ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు

కేసీఆర్, ఆర్టీసీ బస్సు

ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిందని, అది మూతపడక తప్పదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానం అని చెప్పారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆర్టీసీపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • ఆర్టీసీకి సంబంధించి నాకంటే ఎక్కువ అవగాహన కలిగిన వ్యక్తి ఎవరూ ఉండరు.
  • నేను ముఖ్యమంత్రి అయ్యాక ఆర్టీసీ అధికారులతో ఒక రోజంతా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాను. ఏం చేస్తే సంస్థ బాగుపడుతుందో వివరించాను.
  • జీతాలు 44 శాతం పెంచాం. ఆ తర్వాత ఎన్నికలకు ముందు ఐఆర్ పెంచాలని అడిగితే, 14 శాతం ఇచ్చాం. భారత దేశ చరిత్రలో కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఇంతగా జీతాలు పెంచిన దాఖలాలు లేవు.
  • ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయం. ఇలాచేస్తే మరో 50 కార్పొరేషన్లు కూడా అదే డిమాండ్ చేస్తాయి.
  • తిన్నది అరగక చేస్తున్న సమ్మె ఇది. యూనియన్ ఎన్నికల ముందు కార్మికులను ఆకర్షించేందుకు యూనియన్లు ఇలాంటి సమ్మెలు చేస్తున్నాయి.
  • ఆర్టీసీకి ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఏటా రూ.1,200 కోట్ల నష్టం వస్తోంది. ఆర్టీసీకి ప్రతి కిలోమీటరుకు 13 రూపాయల నష్టం వస్తోంది. దీనికి కారణం ఏంటి?
  • పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది?
  • ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు లాభాలు వస్తోంటే, ఆర్టీసీకి నష్టాలు ఎలా వస్తున్నాయి? ప్రైవేటు నుంచి అద్దెకు తీసుకున్న బస్సులపై కూడా లాభం వస్తోంది.
  • ఇది చిల్లర యూనియన్లు చేస్తున్న మతిలేని రాజకీయ, అర్థరహితమైన సమ్మె. యూనియన్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం ఈ సమ్మెలు చేస్తున్నాయి.
  • టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక భారీగా జీతాలు పెంచాం. ఇంక డిమాండ్లు ఏంటి?
  • టీఆర్‌ఎస్ అధికారంలోకి రాక ముందు ఐదేళ్లలో ఆర్టీసీకి రూ.712 కోట్లు ఇచ్చారు. మేము వచ్చాక రూ.4,250 కోట్లు ఇచ్చాం. ఈ ఏడాది కూడా రూ.425 కోట్లు ఇచ్చాం.
  • హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించేలా చట్టం తీసుకొచ్చాం. ప్రభుత్వం మీకు ఇంకెంత ఇవ్వాలి?
  • తెలంగాణలో దసరా పండుగ చాలా ముఖ్యం. ఆ సమయంలో కోట్ల మంది ప్రయాణాలు చేస్తారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే అలాంటి సమయంలో సమ్మెకు వెళ్లారు. ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలను పట్టించుకోకుండా సమ్మెకు వెళ్లారు.
  • ఆర్టీసీ యూనియన్ల పేరిట చేస్తున్నది మహానేరం, మహా ఘోరం. ఆర్టీసీ యూనియన్ల పేరుతో అమాయక కార్మికుల గొంతు కోస్తున్నారు. ముంచుకుంటున్నారు.
  • సెప్టెంబర్ నెల జీతాలు ఇవ్వాలంటే నాలుగు ఆర్టీసీ బస్టాండ్లు అమ్మాలి.
  • బుద్ధి, జ్ఞానం లేని సమ్మె ఇది. అక్రమ సమ్మె ఇది. సంస్థను కాపాడుకునే బాధ్యత కార్మికులపై లేదా?
  • ఆర్టీసీ బతికి బట్టకట్టదు. దానిని ఎవరూ కాపాడలేరు, దాని పనైపోయింది.
  • ఈ భూగోళం ఉన్నంత కాలం ఆర్టీసీ విలీనం జరగదు.
  • ప్రైవేటు పర్మిట్లు ఇవ్వవచ్చు అని ప్రధాని మోదీ చట్టం తీసుకొచ్చారు. విమానయాన రంగంలో ప్రైవేటు సంస్థలు రావడం ద్వారా విమాన టికెట్ల ధరలు చాలా తగ్గాయి.
  • ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ చాలా మాట్లాడుతున్నారు. కానీ, వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆర్టీసీలను ప్రభుత్వంలో విలీనం చేశారా?
  • యూనియన్ నాయకులు చాలా బాధ్యతాయుతంగా, కార్మికుల శ్రేయస్సు కోసం మాట్లాడాలి. కానీ, వాళ్లు రాజకీయ దురుద్ధేశంతో సమ్మె చేస్తున్నారు.
  • నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చాను.
  • కార్మికులు ఎవరైనా బతకాలనుకుంటే డిపోకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి కదా.

సీఎం ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు: ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీ యూనియన్ల మీద అనవసరమైన నిందలు వేస్తూ, రకరకాల మాటలు చెబుతూ కార్మికులను భయబ్రాంతులకు గురిచేసేలా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని ఆర్టీసీ జేఏసీ నేత థామస్ అన్నారు.

"ఆర్టీసీకి నష్టాలు కార్మికుల వల్ల, నాయకుల వల్ల రాలేదు. ఆ నష్టాలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే. ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలలో వాస్తవాలు లేవు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. జీతాల విషయంలో ఏవేవో రాష్ట్రాల పేర్లను సీఎం చెప్పారు, కానీ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం మాట్లాడలేదు. పల్లెవెలుగు బస్సుల ద్వారా సంస్థకు నష్టం వస్తోంది, దానిని ప్రభుత్వమే భరించాలి. ఇంకా జీహెచ్‌ఎంసీ నుంచి 1,400 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా, ఆ విషయాన్ని సీఎం చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు" అని థామస్ అన్నారు.

ప్రజలకు అసౌకర్యం కలగొద్దు అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి కోరారు.

"కార్మికులు అభద్రతకు గురయ్యేలా సీఎం మాట్లాడారు. కార్మికులెవరూ ఒత్తిడికి గురికావొద్దు. అద్దె బస్సుతో ప్రతి కిలోమీటర్‌కు 75 పైసలు ఆదాయం వస్తోందని సీఎం చెప్పారు. మరి, గత ఏడాది 149 కోట్ల రూపాయల నష్టం ఎందుకొచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దసరా పండుగ సమయంలో ఆర్టీసీకి 17 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని సీఎం అన్నారు. కానీ, ఏనాడూ అంత ఆదాయం రాలేదు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ప్రైవేటు ట్రావెల్స్‌కు లాభాలు వస్తున్నాయి, వాటితో పాటు తిరిగే ఆర్టీసీ బస్సులకు కూడా లాభాలు వస్తున్నాయి. పల్లెవెలుగు, సిటీ బస్సులతోనే నష్టం వస్తోంది. యూనియన్ ఎన్నికల ముందు ఓట్ల కోసం సమ్మె చేస్తున్నామని ఆయన అన్నారు. కానీ, అలా అనుకుంటే అన్ని యూనియన్లూ కలిసి సమ్మె చేస్తాయా?" అని రాజిరెడ్డి ప్రశ్నించారు.

సీఎం అలా మాట్లాడటం సరికాదు: సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి

కార్మికులు, ఉద్యోగుల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు సరిగా లేదని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ... "ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ సరైన వ్యూహం తీసుకోలేదని అర్థమవుతోంది. ఒక విధంగా కార్మికులు చెబుతున్న విషయాలను ఆయన ధ్రువీకరించారని చెప్పొచ్చు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రమాదం ఉందని, సంస్థను రక్షించాలని కార్మికులు అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రమాదం జరగబోతోందన్న విషయాన్ని కేసీఆర్ ధ్రువపరిచారు. ఆయన గతంలో చెప్పిన తప్పుడు విషయాలనే మళ్లీ చెప్పారు. దిక్కుమాలిన యూనియన్లు, బుద్ధి లేని సమ్మె అంటూ ముఖ్యమంత్రి ద్వేషించడం సరికాదు. కార్మికుల పట్ల, ఉద్యోగుల పట్ల అలా మాట్లాడటం మంచిది కాదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)