ఆంధ్రప్రదేశ్: ‘రాజధాని అమరావతిపై మీ వైఖరేంటి...హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు’ - ప్రెస్‌రివ్యూ

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, ysrcp/fb

రాజధాని నిర్మాణం, స్విస్‌ ఛాలెంజ్‌ విధానంపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని, వాటిపై నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని అభిప్రాయపడిందని ఈనాడు తెలిపింది.

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రుల ఎజెండాలతో తమకు పని లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబులింగ్‌ (ఏపీఐడీఈ) చట్టం-2001కి సవరణ చేస్తూ 2017 ఏప్రిల్‌ 19న ఏపీ న్యాయశాఖ కార్యదర్శి తీసుకొచ్చిన సవరణ చట్టం-3/2017ను సవాలు చేస్తూ 'ఫౌండేషన్‌ ఫర్‌ సోషల్‌ అవేర్‌నెస్‌ సొసైటీ' సభ్యులు వై.సూర్యనారాయణమూర్తి, రాజధాని అమరావతి స్టార్టప్‌ ప్రాంతం అభివృద్ధి కోసం ఏపీ సర్కారు అనుసరిస్తున్న స్విస్‌ ఛాలెంజ్‌ విధానాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాలు 'స్విస్‌ ఛాలెంజ్‌' విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసినవని, రాజధాని నిర్మాణానికి సంబంధించినవి కావని తెలిపారు. అందుకు ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఈ వ్యాజ్యాల్ని రాజధాని నిర్మాణ విషయానికి విస్తరిస్తామని స్పష్టం చేసింది.

హైకోర్టు వద్ద కప్పు టీ కూడా దొరకడం లేదని ఆక్షేపించింది. పలు సమస్యలున్నాయని, వాటిని తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పేర్కొంది. 2 వారాల్లో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. మరోసారి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

న్యాయ పరిపాలన, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన మధ్యంతర ఉత్తర్వులిస్తామని పేర్కొంది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ కాంట్రాక్టు పనుల్ని ప్రభుత్వం పునఃసమీక్షిస్తోందని ఎస్‌జీపీ చెప్పగా.. అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. 'ఎన్ని రోజులు సమీక్షిస్తారు? ఏమి చేయాలనుకుంటున్నారో త్వరగా నిర్ణయం తీసుకోండి' అని స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, kcr/fb

నవంబర్‌లోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తి: సీఎం కేసీఆర్

నవంబర్ నెలలోనే మున్సిపల్ ఎన్నికలు పూర్తి అవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

తెలంగాణ భవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు, మంచి సత్ఫలితాలు వచ్చాయన్నారు.

"ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండు నూతన చట్టాలు తెచ్చింది. గ్రామపంచాయతీ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం తెచ్చాం. రెవెన్యూ చట్టం రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ చట్టం, మున్సిపల్ చట్టం ద్వారా నియంత్రిత విధానంలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి జరగాలి.

ఉత్త మాటలు చెప్పి అభివృద్ధి అంటే కుదరదు. అందుకు నిధులు సమకూర్చాలి. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే గ్రాంట్స్‌తో పాటు అంతే స్థాయిలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చి అభివృద్ధి చేయాలనుకున్నాం.

గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా రూ.339 కోట్లను విడుదల చేస్తున్నాం. మున్సిపాలిటీలకు కూడా ఇప్పుడు రూ. 1030 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయి. ఇంతే మొత్తంలో తాము కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించాం.

మొత్తం కలిపి రూ. 2060 కోట్లను రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల అభివృద్ధికి కేటాయించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది, మరో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి వద్ద మరికొన్ని కేసులు ఉన్నాయి. రేపు వాటిపై తీర్పు వస్తుంది. తీర్పు అనంతరం ఈసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వస్తుంది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వెలువరుస్తాం" అని కేసీఆర్ తెలిపారు.

నవంబర్ మాసంలోనే మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పట్టణ ప్రగతి ప్రణాళిక కూడా ఒక నెల పాటు చేపడతామని సీఎం తెలిపారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, Balakrishna/fb

బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్తులు

ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైందని సాక్షి తెలిపింది.

లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆయన కారును అడ్డుకున్నారు. భూమి పూజ చేసి మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేదంటూ బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూపురం-చిలమత్తూరు మెయిన్‌రోడ్‌ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్‌ వేయడానికి మూడేళ్ల కిందట భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్‌ వేస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మెయిన్‌ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు.

మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయారో చెప్పాలంటూ నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు.

ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్‌ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు.

బాలకృష్ణ స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని చెప్పారని సాక్షి పేర్కొంది.

ఫొటో సోర్స్, janasena/fb

‘నాలుగు నెలల పాలనలో రాష్ట్రం రెండేళ్లు వెనక్కి వెళ్లింది’

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు నెలల్లో రెండేళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్లిందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిందని విమర్శించారు.

రాష్ట్రంలో ఇసుక కొరతతో ఉపాధి లేక కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, గత నాలుగు నెలలుగా వారు పడుతున్న కష్టాలు తనకు ఎంతో బాధ కలిగించాయని పేర్కొన్నారు.

గురువారం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి పవన్‌ మాట్లాడారు.

"ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం చేపట్టిన వైసీపీ గత టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తీసివేసి కొత్త పథకాలను అమలు చేస్తోంది. 5 లక్షల మందికి వలంటీర్ల ఉద్యోగాలిచ్చి.. ఐదింతల మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది. ఇసుక గందరగోళానికి వీలైనంత త్వరగా తెరదించాలి.

ఇసుక విధానంపై జనసేన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీతో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశాం. అందులో భాగంగానే నవంబరు 3న విశాఖపట్నంలో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాం. ర్యాలీ అనగానే ప్రభుత్వం ఇసుకపై సమీక్ష సమావేశం పెట్టింది. దీనిని బట్టి చూస్తుంటే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు యత్నిస్తుందని అర్థమవుతోంది. తెలంగాణలో 42 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె తలపెడితే జనసేన సహా అన్ని పార్టీలు కలసి వచ్చాయి. ఆంధ్రలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడితే జనసేన తప్ప ఇతర ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడం బాధాకరం" అని వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)