సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్షుడిగా 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?

  • 15 అక్టోబర్ 2019
సౌరవ్ గంగూలీ Image copyright Getty Images

ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన బీసీసీఐ సమావేశం చాలా ముఖ్యమైనది. ఈ మీటింగ్‌కు అంత ప్రాధాన్యం ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు నడిపే బాధ్యతలను ఎవరెవరికి ఇవ్వాలి అనేది ఈ సమావేశంలోనే నిర్ణయించాలి.

లోధా కమిటీ కొత్త చట్టం ప్రకారం అనర్హులైన బీసీసీఐ పాత యోధులందరూ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ఆడుతూ తన సన్నిహిత ప్రతినిధులను మైదానంలోకి దించారు.

సుప్రీంకోర్టు నియమించిన నిర్వాహక కమిటీ మూడేళ్ల పదవీకాలం పూర్తైన తర్వాత, అక్టోబర్ 23న బోర్టు మరోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కొత్త టీంతో ప్రారంభమవుతుంది.

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ తర్వాత అధ్యక్షుడు కావడం దాదాపు ఖాయమైంది. ఈ వార్తలు రాగానే సోషల్ మీడియాలో #SouravGanguly, #DADAGIRI అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవడం మొదలైంది.

క్రీడా రాజకీయాలా లేక రాజకీయ క్రీడలా..

క్రికెట్‌లోని ఇద్దరు పవర్‌ఫుల్ పెద్దలు తమ అభ్యర్థులను బీసీసీఐ అధ్యక్ష పదవిలో కూర్చోపెట్టేందుకు తమ బలమంతా ప్రయోగించారు. బోర్డ్ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అభ్యర్థి బ్రజేష్ పటేల్, హోంమంత్రి అమిత్ షా కొడుకు జయ్ షాలతో పాటు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా బరిలో నిలిచారు.

అటూ, ఇటూ తిరిగి దీని పగ్గాలు మళ్లీ హోంమంత్రి చేతికే వచ్చాయి. శనివారం హోంమంత్రి అమిత్ షాను కలిసిన శ్రీనివాసన్, ఆయనకు బ్రజేష్ పటేల్ పేరును చెప్పారు. అటు గంగూలీ కూడా అమిత్ షాకు బీసీసీఐ చీఫ్ కావాలని అనుకుంటున్నట్టు తన కోరికను చెప్పాడు.

Image copyright Getty Images

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌పై దృష్టి

ముంబైలో క్రికెట్ సంఘాలు చాలాసార్లు సమావేశమైన తర్వాత సౌరవ్ గంగూలీ పేరును అంగీకరించాయి. ఎందుకంటే బీసీసీఐ అధ్యక్ష పదవి తప్ప తనకు వేరే ఏ పదవిపైనా ఆసక్తి లేదని అతడు స్పష్టంగా చెప్పాడు. గంగూలీకి కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మద్దతు కూడా ఉందని చెబుతున్నారు.

బ్రజేష్ పటేల్ ఐపీఎల్ చైర్మన్‌గా ఉండడానికి అంగీకరించగా, హోంమంత్రి అమిత్ షా కొడుకు జయ్ షా కార్యదర్శి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అటు అనురాగ్ ఠాకూర్ తమ్ముడు, అరుణ్ సింగ్ ఠాకూర్‌ను కోశాధికారిగా చేయవచ్చు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది సభ్యులు ఉంటారు.

సెలక్షన్ ప్రక్రియ పూర్తైన తర్వాత గంగూలీ 10 నెలలు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటారు. అయినా ఇది గంగూలీకి చాలా తక్కువ కాలమే అవుతుంది. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం 2020 జులై నుంచి ఆయన కాలింగ్ ఆఫ్ వ్యవధి మొదలవుతుంది.

ఆయన గత ఐదేళ్ల రెండు నెలలపాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బంగాల్‌లో పదవిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన లోధా కమిటీ నిబంధనల ప్రకారం ఒక నిర్వాహకుడు ఆరేళ్ల వ్యవధి వరకూ సేవలు అందించవచ్చు.

దీనిపై మాట్లాడిన సౌరవ్... "అది నిబంధన. అందుకే మనం వాటిని పాటించాలి. నా మొదటి ప్రాధాన్యం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే ఇస్తాను. రంజీ క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సీఓఏను కూడా కోరాను. వారు వినలేదు. వారికి క్రికెటర్ల ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం" అన్నాడు.

గంగూలీ తన అటాకింగ్ కెప్టెన్సీతో భారత క్రికెట్‌లో ఒక కొత్త యుగానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు అతడు బోర్డు అత్యున్నత పదవిని చేపట్టబోతున్న రెండో భారత క్రికెట్ కెప్టెన్ అయ్యాడు. ఇంతకు ముందు బీసీసీఐ అధ్యక్షుడుగా ఉన్న ఒకే ఒక క్రికెట్ కెప్టెన్ తెలుగువాడు పూసపాటి విజయానంద గజపతి రాజు. ఈయన్నే విజ్జీ అనేవారు. ఆయన 1936లో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించిన సమయంలో 3 టెస్ట్ మ్యాచులకు నేతృత్వం వహించారు. 1954లో ఆయన బీసీసీఐ అధ్యక్షుడయ్యారు.

Image copyright Reuters

దాదా దాదాగిరీ (సెకండ్ ఇన్నింగ్స్)

గంగూలీ ఎప్పుడు కెప్టెన్ పాత్ర పోషించాలన్నా వెనకాడేవాడు కాదు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా కెరీర్ ముగించిన గంగూలీ, తర్వాత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా సంరక్షణలోని సీఏబీలోకి అడుగుపెట్టాడు.

గంగూలీ 2000 సంవత్సరంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నప్పుడు భారత క్రికెట్ పాతాళంలో ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో ఐసీసీలో బోర్డు పలుకుబడి దాదాపు తగ్గిపోయింది. కెప్టెన్ అయిన గంగూలీ మన జట్టు విదేశాల్లో కూడా గెలవగలదని భారత్ క్రికెట్‌కు ఒక విశ్వాసాన్ని నింపాడు.

లోధా కమిటీ వచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక మాజీ క్రికెటర్ ఈ పదవిని అందుకోవడం ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్తే.

దీనిపై మాట్లాడిన గంగూలీ... "నా నియామకంపై సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది బీసీసీఐ ఇమేజ్ కాస్త మసకబారిన సమయం, చాలా చేయడానికి నాకు ఇది ఒక అద్భుత అవకాశం" అన్నాడు.

గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఈడెన్ గార్డెన్‌లో ఆస్ట్రేలియా 16 వరుస టెస్టు విజయాలకు బ్రేక్ వేయడం ప్రతి క్రికెట్ అభిమానికీ గుర్తుండే ఉంటుంది. అలాగే, ఇప్పుడు బీసీసీఐలో ఏళ్ల తరబడి ఉన్న లోపాలను అతడు సరిదిద్దగలడనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఇంత తక్కువ సమయంలో అది చేయడం అంత సులభం కాదు.

"పోటీ లేకుండా లేదా మరోలా ఎంపిక కావచ్చు. కానీ, ఇది ఒక పెద్ద బాధ్యత అవుతుంది. ఎందుకంటే, బీసీసీఐ క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ఇప్పుడు భారత్‌లో అది ఒక పవర్ హౌస్. దానికి సంబంధించిన ఈ పదవి ఒక సవాల్ లాంటిది" అని గంగూలీ చెప్పాడు.

అటు గంగూలీ టీమ్‌లో సభ్యుడైన క్రికెటర్ హర్భజన్ సింగ్ దీనిపై స్పందించాడు.

"సౌరవ్ నియామకం క్రికెటర్లకు శుభవార్తే అవుతుంది. ఎందుకంటే అతడో క్రికెటర్, క్రికెటర్ మానసిక స్థితిని అతడు పూర్తిగా అర్థం చేసుకోగలడు. గంగూలీ 2000లో కెప్టెన్‌గా కొత్త జట్టుకు పునాది వేశాడు. అతడికి ఒక విజన్ ఉంది. సౌరవ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్, అతడి మొదటి ఇన్నింగ్స్ కంటే విజయవంతం కావాలని ఆశిస్తున్నా. అతడు క్రికెట్ నిర్వాహకులకు ఒక ఉదాహరణ అవుతాడనే అనుకుంటున్నా" అన్నాడు.

దాదా పుట్టుకతోనే లీడర్ అని హర్భజన్ చెప్పాడు.

"సౌరవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరినీ వెంట తీసుకుని నడిచేవాడు. ప్రతి ఒక్కరూ అతడిని కలిసి ప్రశ్నించగలిగేవారు. తమ బాధను చెప్పుకోగలిగేవారు. అతడి ప్రత్యేకత అదే. అంతే కాదు, పెద్ద పెద్ద అంశాలలో కూడా గంగూలీ అందరి అభిప్రాయాలూ తెలుసుకునేవాడు" అన్నాడు.

"గంగూలీకి క్రికెట్ గురించి అందరికంటే బాగా తెలుసు. అతడు క్రికెట్ వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తాడు. ముందు ముందు బోర్డులో చాలా సవరణలు కనిపించవచ్చు, ముఖ్యమైన విషయం ఏంటంటే అతడికి క్రికెట్ వ్యవహారాలపై పూర్తి అనుభవం ఉంది" అని దాదా గురించి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అన్నాడు.

Image copyright TWITTER @RAVI SHASTRI

రవిశాస్త్రితో ఎలా ఉంటాడో?

రవిశాస్త్రి, గంగూలీల మధ్య ఎప్పుడూ సఖ్యత లేదు. శాస్త్రి కోచ్ పదవి కోసం పోటీపడిన సమయంలో ఇద్దరి మధ్య మీడియాలో మాటల యుద్ధం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు అనిల్ కుంబ్లే కోచ్‌గా ఎంపికయ్యాడు.

కోచ్‌గా తనను ఇంటర్వ్యూ చేసే సమయంలో గంగూలీ గైర్హాజరు అయ్యాడని రవిశాస్త్రి ఆరోపించాడు. అప్పటి నుంచి పరస్పరం ఆరోపణలు చేసుకోడానికి ఇద్దరూ ఏ అవకాశాన్నీ వదులుకోలేదు. ఇప్పుడు గంగూలీ అధ్యక్షుడైతే వీరి గొడవ ప్రభావం తర్వాత తీసుకునే నిర్ణయాలమీదా పడవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే, రవిశాస్త్రి అన్ని విషయాలూ సౌరవ్ గంగూలీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్‌లో దీనిపై అప్పుడే చర్చ మొదలైంది. గంగూలీ అధ్యక్షుడు అవుతాడనే వార్తతోపాటే నెటిజన్లు రవిశాస్త్రిని ట్రోల్ చేయడం కూడా మొదలైంది.

అయితే, "సౌరవ్ వచ్చిన తర్వాత కోచ్ అంశమైనా, వేరే ఏ ఇతర అంశమైనా చాలా విషయాల్లో స్పష్టత వస్తుంది. గంగూలీ వస్తే, తర్వాత ఏం చేయాలనేదానిపై కచ్చితంగా ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తాడు. అతడు ఏం చేసినా క్రికెట్ మంచికోసమే చేస్తాడు" అని హర్భజన్ చెబుతున్నాడు.

ఇక్కడ స్పష్టత అవసరం ఉన్న మరో విషయం కూడా ఉంది. అదే మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్. ధోనీ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ, క్రికెట్ బోర్డు కూడా దీనిపై ఇప్పటివరకూ ఏదీ చెప్పలేకపోతోంది.

కానీ, గంగూలీ మాత్రం ఇంతకు ముందే దీనిపై మాట్లాడాడు.

"ప్రతి పెద్ద ఆటగాడూ రిటైర్ కావాల్సుంటుంది. టెండూల్కర్, లారా, బ్రాడ్‌మన్.. అందరూ జట్టును వీడినవారే. అదే విధంగా ఎంఎస్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి" అన్నాడు. అలాంటప్పుడు ధోనీ కోసం కూడా కొత్త రోల్ నిర్ణయించవచ్చు.

సౌరవ్ మీద చాలా ఆశలే ఉన్నాయి. పోటీ లేకుండా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైతే అతడిపై ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ, ఒత్తిడిలో అద్భుత ప్రదర్శన ఇవ్వడం దాదాకు అలవాటు. అతడు అధ్యక్షుడిగా ఉండే రాబోయే 10 నెలలు భారత క్రికెట్‌కు అత్యంత కీలకమైనవిగా నిలుస్తాయి.

బీసీసీఐని బలోపేతం చేసే బాధ్యత ఆ పదవిలో ఉన్న అతడిపై ఉంటుంది. అటు బీసీసీఐలో కూడా మార్పులు తీసుకురావడం, ఆటకు, ఆటగాళ్లకు కొత్త రోడ్ మ్యాప్ తయారు చేయడం కూడా ఉంటుంది.

గంగూలీ ట్రాక్ రికార్డ్ అద్భుతం. అలాంటప్పుడు మనం, రాబోవు రోజుల్లో భారత క్రికెట్‌లో చాలా మార్పులు కనిపిస్తాయనే ఆశించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)