భారత సైన్యం దాడిలో 6 నుంచి 10 మంది పాక్ సైనికులు మృతి: ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రకటన

  • 20 అక్టోబర్ 2019
కార్గిల్ యుద్ధం Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

పాకిస్తాన్ అధీనంలోని కశ్మీర్ ప్రాంతంలో ఉన్న మూడు ‘ఉగ్రవాద’ స్థావరాలపై భారత సైన్యం దాడిచేసిందని, ఆ దాడుల్లో 6 నుంచి 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ చెప్పారు. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులూ హతమయ్యారని ఆయన తెలిపారు.

ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన నీలం లోయలో లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు చెందిన నాలుగు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు చేసిందని, ఆ దాడుల్లో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. నాలుగో స్థావరం కూడా పాక్షికంగా ధ్వంసమైందన్నారు.

అంతకుముందు పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే జమ్మూ పౌరులపై కాల్పులు జరిపిందని భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.

పాకిస్తాన్ సైన్యం కాల్పుల వల్ల జమ్ములోని గుణదిష్ట్, తంగ్దర్ గ్రామాల్లో ఒక పౌరుడు చనిపోయాడని మరో ముగ్గురు గాయపడ్డారని చెప్పింది.

"పాక్ దళాల కాల్పుల్లో 55 ఏళ్ల మొహమ్మద్ సాదిక్ చనిపోయారు. ఈ కాల్పుల్లో 70 ఏళ్ల మొహమ్మద్ మక్బూల్, 50 ఏళ్ల మొహమ్మద్ షఫీ, 22 ఏళ్ల యూసఫ్ హామిద్ గాయపడ్డారు. తీవ్రవాదులను భారత్‌లోకి పంపేందుకే పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది" అని ఇండియన్ ఆర్మీ తమ ప్రకటనలో చెప్పింది.

అటు భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆరోపించారు. దీనిపై ట్వీట్ చేసిన ఆయన "ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా జురా, షాకోట్, నౌషోరీ సెక్టార్లలో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది" అని ఆరోపించారు.

"మేం దానికి తగిన సమాధానం ఇచ్చాం. భారత సైన్యంలో 9 మంది జవాన్లు మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. రెండు భారత బంకర్లు ధ్వంసం చేశాం. ఆ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఒక పాకిస్తాన్ జవాన్, ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు, ఐదుగురు పౌరులు గాయపడ్డారు" అని తెలిపారు.

Image copyright Getty Images

మరోవైపు, భారత సైన్యం ఆదివారం పాక్ అధీనంలోని కశ్మీర్ ఉన్న తీవ్రవాద శిబిరాలపై దాడులు చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

పాక్ పాలిత కశ్మీర్‌లోని జురా, ఆత్ముఖామ్, కుందాల్‌సాహీల్లోని మిలిటెంట్ శిబిరాలపై భారత సైన్యం గత రాత్రి ఆర్టిలరీ గన్స్‌తో దాడులు చేసినట్లు సమాచారం ఉందంటూ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

భారతదేశంలోకి తీవ్రవాదులను పంపించేందుకు ప్రయత్నిస్తున్న శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

పాక్ అధీనంలోని కశ్మీర్‌లో ఉన్న నీలం లోయలో ఈ దాడులు జరిగాయని, మృతులకు సంబంధించిన సమాచారం కూడా అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

ఆ వర్గాల సమాచారం ప్రకారం తీవ్రవాదులను భారతదేశ భూభాగంలోకి చొరబడేలా చేసేందుకు పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూకశ్మీర్‌లోన కుప్వారా సెక్టార్ పరిధిలోని తంగ్‌ధార్ ప్రాంతంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు, ఒక పౌరుడు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం