కానిస్టేబుల్ చిటికెన వేలును తెగేదాకా కొరికాడు: ప్రెస్ రివ్యూ

  • 23 అక్టోబర్ 2019

ఫిర్యాదు చేయడానికంటూ అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ వేలును తెగేదాక కొరికినట్లు 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

ఖమ్మం నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన డుంగ్రోతు మస్తాన్‌, మరో ఇద్దరు సోమవారం అర్థరాత్రి ఖమ్మంలోని ఒకటో పట్టణ ఠాణాకు వచ్చారు.

కానిస్టేబుల్‌ మన్ఫూరలీకి వివరాలు చెప్పే క్రమంలో మస్తాన్ బీభత్సం సృష్టించాడు. మన్పూరలీ తొడను కొరికాడు. ఆ తర్వాత చేతిని నోటితో అందుకొని చిటికెన వేలు తెగేదాక కొరికి నేలపై ఊశాడు

అనంతరం మస్తాన్‌, అతడితోపాటు వచ్చిన ఇద్దరు పారిపోయారు.

ఆ తర్వాత ఏఎస్సై నాగేశ్వరరావు మస్తాన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ సమయంలో నాగేశ్వరరావుపైనా మస్తాన్ దాడి చేశాడు. స్టేషన్‌ ఆవరణలోని అద్దాలను ధ్వంసం చేశాడు.

కొన్నేళ్లుగా పోలీసు స్టేషన్లలో, రహదారులపై పోలీసులతో మస్తాన్ ఘర్షణలకు దిగుతున్నాడని పోలీసులు తెలిపారు.

Image copyright NCBN.IN

అమరావతి బంగారు బాతు.. మీరు పొట్టన పెట్టుకున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సంపదను తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటిదని, వైసీపీ ప్రభుత్వం దాన్ని పొట్టనపెట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

అమరావతి నిర్మాణం పూర్తయితే తనకు పేరు వస్తుందన్న అక్కసుతోనే పనులు ఆపేశారని చంద్రబాబు అన్నారు.

పాలన చేతగాక వైసీపీ ప్రభుత్వం తనను విమర్శిస్తోందని.. టీడీపీని నైతికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.

ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చేస్తాయని ప్రచారం చేసిన జగన్‌.. ఇప్పుడు దాని గురించి గానీ, రాష్ట్ర సమస్యల గురించి గానీ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.

''తెలంగాణ సీఎంతో చెట్టాపట్టాల్‌ వేసుకుని తిరుగుతున్నారు. మరి విభజన సమస్యలేమైనా పరిష్కారమయ్యాయా?'' అని అడిగారు.

''మా నాయకులు, కార్యకర్తలపై ఇప్పటికి 100 కేసులు నమోదు చేశారు. పోలీసు వ్యవస్థనే భ్రష్టుపట్టించేశారు. ఇష్టమొచ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులు వచ్చి అరెస్టు చేస్తున్నారు'' అని చెప్పారు.

Image copyright Getty Images

పుప్పాలగూడ భూములు ప్రభుత్వానివే..

పుప్పాలగూడలోని వివాదాస్పద భూములు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ వార్త రాసింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని 148.30 ఎకరాల వివాదాస్పద భూములు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

హైటెక్‌సిటీ, సైబర్ గేట్‌వే, పలు ఐటీ కంపెనీలకు అత్యంత సమీపంలో ఉన్న ఈ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.5వేల కోట్లు.

దేశవిభజన సందర్భంగా ఆస్తులు కోల్పోయి పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల (కాందిశీకులు)కు పరిహారం చెల్లించడానికి కేంద్రం నిర్వాసితుల (పరిహారం, పునరావాసం) (డీపీసీఆర్) చట్టం- 1954, నిర్వాసితుల భూమి పాలన చట్టం- 1950 లను తీసుకువచ్చింది.

పాకిస్తాన్ నుంచి వచ్చిన పరశురాం రామచంద్‌ మలానీకి దీని కింద బాటసింగారం, బోయినపల్లిల్లో కేటాయించాల్సిన భూముల కన్నా దాదాపు నాలుగింతలు ఎక్కువగా (323.10) ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. వాటిని ఆయన అమ్మేసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ మలానీకి తగినంత భూమి ఇవ్వలేదంటూ ఆయన వారసులమని చెప్పుకొంటున్నవారు మరో 200 ఎకరాలు కేటాయించాలని 2001లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి రెవెన్యూ అధికారులు పుప్పాలగూడలో మరోసారి 148.30 ఎకరాలు కేటాయించారు. అనంతరం ఈ వ్యవహారంపై ప్రభుత్వమే కోర్టును ఆశ్రయించింది.

ఏపీ ప్రభుత్వం

ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీలో కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులందరికీ నివాస గృహాల కోసం స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు 'సాక్షి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

వచ్చే ఉగాది పండుగకు 25 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక, అవసరమైన భూమి సేకరణకు అధికార యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.

ఇప్పటికే నివాస స్థల పట్టాల జారీకి 22 లక్షల మంది అర్హులను అధికారులు ఖరారు చేశారు. వీరి జాబితాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో పెట్టారు.

నాలుగైదు రోజులుగా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు కూడా నిర్వహించి లబ్ధిదారుల జాబితాలకు ఆమోదం తెలిపారు.

అర్హుల జాబితాలో పేర్లు లేని వారు జనవరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.

వివాదం లేని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారికి (రెండు సెంట్ల లోపు) పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చి కేవలం రూపాయికే వారి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయాలని కూడా సీఎం ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు