హైదరాబాద్‌లోని షైన్ పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, ఒక శిశువు మృతి

  • 21 అక్టోబర్ 2019
షైన్ పిల్లల వైద్యశాల Image copyright UGC

హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల వైద్యశాలలో అగ్నిప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా అందులో ఒక చిన్నారి మృతి చెందింది.

దీంతో, ఆస్పత్రి వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోచేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు స్పష్టం చేశారు.

Image copyright UGC

హాస్పటల్ భవనం అద్దాలు ధ్వంసం చేసి అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

"రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర గాయాలపాలైన చిన్నారులు ప్రస్తుతం ఇతర ఆస్పత్రులలోని ఎమర్జెన్సీ విభాగాల్లో చికిత్స పొందుతున్నారు" అని డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

అగ్ని ప్రమాదం జరిగినట్లు రాత్రి 2.59 గంటలకు తమకు ఫోన్ వచ్చిందిన ఫైర్ సిబ్బంది తెలిపారు. 3.06 గంటలకు తాము ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు.

"భవనం మూడో అంతస్తులో ప్రమాదం సంభవించింది. మా సిబ్బంది వెంటనే మూడో అంతస్తుకు చేరుకున్నారు. కానీ అప్పటికే అక్కడి గది అంతా పొగతో నిండిపోయింది. ఏం కనిపించలేదు. అద్దాలు పగలగొట్టి పొగను ముందు బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. ఈలోగా మిగిలిన సిబ్బంది మంటలు చెలరేగిన ప్రదేశాన్ని గుర్తించారు. ఓ మూలనున్న ఫ్రిడ్జ్ సమీపంలోనుంచి ఎగసి పడుతున్న మంటలను అదుపుచేశారు" అని అగ్నిమాపక విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో ఈ ప్రమాదం జరగడంతో అందులోని ఇంక్యుబేటర్లలో చికిత్స పొందుతున్న ఐదుగురు శిశువులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఆస్పత్రికి చేరేలోపే ఆస్పత్రి సిబ్బంది ఈ పిల్లలను ఆ గది నుంచి తరలించారు.

ఇదే అంతస్తులోని ఇతర గదుల్లో దాదాపు మరో 45 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారందరినీ షైన్ హాస్పటల్ నుంచి ఇతర ఆస్పత్రులకు సిబ్బంది, పోలీసులు తరలించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన ఐదుగురు పిల్లల్లో మూడు నెలల బాలుడు మృతి చెందాడు.

ఆస్పత్రిలోని ఫైర్ ఫైటింగ్ వ్యవస్థలు పనిచేయడం లేదని, నీటి పైపులను ఉపయోగించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించగా అవి కూడా పనిచేయలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు.

ఆస్పత్రిని సీజ్ చేసి, పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)