ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

  • 22 అక్టోబర్ 2019
ఇన్ఫోసిస్ సీఈఓ సాహిల్ పరేఖ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇన్ఫోసిస్ సీఈఓ సాహిల్ పరేఖ్

భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని సీనియర్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై విచారణలు ప్రారంభించింది.

సంస్థ లాభాలను పెంచేందుకు అకౌంటింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్నారని సంస్థ సీఈఓ, సీఎఫ్‌ఓలపై ఓ అజ్ఞాత బృందం ఫిర్యాదులు చేయడంతో ఈ చర్య తీసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.

ఈ ఆరోపణల గురించి వార్తలు సోమవారమే బయటకు వచ్చాయి. ఈ పరిణామాల అనంతరం ఇన్ఫోసిస్ షేర్ల విలువ 16 శాతం మేర పతనమైంది.

ఆసియాలోని ఐటీ సంస్థల్లో ఇన్ఫోసిస్ రెండో అతిపెద్దది.

తాజా ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణలు జరుపుతున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

విచారణల స్వతంత్రతను కాపాడేందుకు సీఈఓ, సీఎఫ్ఓలకు ఈ వ్యవహారంలో పాత్ర లేకుండా చేసినట్లు వివరించింది.

ఇన్ఫోసిస్ ఉద్యోగులతో కూడిన ఓ అజ్ఞాత బృందం సెప్టెంబర్ 20 తేదీతో ఉన్న ఓ లేఖలో ఈ ఫిర్యాదులు చేసింది.

సంస్థ 'స్వల్పకాలిక ఆదాయం, లాభాలు' పెంచేందుకు సీఈఓ సాహిల్ పరేఖ్ 'అనైతిక కార్యకలాపాలకు' పాల్పడుతున్నారని ఇందులో ఆరోపించింది. ఈ వ్యవహారంలో సీఎఫ్ఓ నిలంజన్ రాయ్‌ 'పాత్ర' కూడా ఉన్నట్లు పేర్కొంది.

ఆరోపణలు రుజువుచేసే 'ఇ-మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్' కూడా తమ వద్ద ఉన్నట్లు వివరించింది.

పరేఖ్, రాయ్ ఇంతవరకూ ఈ ఆరోపణలపై స్పందించలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నిలేకని, నారాయణ మూర్తి

లేఖలో పేర్కొన్న ఇ-మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ లాంటివేవీ తమ బోర్డుకు గానీ, సీనియర్ అధికారులకు గానీ అందలేదని ఇన్ఫోసిస్ తెలిపింది.

ఆరోపణలపై 'వీలైనంత లోతుగా' విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

ఇన్ఫోసిస్ బోర్డుకు ఈ ఫిర్యాదు లేఖను ఆ అజ్ఞాత బృందం రాసింది.

ఇదే లేఖ అమెరికా సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్‌కు కూడా వెళ్లినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఇన్ఫోసిస్ షేర్లు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లోనూ ట్రేడ్ అవుతున్నాయి.

ఏడుగురు ఇంజినీర్లు, రూ.17వేల పెట్టుబడితో 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్.. ఇప్పుడు దాదాపు రూ.83వేల కోట్ల విలువ కలిగిన సంస్థగా అవతరించింది. భారత్‌లో ఐటీ రంగ విప్లవానికి ఓ ప్రతీకగా మారి.. అంతర్జాతీయంగా విస్తరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)