అయోధ్య కేసు: సుప్రీం కోర్టు తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? పిటిషనర్లు ఏమంటున్నారు?

  • 18 అక్టోబర్ 2019
బాబ్రీ మసీద్ Image copyright Getty Images

రెండు ఫుట్‌బాల్ పిచ్‌ల పరిమాణంలో ఉన్న భూమిపై భారత్‌లో సుదీర్ఘకాలంగా వివాదం కొనసాగుతోంది.

ఇది సాధారణ భూమి కాదు. అయోధ్యలో ఉన్న ఈ 2.77 ఎకరాల భూమి... ఇది హిందువులు, ముస్లింల విశ్వాసానికి సంబంధించినది.

ఈ వివాదం చాలా ఏళ్ల నుంచి కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు దీనిపై తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. దీంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో 144 సెక్షన్ అమలు చేశారు.

ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న మూడు ప్రధాన పార్టీలు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాయి.

వివాదాస్పద ప్రదేశంలో రామ మందిరాన్ని నిర్మిస్తామని హిందూ సంస్థలు ప్రమాణం చేస్తున్నాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించాల్సిన రాళ్లను చెక్కే పని ఇక్కడ చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది.

Image copyright SAMIRATMAJ MISHRA /BBC

ఐదుగురు సభ్యుల ధర్మాసనం

అయోధ్య భూవివాదం కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తున్నారు. ఆయన నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. పదవీకాలం ముగిసేలోపే దీనిపై ఆయన తుది తీర్పు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

'బాబ్రీ మసీదు - రామజన్మభూమి' వివాదంలో పిటిషనర్లుగా ఉన్న మూడు ప్రధాన గ్రూపులు (నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్‌లాలా విరాజమాన్ (హిందూ మహా సభ)లలో రెండు హిందూ సంస్థలకు చెందినవి కాగా, ఒకటి ముస్లింలకు చెందినది.

ఇవన్నీ వివాదాస్పద భూమి తమదేనని వాదిస్తున్నాయి.

అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.

Image copyright Getty Images

విఫలమైన మధ్యవర్తిత్వం

అలహాబాద్ హై కోర్టు తీర్పును ముగ్గురు పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో 2011లో విచారణ ప్రారంభం కావాలి. కానీ, ఇటీవల దీనిపై వాదనలు ప్రారంభమయ్యాయి. వరుసగా 40 రోజులు కొనసాగిన ఈ వాదనలు అక్టోబర్ 16న ముగిశాయి.

సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీ తన నివేదికను ఆగస్టు 1న కోర్టుకు సమర్పించింది.

మధ్యవర్తిత్వం విఫలమైందని కేసులో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తెలిపాయి. ఇప్పుడు మధ్యవర్తిత్వ కమిటీ రెండో రౌండ్ మధ్యవర్తిత్వంపై నివేదికను సమర్పించింది. కానీ, ఈ నివేదికలో ఏం ఉందో స్పష్టంగా తెలియదు. మరోవైపు, మధ్యవర్తిత్వంపై ఉన్న అన్ని నివేదికలను సుప్రీంకోర్టు నిషేధించింది.

ఇప్పుడు తీర్పు వచ్చే సమయం ఆసన్నమైంది. తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని మూడు పార్టీలు ఆశిస్తున్నాయి. అయితే, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని చిన్న సవరణలతో సుప్రీం సమర్థించవచ్చని కొందరు భావిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్

ఎలాంటి ఫలితాలు రావొచ్చు?

ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే?

ఇది జరిగితే, మరో ప్రశ్న వస్తుంది.

పిటిషనర్లుగా ఉన్న రెండు హిందూ గ్రూప్‌లలో ఎవరు రామ మందిరాన్ని నిర్మించాలి?

రామ మందిర నిర్మాణంపై హిందూ గ్రూప్‌లు రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, ఆలయాన్ని ఎవరు నిర్మించాలనే దానిపై ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

నిర్మోహి అఖాడాకు చెందిన కార్తీక్ చోప్రా ఈ కేసును గెలిస్తే తామే ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.

విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంలో రామ్ లాలాకు మద్దతు ఇస్తుంది. ఆలయాన్ని రామ్ జన్మ భూమి న్యాస్ నిర్మిస్తుందని వీహెచ్‌పీ నేత ఛాంపత్ రాయ్ చెప్పారు.

రామ్ జన్మ భూమి న్యాస్ ఒక ట్రస్ట్. దీన్ని రామ మందిర నిర్మాణ ప్రక్రియను, దాని నిర్వహణను వేగవంతం చేయడానికి స్థాపించారు.

''రామ మందిర నిర్మాణం కోసం న్యాస్ ఇప్పటికే ఆరు కోట్ల మంది హిందువుల నుంచి విరాళాలు సేకరించింది. నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసింది. 60 శాతం నిర్మాణ సామగ్రి సిద్ధంగా ఉంది. మేం నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.

Image copyright Ani
చిత్రం శీర్షిక సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన ఇక్బాల్ అన్సారీ

తీర్పు సున్నీ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉంటే?

తీర్పు సున్నీ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వచ్చినప్పటికీ, వారు ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలని ముస్లిం మేధావుల బృందం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ సూచనతో సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి ఇక్బాల్ అన్సారీ అంగీకరిస్తారా?

దీనిపై ఆయన స్పందిస్తూ, ''చూడండి, తీర్పు ఇంకా రాలేదు. మేధావులు, మరికొందరు ఈ వివాదాన్ని గమనిస్తున్నారు. ఈ సమస్యను కోర్టు పరిష్కరించాలని మేం కోరుకుంటున్నాం. ఇప్పుడు తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఇప్పుడు సమస్య పరిష్కారం కావొచ్చు'' అని పేర్కొన్నారు.

తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చే అవకాశమే లేదని నిర్మోహి అఖాడా భావిస్తోంది. వాస్తవానికి వివాదాస్పద భూమికి హక్కుదారులలో ఒకరిగా ముస్లిం సమూహాన్ని నిర్మోహి అఖాడా గుర్తించింది. కానీ, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది.

రామ్‌లాలా విరాజమాన్ గుడి ప్రధాన పూజారి మాట్లాడుతూ, అవసరమైతే ఆలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుందని చెప్పారు.

చిత్రం శీర్షిక కార్తిక్ చోప్రా

రామ్‌లాలా విరాజమాన్ (హిందూ మహా సభ)కు అనుకూలంగా వస్తే?

నిర్మోహి అఖాడాతో సంబంధం ఉన్న 94 ఏళ్ల రామ్‌చంద్ర ఆచార్య మాట్లాడుతూ ''రామ్‌లాలా కూడా మాదే. మేం నిర్వహణ బాధ్యతలను ఇవ్వాలని కోర్టును కోరాం. దేవుడిని ఆరాధించే హక్కు మాకు ఇవ్వమని చెప్పాం'' అని పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వ కమిటీ సమావేశాలలో నిర్మోహి అఖాడాకు తరుణ్‌జిత్ వర్మ ప్రాతినిధ్యం వహించారు. నిర్మోహి అఖాడా 1866 నుంచి 1982 వరకు రామ్ లాలాకు సేవలు అందించిందని ఆయన చెప్పారు. వారు ఆ హక్కును మాత్రమే అడుగుతున్నారని చెప్పారు.

రామ్ లాలాకు నిజమైన సంరక్షకులు నిర్మోహి అఖాడానే అని దానితో సంబంధం ఉన్న కార్తీక్ చోప్రా అభిప్రాయపడ్డారు.

రామ్ లాలా ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, ''ఈ కేసును ఏ హిందూ గ్రూప్ గెలిచినా ఫర్వాలేదు, రామమందిర నిర్మాణంపై అందరిలో ఏకాభిప్రాయం ఉంది. ఈ తీర్పు రామ్ లాలాకు అనుకూలంగా వస్తే, అది హిందువులందరి విజయం అవుతుంది'' అని పేర్కొన్నారు.

విశ్వ హిందూ పరిషత్ సీనియర్ అధికారి చాంపత్ రాయ్ మాట్లాడుతూ, ''ఈ కేసులో మొదట నిర్మోహి అఖాడా, ముస్లిం గ్రూప్ మాత్రమే పిటిషనర్లుగా ఉన్నారు. కానీ, నిర్మోహి అఖాడా 1949 నుంచి 1989 వరకు ఏం చేసింది? వారికి సంబంధించి చట్టపరమైన విషయాలు కేసులో చాలా బలహీనంగా ఉన్నాయి. అందుకే మేం 1989లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది'' అని తెలిపారు.

అయితే, ఈ విషయంలో ముస్లిం గ్రూప్ పిటిషనర్ అభిప్రాయం స్పష్టంగా ఉంది. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా అంగీకరిస్తామని సున్నీ వక్ఫ్ బోర్డు ప్రతినిధి ఇక్బాల్ అన్సారీ చెప్పారు.

ఇక్బాల్ అన్సారీ మాట్లాడుతూ, ''మేం కూడా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికైనా దీనికి ముగింపుపలకాలి'' అని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక విశ్వహిందూ పరిషత్ నేత చాంపత్ రాయ్

నిర్మోహి అఖాడాకు తీర్పు అనుకూలంగా వస్తే?

విశ్వ హిందూ పరిషత్‌కు చెందిన చాంపత్ రాయ్ మాట్లాడుతూ, ''వాళ్లు (నిర్మోహి అఖాడా) ఇక్కడ గెలవగలిగితే, అలహాబాద్ హైకోర్టులోనే గెలిచినట్లు'' అని చెప్పారు.

''అలహాబాద్ హైకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పుకు భిన్నంగా ఇక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలనుకుంటున్నాను. ఈ కేసు 15 ఏళ్లకు పైగా ఉంది. తొమ్మిదిన్నర నెలల నుంచి వాదనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సుప్రీంకోర్టు 40 రోజుల్లో విచారణ పూర్తి చేసింది. 15 ఏళ్ల పాటు కొనసాగిన తీర్పు, తొమ్మిదిన్నర నెలల పాటు జరిగిన విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలని మాకు ఆసక్తిగా ఉంది'' అని పేర్కొన్నారు.

ఈ కేసులో కోర్టు పాత్ర చాలా ముఖ్యమని సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన ఇక్బాల్ అన్సారీ అన్నారు.

''రెండు హిందూ గ్రూపులు తీర్పుపై చాలా ఆశతో ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం, కోర్టు చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటాయి. ఎందుకంటే, ఈ సమస్య మొత్తం దేశానికి సంబంధించినది. చాలా మంది ఈ సమస్య నుంచి రాజకీయ లబ్ధి పొందారు. కోర్టు ఏది నిర్ణయించినా మేం అంగీకరిస్తాం'' అని చెప్పారు.

తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని నిర్మోహి అఖాడా ప్రతినిధులు భావిస్తున్నారు. రామమందిరం వివాదం గురించి హిందువులను తప్పుదారి పట్టించారని అఖాడా సీనియర్ సభ్యుడు మహంత్ రాజా రాంచంద్ర ఆచార్య చెప్పారు.

''దేశంలో ఈ వివాదం కారణంగా మత హింస చోటు చేసుకుంది. వారు ధ్వంసం చేసింది గుడినా, మసీదునా, వివాదాస్పద స్థలాన్నా అనేది రాజకీయ నాయకులు మాత్రమే చెప్పగలరు. ఈ స్థలాన్ని తిరిగి మాకే ఇచ్చివేయాలి'' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం