హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు: ప్రెస్ రివ్యూ

  • 22 అక్టోబర్ 2019
Image copyright TWITTER/HYDERABAD METRO RAIL

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోరైల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైనట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ కథనం రాసింది.

సోమవారం ఒకే రోజు మెట్రోరైల్ అత్యధికంగా 830 ట్రిప్పులు నడిచింది. నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.

పండుగ సెలవులు ముగిసి విద్యాసంస్థలు తెరుచుకోవడంతో సోమవారం మెట్రోరైళ్లు కిటకిటలాడాయి.

రద్దీ అధికంగా ఉండటంతో సగటున 3.5 నిమిషాల నుంచి 4.5 నిముషాలకు ఒకటి చొప్పున రైళ్లను మెట్రో రైల్ సంస్థ నడిపింది.

సాధారణ సమయాల్లో ఆరు నుంచి ఏడు నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. రోజూ నడిచే ట్రిప్పులకు అదనంగా సోమవారం నాలుగు రైళ్లతో మరో 120 ట్రిప్పులు నడిపామని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వివరించారు.

అదనపు ట్రిప్పుల కారణంగా ఎక్కడా రైళ్లు నిలిచిపోలేదని, వదంతులను నమ్మవద్దని ప్రయాణికులను కోరారు.

Image copyright Getty Images

బండెడు పుస్తకాలు, గంటల తరబడి క్లాసులు లేని ఫ్రీడం స్కూల్ విధానం తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పాఠశాలల్లో కొత్తగా ఫ్రీడం స్కూల్ విధానాన్ని తీసుకువచ్చారు.

23 గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లోనూ అమలు చేయాలని సొసైటీ భావిస్తోంది.

ఫ్రీడం స్కూల్స్‌లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు బదులుగా మాడ్యూల్స్‌ ఉంటాయి. వీటిలోని అంశాలపై విద్యార్థులే పరస్పరం వేర్వేరుగా, బృందంగా చర్చలు జరుపుతారు. లోతుగా చర్చిస్తారు.

బోధన, అభ్యసన అంశాలు, పరీక్షల నిర్వహణకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. తరగతి గదిలో మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆరోజు కార్యక్రమాలు సాగుతాయి.

ఫ్రీడం స్కూల్లో సాధారణ రాత పరీక్షలు ఉండవు. స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతోనే వారికి మార్కులు పడతాయి.

Image copyright Getty Images

ఆన్‌లైన్‌లో చేనేత ఉత్పత్తుల అమ్మకాలు

ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి చీరలు, చొక్కాలు, ధోవతులు తదితర చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలు చేపట్టనుంది. ఇందుకోసం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

తొలి దఫా 25 రకాల ఉత్పత్తులను అమెజాన్‌ ద్వారా నవంబరు నుంచి విక్రయించేలా కార్యాచరణ సిద్ధమైంది. అదే నెల చివరి వారం ఫ్లిప్‌కార్టులోనూ అమ్మకాలు మొదలవుతాయి.

రూ.500 నుంచి రూ.20 వేల వరకు విలువైన ఉత్పత్తులను ఈ వెబ్‌సైట్లలో బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయించనున్నారు.

వినియోగదారులు మోసపోకుండా ఆప్కో చేనేత వస్త్రాలను గుర్తించేలా వాటిపై ప్రభుత్వ లోగో కూడా ముద్రిస్తారు.

చంద్రబాబు Image copyright CHANDRABABU/FB

కేసులు పెడితే చూస్తూ ఊరుకోం: చంద్రబాబు

టీడీపీ కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

ఒకసారి అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేశారని, ఇప్పుడు అలా చేసుండాల్సింది కాదని బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు.

ఖజానాలో డబ్బుల్లేవని చెబుతూనే.. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని విమర్శించారు.

''తోక జాడిస్తే కత్తిరిస్తాం. జగన్‌కు శాడిస్టు అనే పదం చాలదు. జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటే పోలీసులు కేసులు పెడుతున్నారు. నడిరోడ్డుపై నన్ను ఉరితీయాలన్న జగన్‌ వ్యాఖ్యలు పోలీసులకు వినపడలేదా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు.

మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి, అధికారులతోనే మద్యం అమ్మకాలు సాగిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్: ఈఎస్ఐ కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయన్న విజిలెన్స్.. అచ్చెన్నాయుడు పాత్ర ఎంత

‘మత స్వేచ్ఛ మాకు ముఖ్యం... మోదీతో భేటీలో ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తుతారు’

‘‘పొట్టిగా ఉన్నానని స్కూల్లో ఏడిపిస్తున్నారు.. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటూ బాధపడ్డ బాలుడికి అండగా నిలిచిన ప్రపంచం

మానసి జోషి: BBC Indian Sportswoman of the Year నామినీ

200 ఏళ్ల నాటి ఈస్టిండియా కంపెనీ పెయింటింగ్స్‌.. భారత్‌కు నచ్చలేదు, బ్రిటన్‌ ఇబ్బంది పడింది ఎందుకు

పోలవరం గ్రౌండ్‌ రిపోర్ట్: జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయి

ప్రెస్ రివ్యూ: 'ఏపీలో దొరకని మందు.. తెలంగాణకు కాసుల విందు'

మహిళా క్రికెట్ ప్రపంచ కప్: తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్