ఆంధ్రప్రదేశ్: కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

  • 22 అక్టోబర్ 2019
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

రెండు నెలలుగా కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగి భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. కొద్ది రోజుల కిందట జిల్లాలోని దువ్వూరు మండలం రామాపురం గ్రామంలో ఉల్లి సాగుచేస్తున్న పొలంలో భూమి కుంగిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. వేంపల్లె మండలం అశోక్ నగర్ గ్రామంలోని ఓ అరటి తోటలోనూ భూమి కుంగి గుంత ఏర్పడింది.

రెండు వారాల కిందట చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామంలో రైతు సుబ్బారాయుడి పొలంలోనూ భూమి కుంగిపోయింది. సుమారు 8 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతుతో గొయ్యి ఏర్పడింది. నెల రోజుల కిందట అదే మండలంలోని బయినపల్లెలో కూడా ఇలాగే భూమి ఉన్నట్టుండి కుంగిపోయింది. అంతకుముందు మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని గడ్డమాయపల్లె పొలాల్లోనూ ఇలానే జరిగింది.

జిల్లాలోని అనేక మండలాల్లో ఉన్నట్టుండి భారీ శబ్ధాలతో భూమి కుంగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

గోతుల భయంతో కూలీలు రావడం లేదు

వేంపల్లె మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన అరటి రైతు రామకృష్ణ దీనిపై మాట్లాడుతూ ''మూడెకరాల్లో అరటితోట వేశాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు నీరు పెట్టేందుకు తోటలోకి వచ్చాను. వాల్వ్ తిప్పుతుండగా చాల పెద్ద శబ్దం వినిపించింది. భయపడి దూరంగా పరుగెత్తాను. ఏం జరుగుతుందో అర్థంకాక ఇంటికి పోయి మా అన్నను తీసుకొచ్చాను. వచ్చి చూస్తే భారీ గొయ్యి పడింది. అది చూసి భయపడి తోటలో నుంచి బయటకెళ్లిపోయాం. ఇప్పటికీ తోటలోకి వచ్చి పనిచేయాలంటే.. ఎప్పుడు, ఎక్కడ నేల కుంగుతుందోనని భయంగానే ఉంటోంది. కూలీలు కూడా తోటలో పనికి రావటానికి ధైర్యం చేయటం లేదు. రెండేళ్ల కిందట కూడా ఈ ఊరిలో ఇలాగే జరిగింది. అప్పట్లో 15 అడుగుల గొయ్యి ఏర్పడింది. ఇప్పుడు అంతకంటే పెద్ద గొయ్యి ఏర్పడింది'' అన్నారు.

అడుగు వేయాలంటే భయమేస్తోంది

దువ్వూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఉల్లి రైతు వెంకటశివ మాట్లాడుతూ.. "ఇక్కడ 22 అడుగుల మేర గొయ్యి పడింది. పొలంలో కూలీలు పనులు చేస్తున్నప్పుడు ఇలా జరిగితే పెద్ద ప్రమాదమయ్యేది. పొలంలో అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. జిల్లాలో అనేకచోట్ల ఇలా జరుగుతున్నట్లు వార్తలు చూస్తున్నాం. ఎందుకిలా జరుగుతుందో అధికారులు, ప్రభుత్వం తేల్చాలి'' అన్నారు.

సురక్షిత ప్రాంతమో కాదో అధికారులు చెప్పాలి

''ఐదారేళ్ల నుంచి గూడవాండ్లపల్లె, నాగిరెడ్డి పల్లె వంక, బయినపల్లె వంక, బుగ్గ శివాలయం ప్రాంతాల్లో గుంతలు పడుతున్నాయి. అవి ఎందుకు పడుతున్నాయో ఏమో తెలియటంలేదు. వర్షాకాలంలోనే ఈ గుంతలు పడుతున్నాయి. గుంతలు పడినప్పుడు అధికారులు వస్తున్నారు.. పోతున్నారే తప్ప.. ఇది సురక్షిత ప్రాంతమా కాదా అన్నది స్పష్టంగా చెప్పడం లేదు" అని చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన రైతు రామకిశోర్ రెడ్డి తెలిపారు.

జిల్లాలోని వేంపల్లె, చింతకొమ్మదిన్నె, మైదుకూరు, దువ్వూరు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో ఉన్నట్టుండి భూమి కుంగిపోతున్న విషయాన్ని స్థానిక మండల రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఇదీ ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటని చెబుతున్నారు.

అశోక్ నగర్‌లో 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున భూమి కుంగిపోయిందని.. ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు గనులు, భూగర్భ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వేంపల్లె తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. గనులు, భూగర్భ శాఖ అధికారులు వచ్చి పరిశీలించి కలెక్టరుకు నివేదిక అందజేస్తారని ఆయన తెలిపారు.

గతంలోనూ..

కడప జిల్లాలోని వేంపల్లె, చింతకొమ్మదిన్నె మండలాల్లో గతంలోనూ ఇలాగే భూమి కుంగిపోయింది. 2015, 2017లో చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లి, నాగిరెడ్డిపల్లి, నాయనోరిపల్లి గ్రామాల్లో 20 నుంచి 40 అడుగుల మేర గోతులు ఏర్పడ్డాయి. వేంపల్లె మండలం అశోక్ నగర్‌లో 15 అడుగుల మేర గొయ్యి పడింది. ఒక్క బుగ్గ శివాలయం పరిసరాల్లోనే దాదాపు 20 చోట్ల గోతులు పడ్డాయి. అపట్లో పలువురు అధికారులు, భూగర్భ శాస్త్రవేత్తలు వచ్చి ఈ ప్రాంతాలను పరిశీలించారు. భూమి కింది భాగంలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని అప్పట్లో ధ్రువీకరించారు. ఇప్పుడు మళ్లీ అదే గ్రామాల్లో అదే మాదిరిగా భూమి కుంగడంతోపాటు కొత్తగా దువ్వూరు, మైదుకూరు మండలాలకు విస్తరించింది.

సున్నపురాయి నిక్షేపాలే కారణం

కడప జిల్లా పొలాల్లో హఠాత్తుగా ఏర్పడుతున్న భారీ గుంతలను సింక్ హోల్స్ అంటారని గనులు, భూగర్భ శాఖ అధికారులు తెలిపారు.

''భూమి పొరల్లో సున్నపురాయి నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇలా ఏర్పడుతుంటాయి. భూమిపొరల్లో సున్నపురాయి నిక్షేపాలున్న నదీ పరీవాహక ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఏర్పడుతుంటాయి. సహజంగా సున్నపురాయి.. ఆమ్లాలతో కలిసినపుడు రసాయన చర్య జరుగుతుంది. ఆమ్ల వర్షాలు కురిసినప్పుడు ఆ నీరు భూమి పొరల్లోకి ఇంకి అక్కడున్న సున్నపురాయితో కలుస్తుంది. అప్పుడు రసాయన చర్య జరిగి, సున్నపురాయి కరిగి, ఆ ప్రాంతంలో ఖాళీ ఏర్పడుతుంది. భూమి పొరలో ఖాళీ ఏర్పడడంతో పైనుంచి గుంత పడుతుంది.

ఆ ప్రాంతంలో భూమి లోపల ప్రవహించే నీటి తాకిడి ఎక్కువైనప్పుడు ఈ ఖాళీ ప్రదేశాలు మరింతగా విస్తరిస్తాయి'' అని తెలిపారు.

చిత్రం శీర్షిక గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

కడప గనులు, భూగర్భ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు దీనిపై మాట్లాడారు.

''కడప, చింతకొమ్మదిన్నె, యర్రగుంట్ల, వేంపల్లె, దువ్వూరు ఏరియాల్లోని భూమి పొరల్లో ఎక్కువగా లైమ్ స్టోన్ (సున్నపురాయి) నిక్షేపాలున్నాయి. ఇటీవల జిల్లాలో భారీగా వర్షాలు కురవడంతోపాటు నదుల్లోకి భారీగా నీరుచేరింది. వర్షపునీరు భూమిలోకి ఇంకటంవల్ల లేదా నదులు, కాలువల్లోని నీరు భూమిపొరల్లోకి చేరి అక్కడి సున్నపురాళ్లతో కలవటంవల్ల రసాయన చర్య జరిగి ఈ సింక్ హోల్స్ ఏర్పడుతున్నాయి. వీటివల్ల ఇప్పటివరకూ పెను ప్రమాదమేం జరగలేదు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా భూమి గుల్లబారి ఉన్నచోట, నీటి ప్రవాహం, నీటినిల్వ, సున్నం ఎక్కువగా దొరికే ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ గుంతలు ఒక్కోసారి పెద్ద ప్రమాదాలకు దారి తీయొచ్చు'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

టెలికాం రంగంలో ఏం జరుగుతోంది.. మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరముందా

"పాకిస్తాన్‌ వ్యతిరేక ప్రచారానికి దిల్లీ కేంద్రంగా నకిలీ మీడియా సంస్థలు" - ఇది నిజమేనా?

శబరిమలకు 10 మంది విజయవాడ మహిళలు.. వెనక్కి పంపిన పోలీసులు

అతిపెద్ద డంప్ యార్డ్ పాతికేళ్ల ముందే నిండిపోయింది

మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...

తెలంగాణ ఆర్టీసీ సమ్మె: కార్మికుల నిరాహార దీక్షలు... అశ్వత్థామరెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు

గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి

ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు