రూ. 2,000 నోటు కనిపించుట లేదు.. దీనినీ రద్దు చేస్తారా? - ప్రెస్ రివ్యూ

  • 16 అక్టోబర్ 2019
రూ. 2000 నోటు Image copyright Getty Images

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం చలామణిలోకి వచ్చిన రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసిందని.. దీంతో ఈ నోట్లు రద్దవుతాయా అనే ఊహాగానాలకు తెరలేచిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం, 2016 నవంబర్ 8న అప్పటికి చలామణిలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అనంతరం కొత్త రూ. 500 నోటుతో పాటు, కొత్తగా రూ. 2,000 నోటు కూడా చలామణిలోకి వచ్చింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ నోటు ప్రజల్లో మామూలై పోయింది. ఏటీఎంకు వెళ్లి రూ.2,000 లకు మించి డబ్బు డ్రా చేస్తే ఈ పెద్ద నోటు తప్పక వస్తుంది.

అయితే.. కొద్ది రోజులుగా ఈ నోటు అంతగా కనిపించడం లేదు. కారణం, ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల ముద్రను నిలిపివేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్‌బీఐ ఈ వివరాలు వెల్లడించింది.

దీంతో రూ. 2,000 నోట్లు రద్దు కానున్నాయా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542 మిలియన్ల నోట్లు ముద్రించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111 మిలియన్ నోట్లు ముద్రించారు. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో 46 మిలయన్లకు ఈ ముద్రనను కుదించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ. 2,000 నోటు కూడా ముద్రించలేదు. అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరి రూ. 2,000 నోట్లు రద్దు అవుతాయా? కొనసాగుతాయా? అనే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

Image copyright Getty Images

రైల్వే మరింతగా ప్రైవేటుపరం... మార్చి నాటికి 3 లక్షల ఉద్యోగాల కోత

మునుపెన్నడూ లేని విధంగా రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తున్న రైల్వేశాఖ.. ఇప్పుడు మరిన్ని విభాగాలను ప్రైవేటుకు అప్పగించాలని కసరత్తు చేస్తున్నట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. రైలు పెట్టెలు, ఇంజిన్ల తయారీ, రైలు మార్గాల నిర్మాణం, వాటి విద్యుదీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల సంబంధిత పనులకే రైల్వేశాఖ పరిమితం కానుంది. ప్రయాణికుల రైళ్లను నడపడం, వాటిలో సేవలందించడం వంటివన్నీ క్రమేపీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారు.

ఇది ఎప్పట్లోగా అనేదే స్పష్టం కావాల్సి ఉంది. అయితే.. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని న్యాయబద్ధమైన నిష్పత్తిలో రైల్వే శాఖ, ప్రైవేటు సంస్థలు పంచుకుంటాయి.

కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో.. ప్రధానేతర (నాన్-కోర్) విభాగాల్లో రైల్వే ఉద్యోగులు ఎంతెంత మంది అ(న)వసరమో లెక్కలు తేల్చే పని ప్రారంభించాల్సిందిగా జనరల్ మేనేజర్లకు ఆదేశాలు అందాయి.

ప్రస్తుతం రైల్వేలో 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 2020 నాటికి వీరిని 10 లక్షలకు తగ్గించాలనేది లక్ష్యం. రైల్వే ఉద్యోగుల్లో.. 55 ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిలో పనితీరు మెరుగ్గా లేని వారిని ఉద్యోగంలో కొనసాగించరాదని మూడు నెలల క్రితం రైల్వేశాఖ నిర్ణయించింది.

ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఓహెచ్ఈ), నాన్-పవర్ బ్లాక్, విద్యుత్ సరఫరా వ్యవస్థాపన (ఇన్‌స్టలేషన్), నిర్వహణ, ట్రాక్షన్ పవర్ కంట్రోల్ వంటివి ప్రైవేటుపరం చేయవచ్చునని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రధాన కార్యకలాపాలతో ముడిపడిన విభాగాల్లో గుమాస్తాలు, సాంకేతిక సిబ్బంది, సహాయకుల్ని తగ్గించనున్నారు.

Image copyright Getty Images

యూపీలో 25 వేల మంది హోంగార్డులకు ఉద్వాసన

వెలుగుల పండుగ దీపావళి ఈసారి ఉత్తరప్రదేశ్‌ హోంగార్డుల కుటుంబాల్లో చీకట్లను నింపనున్నదని.. ఆ రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి ప్రధాన కారణమని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. తగినంత బడ్జెట్‌ లేని కారణంగా రాష్ర్టంలోని 25 వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ సిగ్నళ్ల దగ్గర పనిచేసే వేలాది మంది హోంగార్డులు ఉద్వాసన జాబితాలో ఉన్నారు.

అంతేకాదు.. రాష్ర్టంలో పనిచేస్తున్న మరో 99 వేల మంది హోంగార్డుల పనిదినాల్ని కూడా ప్రభుత్వం కుదించింది. గతంలో 25 రోజులుగా ఉన్న వీళ్ల పనిదినాల్ని ప్రస్తుతం 15 రోజులకు తగ్గించింది. ఈ మేరకు వీరి వేతనాల్లో భారీగా కోత పడనుంది.

రాష్ర్టంలోని పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు కూడా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు గత జూలైలో ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పుతో గతంలో రోజుకు రూ. 500గా ఉన్న హోంగార్డుల వేతనాన్ని రూ. 672కు పెంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యూపీలో బడ్జెట్‌ ఇబ్బందులు తలెత్తాయి.

'హోంగార్డుల వేతనాన్ని పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమానంగా పెంచాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంతో ప్రతి నెలా రాష్ర్ట ఖజానాపై రూ. 10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల అదనపు భారం పడుతుంది. అయితే, హోంగార్డుల తీసివేత నిర్ణయం తాత్కాలికమైనది. ఒకవేళ వారి సేవలు అవసరమైతే తిరిగి వాళ్లను విధుల్లోకి తీసుకుంటాం' అని రాష్ర్ట డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు.

మరోవైపు.. హోంగార్డులను ఎవ్వరినీ ఉద్యోగాల నుంచి తొలగించట్లేదని రాష్ర్ట హోంగార్డుల శాఖ మంత్రి చేతన్‌ చౌహన్‌ పీటీఐ వార్త సంస్థతో చెప్పారు. 'ఏ ఒక్క హోంగార్డునూ తొలగించం. హోంగార్డులెవర్నీ ఉద్యోగాల నుంచి తొలగించొద్దని పోలీసు శాఖ అధికారులతో చెప్పాను. అయితే, వాళ్ల పని దినాల్ని తగ్గించే అవకాశం ఉన్నది' అని అన్నారు.

హోంగార్డులను యూపీ సర్కారు శాశ్వత ఉద్యోగులుగా పరిగణించడం లేదు. సాధారణ ప్రాతిపదికన రోజూవారీ వేతనంతో వాళ్లను విధుల్లోకి తీసుకుంటున్నది. యూపీలో అత్యధిక మంది హోంగార్డులు ట్రాఫిక్‌ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ట్రాఫిక్‌ కష్టాలు తలెత్తే అవకాశం ఉంది.

Image copyright PA

మొబైల్‌ చార్జీలకు రెక్కలొస్తాయా?

ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్‌ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్‌ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు.

'ఈ టారిఫ్‌లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం' అని ఆయన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

మరోవైపు, ఇంటర్‌కనెక్షన్‌ యూసేజ్‌ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. 'టారిఫ్‌కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది' అని విఠల్‌ పేర్కొన్నారు.

ఇక తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్‌ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు.

ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌పై రిలయన్స్‌ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్‌టెల్‌ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది.

ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది.

ఇతర నెట్‌వర్క్‌ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్‌ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్‌ చర్చాపత్రాన్ని విడుదల చేయడం వివాదాస్పదమైంది.

దీంతో ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను జియో విధించింది. ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్‌ మాథ్యూ ఊమెన్‌ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)