మహారాష్ట్రలో ‘పెద్దన్న’ ఎవరు? శివసేన కోరికను బీజేపీ అంగీకరిస్తుందా?

  • సల్మాన్ రవి
  • బీబీసీ ప్రతినిధి
దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల్లో పెద్దన్న ఎవరు? ఈ ప్రశ్న గురించి కొంత కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత ఒకరు పెద్దన్న, ఇంకొకరు తమ్ముడు అన్న పద్ధతేమీ ఉండదని, రెండు పార్టీలూ సమాన భాగస్వాములేనని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నవారి 'అహంకారాన్ని' సహించబోమని ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సంకేతమిచ్చారని తమ పార్టీ పత్రిక 'సామ్నా'లో శివసేన సంపాదకీయం ప్రచురించింది. 'పెద్దన్న' అంటే బీజేపీకి ఇది ఆ పార్టీ ఇస్తున్న సందేశమేనని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీపై శివసేన ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది. 50-50 భాగస్వామ్య సూత్రం ఉండాలని పట్టుపడుతోంది. ముఖ్యమంత్రి పదవిని తమ పార్టీకి కూడా రెండున్నరేళ్లు ఇవ్వాలి అని కోరుకుంటోంది.

బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం పాత్రికేయ సమావేశంలో ఈ విషయం గురించి మరీ లోతుగా మాట్లాడలేదు. 50-50 సూత్రం గురించి ప్రస్తావించారు గానీ, దాన్ని ఎలా అమల్లోకి తెస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో తమ పార్టీ సంప్రదింపులు జరుపుతున్న విషయాన్ని మాత్రం వెల్లడించారు.

స్వతంత్రులతో సంప్రదింపులు దేనికి?

అంతా సజావుగా ఉంటే, తమ కూటమికి సంపూర్ణ మెజార్టీ లభించిన తర్వాత కూడా స్వతంత్ర ఎమ్మెల్యేల గురించి ఫడ్నవీస్ ఎందుకు మాట్లాడుతున్నారన్నది అసలు ప్రశ్న.

స్వతంత్ర ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరపడం చూస్తుంటే, కూటమిలో లుకలుకలు ఉన్నట్లు కనిపిస్తోందని సీనియర్ పాత్రికేయుడు అనురాగ్ త్రిపాఠి అన్నారు.

''సంపూర్ణ మెజార్టీ వచ్చాక వాళ్లు స్వతంత్ర ఎమ్మెల్యేలను కాదు, గవర్నర్‌ను కలవాలి. అంతా సజావుగా లేదనడానికి ఇదే సంకేతం. ముంబైలో బీజేపీ పెద్దగా గెలుపు సంబరాలు ఏమీ చేసుకోలేదు. ఠాక్రే కుటుంబ రాకుమారుడిగా భావించే ఆదిత్య ఠాక్రే విజయాన్ని మాత్రం శివసేన గొప్పగా జరుపుకొంది'' అని ఆయన అన్నారు.

మహారాష్ట్రలో 1995 నుంచి 1999 వరకూ శివసేన పెద్దన్న, బీజేపీ తమ్ముడి పాత్రల్లో ఉన్నాయి. అప్పుడు కూడా స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో శివసేన నుంచి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు.

ఫొటో క్యాప్షన్,

ముంబయిలో వర్లీ అసెంబ్లీ స్థానంలో ఆదిత్య ఠాక్రే గెలిచారు

అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు 73, బీజేపీకి 65 సీట్లు వచ్చాయి. అందుకే స్వతంత్రుల మద్దతుకు ప్రాధాన్యత ఏర్పడింది.

పొత్తు సమయంలో పెట్టుకున్న షరతుల మీదే బీజేపీతో కలిసి పనిచేశామని ఉద్ధవ్ ఠాక్రే అంటున్నారు. 288 సీట్లలో 124 చోట్ల శివసేన పోటీ చేసింది. మిగతా స్థానాలను బీజేపీకి వదిలేసింది.

''ఇప్పుడు ఒకరు అన్న, ఇంకొకరు తమ్ముడు అనేదేమీ లేదు. సమ భాగస్వామ్యంతోనే ప్రభుత్వం నడుస్తుంది'' అని ఉద్ధవ్ అంటున్నారు.

శివసేన వైఖరితో ఈ కూటమి భవిష్యత్తు గురించి కొన్ని పాత ప్రశ్నలే మళ్లీ తెరపైకి వచ్చాయి. బీజేపీ నాయకులు బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు. అంతా బాగానే ఉందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎలాంటి విభేదాలూ లేవని బీజేపీ నాయకురాలు శ్వేతా శాలిని అన్నారు.

ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఒకరు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కారణంగా ఈసారి శివసేనను ఒప్పంచడం బీజేపీకి కష్టమే అవుతుందని కొందరు నాయకులు అంటున్నారు. సీఎం కుర్చీని ఆ పార్టీ కూడా ఆశిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముంబయిలో వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

దేవేంద్ర ఫడ్నవీస్, నరేంద్ర మోదీ

దీపావళి తర్వాత స్పష్టత

శివసేన, బీజేపీల కూటమిని 'స్వాభావిక కూటమి'గా విశ్లేషకులు చూస్తుంటారు. 1986 నుంచి ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కానీ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు లేకుండా తలపడ్డాయి. ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 122, శివసేన 63 సీట్లు గెలుచుకున్నాయి.

ఈసారి ఈ రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లినా, ముందుసారి కన్నా తక్కువ సీట్లు వచ్చాయి.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో రెండు రకాల పరిస్థితులకు ఆస్కారముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాటిలో మొదటిది 50-50 భాగస్వామ్య సూత్రానికి బీజేపీ అంగీకరించడం. రెండోది ఎన్‌సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడం. కానీ, బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువ.

శివసేనకు ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వొచ్చు. కానీ, శివసేన, బీజేపీల్లో దేన్ని బలపరిచినా ఆ పార్టీల ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ వాగ్లే అంటున్నారు. ఈ కారణంతో ఎన్‌సీపీ, కాంగ్రెస్.. శివసేన, బీజేపీలకు దూరంగానే ఉండేందుకే మొగ్గు చూపుతాయని అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్రలో ఏం జరగనుందో, ‘పెద్దన్న’ ఎవరు కానున్నారో దీపావళి తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)