తెలంగాణ ఆర్టీసీ సమ్మె: వెంటనే చర్చలు ప్రారంభించండి - ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు హైకోర్టు ఆదేశం

  • 15 అక్టోబర్ 2019
తెలంగాణ హైకోర్టు, ఆర్టీసీ చిహ్నం Image copyright Getty Images/BBC

ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల పట్టుదల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఇరు పక్షాల వాదనను విన్న హైకోర్టు... సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని సూచించింది.

దీంతో, సమ్మెలో ఉన్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని యూనియన్ నాయకులు కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన కూడా వెలువడిందని వారన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూనియన్ నాయకులు కోర్టుకు తెలిపారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము సమ్మె అస్త్రాన్ని ప్రయోగించామని, ఈ పరిస్థితుల్లో సమ్మె విరమిస్తే ఇక తమ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని వారు అన్నారు.

నెల ముందే తాము సమ్మె నోటీసు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి.

"చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయి. సంస్థకు పూర్తి స్థాయి ఎండీ కూడా లేరు. ఇబ్బందులు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పాలో తెలియడం లేదు" అని కార్మిక సంఘాలు హైకోర్టుకు తమ వాదనలు వినిపించాయి.

Image copyright Getty Images

ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించినా ఫలితం లేదు కదా: హైకోర్టు

ఇదంతా విన్న కోర్టు... సమ్మె అస్త్రాన్ని ప్రయోగించినా ఫలితం లేదు కదా అని వ్యాఖ్యానించింది.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని యూనియన్లకు సూచించింది.

అదే సమయంలో, ఈనెల 5 నుంచి సమ్మె జరుగుతుండగా, దాన్ని విరమింపచేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.వెంటనే కార్మికులతో చర్చల ప్రక్రియ ప్రారంభించి, రెండు రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.సమస్య పరిష్కారానికి యూనియన్లు, ప్రభుత్వం... ఇద్దరూ ఓ మెట్టు దిగి ప్రయత్నించాలని సూచించింది.ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటారో రెండు రోజుల్లో సవివర నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.కార్మికులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు