ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలన్న భద్రతా సిబ్బంది: కోల్‌కతా విమానాశ్రయంలో వికలాంగ ఉద్యమకారులకు అవమానం

  • 22 అక్టోబర్ 2019
కుహు దాస్, జీజా ఘోష్ Image copyright COURTESY: KUHU DAS
చిత్రం శీర్షిక వికలాంగ ఉద్యమకారులు కుహూ దాస్ (ఎడమవైపు నిలుచున్న వ్యక్తి), జీజా ఘోష్ (కూర్చుని ఉన్న వ్యక్తి)లు విమానాశ్రయంలో తమను అవమానించినట్లు భావిస్తున్నామని చెప్పారు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు ఇద్దరు వికలాంగ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తన ప్యాంటు విప్పాలని చెప్పారని ఆ ఇద్దరిలో ఓ ఉద్యమకారిణి పేర్కొన్నారు.

కుహూ దాస్ పోలియో బాధితురాలు. ఆమె కాలిపర్స్‌ను విప్పి పక్కనపెట్టాలని భద్రతా సిబ్బందిలో మహిళా అధికారి చెప్పారు. తన ప్యాంటు విప్పకుండా కాలిపర్స్‌ను విప్పి పక్కన పెట్టటం సాధ్యం కాదని కుహు దాస్ చెప్పినా.. విప్పి తీరాల్సిందేనని సదరు అధికారి పట్టుపట్టారు.

సెరిబ్రల్ పాల్సీ ఉద్యమకారిణి అయినా జీజా ఘోష్‌ను సహాయకురాలు తోడు లేకుండా విమానంలో ప్రయాణించటానికి వీలులేదని నిలువరించారు.

వికలాంగ మహిళల హక్కుల మీద దిల్లీలో ఒక సమావేశంలో పాల్గొనటానికి వీరు కోల్‌కతా విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు వచ్చారు.

భద్రతా సిబ్బంది తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటంతో వారిని ప్రయాణానికి అనుమతించారు. అయితే.. 'అవమానానికి, చీత్కారానికి' గురైనట్లు తాము భావిస్తున్నామని ఈ ఉద్యమకారులు చెప్తున్నారు.

కుహూ దాస్‌కు మూడేళ్ల వయసు నుంచి పోలియో ఉంది. తాను చాలా ఏళ్లుగా టైటానియం రాడ్లతో కూడిన కాలిపర్స్‌ను ఉపయోగిస్తున్నానని ఆమె బీబీసీతో పేర్కొన్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఆమె విమానాశ్రయానికి వెళ్లినపుడు.. ఆమె ధరించిన కాలిపర్స్‌ను విప్పి స్సానర్‌లో పెట్టాలని మహిళా పోలీసు అధికారి చెప్పారు.

''నేను తిరస్కరించాను. దీంతో ఆమె నా ముందే మరొక అధికారిని పిలిచారు. నా వంటి వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని ఆమె తన సహచర ఉద్యోగితో చెప్పారు. నేనేదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు మాట్లాడారు. ఇంత చులకనా?'' అని ఆమె ప్రశ్నించారు.

''ఇండియాలో ప్రతిసారీ నా కాలిపర్స్‌ను విప్పాలని అడుగుతున్నారు. అంటే.. ప్రతి సారీ నా ప్యాంటు విప్పాలనటమే. ఇది ఆమోదనీయం కాదు'' అని చెప్పారు.

అలాగే.. వీల్‌చైర్‌లో ప్రయాణించే తన సహచర ఉద్యమకారిణి జీజా ఘోష్‌తో సహాయకురాలు లేకుండా ప్రయాణించటానికి వీలు లేదని ప్రైవేట్ ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ చెప్పిందని తెలిపారు.

''జీజా వయోజనురాలు. ఆమె సొంతంగానే ప్రపంచమంతా ప్రయాణిస్తారు. ఎయిర్‌లైన్ వైఖరితో ఆమె అవమానానికి గురైనట్లు భావిస్తున్నారు'' అని కుహూ దాస్ వివరించారు.

''మేం నిరసన తెలిపాం. ఇది వివక్షాపూరితంగా ఉందని చెప్పాం. దీంతో చెకిన్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి క్షమాపణ చెప్పారు. ఆమె మీద మాకు కోపం లేదు. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు. వైకల్యంతో ఉన్న వ్యక్తితో ఎలా వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోంది'' అని పేర్కొన్నారు.

వీరు ఎదుర్కొన్న దుస్థితి గురించి మీడియాలో కథనాలు రావటంతో కోల్‌కతా విమానాశ్రయ అధికారులు సోమవారం ఈ ఇద్దరు ఉద్యమకారులకు క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు.

వికలాంగ ప్రయాణికులు విమానాశ్రయాల్లో తనిఖీల కోసం తమ కృత్రిమ అవయవాలను తొలగించాల్సిన అవసరం ఇక ఏమాత్రం లేదని రెండేళ్ల కిందట అధికారులు ప్రకటించారు. కానీ.. రెండేళ్లు గడిచిన తర్వాత కూడా ఆ ఉత్తర్వులు భద్రతా విధుల్లో ఉండే పోలీసు అధికారులకు చేరినట్లు కనిపించటం లేదు.

భారతదేశంలో శారీరక లేదా గ్రహణ వైకల్యాలు ఉన్న వారు 2.6 కోట్ల మంది కన్నా ఎక్కువ ఉన్నారు. కానీ వీరికి తమ దైనందిన జీవితాల్లో మద్దతు అందించే మౌలికసదుపాయాలు అత్యల్పంగానే ఉన్నాయి.

వికలాంగులు తరచుగా వివక్ష, వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఉద్యమకారులు చెప్తున్నారు.

రెండేళ్ల కిందట రైలులో ప్రయాణించిన ఒక మహిళా పారా-అథ్లెట్‌కు నిబంధనలకు విరుద్ధంగా రైలులో అప్పర్ బెర్త్ కేటాయించారు. దీంతో ఆమె రైలు బోగీలో నేల మీదే పడుకోవాల్సి వచ్చింది.

2016లో వీల్‌చైర్‌ను ఉపయోగించే ఒక వికలాంగ కార్యకర్త మీద.. సినిమా హాలులో జాతీయగీతం వినిపిస్తున్నపుడు లేచి నిలబడలేదని దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)