీ, వెళ్లడానికి డబ్బు లేదు'' అని ఆమె చెప్పారు.

నాటక రంగంలో

రేవతి నాటక రంగంలో ఉన్న శ్రీజిత్, మంగైలతో కలిసి పనిచేస్తున్నారు.తన జీవిత కథను ఆమె ఏకపాత్రాభినయంతో ప్రదర్శించారు. 30 కంటే ఎక్కువ సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు.

"మా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాయడం, నాటకాలు వేయడం ఉత్తమ మార్గాలు. ఈ రెండింటినీ బాగా ఉపయోగించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను'' అని ఆమె చెప్పారు.

''లింగమార్పిడి గురించి సమాజం అభిప్రాయాలు కొద్దిగా మారిపోయాయి. కానీ, అది సరిపోదు. ఆర్టికల్ 377 కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆశాజనకంగా ఉంది. అయితే, మనం ఇంకా చాలా దూరం వెళ్లాలి'' అని ఆమె తేల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)