అసోం: తండ్రి శవాన్ని తీసుకోడానికి నిరాకరించిన కొడుకులు.. కారణమేంటి

  • 20 అక్టోబర్ 2019
తండ్రి శవాన్ని తీసుకోని కొడుకులు Image copyright DILIP SHARMA/BBC

"మా నాన్నను బంగ్లాదేశీయుడు అని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లారు. రెండేళ్లు డిటెన్షన్ క్యాంపులోనే ఉంచారు. ఇప్పుడు ఆయన కస్టడీలోనే చనిపోవడంతో, శవాన్ని తీసుకెళ్లమని ప్రభుత్వం మాపై ఒత్తిడి తెస్తోంది. ఇదేం న్యాయం".

25 ఏళ్ల అశోక్ పాల్ తన తండ్రి మరణంతో ప్రభుత్వం తీరుపై చాలా కోపంగా ఉన్నారు.

"మా నాన్న బతికున్నప్పుడు ఆయనపై బంగ్లాదేశీయుడని ముద్ర వేశారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన భారతీయుడు ఎలా అవుతాడు. ఆయన భారత పౌరుడే అని ప్రభుత్వం మాకు రాసివ్వాలి. అప్పుడే ఆయన శవాన్ని తీసుకుంటాం. మేం బంగ్లాదేశీయుడి మృతదేహం కోసం వెళ్లం" అని చెప్పారు.

నిజానికి అసోం తేజ్‌పూర్‌ సెంట్రల్ జైల్లో ఏర్పాటు చేసిన డిటెన్షన్ క్యాంపులో ఉన్న 65 ఏళ్ల దులాల్ చంద్రపాల్ అనే ఖైదీ మరణం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా గందరగోళ పరిస్థితుల్లో పడేసింది.

అనారోగ్యంతో ఉన్న దులాల్ చంద్రపాల్ గత ఆదివారం గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మృతిచెందారు. అప్పటి నుంచి ఆయన మృతదేహం మార్చురీలోనే ఉంది.

Image copyright DILIP SHARMA/BBC
చిత్రం శీర్షిక మృతుడు దులాల్ చంద్రపాల్

శవం తీసుకోడానికి నిరాకరించిన కుటుంబం

దులాల్ చంద్రపాల్ శవం తీసుకువెళ్లేలా కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయన స్వగ్రామానికి ఒక ప్రతినిధి మండలిని కూడా పంపించింది. కానీ దులాల్ చంద్రపాల్‌ భారత పౌరుడే అని ప్రభుత్వం ప్రకటించేవరకూ ఆయన మృతదేహం తీసుకునేది లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

శోణిత్‌పూర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మానవేంద్ర ప్రతాప్ సింగ్ ఈ ఘటన గురించి చెబుతూ "విదేశీ ట్రైబ్యునల్ దులాల్ చంద్రపాల్‌ను 2017లో విదేశీయుడని ప్రకటించింది. అప్పుడు ఆయన మానసికంగా అనారోగ్యంతో ఉన్నారు. తర్వాత డిటెన్షన్ క్యాంప్‌కు పంపించారు" అని చెప్పారు.

పాల్‌కు మధుమేహం తీవ్రంగా ఉందని మానవేంద్ర్ చెప్పారు. "గత నెల 26న అనారోగ్యానికి గురవడంతో ఆయన్ను తేజ్‌పూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చించాం. తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం పాల్‌ను గువాహటి మెడికల్ కాలేజీకి పంపించాం. అక్కడ ఆయన అక్టోబర్ 13న చనిపోయాడు" అన్నారు.

"పాల్ మృతి తర్వాత అధికారులు ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించినపుడు, మొదట ఆయన్ను భారత పౌరుడుగా ప్రకటించాలని, తర్వాత మృతదేహం తీసుకుంటామని వాళ్లు చెప్పారు. కానీ, దానికి జిల్లా యంత్రాంగం ఏ చేయగలదు. దులాల్ చంద్రపాల్‌ను శోణిత్‌పూర్‌లోని ఒక విదేశీ ట్రైబ్యునల్ విదేశీయుడుగా ప్రకటించింది" అని ఆయన చెప్పారు.

