ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు సీఎం పచ్చజెండా - ప్రెస్‌రివ్యూ

తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం సిద్ధమైందని, శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయని సాక్షి వెల్లడించింది.

అయితే కార్మిక సంఘాల నేతలతో చర్చల్లో ఆర్టీసీ ఈడీలు పాల్గొంటారని తెలిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన సమీక్షలో ఎట్టకేలకు చర్చల ప్రక్రియకు సీఎం కేసీఆర్‌ సమ్మతం తెలిపినట్లు సమాచారం. ఈ నెల 28న హైకోర్టులో సమ్మెపై విచారణ ఉన్న నేపథ్యంలో చర్చలు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని సీఎం ఆదేశించారు.

గడువు ఎక్కువగా లేనందున శనివారమే చర్చలకు ముహూర్తం ఖాయం చేశారు. సమ్మె ప్రారంభం కాకముందు ఐఏఎస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ చర్చలు జరిపిన ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది.

బస్‌భవన్‌లోనే చర్చలు జరపాలని తొలుత భావించినా, అక్కడికి పెద్ద సంఖ్యలో కార్మికులు వచ్చే అవకాశం ఉండటంతో ఎర్రమంజిల్‌లో జరపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

అయితే చర్చల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకపోవటం విశేషం. శుక్రవారం రాత్రి పొద్దుపోయేవరకు అటు కార్మిక సంఘాల జేఏసీకి కూడా ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది.

చర్చలకు ఆహ్వానిస్తే సంతోషమేనని, అయితే ఆర్టీసీ విలీనం అంశం కూడా చర్చల్లో ఉండాలని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి శుక్రవారం రాత్రి 'సాక్షి'తో తేల్చిచెప్పారు. చర్చల ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేయాలని తాము కోరబోతున్నట్లు వెల్లడించారు. వీడియో రికార్డు జరపలేకపోతే చర్చల సారాంశాన్ని నమోదు చేసి తమ సంతకాలు, చర్చల్లో పాల్గొన్న అధికారుల సంతకాలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, janasena

‘ఇసుక ఫేస్‌బుక్‌లోనే కనిపిస్తుంది’

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకువస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వంలో మాదిరే ఇసుక మాఫియాను తీసుకువచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శించారని ఈనాడు పేర్కొంది.

వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల లక్షల మంది రోడ్డున పడ్డారని అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక రవాణాపైనే ఆధారపడ్డ ఆరు వేల లారీలకే పనుల్లేకుండా పోతే కొత్తగా మరో 6 వేల లారీలకు రుణాలు ఇప్పించేలా జీవో 486 తీసుకురావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

లారీల కోసం రుణాలు ఇప్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఆహ్వానించదగ్గదే అయినా ఉన్న లారీల సంగతి ఏమిటి? ఎవరి లబ్ధి కోసం ఈ ప్రయత్నమని ప్రశ్నించారు. రాయితీతో కూడిన 6 వేల లారీలు కొనుగోలుకు ప్రభుత్వం జీవో 486 ఇస్తూ అందులో జీఎస్‌టీ మొత్తాన్ని తగ్గించే విషయాన్ని పరిశీలించాలని పేర్కొనడం శోచనీయమని అన్నారు.

అన్ని రాష్ట్రాలూ రేపు ఇలాగే వ్యవహరిస్తే ఆదాయం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ జీవోపై ప్రధాన మంత్రికి జీఎస్టీ మండలికి, అమిత్‌షాకు జనసేన ఫిర్యాదు చేస్తుందని చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఇసుక నిల్వలు ఉంటున్నాయే తప్ప వాస్తవంగా ఉండటం లేదన్నారు.

రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని.. మంత్రి బొత్స సత్యనారాయణ వెటకారంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాజధానిపై స్పష్టత ఇవ్వాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. అంబటి రాంబాబుపై తనకు గౌరవం ఉందని, మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు.

ఎన్నికలు అయిదేళ్లు ఉన్నాయనుకుంటున్నారేమో, ముందే వస్తాయని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన ప్రజలే తిరిగి దెబ్బకొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ ఉద్యోగానికి వయోపరిమితి ఇకపై 34 ఏళ్లే

తెలంగాణ ఉద్యమకారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షల్లో వయోపరిమితి సడలింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో గడువు మూడు నెలల క్రితమే ముగిసిపోయింది. దాంతో కొత్తగా వచ్చే ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఉండదని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయో పరిమితిని 44 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. 2015 నుంచి ఏటా వయోపరిమితిని ఏడాది పాటు పెంచుతూ వస్తున్నారు. ఇక 2017 ఆగస్టు 8న ఏకంగా రెండేళ్లకు పెంచుతూ జీవో జారీ చేశారు. ఈ గడువు జులై 26వ తేదీతో ముగిసింది. తాజాగా ఎస్పీడీసీఎల్‌లో 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడగా వయోపరిమితిని 34 ఏళ్లకే కుదించారు. దీనికి కారణాలేంటీ అని ఆరా తీయగా... ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసిందని, అందుకే కుదించినట్లు ఎస్పీడీసీఎల్‌ ప్రకటించింది.

దాంతో దాదాపు 3 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైనా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి.

అయితే వయోపరిమితి గడువును మళ్లీ పెంచరాదనే నిర్ణయంతోనే దీనిపై తదుపరి ఉత్తర్వులు వెలువడలేదా? యంత్రాంగం ఈ విషయాన్ని ఉన్నత స్థాయికి నివేదించలేదా? అనేది తేలాల్సి ఉంది.

తెలంగాణలోని 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి రాకముందే వయోపరిమితి సడలింపు ఎత్తేయడంతో కొత్త జోనల్‌ విధానంతో ఉద్యోగాలన్నీ మాకే దక్కుతాయని నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలన్నీ అవిరైపోయాయి. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి, నోటిఫికేషన్లు వెలువడి, నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకైనా అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కేంద్రం నిర్ణయం

పార్లమెంటు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు త్వరలో సరికొత్త కళను సంతరించుకోనున్నాయని ఈనాడు వెల్లడించింది. రూ.12,450 కోట్లతో వాటిని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా.. రాబోయే 250 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఆధునిక హంగులతో నూతన పార్లమెంటు భవన నిర్మాణం చేపట్టనున్నారు. 70 వేలమంది ఉద్యోగులు ఒకేచోట పనిచేసేందుకు వీలుగా కేంద్ర సచివాలయాన్ని నిర్మించనున్నారు. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియాగేట్‌ వరకు సెంట్రల్‌ విస్టా అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కన్సల్టెన్సీ పనులను గుజరాత్‌కు చెందిన 'హెచ్‌సీపీ డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థ దక్కించుకుంది.

పార్లమెంటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ను సంస్థ రూపొందిస్తుంది. తర్వాత నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) చూసుకుంటుందని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)