ఆంధ్రప్రదేశ్: ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’.. చందన మరణ రహస్యాన్ని ఛేదించిన పోలీసులు

  • 18 అక్టోబర్ 2019
చందనను కాల్చేసిన ప్రదేశం
చిత్రం శీర్షిక చందనను కాల్చేసింది ఇక్కడే

ఆ ఊళ్లో చీకటి పడింది. ఇళ్లలో దీపాలు వెలిగించారు. అలాగే, ఆ ఊరి చివర కూడా ఒక చితి వెలిగింది. ఆ చితిలో కాలుతున్నది, 17 ఏళ్ల అమ్మాయి చందన. ఆమె చావుకు, ఈ చితికి కారణం తను ఓ దళితుడిని ప్రేమించడమే! అతడి చేత తాళి కట్టించుకోవడమే! చందన.. బోయ కులానికి చెందిన కుటుంబం నుంచి వచ్చింది.

దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులే కన్నకూతురిని హత్య చేసి, పోలీసులకు తెలియకుండా కాల్చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ, చందన ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

దీనిపై విచారణ చేసిన పోలీసులు చందనది హత్యేనని తేల్చారు. డీఎస్పీ ఆరిఫుల్లా కేసు వివరాలు మీడియాకు తెలిపారు. ‘‘చందన తన తల్లిదండ్రులకు తెలియకుండా దలితుడిని వివాహం చేసుకోవడంతో పాటు తమ మాట వినకపోవడంతో తల్లి అమరావతి, తండ్రి వెంకటేశు ఇద్దరు కలిపి చందన గొంతు నులిమి చంపారు. ఆత్మహత్య గా చిత్రీకరించాలని చూశారు. రాత్రికి రాత్రే శవాన్ని మాయం చేయలని మృతురాలి పెదనాన్న, అతని కుమారుడి సహకారంతో ఊరి చివరకు శవాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అక్కడ ఆనవాళ్లు లేకుండా బూడిదను మాయం చేయాలని సంచుల్లో మూటకట్టి కర్నాటక రాష్ట్రంలోని క్యాసంబల్ల వద్ద ఒక చెరువులో పడేశారు. అక్కడ గ్రామస్థులు అడ్డుకోవడంతో విషయం బయట పడింది. బూడిద బస్తాలను స్వాధీనం చేసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిందితులను రిమాండ్‌కు తరలించాం’’ అని డీఎస్పీ చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘దళితుడిని పెళ్లాడిందని తల్లిదండ్రులే చంపేశారు’

చిత్తూరు జిల్లా కుప్పం మండలం రెడ్లపల్లిలో, అక్టోబర్ 12 సాయంత్రం జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

''ప్రేమించడానికి ఇంకెవ్వురూ దొరకలేదా, ఈడిని ప్రేమించినావ్! మాలమాదిగలను కాకుండా, వేరే ఏ కులమోడినైనా ప్రేమించుంటే ఒప్పుకుంటాం. మీరు పెళ్లి చేసుకుంటే, రేపటి నుంచీ ఈడ్ని ఏమని పిలిసేది? అల్లుడా... అని ఎట్ల పిలుస్తాం'' అని ఆమె ఇంట్లోవాళ్లు ఎప్పుడూ తిట్టేవాళ్లు సార్! అన్నాడు చందన ప్రియుడు నందకుమార్ అలియాస్ ప్రభు.

సంఘటన జరిగిన తర్వాత, బీబీసీ తెలుగు నందకుమార్, చందన గ్రామాలకు వెళ్లింది.

వీరిద్దరివీ పక్కపక్క గ్రామాలే. ఏటికి ఇటువైపు నందకుమార్ గ్రామం ఒడుమడి, అటువైపు చందన గ్రామం రెడ్లపల్లి. రెండు ఊళ్లను ఎండిపోయిన ఏరు ఒకటి వేరు చేస్తుంది.

రెడ్లపల్లిలో ఓ చోట పోలీస్ పికెటింగ్ ఉంది. దాని పక్కనే చందన ఇల్లు.

'ఆ పాపను చంపేసుండారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నంక, పెద్దమనుషులు పంచాయితీ చేసి, సాయంత్రానికి పాపను ఇంటికి చేర్చినారు. ఆ రాత్రే ఇంట్లోవాళ్లు చందనను చంపి, నిప్పుపెట్టినారు. ఇంతెత్తు ఎగసిన మంటలు నందకుమార్ ఊర్లోకి కనిపించినాయంట. ఆ పాప పూర్తిగా కాలిపోయినంక, అస్తికలు, బూడిదను ఆరు సంచులకు ఎత్తి, ఈడికి 20 కి.మీ. దూరంలో, కర్నాటకలోని ఒక చెరువులో పడేసినారు. తర్వాత, చందనను కాల్చేసిన ప్లేసును నీళ్లతో అలికినట్ల శుభ్రం చేసినారు. ఇది హత్యే' అని దళిత నాయకుడు కణ్ణన్న బీబీసీకి చెప్పారు.

అక్కడికి కొద్ది దూరంలో మరో పోలీసు పికెటింగ్ ఉంది, దాని పక్కనే ఉన్న సందు చివర్లో నందకుమార్ ఇల్లు ఉంది.

చిత్రం శీర్షిక చందన ఇల్లు

ఇద్దరూ మైనర్లే

నందకుమార్‌ వయసు 18. చందనకు 17 ఏళ్లు. ఇద్దరూ మైనర్లే. తన ప్రేయసి చావు, ఆమె జ్ఞాపకాలతో నందకుమార్ ఎలా పోరాడుతున్నాడో తెలీదు.

నందకుమార్‌ది రెండు గదుల ఇల్లు. బయట ముఖం కడుక్కుంటున్న అతడు సన్నగా, ఎత్తుగా ఉన్నాడు. ఒంటి రంగు నలుపు.

అప్పుడే, నందకుమార్ తల్లి బయటకు వచ్చారు. నందకుమార్ తండ్రి ఇంట్లో లేరు.

''ఇద్దరం ఇంటర్‌ ఫస్టియర్‌లోనే ప్రేమించుకున్నాం. సెకండ్ ఇయర్‌లో ఓరోజు వాళ్లింట్లో తెలిసిపోయింది. లవ్ చేయడానికి వీడే దొరికినాడా? అని తిట్టేవాళ్లంట. వాళ్ల ఇల్లు ఈ దావలోనే ఉంది. నేను ఎక్కడికి పోవల్లన్నా, వాళ్లింటిముందు నుంచే పోవల్ల. అట్ల నేను పోతున్నపుడు చందనను తిట్టేవాళ్లంట. చందనను వాళ్లే చంపేసినారు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు చందన'' అని చెప్పాడు నందకుమార్.

ఇప్పుడు చందన గురించి చెప్పడానికి ఎవ్వరూ లేరు. చందన తల్లిదండ్రులను, దగ్గరి బంధువులను పోలీసులు విచారిస్తున్నారు. వాళ్లను కలవడం కుదరదు.

''మేము కాలేజికి పోవల్లంటే, బస్సు కోసం రోడ్డులోకి నడిచిపోవల్ల. అట్ల పోతున్నప్పుడు చందనతో పరిచయమైంది. ఇద్దరం కలిసి కాలేజికి పొయ్యేవాళ్లము. అట్ల ఇద్దరం ప్రేమించుకున్నాం. సెకెండియర్‌లో ఉన్నట్లే, మా గురించి వాళ్లింట్లో తెలిసిపోయింది. అప్పట్నుంచి, ఆ పాపకు నరకం చూపించినారు. ఇంటర్ పూర్తయినంక చందనని కాలేజ్ మాన్పించినారు. ఇంటి నుంచి బయటికి రానిచ్చేవాళ్లు కాదు'' అని నందకుమార్ అన్నాడు.

చిత్రం శీర్షిక పోలీస్ పికెటింగ్

'రోడ్డు పక్కనే బండి ఆపి, పెండ్లి చేసుకున్నాం'

''అప్పటికి మూడు రోజుల కిందట, వాళ్ల పొలం దగ్గర చందనతో మాట్లాడినాను. అప్పుడే, ఇద్దరం వెళ్లిపోవల్లని అనుకున్నాం. అనుకున్నట్లే, 11తేదీ పొద్దున ఏటి దగ్గర కలిసినాం. అక్కడి నుంచి నా బైక్‌లో బయల్దేరినాం. నేను మైనర్‌ని, మేజర్ అయ్యేకి ఇంకా రెండేళ్లు టైం ఉందని, కొంతకాలం ఇట్లానే ఉందామని అన్నా. కానీ, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్లంటే ఈ లోపు మా నాయిన ఇంకోరితో నా పెండ్లి చేస్తాడు లేదా నన్ను చంపుతాడు అని ఏడ్చింది. అందుకే ఆ అమ్మాయిని పిల్చుకుని వెళ్లిపోయినాను.

అట్ల 11 తేదీన మేం ఇక్కడి నుంచి బయల్దేరినంక, దారిలో ఓ చోట బండి ఆపమని చెప్పింది. తాళి నా చేతికిచ్చి కట్టమని చెప్పింది. రోడ్డుపై ఎందుకు, గుడికి పోయి పెళ్లి చేసుకుందామని అంటే, గుడికి పొయ్యే దారిలో ఎవరైనా చూస్తే, నన్ను ఇంటికి ఈడ్చుకుపోతారు. నాకు నమ్మకం లేదు. ముందు ఈ తాళి నా మెడలో పడితే, ఇంక మనల్ని ఎవురూ ఏమీ చెయ్యలేరు అని చెప్పింది. అందుకే, రోడ్డు పక్కనే బండి ఆపి, చందన మెడలో తాళి కట్టేసినా. అట్ల మా పెండ్లి జరిగిపాయ'' అన్నాడు నందకుమార్.

ఆ తర్వాత ఇద్దరూ కుప్పం వెళ్లిపోయారు. నందకుమార్ మామ, తన కూతురికి వైద్యం చేయించడం కోసం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని కుప్పంలో ఉంటున్నారు. కుప్పం చేరుకున్నాక, ఇద్దరూ తన మామ దగ్గరకు వెళ్లారు.

'కొయంబత్తూర్‌లో కొత్త ఉద్యోగం'

'పెళ్లి చేసుకున్నంక ఇద్దరమూ కొయంబత్తూర్‌కు పోవల్లనుకున్నాం. అక్కడే ఒక ఉద్యోగం కూడా చూసుకున్నాను. నెలకు 15వేలు జీతం. ఉండేకి వాళ్లే ఇల్లు ఇస్తారు. అలా ఇంటికి 2వేలు పోయినా, ఇంకా 13వేలు ఉంటుంది కదా, చందనతో హాయిగా ఉందామనుకున్నా. ఇక్కడ అంతా సర్దుకున్నంక, ఊరికి వచ్చి, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాలకు అప్లై చేద్దామనుకున్నాను. కానీ..!'

ఇద్దరూ అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకున్నారు కానీ, పరిణామాలు మాత్రం తీవ్ర రూపం దాల్చాయి.

నందకుమార్ చేసిన ఒక్క ఫోన్ కాల్, వీరి తల రాతను మార్చేసింది.

ఇద్దరూ అక్టోబర్ 11న ఊరు వదిలి వచ్చేశాక, చందన తల్లిదండ్రులు నందకుమార్ ఇంటికి వెళ్లలేదు, అలా అని పోలీసులకూ ఫిర్యాదు చేయలేదు.

12వ తేదీ సాయంత్రం రైలు ఎక్కాల్సిన ఈ ఇద్దరూ కొయంబత్తూర్ వెళ్లలేదు.

''మరుసటి రోజు ఎవరికీ తెలీకుండా స్టేషన్‌కు పోయి, కొయంబత్తూర్ రైలు ఎక్కుదామనుకున్నాం. అంతలోపల ఒకసారి నాయినతో మాట్లాడదామని అనిపించింది. 12వ తేదీ పొద్దున్న నాయినకు ఫోన్ చేసి, జరిగింది చెప్పినా. ఒకసారి చూడబుద్ది అయితాందని చెప్పినా. సరే వస్తున్నా అన్నాడు. కానీ ఈ విషయం చందన తల్లిదండ్రులకు చెప్పి, వాళ్లను కూడా వెంట తెచ్చేసినాడు. వారితోపాటు కొంతమంది పెద్దమనుషులు కూడా వచ్చినారు.''

నందకుమార్ చేసిన పనికి అతని తండ్రి కాస్త భయపడ్డాడు. విషయం శృతిమించకుండా, గొడవలు జరగకూడదంటే, చందన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడమే నయం అని అతను భావించి ఉండొచ్చు.

కుప్పంలో పంచాయితీ జరిగింది. నందకుమార్ మాటల్లో చెప్పాలంటే,

''థూ... ఇంతపని చేస్తావని తెలిసుంటే ఆడనే సంపేసుండేవాళ్లము. ఇంకెవ్వరూ దొరకలేదా ప్రేమించేదానికి, పోయిపోయి వీడిని ఎట్ల ప్రేమిస్తివే? నిన్ని పెండ్లి చేసుకుని వీడు కళ్లముందే తిరుగుతాంటే ఎట్ల చూసేది?''

పంచాయితీ పెద్ద మనుషులు ఈ మాటలు అంటున్నపుడు ఆ గదిలో నందకుమార్‌‌తోపాటు అతని తండ్రి కూడా అక్కడే తలదించుకుని నిలబడ్డాడట.

'మైనర్ కాబట్టి చందన తల్లిదండ్రులు నీపై కేసు పెడితే నీకు మూడేండ్లు జైలు శిక్ష పడుతుంది రా, అప్పుడు ఆ పాప గతేంకాను?' అని చెప్పినారు. ఆ మాటలకు ఆలోచనలో పడ్డాడు నందకుమార్. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి, మీకు మైనారిటీ తీరినంక మేమే ఏదో ఒకటి చేస్తామని పెద్దమనుషులు అన్నారని నందకుమార్ వివరించాడు.

ఎట్లాగూ చందన మెడలో తాళి కట్టేశాను కాబట్టి, మేజర్లు అయ్యాక, చందనను తనకే ఇస్తారని నందకుమార్‌లో చిన్న ఆశ కలిగింది. పైగా, పెద్దమనుషులు చెప్పినట్లు మూడేళ్లు జైలులో ఉంటే, అప్పుడు చందన పరిస్థితి ఏమిటి? జైలులో ఉండటం కన్నా, చందనకు దూరంగా, కూతవేటు దూరంలోని తన గ్రామంలో ఉండేందుకే మొగ్గుచూపాడు నందకుమార్.

ఈ ఒప్పందానికి సరేనంటూ, చందనను ఆమె తల్లిదండ్రులతో పంపడానికి అంగీకరించాడు. అది కూడా, పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులకు అప్పగిస్తానని నందకుమార్ అన్నాడు.

''పోలీసుల ముందు అప్పగిస్తే వాళ్లకీ కొంచెం భయం ఉంటుంది కదా. ఆమెకు కూడా సెక్యూరిటీ ఉంటుందని అట్ల చెప్పినా. కానీ, స్టేషన్‌కు పోతే మా మర్యాద పోతుందని చందన అమ్మా, నాన్న అన్నారు. అవన్నీ వద్దు, మీ ఇంటికి నువ్వు పో, మా బిడ్డను మేం తీసుకుపోతాం అన్నారు. ఎవరూ నా మాట వినలేదు'' అని, పెద్దమనుషుల పంచాయితీని నందకుమార్ బీబీసీకి వివరించాడు.

పంచాయితీ ముగిసినా, చందన గురించిన భయం అతడిని వెంటాడుతూనే ఉంది.

నందకుమార్ మేజర్ అవ్వడానికి ఇంకా మూడేళ్లు పడుతుంది. కానీ, చందన మైనారిటీ మరో నెలరోజుల్లో తీరనుంది. 2019 నవంబర్ 27 నాటికి చందన మేజర్ అవుతుంది.

'భగభగమని మండిపోయిన చందన'

అట్లా ఇద్దరూ అక్టోబర్ 12న ఇల్లు చేరారు. ఆ సాయంత్రం, చందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నందకుమార్, చందన ఊరిలోని తన మిత్రుడికి ఫోన్ చేశాడు. చందన గురించి ఆరా తీయమన్నాడు. కాసేపటికి, ఆ మిత్రుడు నందకుమార్‌కు ఫోన్ చేసి, చందన చనిపోయిందని చెప్పాడు. తల్లిదండ్రులే ఆమెను చంపినట్లు అందరూ అనుకుంటున్నారని చెప్పాడు.

దీంతో నందకుమార్‌కు అంతా శూన్యంలా అనిపించింది.

''నన్ను కూడా ఆ అమ్మాయిలాగే కాల్చేసింటే బాగుండనిపిస్తుంది! ఇంకెందుకురా జీవితం అనిపిస్తోంది'' అని అతడు చెప్పాడు.

చందన ఆత్మహత్య చేసుకుందన్న వాదనతో నందకుమార్ ఏమాత్రం ఏకీభవించడం లేదు. ఆ విషయం గురించి మాట్లాడుతూ,

''చందన పిరికి అమ్మాయి కాదు. చానా గట్టిది. ఒకసారి ఇంటర్‌లో, మేమిద్దరం కలిసి తిరగడం మా లెక్చరర్ చూసి, ఇద్దర్నీ దండించినాడు. అప్పుడు చందన, సార్... మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏ తప్పు చేయలేదు. మీకు, మీ కాలేజీకి ఏమైనా రిమార్క్ తెచ్చినామా? అట్లయితే తిట్టండి, పడతాం. అని మాట్లాడింది. చందన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? నేనింకా బతికేవున్నా కదా. చందనను వాళ్లే సంపుండారు. ఊసరపెంటలో ఎస్సీ పిల్లోన్ని ప్రేమించి పెండ్లి చేసుకుందని బాలింతరాలిని చంపేసినారుకదా, అట్లే నిన్నూ సంపుతానని వాళ్ల నాయిన ఎప్పుడూ బెదిరించేవాడంట'' అన్నాడు.

ఊసరపెంటలో ఏం జరిగింది?

ఊసరపెంటలో బాలిక హత్య గురించి కణ్నన్న వివరించారు.

''పలమనేరు మండలం ఊసరపెంటలో మూడు నెలల కిందట రోజుల బాలింతను హత్య చేసినారు. రెండేండ్ల కిందట ఊసరపెంట అమ్మాయి, ఒక దళితుడిని పెండ్లి చేసుకుని వెళ్లిపోయింది. మూడు నెలల కిందటే వాళ్లకు ఒక మగ బిడ్డ పుట్టినాడు. పిల్లోనికి ఆరోగ్యం బాలేదని హాస్పిటల్‌కు తీసుకుపోయి వస్తున్నపుడు, దారిలో కాపుకాసి, అమ్మాయి తరపు బంధువులు, భర్తను కొట్టి, ఆమెను బైక్‌లో ఎక్కించుకుని పోయినారు. అంతే, కొంత దూరంలో ఉన్న మామిడి తోపులోకి తీసుకుపోయి, ఆ బాలింతను చంపేసినారు.''

చిత్రం శీర్షిక సీఐ కృష్ణమోహన్

చందన మరణంపై పోలీసులేమంటున్నారు?

"12వ తేదీ సాయంత్రం, తోటలోని ఇంటి దూలానికి ఉరి వేసుకుని చందన ఆత్మహత్య చేసుకుందని, ఆమె తల్లిదండ్రులు గ్రామస్థులతో చెప్పారు. ఆ తర్వాత, ఆమె శవాన్ని మోసుకుని, ఆ ఇంటికి వెనకవైపు కొద్ది దూరం వెళ్లారు. అక్కడ చదునుగా ఉన్న స్థలంలో చందన శవాన్ని ఉంచారు. ఎండిపోయిన కట్టెలను చందనపై పేర్చి, పెట్రోల్ పోసి తగులబెట్టారు" అని పోలీసులు తెలిపారు.

చందనకు అంత్యక్రియలు పూర్తి చేసి, ఆ అస్తికలను, బూడిదని ఆరు సంచుల్లో నింపి, అక్కడికి 20 కి.మీ. దూరంలో, కర్నాటక రాష్ట్రంలో ఉన్న ఒక చెరువులో ఆ సంచులను పడేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని రాళ్లబూదుగూరు సీఐ కృష్ణమోహన్ బీబీసీకి తెలిపారు.

''పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చందన శవాన్ని తగులబెట్టారు. నిప్పంటించడం తమ ఆచారం అని వారు చెబుతున్నా, ఆత్మహత్యయినా పోలీసులకు చెప్పకపోవడం తప్పు. చందన అస్తికలను కూడా దూరంగా వెళ్లి పడేశారు. హడావుడిగా తతంగం ముగించారు. ఇవన్నీ చూస్తుంటే అనుమానం కలగకపోదుకదా'' అని కృష్ణమోహన్ బీబీసీతో అన్నారు.

ఆత్మహత్య, యాక్సిడెంట్, కరెంట్ షాక్, నీళ్లలో మునగడం... లాంటి సందర్భాల్లో చనిపోయినవారిని, పైగా పెళ్లికానివారిని ఇలాగే దహనం చేయడం తమ ఆచారమని చందన అమ్మమ్మ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

దహనం చేసిన తర్వాత అస్తికలను, బూడిదను అలాగే ఉంచితే, ఆ ప్రాంతంలోని క్షుద్రపూజలు చేసేవారు ఆ అస్తికలతో తమకు చెడు చేస్తారని ఆమె తమ ఆందోళనను వివరించారు.

చందనను దహనం చేసిన ప్రదేశం పచ్చటి పొలాల మధ్య ఒక నల్లటి మచ్చలా తయారైంది. చందనను దహనం చేసినపుడు, ఆ మంటలకు పక్కనేవున్న ఓ చెట్టు సగం కాలిపోయింది.

'అంతెత్తు మంటలు, పైగా కమురు వాసన!'

''మేం నందకుమార్ ఇంటి పక్కనే ఉంటాం. ఆరోజు కూడా, ఈడనే కుచ్చోని, పాపను ఆ తల్లిదండ్రులే తోడ్కోనిపోయినారంట అని మాట్లాడతాంటిమి. ఉన్నట్లుండీ ఎవురో, ఎనకపక్క ఏందో రగులుతాంది అని అరిసిరి. యాడయాడ..! అని తిరిగి చూస్తే, ఇంతెత్తున ఎగిసిపడతాండాయ్ మంటలు. ఎంటనే కమురు వాసన వచ్చేశ. తీరా చూస్తే పాపం ఆ బిడ్డనే ఆడ కాల్చుండారు'' అని నందకుమార్ పొరుగింటామె బీబీసీకి తెలిపింది.

తక్కువ జాతి పిల్లోన్ని పెండ్లి చేసుకోందని ఆ బిడ్డను అన్యాయంగా సంపేసుండారు. పిల్లోల్లు చేసింది రైటు అని నేను చెప్పను. కానీ, ఆ పాప తల్లిదండ్రులు చేసింది ఏమంటారు సార్? వాళ్లకు సంపేంత కోపం ఉన్నప్పుడు, పోనీలే... అని మాకు ఇడిసిపెట్టిన్నా, ఆ పాపను మా బిడ్డతోపాటే సాక్కుంటాంటిమి. ఇప్పుడు ఎవరికి ఏమొచ్చె? ఏం మిగిలె? ఆ పాపను తల్సుకుంటా వీడిట్లా అయిపాయ'' అని నందకుమార్ తల్లి గంగమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నారు.

'చందన మమ్మల్ని మోసం చేసింది'

చందన తల్లిదండ్రులు, బంధువులు పోలీసు కస్టడీలో ఉండటంతో, వారితో మాట్లాడటానికి కుదరలేదు. కానీ, చందన అక్క, అమ్మమ్మను బీబీసీ కలిసింది. చందన గురించి మాట్లాడటానికి వాళ్లు పెద్దగా ఇష్టపడలేదు. చందన అక్క అభిప్రాయం పొడిమాటల్లో...

''ఆ పాప మా అందర్నీ మోసం చేసింది. మా నాయన్ని చానా ఇబ్బంది పెట్టింది. వాడిని మరచిపోమని వేడుకుంటాండె మా నాయిన. కానీ ఆ పాప వినలేదు. మమ్మల్ని చానా సతాయించింది. నాతో కూడా ఏందీ చెప్పేదికాదు. మా పెదనాయన కూతురు కూడా ఇట్లే ఒక ఎస్సీ పిల్లోన్ని ప్రేమించి పెండ్లి చేసుకునింది. అప్పటినుంచి వాళ్లతో మాటల్లేవు. ఆయమ్మ ఇప్పుడు యాడుందో కూడా తెలీదు. అప్పుడే మా నాయన, పెదనాయన చానా బాధపడినారు. ఇప్పుడు చందన కూడా అట్లే చేసింది'' అని చందన అక్క బీబీసీకి తెలిపింది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది.

చందన ఆత్మహత్య చేసుకుంటే, మీ తల్లిదండ్రులను పోలీసులు ఎందుకు విచారిస్తున్నారని ఆమెను అడిగితే,

''ఆ పాప ఆత్మహత్య చేసుకున్నంక, అందరూ కలిసి దహనం చేసినారు అందుకే మా అమ్మానాన్నలను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్సీ కులసంఘాలు ధర్నాలు చేసినాయి. వాళ్లకు అదేందో ఉందంట కదా, అంబేద్కర్... అదేందో ఇచ్చినాడంట. వాళ్లు అట్ల చేయొచ్చంట. అందుకు వాళ్లు ధర్నా చేస్తే, పోలీసులు మా అమ్మానాయినల్ని పిలుచుకుపోయినారు'' అని ముగించింది ఆమె.

చందన అక్క మాటల్లో, స్వరంలో బాధకు బదులు, చందన పట్ల కోపం కనిపించింది.

''అవును, చట్టం ముందు అందరూ సమానమే అని వాళ్లు చెప్పుతారు. కానీ మా ఊర్లో సమానం అనరు. ఇక్కడ ఇంతే!'' అని నందకుమార్ తల్లి అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కరోనా లాక్‌డౌన్: ఏపీలో 162, తెలంగాణలో 229కి చేరిన మొత్తం కేసులు

కరోనావైరస్: సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అంటే ఏంటి? ఎవరిని ఒంటరిగా ఉంచాలి?

రోజుల బిడ్డ ఉన్నా.. కరోనావైరస్ సమయంలో విధుల్లో చేరిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం

తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..

కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?

ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల‌ కార్మికుల వేదన

ఇండియా లాక్‌డౌన్: వలస కార్మికుల కష్టాలు.. తప్పెవరిది.. మోదీ ఎందుకు క్షమాపణ చెప్పారు

కరోనావైరస్: వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం తయారుచేసిన మెర్సిడెస్ ఫార్ములా వన్ టీం