"ఆ తర్వాత పాల్ కుటుంబ సభ్యులు గువాహటీ హైకోర్టులో కూడా అపీల్ చేశారు. కానీ అక్కడ కూడా వారి పిటిషన్‌ను కొట్టేశారు. ఆయన్ను విదేశీయుడనే చెప్పారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్లి ఆయన్ను భారత పౌరుడుగా ప్రకటించే అధికారం జిల్లా యంత్రాంగానికి ఎలా ఉంటుంది" అన్నారు.

Image copyright DILIP SHARMA/BBC
చిత్రం శీర్షిక అశోక్ పాల్

జిల్లా అధికారులు ఏం చేస్తారు

పాల్ మరణించి ఆరు రోజులైంది. కుటుంబ సభ్యులు ఆయన శవం తీసుకోకపోతే అధికారులు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా "నిజానికి శవాన్ని ఏం చేయాలి అనేదానిపై బోర్డర్ పోలీస్, విదేశీ ట్రైబ్యునల్ మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఈ విషయంలో జిల్లా అధికారులకు ఎలాంటి పాత్రా ఉండదు" అని ఆయన చెప్పారు.

"మృతుడి శవాన్ని తీసుకురావడానికి కుటుంబ సభ్యులకు మా సాయం కావాలన్నా, లేక వేరే ఏదైనా చట్టపరమైన సాయం అవసరమైనా మేం కచ్చితంగా చేస్తాం. ఈ ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా అధికారులను కూడా ఆదేశించాం" అన్నారు.

Image copyright DILIP SHARMA
చిత్రం శీర్షిక జాతీయ రహదారిపై బెంగాలీ హందువుల ఆందోళన

జైలు అధికారుల నిర్లక్ష్యం

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే చంద్రపాల్ చనిపోయారని ఆయన కుటుంబం ఆరోపిస్తోంది.

దులాల్ పెద్ద కొడుకు అశోక్ పాల్ బీబీసీతో "రెండేళ్ల ముందు మా నాన్నను డిటెన్షన్ క్యాంప్‌కు తీసుకెళ్లినపుడు ఆయన చాలా బాగున్నారు. మానసికంగా కాస్త అనారోగ్యంతో ఉన్నారు. కానీ జైలుకు వెళ్లిన కొన్ని నెలల్లోనే ఆయన చాలా బలహీనంగా అయిపోయారు. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు" అని చెప్పారు.

"మేం ఆయన్న ఎప్పుడు కలవడానికి వెళ్లినా ఆయన 'నన్నుఇక్కడ్నుంచి ఎప్పుడు బయటకు తీసుకెళ్తారు' అని ఒకే మాట అడిగేవారు. ఆ డిటెన్షన్ క్యాంపులో ఆయనకు సరిగా తిండి పెట్టలేదని, చాలా కష్టంగా ఉండేదని మాకు తెలిసింది".

ప్రభుత్వ ఏర్పాట్లను ప్రశ్నిస్తూ "మా నాన్నను చికిత్స కోసం గువాహటి మెడికల్ కాలేజ్ తీసుకెళ్లినపుడు అక్కడ ఐసీయూలో చేర్పించారని మాకు చెప్పారు. కానీ మా అన్న, అమ్మతో ఆయన్ను చూడ్డానికి వెళ్లినపుడు మా నాన్న ఆస్పత్రి వరండాలో ఒక మంచంపై కనిపించారు" అని అశోక్‌పాల్ చెప్పారు.

"మా నాన్న అప్పుడు సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న ఇద్దరు పోలీసులు మీ నాన్న ఐదు రోజులుగా ఏం తినలేదని మాకు చెప్పారు. తర్వాత రోజు ఉదయం తొమ్మిదిన్నరకు ఆయన చనిపోయారు" అన్నాడు.

Image copyright DILIP SHARMA/BBC
చిత్రం శీర్షిక అసోం ముఖ్యమంత్రికి పంపిన మెమరాండం

విచారణకు ఆదేశం

ఇటు, అసోం ప్రభుత్వం దులాల్ చంద్రపాల్ మృతిపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. శోణిత్‌పూర్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ పరాగ్ కాకోతీ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పాల్ మృతి హిందూ బెంగాలీ సమాజంలో ఆగ్రహం తెప్పించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆల్ అసోం బెంగాలీ యూత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అక్టోబర్ 16న ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ఒక వినతిపత్రం కూడా పంపించారు. దులాల్ చంద్రపాల్‌ను భారత పౌరుడుగా ప్రకటించాలని అందులో కోరారు.

"మా ఫెడరేషన్ సర్కిల్ అధికారి ద్వారా ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం పంపించాం. అందులో దులాల్ చంద్రపాల్‌ను భారత పౌరుడుగా ప్రకటించాలని, ఆ తర్వాతే ఆయన మృతదేహాన్ని తీసుకోడానికి వెళ్తామని స్పష్టంగా చెప్పాం" అని ఆల్ అసోం బెంగాలీ యూత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్ డే బీబీసీకి చెప్పారు.

"దులాల్ కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నారు. ఆయన బంగ్లాదేశీ అయితే ప్రభుత్వం ఆ శవాన్ని బంగ్లాదేశ్ పంపించవచ్చు అంటున్నారు. ఇది దులాల్ చంద్రపాల్‌ ఒక్కరికి సంబంధించిన విషయమే కాదు, అసోంలో డిటెన్షన్ క్యాంపుల్లో ఉన్న చాలామంది హిందూ బెంగాలీలతో ఇలాగే వ్యవహరిస్తున్నారు" అన్నారు.

"నేను స్వయంగా డిటెన్షన్ క్యాంపులకు వెళ్లి అక్కడి వారిని కలిశాను. భారత పౌరసత్వానకి సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ, చాలా మందిని ఆ డిటెన్షన్ క్యాంపుల్లో బంధించారు".

Image copyright DILIP SHARMA/BB

బెంగాలీ హిందువులకు అంత కోపం ఎందుకు

అసోంలో 2011 జనభా లెక్కల ప్రకారం బెంగాలీ మాట్లాడే ప్రజల జనాభా 91 లక్షలకు పైనే ఉంది. అంటే అది రాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు 29 శాతం. వారిలో సుమారు 31 శాతం బెంగాలీ మాట్లాడే హిందువులు ఉన్నారు.

ఎప్పుడూ హిందువుల గురించి మాట్లాడే బీజేపీ పాలనలో బెంగాలీ హిందువుల మనసులో అంత ఆగ్రహం ఎందుకు ఉంది.

దీనిపై ప్రదీప్ "హిందూ బెంగాలీలకు వ్యతిరేకంగా బీజేపీ పాలనలో జరిగినట్లు ఇంత అన్యాయం గతంలో ఏ ప్రభుత్వంలో జరగలేదు. ఎన్ఆర్సీ పైనల్ జాబితాలో 12 లక్షలకు పైగా హిందువుల పేర్లు లేవు" అన్నారు.

శోణిత్‌పూర్ జిల్లాలో డేకియాజూలీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే రబడ్తలా ఆలీసీంగా గ్రామంలోని దులాల్ చంద్రపాల్ ఇంటికి ఇప్పుడు బంధువుల నుంచి ప్రభుత్వ అధికారులు, సామాజిక సంస్థలకు సంబంధించిన చాలామంది వస్తూపోతూ ఉన్నారు.

ఈ చిన్న గ్రామంలో హిందూ బెంగాలీ కుటుంబాలు దాదాపు 200 ఉంటున్నాయి. వారంతా ఇప్పుడు ఈ ఘటనతో భయపడిపోతున్నారు. గత సోమవారం గ్రామస్థులు ఆగ్రహంతో జాతీయ రహదారి 15పై ఆందోళనలు కూడా చేశారు.

Image copyright DILIP SHARMA
చిత్రం శీర్షిక ముఖ్యమంత్రికి పంపిన మెమరాండం

గ్రామస్థుల్లో భయం భయం

విదేశీయుడుగా ప్రకటించిన పాల్ మృతదేహాన్ని తీసుకుంటే, తర్వాత తమ కుటుంబాల్లో వారిపై కూడా విదేశీయులుగా ముద్ర వేస్తారేమోనని గ్రామస్థులు భయపడిపోతున్నారు.

దులాల్ చంద్రపాల్ మేనల్లుడు శుకుమల్ పాల్ "అధికారులు శవం తీసుకెళ్లాలంటూ మా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ మృతదేహాన్ని తీసుకునే ముందు ప్రభుత్వం మా మామయ్య దులాల్ చంద్రపాల్ విదేశీయుడని ప్రకటించిన అదే పేపరుపై ఆయన భారతీయుడేనని రాసి సంతకం పెట్టాలి. మేం ఒక విదేశీయుడి శవాన్ని ఎలా తీసుకోగలం మీరే చెప్పండి" అన్నారు.

"మా మామయ్య దగ్గర భారత పౌరసత్వానికి సంబంధించి 1965 నాటి పత్రాలు ఉన్నాయి. కానీ ఆయన్ను విదేశీయుడని అంటున్నారు. అసోంలో హిందూ బెంగాలీల ఘటనలు చాలా జరిగాయి. అందుకే, ఇప్పుడు మాకు చాలా భయమేస్తోంది" అని చెప్పాడు.

దులాల్ చంద్రపాల్‌ భార్య, ముగ్గురు కొడుకులు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. తండ్రి అంత్యక్రియలు చేయకపోగా, మరణం తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం చేయాల్సిన ఆచారాలు కూడా నిర్వహించలేకపోతున్నారు.

"మాకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరుంటారు చెప్పండి. మా నాన్నకు తలకొరివి కూడా పెట్టలేకపోతున్నాం. మేం విదేశీ పౌరుడుగా చెప్పిన, మా నాన్న శవాన్ని తీసుకుంటే మా ముగ్గురు సోదరులను కూడా విదేశీయలుగా ప్రకటించి జైల్లో పెడతారు" అని అశోక్ పాల్ చెబుతున్నాడు.

"ఎన్ఆర్సీ ఫైనల్ జాబితాలో మా ముగ్గురి పేర్లూ లేవు. మా అమ్మ పేరు మాత్రమే ఉంది. ముందు ముందు మమ్మల్ని ఏం చేస్తారో తెలీడం లేదు" అంటున్నాడు అశోక్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: తాహిర్ హుస్సేన్‌‌పై హత్యాయత్నం కేసు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఆప్

దిల్లీ హింస: ‘హిందువుల ఆలయాలను ముస్లింలు రక్షించారు’

వాట్సాప్, ట్విటర్, టిక్‌టాక్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

యువకుడి ఆచూకీ కోసం వెదుకుతుంటే సింహాల బోనులో అస్థిపంజరం దొరికింది

కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా.. శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’

యాపిల్ మొట్టమొదటి ఇండియన్ స్టోర్ 2021లో ప్రారంభం: టిమ్ కుక్

దిల్లీ హింస: జస్టిస్ మురళీధర్ ఎవరు.. ఆయన బదిలీపై చర్చ ఎందుకు

దిల్లీ హింస ప్రభావం హైదరాబాద్‌పై ఎలా ఉంది

దిల్లీ హింసను 2002 నాటి గుజరాత్ అల్లర్లతో ఎందుకు పోలుస్తున్నారంటే...