మలద్వారంలో పెట్టుకుని బంగారం క్యాప్సుల్స్‌ అక్రమ రవాణా.. శంషాబాద్‌లో స్మగ్లర్ అరెస్టు: ప్రెస్ రివ్యూ

  • 21 అక్టోబర్ 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

బంగారం క్యాప్సుల్స్‌ను మల ద్వారంలోకి చొప్పించుకుని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ కథనం రాసింది.

బంగారాన్ని పేస్ట్‌లా మార్చి, నల్లటి టేప్‌తో ఉండలుగా చుట్టి అతడు మలద్వారంలో చొప్పించుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.

అతడి దగ్గర లభించిన రూ.27,87,400 విలువైన పేస్ట్ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) హైదరాబాద్ యూనిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో, డీఆర్ఐ అధికారులు మాటు వేసి పట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

శనివారం రాత్రి జెడ్డా నుంచి వచ్చిన మరో ముగ్గురు ప్రయాణికుల వద్ద మొత్తం 915.17 గ్రాముల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో హైవేలపై ఎమర్జెన్సీ క్లినిక్‌లు

ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో గాయపడే వారికి అత్యవసర చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్సార్ రహదారి అత్యవసర చికిత్స కేంద్రాల' ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

మొత్తం 4,500 కి.మీ.ల పొడవున రాష్ట్రంలో ఈ రహదారులున్నాయి. ప్రతి 50 కి.మీ.ల దూరానికి ఒకటి చొప్పున మొత్తం 90 హెచ్‌ఈసీ (హైవే ఎమర్జెన్సీ క్లినిక్)లను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సూచనల మేరకు ఈ క్లినిక్‌లను ప్రారంభిస్తోంది. ఒక్కో క్లినిక్‌కు రూ.80 లక్షలు చొప్పున మొత్తం 90 క్లినిక్‌లకు రూ.72 కోట్లు ఖర్చు చేయనుంది.

శిక్షణ పొందిన పారా మెడికల్‌ సిబ్బందిని హెచ్‌ఈసీల్లో నియమిస్తారు. ఈ కేంద్రాలను 108 సర్వీసుతో అనుసంధానిస్తారు.

వందం శాతం బస్సులు నడపాలని కేసీఆర్ ఆదేశం

తెలంగాణలో విద్యా సంస్థలు సోమవారం తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు వంద శాతం నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ వార్త రాసింది.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పరిస్థితులపై సీఎం ఆదివారం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

సోమవారం నుంచి అన్ని డిపోల ద్వారా వంద శాతం బస్సులు నడపాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, సిబ్బందిని నియమించుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.

విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్దేశించినట్లు సమాచారం.

ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సహకరించిన విద్యా సంస్థలకు చెందిన వాహనాలు కూడా సోమవారం నుంచి అందుబాటులో ఉండవు. దీంతో ఆర్టీసీ బస్సులన్నింటినీ నడపాలని నిర్ణయించినట్లు సమాచారం.

శనివారం జరిగిన బంద్‌ ప్రభావం అంశం కూడా ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.

ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నా.. తాత్కాలిక ఉద్యోగుల ద్వారా ఆదివారం రాష్ట్రంలో 6,437 బస్సులను నడిపించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 4,502 మంది ప్రైవేటు డ్రైవర్లు, 6,437 మంది ప్రైవేటు కండక్టర్లు ఆదివారం పని చేసినట్లు పేర్కొంది.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై పెద్దఎత్తున వస్తున్న ఆరోపణలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధికారులను కోరారు.

విద్యుత్ Image copyright Getty Images

విశాఖలో సాధారణ ఇంటికి రూ.9.9 లక్షల విద్యుత్ బిల్లు

విశాఖపట్నంలోని కొత్తపాలెంలో ఓ సాధారణ ఇంటికి ఒక్క నెలకు రూ.9.92 లక్షల విద్యుత్ బిల్లు వచ్చినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

డి.నరసింగరావుకు చెందిన విద్యుత్ మీటర్‌పై గత నెల 12 నుంచి ఈ నెల 19 వరకు రీడింగ్‌ను నమోదు చేసుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది రూ.9.92 లక్షల బిల్లు వేశారు.

దీనిపై సంబంధిత అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు.

విద్యుత్ మీటర్‌లో లోపం వల్ల అంత బిల్లు వచ్చిందని విద్యుత్ శాఖ ఏఈ జి.వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.

గృహ వినియోగదారులకు రూ.15 వేలకు మించి నెల బిల్లు వస్తే, దాన్ని వినియోగదారుడికి కాకుండా, నేరుగా తమ కార్యాలయానికి ఇవ్వాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన రీడింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)