ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాదిలో మూడోసారి వ‌ర‌ద‌.. ప్ర‌కాశం బ్యారేజీ వద్ద గత 20 ఏళ్లలో కొత్త రికార్డు

  • వి శంకర్
  • బీబీసీ కోసం
ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం వైపు వదిలిన వరద నీరు
ఫొటో క్యాప్షన్,

ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రం వైపు వదిలిన వరద నీరు

విస్తారంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు న‌దుల‌కు వ‌ర‌ద తాకిడి క‌నిపిస్తోంది.

ముఖ్యంగా ఎగువ రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, ఒడిశాలో న‌మోద‌యిన భారీ వ‌ర్షపాతాల కార‌ణంగా కృష్ణా న‌దితో పాటుగా తుంగ‌భ‌ద్ర‌, వంశ‌ధార న‌దుల‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది.

కృష్ణా న‌దికి గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈ సీజ‌న్ లో వ‌ర‌ద జ‌లాలు చేర‌డం విశేషం.

ఏడాదిలో మూడోసారి వ‌ర‌ద‌

కృష్ణా న‌దికి ఈసారి వ‌ర‌ద ప్ర‌వాహం బాగా పెరిగింది. 2009 త‌ర్వాత అత్య‌ధిక స్థాయికి నీటిమ‌ట్టం చేరింది.

ఈ ఏడాది ఆగ‌ష్టు 14న సుమారుగా 8 ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాలు దిగువ‌కు వ‌దిలారు. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్‌లో కూడా వ‌ర‌ద తాకిడి క‌నిపించింది. తాజాగా మూడోసారి వ‌ర‌ద నీరు పెర‌గ‌డంతో విజ‌య‌వాడ‌తో పాటుగా కృష్ణా జిల్లాలోని ప‌లు ప‌ల్ల‌పు ప్రాంతాల్లో న‌దీ జ‌లాలు చేరాయి.

విజ‌య‌వాడ న‌గ‌రంలోని రాణీగారి తోట‌, కృష్ణ‌లంక స‌హా ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. 38 కుటుంబాల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

ప్ర‌కాశం బ్యారేజ్ నుంచి శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 25) ఉద‌యం 10గంటల స‌మ‌యానికి 4,83,746 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వ‌దిలారు.

ఇది మ‌రింత పెరిగి 6ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌కూ డిశ్చార్జ్ న‌మోద‌వుతుంద‌ని కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు.

వ‌ర‌ద జ‌లాల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ప్ర‌భుత్వం బాధితుల‌ను ఆదుకుంటుంద‌ని, జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆయ‌న సూచించారు.

వ్య‌వ‌సాయ పంట‌ల‌కు కూడా న‌ష్టం వాటిల్లింద‌ని ఆయ‌న తెలిపారు. ఈసారి ప‌దే ప‌దే వ‌ర‌ద‌లు రావ‌డంతో అపార న‌ష్టం సంభ‌వించిన‌ట్టుగా ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌కాశం బ్యారేజ్‌కి గ‌తంలో ఇలా ఎన్న‌డూ లేదు..

ఆగ‌ష్టు రెండోవారంలో తెరిచిన ప్ర‌కాశం బ్యారేజ్ గేట్లు నేటికీ మూత‌ప‌డ‌లేదు. నిత్యం వ‌ర‌ద జ‌లాలు ఎగువ నుంచి వ‌చ్చి చేరుతుండ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

గ‌త 20 ఏళ్ల చ‌రిత్ర‌లో 2009లో వ‌చ్చిన వ‌ర‌ద‌లు మాత్ర‌మే తీవ్ర‌మైన‌విగా రికార్డులు చెబుతున్నాయి.

అప్ప‌ట్లో సుమారుగా 9.4ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువ‌కు విడుద‌ల చేశారు.

ఆ త‌ర్వాత మొన్న‌టి ఆగ‌ష్టు 14న అత్య‌ధికంగా న‌మోద‌య్యింది.

ఇప్పుడు మ‌రోసారి 6ల‌క్ష‌ల‌కు చేరువ‌వుతున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

బ్యారేజ్ కి సంబంధించిన 75 గేట్ల‌ను ఎత్తివేసి ఇన్ ఫ్లోస్ య‌ధావిధిగా దిగువ‌కు త‌ర‌లిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎన్న‌డూ లేద‌ని చెబుతున్నారు.

2009లో కూడా వ‌ర‌ద అక్టోబ‌ర్ మొద‌టి వారంలో వ‌చ్చింది.

ఈసారి ఆగ‌ష్టు నుంచి అక్టోబ‌ర్ గ‌డుస్తున్నా వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతుండడానికి ప్రధాన కార‌ణం న‌దీ క్యాచ్ మెంట్ ఏరియాలో కుర‌స్తున్న వ‌ర్షాలేన‌ని కృష్ణా జిల్లా ఇరిగేష‌న్ ఎస్ ఈ శివ భాస్క‌ర్ రావు తెలిపారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘ప్ర‌కాశం బ్యారేజ్ కి గ‌తంలో ఎన్న‌డూ ఇంత సుదీర్ఘ‌కాలం పాటు గేట్లు తెరిచి ఉంచిన దాఖ‌లాలు లేవు. ఇంత ఆల‌స్యంగా వ‌ర‌ద‌లు రావ‌డం కూడా అరుదు. అయితే ఈసారి నైరుతి రుతుప‌వ‌నాల‌కు తోడుగా ఈశాన్య రుతుప‌వ‌నాల ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దాంతో వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు పోను అత్య‌ధికంగా మిగులు జ‌లాలు దిగువ‌కు వ‌ద‌లాల్సి వ‌స్తోంది. ఈ ఒక్క సీజ‌న్ లోనే ఇప్ప‌టి వ‌ర‌కూ 580 టీఎంసీల వ‌ర‌కూ కృష్ణా జలాలు స‌ముద్రం పాల‌య్యాయి. గ‌తంలో ఎన్న‌డూ ఇంత అత్య‌ధికంగా కృష్ణా జ‌లాలు స‌ముద్రానికి చేరిన‌ట్టు స‌మాచారం లేదు‌‌’’ అని చెప్పారు.

నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్న కృష్ణా ప్రాజెక్టులు

కృష్ణా న‌దిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల వ‌ద్ద దాదాపు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

శ్రీశైలం నుంచి 884.4 అడుగుల‌కు నీటిమ‌ట్టం చేరింది. దాంతో డ్యామ్ నుంచి దిగువ‌కు 6.41ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు.

నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద 589.3 అడుగుల నీటిమ‌ట్టం న‌మోద‌య్యింది. 309.55 టీఎంసీల నీటిని నిల్వ చేసి దిగువ‌కు 5.99ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు. 18గేట్లు ఎత్తి మిగులుజ‌లాల‌ను విడుద‌ల చేస్తున్నారు.

ఇక పులిచింత‌ల వ‌ద్ద కూడా అదే ప‌రిస్థితి. పులిచింత‌ల నుంచి ప్ర‌స్తుతం 6.18ల‌క్ష‌ల క్యూసెక్కుల మిగులు జ‌లాలు దిగువ‌కు వ‌దులుతున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డి నీటిమ‌ట్టం 172.28గా న‌మోద‌య్యింది.

ఎగువ‌న అన్ని ప్రాజెక్టులు నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తూ భారీగా మిగులు జ‌లాలు దిగువ‌కు విడుద‌ల చేస్తుండ‌డంతో ప్ర‌కాశం బ్యారేజ్ వ‌ద్ద వ‌ర‌ద తాకిడి మ‌రింత పెరగ‌వ‌చ్చ‌ని ఇరిగేష‌న్ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. రాబోయే 24 గంట‌ల పాటు వ‌ర‌ద తాకిడి పెరుగుతూ, ఆ త‌ర్వాత క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్ట‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)